Previous Page Next Page 
విరిజల్లు పేజి 10


    నదిలోని నీరు అలలుఅలలుగా ముందుకివస్తూ విరిగిపడి పోతూ వుంది. సాయంకాలపు నీరెండలో చేపలు మిలమిల మెరుస్తున్నాయ్. నీటిలో ఎగిరెగిరి పడుతూ తలెత్తి చూస్తూ మత్స్యాలూ మనుషులవలెనే సాయంకాలాలలో విహరిస్తాయని చెబుతున్నాయి. అందమైన యువతి జఘన భాగంగా మెరుస్తున్నాయి ఇసుకతిన్నెలు.
    నిశ్శబ్దంగా కొన్ని క్షణాలు మానవుడికి ఎదురుగా నడిచాయి. వేణు చేతిని తనచేతిలోనికి తీసుకుని మృదువుగా అన్నాడు మురళి.
    "నీ బాధ ఏమిటో వివరంగా చెప్పు వేణు! ఆత్మీయుడితో పంచుకుంటే వేదన నశిస్తుంది. కనీసం తగ్గుతుంది. మనసులో దాచుకున్నంత కాలం అది ఉడికిపోతూనే వుంటుంది. కానీ వేణూ నీ బాదేమిటో చెప్పు?"
    అతడందుకున్న చేతి వెంట అలాగే అతని తొడమీద పడుకుని అతని చేతిని తన చెంపమీద రాచుకుంటూ అన్నాడు.
    "మనసుని అర్ధంచేసుకున్న వాడివి. నాకున్నవారిలో నా వాడు అనుకున్నవాడివి_ ఆత్మీయుడివి_ నీవుకాక మరెవరికి చెప్పుకోను? మరెవరికి చెప్పగలను? బెటర్ హాఫ్ కికూడా చెప్పని చెప్పలేని విషయాన్ని నీకు చెబుతున్నాను."
    ఒక్కో మనిషికి ఒక్కో అనుబంధం అనుకోకుండా జీవితంలో అతుకుతో ఉంటుంది. ఏది ఎందుకు అనే ప్రశ్నకి మానవుడికి భగవానుడేనాడు బదులు చెప్పలేదు. చెప్పడుకూడా. కనిపిస్తే లేపి అడిగి చంపేస్తారనే భయంతోనే కావచ్చు. భగవానుడు కనిపించకుండా ఉండటానికి కారణం.  
    నేను హైస్కూల్లో చదివే రోజులలో నాతోపాటే పట్నానికి ఓ క్రిస్టియన్ అమ్మాయి వస్తూ ఉండేది. చిన్ననాటినుండీ కలిసిమెలసి తిరిగేవాళ్ళం. హైస్కూల్లో చేరిన తొలినాటినుంచి ఒకరిని విడిచి మరొకరం వెళ్ళింది లేదు. తిరిగి వచ్చింది లేదు.
    నిర్మలమైన మనస్సుతో ప్రశాంతమైన మనస్సుతో మా చదువు సాగింది. అడ్డంకు రాకపోతే జీవితంలో చిత్రమనేదే లేదు. అలా చిత్రవిచిత్రాలు కల్పించకపోతే ఆయనకి తృప్తి కూడా ఉండదు కాబోలు.
    మతాతీతంగా కలసిమెలసి అన్యోన్యంగా ఒక కుటుంబంలోని వ్యక్తులకంటే దగ్గరగా మసలుకుంటూ వుండే వాళ్ళం. నిత్య సన్నిహిత్యంతో అనుక్షణం స్నేహభల్లరి వికసిస్తూ ఉంటే ఆ పరిమళాన్ని అనుభవిస్తు మురిసే వాళ్ళం.
    మా జీవితంలో అతి విషాదకరమయిన దినం- ఓ రోజు వచ్చింది. ఇద్దరం బ్రహ్మాండమైన తిరుణాలకి వెళ్ళాము. పసిపిల్లల సహజమైన మనస్తత్వంతో ఆ వేడుకలలో మునిగిపోయి అక్కడే విధి వశాత్తు విడిపోయాం. అదెలా సంభవించిందో నాకిప్పటికీ అర్ధంకాదు__ అయినా మొదట్నించి మా వియోగానికి కారణం నేనే మురళీ_
    ఆమెకి అంతగా ఇష్టం లేకొన్నా బలవంతంగా తీసికెళ్ళాను తిరుణాలకి. ఆరోగ్యం సరిగా లేదుకూడా అప్పుడు తనికి. అయినా నా కోసము వచ్చింది. అక్కడా అంతే! అన్నీ నా ఇష్టప్రకారమే జరిపి చివరకు ఇద్దరమూ విడిపోవటానికి కూడా నేనే అయ్యాను.
