రాధా.....నీవా , ఇక్కడ?...." అని రేఖ తల్లి తండ్రి ఇద్దరూ ఒక్కసారి అన్నారు.
రాధాదేవి "మీరు ...మీరు రేఖ తల్లి దండ్రులా " గొణిగినట్లుంది. ఒక్క క్షణం నిశ్శబ్దం తాండవం చేసింది.
"డాడీ, మీకు రాధాదేవిగారు తెలుసా?" రేఖ ఆశ్చర్యంగా అడిగింది.
"ఆ....ఆ..... తెలుసు.... బాగా తెలుసు...." మాధవరావు ముందుగా తేరుకున్నాడు. రాధాదేవి అలా తన కూతుర్ని ఈ స్థితిలో చూడడం పుండు మీద కారం జల్లినట్లయింది. రాధాదేవి యిప్పుడెం చేస్తావు అని సవాల్ చేస్తున్నట్లు అవమానం పొందాడు.... ఆమె మొహంలో వ్యంగ్యపు చిరునవ్వు మెదిలినట్లు అతనికి స్పురించింది.... అంటే తనని అవమానపరచడానికి , ఎద్దేవా చేయడానికే వచ్చింది .....అతనున్న స్థితిలో అంతకంటే ఆలోచించలేకపోయాడు . "రాదా , నీకిప్పుడు చాలా సంతోషంగా ఉందా? చాలా సంతృప్తిగా వుందా నీ అక్కసు తీరిందా. నా కూతురు ఈ స్థితిలో వుంటే చూచి నవ్వి నామీద ప్రతీకారం తీర్చుకోవాలని వచ్చావా? నవ్వు ....బాగా నవ్వు.....నాకు బుద్ది చెప్పు.... బాగా శాస్తి జరిగిందని సంతోషించు.....అదేగా నీకు కావాల్సింది నా మీద ఇన్నాళ్ళుగా పేరుకున్న నీ కక్ష చల్లరిందా?" మాధవరావు వళ్ళు మరచి ఆవేశంగా అన్నాడు. రాధాదేవి మొహంలో రక్తం పొంగింది. ఏదో చెప్పాలని నోరు తెరవబోయింది. పెదాలు వణికాయి. నోట్లోంచి మాట రాలేదు.
"ఏం, అర్ధం కానట్టు అలా చూస్తావు? కావాలని కాకపోతే యిన్నాళ్ళ తరువాత సరిగా ఈ సమయానికి ఎలా వచ్చావు. కానీ .....అనాల్సినవన్నీ అను...." కర్కశంగా నవ్వాడు. అంతలోనే ఏదో గుర్తుకు వచ్చినట్లు....."మైగాడ్ రెండు రోజుల నుంచి బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను.... రేఖ మీద ఎవరికి యింత పగ ఎందుకని ఆలోచించాను..... రాధా.....నీవు....నీవు .....నామీద కోపంతో, నా మీద కసితో యిలా చేసి ప్రతీకారం తీర్చుకుని సంతోషించాలనుకున్నావు. ఇది నీ పనే ...... లేకపోతే యింకేవరికీ యింత క్రూరంగా నిర్ధాక్షిణ్యంగా పగతీర్చుకునే అవకాశం లేదు. రాదా.....ఇది నీ పనే . మైగాడ్" మాధవరావు ఆవేశంతో రాధాదేవి మీద మీదకి వచ్చి కోపంతో వణికిపోతూ అన్నాడు. అందరూ నిశ్చేష్టులై చూడసాగారు.
ఈ అభియోగానికి రాధాదేవి మొహంలో ఒక్కసారిగా రక్తం పొంగింది. "మిస్టర్ మాధవరావు .....స్టాపిట్.....వాట్ నాన్సెన్స్ యూఆర్ టాకింగ్" కోపంగా అరిచింది. "మీకు పిచ్చిపట్టిందా....రేఖని నేను.....పాడు చేశానా...." వెర్రిదానిలా అంది.
"చేయించావు. నా మీద కక్ష తీర్చుకున్నావు...." కర్కశంగా అన్నాడు.
"మిస్టర్ మాధవరావు ....డోన్టాక్ ఎనదర్ వర్డ్....మీకు నిజంగా పిచ్చి పట్టింది. ఇంతవరకు రేఖ మీ కూతురని , మీరు రేఖ తండ్రని అని కూడా తెలీదు నాకు......తెలిస్తే నానీడ కూడా యిక్కడ పడనిచ్చే దాన్ని కాదు."
"ఆహాహా....తెలీదు.....నా పేరు కూడా తెలీదూ.... తెలీకుండానే యింత నీచానికి వడిగట్టావన్న మాట..."
'ఛీ.....' రాధాదేవి తిరస్కారంగా చూస్తూ చీత్కారం చేసింది. "మాధవరావు ....యిన్నాళ్ళూ నీవో మనిషివనుకున్నాను. ఇంత నీచంగా యింత హేయంగా ఆలోచించే అధముడవని అనుకోలేదు! నీవు క్రూక్ వని తెలుసు గాని యింత క్రూకేడ్ గా ఆలోచించే హీనుడవని తెలియలేదు - నీమీద కక్ష వుంటే నీమీదే తీర్చుకోగలను, దానికోసం ఓ అభం శుభం తెలియని ఆడపిల్లని వాడుకోను. అండర్ స్టాండ్ .....యింకొక్క మాట మాట్లాడావంటే పరువునష్టం దావా వేస్తాను" అడపులిలా గర్జించింది.
