అరగంట నుంచి శ్యామ్ ఆరాటంగా తల్లిని ఎన్నో ప్రశ్నలు వేశాడు. ఇంటికి వస్తుండగా ఆటోలోనే తల్లిని ఎన్నో విధాలుగా అడిగాడు. "ఎవరమ్మా అయన? రేఖ మీద అత్యాచారం నీవు చేయించావంటాడేమిటి...." కోపంగా అడిగాడు. రాధాదేవి కళ్ళలో తిరుగుతున్న నీరు కొడుకు కంట బడకూడదని తల అటు తిప్పుకుంది.
'అమ్మా! అసలు ఆయనేవరమ్మా? నీకు ఆయనపై కక్ష ఏమిటి?" దానికీ జవాబు లేదు. మాటిమాటికి కళ్ళలో వుబుకుతున్న కన్నీళ్ళని యింక దాచలేక కొంగుతో తుడుచుకుంది. దాంతో శ్యామ్ కి పట్టరాని ఆగ్రహం కల్గింది. 'అమ్మా నీవు చెప్పకపోతే నా మీద వట్టె. అసలు ఆయనేవరు నిన్ను అన్ని మాటలు అన్నాడు. నీవు అనవసరంగా తొందరపడి వచ్చేశావు గాని , వుండి ఆయనన్నవాటికి నోరు మూయించి రావాలనిపించింది నాకు. అసలు సంగతి ఏమిటో తెలియకుండా ఏం అనలేక వచ్చేశాను. నాకు చెప్పు - వెళ్ళి వాడిపని పడ్తాను .....మనం రేఖ కోసం అంత బాధ పడ్తుంటే మనం చేయించామంటాడా స్టుపిడ్...." ఆవేశంగా అన్నాడు.
తల్లి మౌనం అతనిలో మరింత అసహనాన్ని పెంచింది.
"అమ్మా...." అసహనంగా ఏదో అనబోతుంటే ...."ష్....ఆటోలో ఏమిటీ గొడవ.....నీ వూరుకో, నా మనసు బాగులేదు అసలే, నన్ను చంపకు...." అంది రాధాదేవి.
శ్యామ్ యిల్లు చేరాక మళ్ళీ మళ్ళీ అడిగాడు. ....."అమ్మా, నీవు ఏదో దాస్తున్నావు నా దగ్గిర. ఏమిటో చెప్పాలి. ఏమి లేకపోతే ఆయనన్న మాటలకి నీవు ఎందుకూరుకుంటున్నావు? నాతొ చెప్పడానికేం...." ఎన్నో విధాలుగా అడిగాడు. రాధాదేవి మొహం కళ్ళు ఏడ్చినందు వల్ల ఎర్రబడ్డాయి. ఇంటికెళ్ళి బాత్ రూమ్ లో మొహం కడిగి వచ్చినా కళ్ళనించి నీరు వూరుతూనే వుంది. ఏమి లేకపోతే ముక్కు మొహం తెలియనివాడు అంతలా అనలేడని , ఎవడో ఏదో అన్నంత మాత్రాన తల్లి అంతలా బాధపడదని అన్పించింది శ్యామ్ కి.
శ్యామ్ అడిగే ప్రశ్నలకి జవాబు చెపితే ఇన్నాళ్ళుగా తను వాడి నించి దాచిన రహస్యం విని భరించగలడా? రాధాదేవి బాధ అది. మాధవరావు అన్నదానికి తాత్కాలికంగా బాధపడి మనసు నొచ్చుకున్నా....యిప్పుడు విషయం శ్యామ్ కి చెప్పి వాడి మనసును నొప్పించడానికి ఆమె మనసు వప్పలేదు. అంచేత అనవసర కోపం నటించి శ్యామ్ ని కసిరింది.
'అమ్మా.....నీకు చెప్పడం యిష్టం లేకపోతే.....నిన్నింక విసిగించను. కాని ఒక్క సందేహానికి మాత్రం జవాబు చెప్పు.....అయన....అయన......"
రాధాదేవి నిశ్చలంగా చూసి 'అవును నీ ఊహ సరి అయినదే, అతను నా భర్త.....ఒకప్పటి నా భర్త...." అంది.
శ్యామ్ మొహం ఒక్క క్షణం వెలిగింది. "అంటే.....నాన్నగారు...."
"ఇంకేం అడగకు వెళ్ళు....నన్ను వంటరిగా వదులు" శ్యామ్ ని ఒక విధంగా బలవంతంగా అవతలికి నెట్టి తలుపులు మూసుకుని పక్కమీద వాలిపోయింది ఆమె.
