పొద్దు నెత్తికెక్కింది. పోలీసులు ఆకలికి అలమటించి పోతున్నారు. మండుతున్న పొయ్యిల మీదికి , డేగిశా లెక్కాయి. మేకలు, గొర్రెలు తెగాయి. శివరావు సర్కిలినస్పెక్టరు కుర్చీలో కూర్చొని సిగరెట్టూ పీకుతున్నాడు. బలరామయ్య కుర్చీలో కూర్చున్నాడు. రాముడు వారి పక్కనే నుంచున్నాడు. పోలీసులను వదిలితే నీటిని వదిలిన చాపలా అవుతున్నాడతను. శివరావు ఏదేదో అడుగుతున్నాడు. రాముడు జవాబులు చెపుతున్నాడు. ఏదో గొణుగుతున్నాడు శివరావు. బలరామయ్య ఏదో పలుకుతున్నాడు. వారు ఎంతోసేపు ముచ్చట్లు పెట్టుకున్నారు.
వంటలూ వార్పులూ పూర్తీ అయినాయి. దొరలు గడీలోనూ, పోలీసులు బయటా భోజనాలు చేస్తున్నారు. పశువుల కొట్టం లోంచి ఆకలి కేకలు - పసి పాపలవి - వినిపిస్తున్నాయి. పశువుల అంబా అని అరుస్తున్నాయి. అయినా భోజానాలు ముగిశాయి. బంకుల్లో కూర్చొని జగ్గయ్యను పిలిపించాడు శివరావు.
"వాళ్ళెక్కడున్నారు?" అడిగాడు శివరావు.
"నాకే మేరకండి!"
శివరావు రాముణ్ణి చూచాడు.\
"నీకు తెల్వకుంటే ఎవ్వరికీ తెలుస్తుందిర. కోరియరువు కావు నువ్వు" అడిగాడు రాముడు.
జగ్గయ్య రాముణ్ణి చూశాడు - రాముడు జగ్గయ్యను చూచాడు. అతని కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి. రాముడు తల వంచుకున్నాడు. జగ్గయ్య కాండ్రించి కింద ఊశాడు. రాముడు శివరావును చూశాడు. శివరావు పోలీసులను చూశాడు. పోలీసులు జగ్గయ్యమీద పడ్డారు. బాదసాగారు. జగ్గయ్య వళ్ళు చిట్లి రక్తం కారుతుంది. బాధ భరించలేక మొత్తుకుంటున్నాడు. కేకలేస్తున్నాడు. కాని ఒక్క మాటకు సమాధానం చెప్పటం లేదు. పశువుల కొట్టంలోంచి జనం గుంపులు కూడి చూస్తున్నారు.
శివరావు వళ్ళు మండింది. జగ్గయ్య మీదికి ఉరికాడు. పోలీసులు తప్పుకున్నారు. క్రింద పడ్డవాడ్ని లేపి నుంచో పెట్టారు. పిస్తోలు చూపించి అడిగాడు. "ఇప్పుడు చెప్పు ఎక్కడున్నారో " జగ్గయ్య నోటి నిండా రక్తం ఉంది. ఉమిశాడు. మండిపోయాడు శివరావు. జగ్గయ్య మీద పడి దబాదబా బాదాడు. జగ్గయ్య పడిపోయాడు. అతడు కనీసం మూల్గలేదు. ఆ శక్తి అతనిలో చచ్చిపోయింది. పిస్తోలు తీశాడు శివరావు. పక్కకు కాల్చాడు. గుండు భూమిలోకి దూసుకుపోయింది. జగ్గయ్య కండ్లు తెరిచాడు. చిరునవ్వు నవ్వాడు. గుండెకు గురిపెట్టాడు శివరావు. "చెప్పు గుండెలోంచి దూసుకు పోతుంది" అతడు తనుస్తున్నాడు. జగ్గయ్య భార్య మంగమ్మ సెంట్రీ పోలీసులను పక్కకు నెట్టి పరిగెత్తుకొని వచ్చింది. బాణం విడిచిన అమ్ములా భర్త మీద పడిపోయింది. గోడుగోడున ఏడ్చింది. జగ్గయ్య ఆవిడ తల నిమిరాడు. అంతే, పోలీసులు ఆవిడ రెండు రెక్కలూ పట్టి లాక్కుపోయారు.
"చెట్టుకు వ్ర్రేలాడతీయండి" తుపాకి గుండులా దూసుకు వచ్చింది శివరావు ఆదేశం. జగ్గయ్య కాళ్ళకు పగ్గాలు కట్టి గడీ ముందరి వేలచేట్టుకి వ్రేలాడదీశారు.
మంగమ్మ విలవిల్లాడింది. ఏడ్చింది మొత్తుకున్నది. జంగయ్య ఆమెను ఓదార్చాడు. "సోరాజ్జం వచ్చిందంటున్రు ఏడ్వకు" అని.
