Previous Page Next Page 
మనసున మనసై పేజి 9


    'వుండు, ఏం తొందర' ఏదో పైపైకి అన్నట్టు అంది అన్పించింది జయంతికి.
    'శ్రీధర్ రాత్రి డిన్నరుకి తీసికెళ్తానంటున్నారు. నీవూ రాకూడదు...' ఉషారాణితో అంటుంటే శ్రీధర్ మొహం కాస్త అప్రసన్నంగా అనిపించింది జయంతికి. కాబోయే భార్యతో వంటరిగా వెళ్ళాలనుకుంటున్నాడు అతను.
    'మధ్యలో నేనెందుకు' అంటూ ఓ నవ్వు నవ్వి 'ఎంజాయ్ యువర్ సెల్ఫ్' భుజం తట్టి, అతని దగ్గిర సెలవు తీసుకుని బయటికి నడిచింది.
    రూముకి వెళ్ళడానికి నడుస్తుంటే అడుగులు భారంగా పడ్డాయి. మనసంతా ఏదో దిగులు ఆవరించింది. ఉషారాణి పెళ్ళయి వెళ్ళిపోతుందన్న ఆలోచన, తను వంటరి అయిపోతానన్న ఆలోచన. తనకి పట్టని అదృష్టం ఉషారాణికి ఎంత సులువుగా దక్కింది అన్న ఆలోచన అన్నీ కలిసి ఆమె మనసు భారంగా అయింది. ఎవరికి ఎక్కడ రాసి పెట్టివుందో అని అమ్మ అనే మాటలు నిజమే కాబోలు. పెద్ద ప్రయత్నం లేకుండానే ఉష పెళ్ళి కుదిరిపోయింది. గత ఐదేళ్ళ నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా తన సంగతి ఎక్కడవేసిన గొంగళి అక్కడ మాదిరిగానే వుంది.
    