"నేనూ నీమీద నా కూతురు ఇలా కావడానికి కారణం నువ్వే అని కేసు వేస్తాను" పౌరుషంగా అన్నాడు.
రాధాదేవి అదోలా నవ్వింది. "వేయి, తప్పకుండా వేయి. మిస్టర్ మాధవరావు.....నీవెంత చేసినా ఇన్నాళ్లుగా , యిన్నేళ్ళుగా నా మనసులో ఏమూలో నీకు స్థానం వుండేది..... నౌ, యూ ఆర్ డేడ్ టు మీ .....శ్యామ్ పద వెడదాం...." ముందుకు వెళుతూ ఒక్క క్షణం ఆగి .....రేఖ వంక చూసి "రేఖా .....నీ స్థితి చూసి మతిపోయిన నీ తండ్రి మాటలు నిజమని అనుమాన పడకమ్మా....నేను ఆడదాన్ని.... ఎంత నీచురాలైనా....యింత నీచానికి వడిగట్టదని నమ్ము...." అంటూ వడివడిగా గదిలోంచి వెళ్ళిపోయింది.
"శ్యామ్ .....అంటీ" అంటూ నిస్సహాయంగా చూసింది రేఖ. శ్యామ్ ఒక్క క్షణం ఆగి ఏదో అనబోయి విరమించుకొని మాధవరావు వంక ఒకసారి చూసి తలదించుకుని వెళ్ళిపోయాడు.
"వీడెవడు? .....దాని కొడుకా!....ఆ నల్ల వెధవ యింత వాడయ్యడన్న మాట...." కర్కశంగా అన్నాడు మాధవరావు శ్యాం ని చూస్తూ.
"డాడీ...." బాధగా అరిచింది రేఖ......"ఎవరో రౌడీ వెధవలు చేసిందానికి రాధాదేవిగార్ని నిందించుతావేమిటి.....ఆవిడని అలా యిన్సల్టు చేశావు. ఆవిడ ఎంతో మంచావిడ డాడీ....నాకెంత ధైర్యం చెప్పిందో.....ఎంత ఒదార్చిందో!
"ఆ ...ఆ ....చేసింది చేసి, తనమీదకు రాకుండా నీ దగ్గిరకు వచ్చి కల్లబొల్లి మాటలు చెప్పిందిన్నమాట.... రేఖా....నీకేం తెలీదు అసలు సంగతి నాకు తెలుసు. ఆవిడకి నీమీద కక్ష కాదు నామీద కక్ష....నా మీద ప్రతీకారం తీర్చుకొవడానికి నిన్ను ఉపయోగించుకుంది. బదులు తీర్చుకుంది ఇన్నాళ్ళకు తండ్రి మొహంలో పొంగుతున్న కోపం చూసి రేఖ ఇంకేం అనలేక , ఏం అర్ధం కాక ఆ క్షణంలో అంతకంటే ఆలోచించే ఓపిక లేక నెమ్మదిగా తలగడ మీదకి జారింది.
"ఇది రాధపని కాదేమోనండి. మీ మీద ఎంత కోపం వున్నా రేఖనీ యింత క్రూరంగా పగ తీర్చుకోలేదండి.....ఎంతయినా ఆడది.....అందులో... అంతవరకూ మౌనంగా శ్రోతలా మిగిలి , భర్త అభియోగం నిజమా అబద్దమా అని సంకోచిస్తూ రాధాదేవి మొహం చూసి నిజం కాదనిపించి నెమ్మదిగా అంది ఆవిడ.
"లేకపోతే యింకెవరు చీశారింతపని? రోడ్డున పోయే రౌడీలు ఏదో వాగుతుంటారు తప్ప ఇంతలా ప్లాన్ చేసి చేయరు" ఖచ్చితంగా అన్నాడు.
"ఏమో , నిజానిజాలు భగవంతుడికే తెలియాలి...." ఆవిడ బత్తాయి పళ్ళ రసం తీయసాగింది.
4
"ప్లీజ్ , శ్యామ్ ....ఫర్ గాడ్ సేక్.....నన్నేం అడక్కు. నేనేం చెప్పలేను. వెళ్ళు....నన్ను విసిగించకు....' రాధాదేవి అరిచింది.
తల్లికోపం ఎన్నడూ చూడని అతను భిన్నుడై చూశాడు. అతని మొహం చూసిన రాధాదేవి అనవసరంగా శ్యామ్ మీద తన కోపం చూపినందుకు లజ్జితురాలై "శ్యామ్ ....నన్నేం అడగకు. నేనేం చెప్పలేను. చెపితే విని నీవు భరించలేవు....వెళ్ళు శ్యామ్..... నన్ను కాసేపు వంటరిగా వదిలి వెళ్ళు" రాధాదేవి ఆవేదనగా తల తిప్పుకుంది.