అది ఆ ఊరికి కాళరాత్రి. పశువుల కొట్టంలో జనం గుప్పెట్లో ప్రాణాలు పెట్టుకున్నారు. గుండెలు గుబగుబలాడుతున్నాయి. ఎప్పుడు ఎవరి వంతు వస్తుందో తెలీదు. పిల్లలు ఆకలికి అల్లాడిపోతున్నారు. గదీలోంచి గుమ్మని మాంసం ఉడికిన వాసన వస్తుంది. కళ్ళను పత్తికాయలు చేసి చూస్తున్నారు. జనం జగ్గయ్యను. జగ్గయ్య వంటి మీద రక్తం పెరిపోయింది. పెక్కులు కట్టింది. ఇంక కారడం లేదు. అసలు ఆ బొందిలో ప్రాణం ఉందొ లేదో తెలియడం లేదు.
జగ్గయ్య సంగతి పట్టనట్లు కోళ్ళు కూశాయి. వేగుచుక్క పొడిచింది. పోలీసు శిభిరంలో సంచలనం ప్రారంభం అయింది. మందు గుండు సర్దుకున్నారు. లారీలు వచ్చాయి. ఎక్కారు. బారులు తీరిన లారీల ముందు జగ్గయ్యను దింపారు. జగ్గయ్య పడిపోయాడు. మంగమ్మ సహితంగా గొల్లుమన్నారు. జగ్గయ్యను ఎత్తుకెళ్ళి లారీమీద వేస్తుంటే గుండె బాదుకొని ఏడ్చింది మంగమ్మ. ముందుకు ఉరికినదాన్ని తుపాకి మడమలతో బాది పంపించేశారు పోలీసులు. ఆమె విరుచుకుని పడిపోయింది.
లారీల బిడారు సాగింది. ఊరు దాటింది. సాగుతుంది. ఊళ్ళూ దాటింది. అడవిలో దూరింది. బాట ఇరుకుగా ఉంది. లారీలు సాగవు. జీపు వెనక తుపాకులతో పోలీసుల బారు సాగింది. ఎండ ఎక్కింది కూడా కనిపించటం లేదు. అంత దట్టంగా ఉంది అడవి. పోలీసుల బూట్ల చప్పుడే ఏదీ వినరావడం లేదు. మధ్యాహ్ననానికి ఒక గుట్టకు చేరారు. ఆగారు. గుట్టను చూచి గుండె డక్కుమన్నది శివరావుకు - అంత కొండను ఎలా దువ్వడం? ఎక్కడ ఏ మృగం ఉందొ? అసలు ఈ బలగం చాలుతుందా? రాముడు నమ్మదగిన వాడేనా? తమను ఇరికించడు గదా! అదే మాట అడిగాడు బలరామయ్యను. బలరామయ్యకు భయం పట్టుకుంది. స్పష్టంగా జవాబు చెప్పలేదు. రాముడ్ని అడిగాడు. ఇది వాళ్ళ తావరం కాకుంటే తన తల తీయించమన్నాడు. బాగానే వుంది. వాడి తల తీస్తారు కాని తన తల మాట! అనవసరంగా తల దూర్చాననుకున్నాడు. ఇక్కడికి వచ్చినందుకే ఒక ప్రమోషను వచ్చింది. ఎక్కన్నన్నా పడ్తే మరో ప్రమోషన్ వస్తుందని ఆశపడ్డాడు. ఏం చేయాలా తోచలేదు. అయినా గుట్టను చుట్టేయమని ఆదేశించాడు. పోలీసులూ వెనుకా ముందాడారు. గద్దించాడు శివరావు. తప్పలేదు పోలీసులకు. పొద్దు కరకర ఎక్కింది. ఆకలి నకనకలాడుతుంది. ఏడుస్తూ అడుగులు వేస్తున్నారు పోలీసులు. కొండను దువ్వటం - గాలించటం - సాగుతుంది. ఒక్క పురుగు బయటకు రావటానికి వీల్లెనట్లుగా సాగుతున్నారు పోలీసులు. పొద్దుతో పటు గుండె కుంగుతుంది శివరావుకు. ఒక గుహకు దారితీశాడు రాముడు. శివరావు అనుసరించాడు. గుండె గుబగుబలాడింది. బలరామయ్యకు. అయినా అనుసరించాడు. పోలీసులు తుపాకులు గురిపెట్టి గుహలో ప్రవేశించారు. లోన గలగలా చప్పుడైంది. తుపాకులు ధన్ ధన్ పేలాయి. రెండు కుందేళ్ళు తుపాకుల మీద నుంచి దూకి బయట పడ్డాయి. అంతా గుహలో దూరారు. చిమ్మున చీకటి బ్యాటరీ లైట్లు వెలిగాయి. ఆ వెలుగులో విడిచిపోయిన విస్తళ్ళు, బియ్యం నూకలు, కొన్ని కాగితాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. గోడ మీద నినాదాలున్నాయి.