Previous Page Next Page 
జనపదం పేజి 10

 

    వెనక నుంచి శివరావు పిస్తోలు పేలింది. జగ్గయ్య వీపులో దూరిన గుండు ఎదను చీల్చుకొని బయటికి వచ్చేసింది. అయినా పరిగెత్తాడు. రక్తం వరద కట్టింది. పడిపోయాడు. శివరావు, పోలీసులు పరిగెత్తారు. బలరామయ్య , రాముడు వెనకనే ఉండిపోయారు.
    శివరావు కళ్ళు చీల్చుకొని చూశాడు జగ్గయ్యను.
    "రైతురాజ్యం స్థాపిస్తాం"
    "దున్నేవాడిదే భూమి"
    "విప్లవం వర్ధిల్లాలే" చివరి నినాదంతో జగ్గయ్య ఆఖరి విశ్వాసం వదిలాడు.
    శివరావు అడిరిపోయాడు. చచ్చేప్పుడూ దీక్ష వదల్లేదు. ఎంత వీరుడు అనుకున్నాడు. వెంటనే పోలీసుగా మారిపోయాడు. అతణ్ణి తీసుకొని బయల్దేరమని ఆదేశించాడు. పోలీసు పటాలం బయలుదేరింది. సాగిపోతుంది. తోవలో పరుగెత్తుతున్న ఒక గోచి గుడ్డివాడు కనిపించాడు. కాల్చమన్నాడు పోలీసుల్ని శివరావు.
    పోలీసులు కాల్చారు.
    అనామకుడు పడిపోయాడు.
    అతడెవరో తెలియదు.
    తుపాకులవాళ్ళ కింద జమకట్టారు.
    శివరావు జైత్రయాత్ర చేసి ఊరికి వచ్చేశాడు. అతడు చంపిన తుపాకుల వాళ్ళనూ, వాళ్ళ దగ్గర పట్టుకున్నవనుకున్న ఆయుధాలనూ గడీ ముందు ప్రదర్శన ఏర్పాటు చేశాడు. పశువుల కొట్టంలోని పల్లె జనం హోరుమని ఏడ్చారు. మంగమ్మ దుఖాన్ని వర్ణించటం ఎలా?
    పశువుల కొట్టంలోని జనాన్ని విదిచేశారు. గడపదాటి బయటికి రావద్దన్నారు. ఊరు నిర్మానుష్యంగా ఉంది. మంగమ్మ జగ్గయ్య ఇల్లు చేరింది. ఇండ్లకు చేరారనే గాని ఆ రోజు ఒక్క ఇంట్లోనూ పొయ్యి రాజలేదు. ఊరు అశ్రుతర్పణం అర్పించింది జగ్గయ్యకు.
    గడీ ముందు చాలా సమ్మర్ధంగా ఉంది. వంటలు జరుగుతున్నాయి . వార్తలు చేరుతున్నాయి. సాయంకాలానికి పట్నం నుంచి పెద్ద అధికారులు , నాయకులూ వచ్చారు. ప్రదర్శన చూశారు. శివరావును అభినందించారు అధికారులు. బలరామయ్యను అభినందించారు నాయకులు.
    నాయకుల సభ జరుపుతామన్నారు. తుపాకుల వాళ్ళ దౌర్జన్యాలను వివరిస్తామన్నారు. తమకు ప్రజల సహకారం కావాలన్నారు. పోలీసులు జనాన్ని కూడ దీయలన్నారు. శివరావు అభ్యంతరం చెప్పాడు. ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నాడు. నాయకులూ జంకారు. అంతటితో విరమించుకున్నారు.
    అ రాత్రి విందులూ, వినోదాలూ జరిగాయి.
    తెల్లవారింది. ఆరోజు సూర్యుడు ఉదయించలేదు. మబ్బుల్లో దాక్కున్నాడు. మేఘుడు ఉరిమాడు. వర్షం వస్తుందని భయపడ్డాడు శివరావు. అందుకే మత్తు వదలకున్నా బయలుదేరాడు. శవాలను అందరికీ కనిపించేట్టు లారీల మీద కట్టారు. ముందు ఆ లారీ నడిచింది, వెనుక పోలీసు వ్యానులు, పెద్దల జీపులు వరుసగా బయలుదేరాయి - పట్నానికి'. శవాలు ఊళ్లోంచి సాగుతుంటే కిటికిలోంచి అంజలి ఘటించారు జనం. కన్నీటి తర్పణం విడిచారు. అంతకుమించి ఏం చేయగలరు ప్రజలు? ఎక్కువమంది అన్యాయాన్ని సహించరు. అయినా ఏ ఒక్కడో గాని ఎదిరించడు.   
