అప్పుడే లోపలికి వచ్చిన డాక్టరుని "డాక్టర్! ఇప్పుడు రేఖ వంట్లో మరేం లేదు కదా?" ఆదుర్దాగా అడిగింది రాధాదేవి.
"షాక్, భయం వాళ్ళ నర్వ్ వీక్ అయి డీలా పడింది. అంతేకాక ...." ఒక్కక్షణం ఆగి చాలా నెమ్మదిగా ...."వజీనా బాగా దెబ్బతింది. మాములు కావడానికి కొన్ని రోజులు పట్టవచ్చు......మిగతా రక్కులు, కొరుకులు అవి త్వరలోనే మానిపోతాయి.....ఇంకా ఒకటి రెండు రోజులు యిక్కడ వుంటే త్వరగా మానిపోతాయి.....ఇంకా ఒకటి రెండు రోజులు యిక్కడే వుంటే త్వరగా కోలుకునే అవకాశం వుంటుంది" ఇంజక్షన్ యిస్తూ చెప్పాడు డాక్టర్.
డాక్టర్ వెళ్ళాక 'అంటీ మీరు వచ్చాక పోయిన శక్తి కొద్దిగా వచ్చింది అంటీ, థాంక్స్ అంటీ.....మీ మాటలతో నాకు జీవం వచ్చింది ...." నీర్సంగా అంది.
"థాంక్స్ ఏమిటమ్మా....నేనేం చేశానని....శ్యామ్ నీ గురించి ఎంత బాధపడుతున్నాడో ....యిప్పుడు వద్దు రేఖ కోలుకున్నాక వెళ్దాం అంటే, కాదు అని బలవంతంగా వచ్చాడు. రావడం మంచిదే అయింది. చూడమ్మా రేఖా! నీవు చక్కగా భోజనం చేసి హాయిగా రెస్టు తీసుకో. పుస్తకాలు చదువుకో. రెండు రోజులలో బాగయిపోతావు. మరేం దిగులు వద్దు. మరి నేను వెళ్ళనా. ఉదయం ఏ పని కాలేదు. ఉన్నదాన్ని ఉన్నట్టే వచ్చేశాను. మళ్ళీ రేపు వస్తాను. ఏం, పద శ్యామ్ వెడదాం....." రాధాదేవి రేఖ జుత్తు నిమిరి నవ్వుతూ అంది.
శ్యామ్ సంకోచంగా రేఖ దగ్గిర నిలబడి "రేఖ .... ఐయామ్ యువర్ ఫ్రెండ్ అండ్ వెల్ విషర్ అన్నమాట మరిచిపోకు. నీవు త్వరగా రికవర్ అనాలి. కాలేజికి మాములుగా రావాలి..... నీ మొహంలో మళ్ళీ బాధ కనపడకూడదు. ....ప్రామిస్ ...." అన్నాడు.
"యా ప్రామిస్" అంది రేఖ నవ్వి . కాని ఆ నవ్వులో జీవం లేదు.
3
రేఖ మీద అత్యాచారానికి పట్టణం అంతా కదిలిపోయింది. ఆడపిల్ల తల్లిదండ్రులు భయంతో గుండెల మీద చెయ్యి వేసుకున్నారు. అన్ని కాలేజీలలో హైస్కూళ్లలో విద్యార్ధినులు పెద్ద అలజడి లేవదీసి వీధిలో గుంపులుగా ఊరేగి తోటి విద్యార్ధిని మీద జరిగిన అత్యాచారానికి ప్రతీకారం కావాలి. సమాజంలో స్త్రీకి వున్న రక్షణ ఏమిటంటూ ముఖ్యమంత్రి వద్దకు బారులు తీరి వెళ్ళి మెమొరాండం సమర్పించారు. ఊరిలో అన్ని మహిళా మండలి అద్యక్షురాండ్రు స్త్రీకి సమాజంలో రక్షణ కల్పించాలంటూ మెమొరాండం సమర్పించారు. ఆ వార్త ముఖ్యమంతిని కలిచి వేసింది. అయన దోషులని త్వరలో పట్టుకుని కఠినంగా శిక్షించుతామని స్వయంగా హామీ యిచ్చారు. ఈరోజు రేఖ మీద జరిగిన అత్యాచారానికి నిరసనగా అన్ని కాలేజీలలో విద్యార్దినిలు క్లాసులు బాయ్ కాట్ చేశారు. వారికి అండగా మేమున్నాం అంటూ విద్యార్ధులు కాలేజీ మానేశారు. విద్యాసంస్థలన్నింటికి ఆరోజు సెలవు యివ్వక తప్పలేదు. రేఖ మేఅ జరిగిన అత్యాచారం గురించి మీ అభిప్రాయం ఏమిటి అంటూ పత్రికలవాళ్ళు అనేకమంది విద్యార్ధినులని ఇంటర్వ్యూ చేసి ప్రచురించారు.