    చిన్నమ్మాయికూడా కాదు మరి. అయినా ఎలాగో చేయిజారి పోయింది. ఎలా విడిపోయిందో ఎలా తప్పిపోయిందో అర్ధం కాదు. అయితే తిరిగి ఇంతవరకూ దొరకలేదు. తిరిగి రాలేదు. ఎక్కడ వుందో, యెలా వుందో కూడా తెలియదు ఇంతవరకూ.
    ఆ అమ్మాయి జతపోగొట్టుకుని బడికెళ్ళి చదువుకోలేకపోయాను. బెంగతో కొన్నాళ్ళు మంచం పట్టాను. చదువు మీద శ్రద్ధ లేకపోయింది.
    నిజం మురళీ! ఆ అమ్మాయి నన్ను విడిచి వెళ్ళేవరకు మా మధ్య అంత అనురాగం వుందనికానీ, ఒకరిని విడిచి మరొకరు వుండలేమనికానీ అనుకోలేదు. అసలు విడిపోయే ప్రశ్నే తలెత్తలేదు.
    చదువు మానుకోదలచుకున్నాను. హైస్కూలు చదువుతోనే దానికి స్వస్తిచెప్పి ఇంట్లోనే వుండిపోయి వ్యవసాయంతో గడపదలచుకున్నాను.
    ఆ రోజు రాత్రే ఓ చిత్రమయిన కల వచ్చింది.
    ఎవరో ఓ బలమైన వ్యక్తి విరజని తీసికెళ్ళాడు. అతని అండదండల విషవలయంలో చిక్కుకుంది. రాలేకపోతుంది. జాలిగా చూస్తోంది. విడదీసుకుని రావాలని ఎంతగా ప్రయత్నిస్తున్నా కృతు కృత్యురాలురాలేకపోతుంది.
    ఏమిటో ఏడుస్తూనే సగం చెప్పింది. సగం మాటలు ఎక్కిళ్ళు మింగేశాయ్. అదేమిటో అర్ధంకాలేదు నాకు. కానీ ఏదో నిర్దేశిస్తున్నట్టు ఆమె ముఖ కవళికల్నిబట్టి కనుక్కున్నాను. నాకు వినబడటం లేదని మళ్ళీ చెప్పింది.
    "చదువు మానుకోవద్దు వేణూ! నేను నీకు దూరమయ్యాను నిజమే అది శారీరకంగానే.... నిన్ను మరచిపోలేను మరువను. కానీ నీవు నన్ను మరచిపోవాలి. అవును అంతే! తప్పదు. నా మీద జ్ఞాపకాలతో నీవు చదువును పాడుచేసుకోరాదు. అన్ని పరీక్షలు పాసయినా వేణు డాక్టరవ్వాలని నా నర నరాలలో ప్రవహిస్తున్న రక్తంలాగా కోరిక నిత్యము ఉరకలేస్తుంది. నీవు నా మాటలు వినకపోతే నాకు శాంతి ఉండదు. నాకు చేతిలో చేయి వేసి ప్రతిజ్ఞ చెయ్....
    ఈ క్షణంలో నాకు అక్షరాలా గుర్తుకు వస్తున్నాయి. ఆవిడ మాటలు నాకు మొదటినుంచీ ఎంతో గౌరవం. ఆవిడ మాటంటే ఆజ్ఞతో సమానం. అనుకోకుండా అక్షరాలా పాటించడం అలవాటు. చిన్ననాటి నుండి మానాయనగారి మనసులో నన్ను లాయర్ ని చేయాలన్న కోరిక గూడా తీర్చలేదందుకే.
    ఆరోజు కలలో వచ్చిందంతే! ఇన్నేళ్ళుగా ఎప్పుడూ ఎందునా ఎందుకు గుర్తుకు రాలేదు. నేనే తనని మర్చిపోయానో, తనే నేను తనని మరచిపోయేట్టు చేసిందో నా కర్ధం కాలేదు. కానీ ఆ భవిష్యత్తుని మాత్రం అన్యాప దేశంగా ఆదేశించింది ఆమె.
    శాంతి వనంలో పారిజాతసుమంలా సుందర స్వప్నంలో శాంతి ప్రదానం చేసేది ఎప్పుడూ! అప్పుడు ఆ హస్తమెవరిదో తెలియకున్నా ఇప్పుడు తెలుస్తుంది. అంతర్గతంగా ఆమెమీద అనురాగాన్ని పెంచుకున్నానని కానీ ఆమె నా కోసం తపస్సు చేస్తుందని. కానీ నాకు తెలీనే తెలియదు.
