రైతు రాజ్యం స్థాపిస్తాం"
"దున్నేవాడిదే భూమి"
:శివరావు బుర్ర తిరిగిపోయింది.
"కాల్చండి" ఆదేశించాడు.
"టప్ టప్ టప్ టప్
ధన్ ధన్ ధన్ ధన్"
పేలుతున్నాయి తుపాకులు. ఒక గమ్యం లేదు. ఒక గురి లేదు. టపాకుల్లా పేలుతున్నాయి.
"ఆపండి ఏమిట్రా ప్రేల్పుడు " అదొక ఆవేశం. ఎందుకన్నాడో అతనికే తెలియదు. కానీ తుపాకులు ఆగాయి. మౌనంగా బయటికి నడిచాడు. బయటికి వచ్చి "పారిపోయారు లంజా కొడుకులు" అని పళ్ళు కొరికాడు శివరావు.
బలరామయ్యగారికి నవ్వు వచ్చింది. కాని ఆపుకున్నాడు.
"దిగండి త్వరత్వరగా" అదొక ఆదేశం.
బూట్లు టకటకలు తప్ప ఏమీ వినిపించలేదు. కొండ దిగి ఊపిరి పీల్చుకున్నాడు శివరావు.
సూర్యుడు పడమటికి వాలి కొండకు కుంకుమ బొట్టు పెట్టాడు.
"కదలండి - వేగంగా నడవండి అదొక ఆదేశం.
అంతకుముందే వేగంగా నడుస్తున్నారు పోలీసులు. అడవి దాటి వచ్చేవరకు లారీలు తగలబడుతున్నాయి. ఆ మంటలు చూచి కోపం రావలసిన శివరావుకి దుఖం వచ్చింది. చీకట్లు కమ్ముకుంటున్నాయి. బయలే అయినా భయంకరంగా ఉంది. ఏం చేయాలో తోచలేదు. పోలీసులను వలయం తీర్చమన్నాడు. మధ్యన కుర్చుండిపోయాడు. ముగ్గురు ముఖ్యులు. ఎవరి నోట మాట రావడం లేదు. కాలం కదలనంటుంది. అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకున్నారందరూ. ఆ రాత్రి వారికి కాళరాత్రి అయింది.
అలసి ఉన్నారు పోలీసులు. కొండ ఎక్కి దిగారు. కాళ్ళు పీకుతున్నాయి. ఉదయం నుంచీ తిండి లేదు. నిద్ర ముంచుకు వస్తుంది. అయినా అప్రమత్తంగానే ఉన్నారు. గుండ్లు నింపిన తుపాకులు అందరి చేతుల్లోనూ ఉన్నాయి. అంతా దేనికో గురి పెట్టె ఉన్నారు.
అర్ధరాత్రి అయింది. కీచురాళ్ళు రొద పెడ్తున్నాయి. ఎక్కడో ఒక గుడ్లగూబ అరుస్తుంది. ఊరి ముందు ఊళ్ళ పెట్టె నక్కకూత వినిపిస్తుంది. చుక్కలు మిలమిల మెరుస్తున్నాయి. ఎక్కడో ఒక ఉల్క రాలిపడింది. దాంతో పాటే తుపాకులు పేలిన ధ్వని వినిపించింది. తూటాలు రయ్ మని శివరావు తలమీంచి దూసుకుపోయాయి. వెంటుక వాసిలో రామునికి గండం తప్పింది. శివరావు ప్రాణాలు పైపైనే పోయాయి. అతని నోట మాట రాలేదు. అయినా పోలీసుల తుపాకులు ప్రేలాయి. రాముడు నేలకు కరచుకొని పడుకున్నాడు. బలరామయ్యను లాగి పడుకోబెట్టాడు. శివరావు పడుకొని పొజిషన్ తీసుకున్నాడు. పోలీసులు బోర్లా పడుకొని కాలుస్తున్నారు.
"టప్ టప్ టప్ -
ధన్ ధన్ధన్ '
దీపావళి టపాకులు పేలుతున్నాయి. ఎటు పెలుతున్నాయో? ఎందుకు పెలుతున్నాయో తెల్వదు. గురి లేదు. పేలుతూనే వున్నాయి. శివరావు 'ఆపండి అనేదాకా పేలుతూనే ఉన్నాయి.
అంతా చుప్ చాప్. కీచురాళ్ళ రొదలు, గుడ్లగూబల అరుపులు తప్ప ఏమీ వినరావడం లేదు. అందరి గుండెలు పీచు పీచు మంటున్నాయి.
అటునుంచి తుపాకులు పేలాయి. ఇటు నుంచి పేల్చవద్దని శివరావు ఆదేశం - బుల్లెట్ల రయ్యిమని తలమీంచి పోతున్నాయి. ఒకటి, రెండు, మూడు .....ఎన్నో. ఒక గుండు రాముని పాదాన్ని చీల్చుకొని పోవడమూ, ఆతడు కేకపెట్టాడమూ, ఇటు నుంచి ఒక్కమ్మడిగా తుపాకులు పేలడమూ ఒకేసారి జరిగాయి.
అలా గడిచింది ఆ రాత్రి. అయినా తెల్లవారింది. తెల్లవారుతుండగా శివరావుకు దిగులు పట్టుకుంది. రావడం వీరుడిలా వచ్చాడు. లారీలు తగలబడ్డాయి. మందు గుండు బోలెడు ఖర్చయింది. ఒక్కణ్ణి పట్టుకోకుండా పొతే ఎలా? ఏం చేయాలి? పట్నం నుంచి వచ్చేప్పుడే ఇందుకు కొంత తయారీ చేసుకొని వచ్చాడు. రజాకర్ల దగ్గర పట్టుబడ్డ తుపాకులు కొన్ని రహస్యంగా తెచ్చాడు. అవి ఇక్కడ పట్టుబదినవని ఒక ప్రదర్శన ఏర్పాటు చేయవచ్చు. సరే మరి మనుసులు? అతనికి జగ్గయ్య గుర్తుకు వచ్చాడు. ఎంత గట్టివాడు. ప్రాణాలు తీసినా ఒక్క మాట చెప్పలేదు! అతడు తప్ప గత్యంతరం కనిపించటం లేదు. అసలు అతడింకా ప్రాణాలతో ఉన్నాడా అని! లేకున్నా తన పని నెరవేరుతుంది? జగ్గయ్యను రప్పించాడు. నీరసంగా ఉన్నాడు. అయినా నడుస్తూనే ఉన్నాడు.
"వదిలేస్తే ఏం చేస్తావు?"
జగ్గయ్య జవాబు చెప్పలేదు. కాని అతని కళ్ళు రక్తం చిమ్మాయి.
"నిన్నే అడిగేది"
"గీ రాముణ్ణి చంపుత, వీడు దొంగ, ద్రోహి " అన్నాడు జగ్గయ్య రక్తం తుకతుక ఉడికింది.
రాముడు వెనక్కు జరిగి శివరావు చాటుకి చేరాడు.
శివరావు రక్తమూ మండింది. కాని అణచుకున్నాడు.
'అయితే వదిలేశాం . ఇక పరిగెత్తు ఊ" అన్నాడు.
జగ్గయ్య ఒకసారి ఎగాదిగా చూశాడు. వెనక్కు తిరిగి పరుగు లంకించుకున్నాడు.