ప్రతి ఆడపిల్ల చాలా ఆవేశంగా ఈ యిరవయ్యో శతాభ్దంలో కూడా స్త్రీకి సమాజంలో రక్షణే లేదని , సాధించిన అభ్యుదయం అంతా మాటల్లో, వేషంలో తప్ప కార్యసాధనలో లేదని, ఎన్ని యుగాలు గడిచినా స్త్రీ పురుషుల దృష్టిలో విలస వస్తువుగానే వున్నదనీ , ఈ మానం నీతి అంతా స్త్రీకి అంటగట్టి పురుషుడు స్వేచ్చగా తిరుగుతున్నాడని యిప్పుడు మానం కోల్పోయిందంటూ రేఖ మీద ముద్ర వేస్తుంది సంఘం. ఆమె తప్పు లేకపోయినా చెడిపోయిన ముద్రవేసి ఆమెని వెలేసి ఆమె భవిష్యత్తుకి దారి మూసివేస్తుంది మన సమాజం. ఇప్పుడింక రేఖని పెళ్ళాదాడానికి ఏ పురుషుడన్నా ముందుకు వస్తాడా? ఇలా ఎందుకు జరగాలి? స్త్రీకో నీతి పురుషుడికో నీతా, ఇలా స్త్రీల మీద అత్యాచారం జరిపే పురుషులని చట్టం అంత తేలిగ్గా వదలకుండా యింకా కఠినశిక్షకి గురిచేయాలి. అలాంటి రాక్షసకృత్యాలు జరిపే పురుషుడు ఎప్పుడూ తప్పించుకుంటున్నాడు. స్త్రీయే శిక్ష అనుభవిస్తుంది. ఈ మానభంగానికి గురి అయిన స్త్రీని ఓ నేరంలా, తప్పులా కాకుండా అది ఓ యాక్సిడెంటు అన్న భావం పురుషులలో కలిగేటంత మార్పు రానిదే అలా గురి అయిన స్త్రీలకి విమోచనం వుండదు - అంటూ ప్రతీ అమ్మాయి రకరకాల అభిప్రాయాలు వ్యక్తపరిచి చాలా ఆవేశంగా మాట్లాడారు.
"భగవంతుడా! అసలే జరిగిన అవమానంతో తలెత్తు కోలేకపోతుంటే ఈ పేపర్లు మన బతుకు బట్టబయలు చేస్తున్నాయి ఏమిటండీ.? ఓ ఆడపిల్ల భవిష్యత్తు గురించైనా ఆలోచించకుండా ఇలా పేపర్లలో బహిరంగంగా ఫోటోతో సహా ప్రచురిస్తున్నారేమిటండీ? మీరు గట్టిగా చెప్పండి వాళ్ళకి ...." రేఖ తల్లి వార్తలు చదివి ఉగ్రురాలై అంది. రేఖ తండ్రి అత్యాచారం జరిగిన రోజునుంచి ఆ షాక్ నుంచి యింకా కోలుకోలేదు. అయన మీద హటాత్తుగా వార్ధక్యం రెండు రోజులలో ముంచుకొచ్చినట్టుగా కృంగిపోయాడు.
"హు....మన ఖర్మ యిలా కాళింది. రోడ్డుపై పడి వున్న స్త్రీ గురించి వార్త రాశాం, మీ అమ్మాయిని నాల్గుగోడల నుంచి దాటించి అన్యాయంగా రాస్తే అనండి. పోలీసులు, డాక్టర్లు యిచ్చిన వార్తా మేం రాశాం అంటారు. మనమేం చేస్తాం? దాని బతుకు రోడ్డున పడింది. ఇంక అంతే- దాని గతి అంతే'...." అన్నాడు అయన విచలీతుడై పట్టుకున్న గొంతుతో.
భర్త దేని గురించి బాధపడతున్నాడో ఆమెకి అర్ధం అయింది. నిట్టూర్చి లోపలికి వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరూ భోంచేసి రేఖకి క్యారియరు పట్టుకుని ఆస్పత్రికి వెళ్ళారు.
"రేఖా.....యివాళ నీ మొహం కాస్త తేటగా వుందమ్మా - గుడ్ .....చూశావా మనసు తెలికపడితే శరీరం దానంతటదే కోలుకుంటుంది ...." రాధాదేవి ఆప్యాయంగా ఆమె ముంగురులు సవరిస్తూ అంది.
"అంటీ....దానికి మీకు నేను థాంక్స్ చెప్పుకోవాలి. మీ మాటలవల్లె నాకేదో ఘోర అన్యాయం జరిగిందన్న సంగతిని తేలిగ్గా తీసుకోగలుతున్నాను.... అంటీ.....మీరిచ్చిన ధైర్యంతో ఆ పీడకలని మరచిపోగలననుకుంటున్నాను.
అప్పుడే రూములోకి వచ్చిన రేఖ తల్లిదండ్రులు రేఖ దగ్గిర కూర్చున్న రాదాదేవిని చూసి గుమ్మం దగ్గిరే సర్పద్రష్టల్లా ఆగిపోయారు. అలికిడికి రేఖ , రాధాదేవి యిద్దరూ తలలు తిప్పి చూశారు. రాధాదేవి మొహం ఒక్క క్షణంలో పాలిపోయినట్లయింది.
'అంటీ, మా అమ్మ, నాన్నగారు ....డాడీ ....ఈవిడ నిన్న చెప్పాను గదా మా కాలేజ్ మెట్ శ్యామ్ , అతని అమ్మగారు - రాధాదేవి ....' రేఖ పరిచయం చేసింది.
"ఏమండీ రాధండి...."