    ఒక్క క్షణం నిట్టూర్పులో కలిసిపోయింది.
    "మరిప్పుడేం జరిగింది వేణు?.... ఇన్నేళ్ళనుంచీలేనిది ఈనాడు ఏం జరిగింది?.... ఆవిడ ఇప్పుడెందుకు జ్ఞాపకం వచ్చింది."
    ఆపుకోడానికి వీల్లేకుండావస్తున్న కన్నీటిని కొనగోటితో తుడుచుకుని లేచి కూర్చుని చెప్పసాగాడు.
    "నిన్న తెల్లవారుజామున నాకో చిత్రమైన కల వచ్చింది. ఎవరో ఎక్కడో ఎందుకో విరజను నిర్భందిస్తూ బాధిస్తున్నారు. బహుశా అతడే విరజని ఆ రోజునుంచి సంరక్షిస్తూ వుండొచ్చు. అతను నాకు పెళ్ళయిన విషయం చెప్పి ఆమెను ఏదో కోరుతున్నాడు. బెదిరిస్తున్నాడు. నాకు పెళ్ళయిందని, సావిత్రి కాపురానికి వచ్చేసిందని ఆమెకి తెలియజెప్పి తన మనసులోని కోరికను సాధించుకోదలిచాడు.
    కానీ విరజ మనసులో ముద్రితమయిన ఓ సుకుమార భావాన్ని అతడు తుడవలేకపోయాడు. తుడవలేడు కూడా! అతడే కాదు మరెవ్వరూ చెరపలేని ముద్ర అది. ఆమె నాకు పెళ్ళయిన విషయాన్ని నమ్మలేక కళ్ళారా దంపతుల ఫోటోని మేగజేర్ లో చూస్తూ నమ్మకపోవటానికి వీలులేక కేవలం అసహాయంగా ఏడ్వటము తప్ప మరేమీ చేయలేక పోయింది.
    ఈ విషయం నా కలలో ఎందుకువచ్చిందో అర్ధం కావటము లేదు. కానీ ఆ విషయం మాత్రం తీవ్రంగా బాధిస్తోంది. ఆమెను నేను మరచిపోయాననీ ఆమె మాత్రం నన్ను మరువలేదనీ! సదా నన్నేధ్యానిస్తూ నా విషయమే తలుస్తూ నా సన్నిధికి రావాలని తీవ్రంగా ప్రయత్నంచేస్తూ నేనెక్కడున్నానో ఎలా ఉన్నానో తెలీక బాధపడుతూ వుందని తెలియచేయటానికి వచ్చిందేమో.
    అబల__ ఒకరి చేతుల్లో చిక్కుకుంది! రావాలని ప్రయత్నంచేసేకొద్దీ బంధనం ఎక్కువౌతుంది. ఏం చేస్తుంది నిరాశతో చావని ఆశతో ఏడవటం తప్ప....?
    ఎందునా సహాయం అంటూ అందనిది? తలిదండ్రులేమయ్యారో ఎక్కడున్నారో కూడా తెలీకుండా సహాయాన్ని కూడా ఆశించలేని దుస్థితిలో వుంది? ఇంకేం చేయగలుగుతుంది?
    "తలి దండ్రులంటే గుర్తుకు వచ్చింది. వారు ఎవరు లేరా వేణు?"
    చుట్టూ ముసురుకుంటున్న చీకటిలాంటి విషాద చాయలు అతని వదన మండలాన్ని కమ్ముతున్నాయి. వెలికి రాబోతున్న కన్నీటిని అణచుకుంటూ అన్నాడు.
    "ఆ అమ్మాయే పంచప్రాణాలుగా వుంచుకున్న తండ్రి, ఆమెతప్పిపోయిననాటి నుంచి ఎన్నోవిధాల వెతికి వెలికి చివరకి పేపరులో కూడా వేయించి ఎందరినో పంపి ఎన్నో ప్రయత్నాలు చేశాడు__ ఎటుపోయినా ఎటుచూసినా ఆశ మాత్రమే వెక్కిరించేది. ఆ దిగులుతోనే మంచం పట్టి ఆమె వెళ్ళిపోయి సంవత్సరం వెళ్ళకముందే అదే దిగులుతో అదే ధ్యాసతో మనోవ్యాధికి గురయి చనిపోయాడు. 

 Previous Page Next Page