    పట్నంలో పెద్ద జాతర లాంటిది జరిగింది. మిలటరీ గవర్నర్ సహితంగా అనేకమంది మహానుభావులు వచ్చారు. విద్రోహుల శవాలను చూడటానికి - పట్టి తెచ్చిన ఆయుధాలను పరికించడానికి. వారంతా శివరావును ప్రశంశించారు. రాజ ప్రముఖ్ ఒక ప్రశంసా పత్రం ఇచ్చారు.
    ప్రజలూ వేల సంఖ్యలో వచ్చారు. పోలీసులకు ఒక సమస్యగా పరిణమించారు. వారిలో ఎందరు చనిపోయినవారిని వీరులని మొక్కారో? ఎందరు విద్రోహులని తిట్టారో చెప్పడం కష్టం.
    మరుసటి రోజు పత్రికలు పతాక శీర్షికలు ఫోటోల సహితంగా ప్రకటించాయి. శివరావు వీరుడైపోయాడు. అతనికి ప్రమోషను వచ్చింది. - డిప్యుటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అయిపోయాడు.
    శివరావు అద్దం చూసుకున్నాడు. చిరునవ్వు నవ్వాడు. మీసం మెలేశాడు. ఎదురు లేదు. ఎంతోమందిని చంపాడు. వేలమందిని కన్సెంట్రేషన్ క్యాంపుల్లో కుక్కాడు. అతడంటే దేశమంతా హడలిపోయింది. కాలాన్ని సహితం కాల్చేశాడతను. హాహాకారాలు చెలరేగాయి.
    శివరావు అన్న సుందరరావు. అతడు గాందేయుడు. మోకాళ్ళ వరకే ఖద్దరు పంచె కట్టుకుంటాడు. పైన పంచె ఉండదు. వట్టి వేరుశనగకాయల మీద జీవిస్తాడు. వార్ధా ఆశ్రమం నుంచి పట్నంలో దిగాడు. పరిస్థితులు తెలుసుకున్నాడు. అతని యెడ ఏడ్చింది. ప్రాయచిత్తానికని అయిదు రోజుల నిరశన వ్రతం ప్రకటించాడు. దాంతో శివరావు సహితంగా అంతా హడలిపోయారు. అయిదు రోజులు గడిచిపోయాయి. అయినా విరమించలేదు. వ్రతం సుందరరావు. ఇంత ఘోరాన్ని చూస్తూ జీవించలేనన్నాడు. ఆత్మార్పణం చేస్తానన్నాడు. శివరావు వళ్ళు మండింది తన సిరిసంపదలను చూసి అన్న సహించలేకపోతున్నాడని ప్రచారం సాగించాడు. అన్నను అరెస్ట్ చేస్తాననే దాకా వచ్చింది వ్యవహారం. అధికారులు వారించారు. వ్యవహారం డిల్లీ దాకా పోయింది. విచారణ జరపడానికి ఒక కమీటీ వేసింది ప్రభుత్వం.
    శివరావు పడగ నేలకు కొట్టుకున్నాడు. ఇంతమందిని హడాలగోట్టానే వంట్లో ప్రాణం లేని ఒక మనిషి తనను ఓడించాడు ! ఏమిటా మహత్తు? అని ప్రశ్నించుకున్నాడు. కానీ జవాబు దొరకలేదు.
    అనేకమందిని అభ్యర్ధన మీద సుందరరావు గారు వ్రతం విరమించారు. శివరావు ఇంటికే భోజనానికి వచ్చారు. శివరావు అన్నను చూచాడు. మండిపోయాడు. ఏమోమో అందామనుకున్నాడు. కానీ  ఏమీ అనలేకపోయాడు. "భోజనానికి రండి" అనడం తప్ప.
    దేశ్ ముఖ్ బలరామయ్యగారి పలుకుబడి పట్నంలో నానాటికీ పెరుగుతుంది. కాదూ మరి. వారు ఒక అవతారం చాలించారు. కుచ్చు టోపీలు, షేర్వాణీలు, చుడీ దార్ పైజామాలు పాత పెట్టెల్లో భద్రపరిచారు. వారి ఇంట్లో ఒక ఖాదీ భండార్ వెలిసింది. వారు ఖద్దరు వినా ఆస్యం ధరించడం లేదు. అధికారాన్ని పట్టుకొని అర్ధం ఉండే రోజులు పోయాయని గమనించారు. అర్ధాన్ని బట్టి అధికారమూ పలుకుబడీ వచ్చే కాలం వచ్చిందనీ గమనించారు. అందుననుసరించి ఖర్చుకు వెనుదీయడం లేదు, వారు ప్రభుత్వ యంత్రాంగంలో ఒక భాగంగా మారిపోయారు. అసలు ఆ దేశముఖ్ వ్యవస్థే అలాంటిది.

 Previous Page Next Page