మాధవ్....మాధవ్ ...ఎంత మాటన్నాడు! యెంత మాట అనగలిగాడు . తననెంత నీచంగా ఊహించాడు! ఎంత నీచంగా మాట్లాడగలిగాడు! ప్రేమ....ఆ అనురాగం....అన్నీ మరిచిపోయినా ....ఆ తాలుకూ నీడలే మనసులో అతనికి మిగిలితే తనని గురించి ఇంత నీచంగా ఊహించేవాడు కాదేమో! ఏ మూలో ప్రేమించి పెళ్ళాడి కాపురం చేసిన భార్య అన్న మమత అయినా వుంటే అతనింత కఠినంగా తనని ఈ విధంగా అవమానించ గలిగేవాడా? ఈ మమతలు, ఈ ప్రేమలు యింత క్షణికమా! ఇరవై యేళ్ళయినా అతనిలో అన్న్జి బంధాలు తెంచుకుని వచ్చినా? మాధవ్ కి ....తన మనసులో ఏదో మూల స్థానం వుంది. అలాంటిది మాధవ్.....యింతలా తనని ఎలా ద్వేషించగలిగాడు! కన్న మమకారం ప్రేమని తోసిపుచ్చి అలా అనిపించిందా? రేఖ....మాధవ్ కూతురు! ఎంత విచిత్రం...మాధవ్ పోలికలు తను గుర్తించలేకపోయింది! .... రేఖ తల్లి పోలిక కాదు తండ్రి పోలిక.....ఆ పోలిక ఎక్కడో చూసినట్లనిపించింది కాని మాధవ్ కూతురని ఎలా అనుకోగలదు. ఒక వూర్లో వుంటూ....ఒకరి ఉనికి ఒకరికి తెలియనే తెలియలేదు. శ్యామ్ రేఖ..... రేఖని శ్యామ్ తీసుకు రాకపోతే ఈ గొడవ వుండేది కాదు!..... యిన్నాళ్ళ తరువాత తను ఈవిధంగా మాధవ్ చేత పరాభవం పొందడానికే రేఖ తమకి చేరువైంది. తనలో తను గతం గుర్తు తెచ్చుకుంటూ కుమిలిపోసాగింది రాధాదేవి. మర్చిపోయిన మాధవ్ మానుతున్న గాయాన్ని కేలికాడు. ఉత్త కేలకటమే కాదు.....ఇంత కారం జల్లి మంట రేపాడు....... రాదామాధవ్ ...ఎంత తియ్యగా, మత్తుగా వుండేవి ఆ పిలుపులు. ఆ పేర్లు, రాదా....మాధవ్ ...ఎంత చక్కటి జంట అనేవారంతా . నిన్నమొన్నలా వుంది ఇంకా యిద్దరూ చెయ్యి చెయ్యి కలుపుకుని నడిచి వస్తున్నట్లు......
5
రిజిస్ట్రార్ ఆఫీసులో సంతకాలు చేసి, పూల దండలు మార్చుకుని చేయి చేయి కలుపుకుని మెట్లు దిగుతుంటే మాధవ్ చేతిలోని రాధ చెయ్యి వణికింది.
"భయంగా వుందా రాధా....' మెల్లిగా చెయ్యి నొక్కి అన్నాడు మాధవ్.
రాధ సిగ్గుతో తల దించుకుంది. "ఊహు, కాదు " యింకేదో చెప్పబోయి చెప్పలేక కళ్ళు వాల్చుకుంది.
టాక్సీ దగ్గరికి రాగానే మిత్రులంతా మరోసారి అభినందనలు తెలిపి నూతన దంపతుల దగ్గిర శెలవు తీసుకున్నారు. ఇద్దరూ టాక్సీ ఎక్కారు. అందరూ చేతులూపుతుండగా టాక్సీ కదిలింది.
"రాధా! ఏమిటంతలా సిగ్గు పడుతున్నావు. కొత్తవాడినా నీకు" చిలిపిగా అన్నాడు చెయ్యి చేతిలోకి తీసుకుని ....." పెళ్ళి కూతురు కాగానే సిగ్గు ముంచుకు వస్తుంది గాబోలు మీ ఆడవాళ్ళకి ....' కొంటెగా అన్నాడు.
రాధ చెయ్యి లాక్కుని కోపం నటిస్తూ "అదేం కాదు" అంది బింకంగా.
"మరేమిటి?" అన్నాడు మాధవ్.
రాధ జవాబు చెప్పకుండా మెల్లిగా హ్యాండ్ బ్యాగులోంచి పసుపుతాడుకి కట్టిన మంగళ సూత్రాలు తీసి మాధవ్ ముందు చెయ్యి జాపింది. మాధవ్ ఒక్క క్షణం ఆశ్చర్యంగా చూసి "ఇదేమిటి" అని అంతలోనే నవ్వేసి "రిజిస్టర్ పెళ్ళి సరిపోలేదన్నమాట. ఈ మంగళ సూత్రం తో బందిస్తే కాని నీ భర్తని కాదనిపించిందా?" అన్నాడు.
రాధ చప్పున "అది కాదు ....మధూ ...." నీకర్ధం అయ్యేట్టు చెప్పలేను...." అంది తల దించుకుని.