                                  * * *
    
    ఉషారాణి మర్నాడేకాదు వారం రోజుల వరకు రూముకి రాలేదు. బ్యాంకుకి ఫోను చేసి 'ఇద్దరం తెగ తిరుగుతున్నాంటే. రోజుకో సినిమా, రోజుకో హోటల్లో డిన్నర్లు, లంచ్ లు షికార్లు అబ్బాయిగారు అమెరికా డాలర్లు బాగానే సంపాదించాడులే. బోలెడు ఖర్చు పెట్టి ప్రెజెంటేషన్లు ఇస్తున్నాడు. ఒ.కే. పెళ్ళయిన తరువాత ఎలాగో ఈ మగాళ్ళు చప్పబడ్తారు. ఈ పదిరోజులన్నా నావెంట తిరగనీ.....' చాలా సంబరంగా, గర్వంగా ఫోనులో అంది ఉషారాణి.
    'ఉషా.....ఓసారి రూముకి రావే. చాలా మాట్లాడాలి' ఏదో చెప్పబోయింది జయంతి. 'మరి ఉద్యోగం...'
    'వస్తాలే, ఈయనగారు వదిలితేకదా-ఇంకెందుకే ఈ ఉద్యోగం. రిజైన్ చేస్తున్నాను. పెళ్ళయి వెళ్ళేవరకూ హాయిగా ఎంజాయ్ చెయ్యదల్చుకున్నాను. అక్కడికి వెళ్ళాక ఎలాగైనా ఈ చదువు, ఉద్యోగం, ఎక్స్ పీరియన్స్ ఏవీ పనికిరావుగా'
    "నీ సామాను...బట్టలు...?"
    "బట్టలు తీసుకుంటాలే బోడి సామాన్లు ఏమున్నాయి.... ఏదో మంచం, టేబుల్, కుర్చీలు, గిన్నెలు బొన్నెలేగా....నీవు ఎలాగూ వున్నావుకదా వాడుకో... రేపు బ్యాంకుకు వచ్చి రిజగ్నేషన్ ఇచ్చి నాకు రావాల్సిన డబ్బులు లెక్కచూసి కాగితం పెట్టాలి. అట్నించి రూముకొచ్చి బట్టలు తెచ్చుకుంటాను' అంది ఉషారాణి.
    మర్నాడు బ్యాంకు పని చూసుకుని జయంతితో రూముకొచ్చి బట్టలు అన్నీ పెట్టెలో సర్దుకుంది. జయంతి దిగులుగా 'ఇన్నాళ్ళు నీ వున్నావు... ఇంటి సంగతే గుర్తురాలేదు- ఇప్పుడు ఒక్కర్తిని' పట్టుకున్న గొంతు అంది.
    'జయంతి...ఈ పంతాలు, పట్టింపులు ఎందుకు, నీ తల్లిదండ్రులు ఏంచేసినా నీ మంచికోరే చేస్తారు. ఇంటికెళ్ళిపో నా మాటవిని' అంది ఓదారుస్తున్నట్టు.
    "ఇదిగో జయా, ఉచిత సలహా అనుకోకపోతే వీలయినంత త్వరగా నీవూ పెళ్ళిచేసుకో, అనవసరంగా లేట్ చేసుకోకు"
    "అవునులే, ఒడ్డెక్కినవారు సలహాలు చెపుతారు. ఏం మంచి సంబంధం వస్తే చేసుకోనన్నానా' పైకి నవ్వుతూనే ఉక్రోషంగా అంది.
    "మంచి అన్నదానికి కొలమానం ఏముంటుంది. లక్ అను పెద్ద వాళ్లన్నట్టు ఎవరికెక్కడ రాసిపెడ్తే అక్కడే అవుతుంది"
    "అవునులే అమ్మా! అమెరికా మొగుడు వచ్చేశాడు కనక ఇంకొకరికి నీతులు వల్లిస్తున్నావు"
    ఉషారాణి నవ్వింది. 'జయా.... నిజంగా శ్రీధర్ మంచివాడే. చాలా సెన్సాఫ్ హ్యూమరుంది. ఇతరులని అర్ధం చేసుకోగల సంస్కారం వుంది. ఐథింక్ ఐయామ్ లక్కీ....' "పెట్టె సర్దుకుని లేచి నిలబడింది. "జయా మరోసారి చెప్తున్నాను వంటరిగా వుండద్దు....ఇంటికెళ్ళు నా మాటవిని" భుజం మీద చెయ్యి వేసి ఆప్యాయంగా అంది.
    ఉషారాణి వెళ్ళాక ఏదో పోగొట్టుకున్నదానిలా అలా నిర్వేదంతో పక్కపై వాలిపోయింది.
    
                                     * * *
    
    "దమయంతీ, మీ అక్కపట్ల నేను అనుచితంగా ప్రవర్తించానేమోననిపిస్తోంది. ఆరోజు ఏదో ఆవేశంలో, ఉక్రోషంలో అలాచేశాను కాని తరువాత గిల్టీగా ఫీలవుతున్నాను. మన పెళ్ళికి కూడా రాలేదంటే మీ అక్క చాలా ఫీలయినట్టుంది-ఐయామ్ సారీ. నావల్ల ఆమె ఇల్లు వదిలివెళ్ళడం.." నిజంగానే బాధపడుతూ అన్నాడు గోపాలకృష్ణ పెళ్ళి అయిన మొదటి రాత్రి.
    "అదేంలేదు మా అక్క సంగతి మా అందరికి తెలుసు. అది ఏదో విధంగా దారికి వస్తుందేమోననే మీరు ఆఫీసుకి వెడతానంటే మేమూ సరే అన్నాం. దానికి బుద్ది తెప్పించాలనుకున్నాంగాని అదింతకి తెగించి ఇల్లు వదిలిపోతుందనుకోలేదు. అమ్మా, నాన్న కూడా విసిగిపోయి కొన్నాళ్ళు విడిగా వుంటేనన్నా బుద్ది మారుతుందేమోనని వదిలేసి వూరుకున్నారు. అనుభవంలోంచి అది ఏమన్నా పాఠం నేర్చుకుంటుందేమోనని మా అందరి ఆశ-ఇందులో మీరు ఫీలవడానికి ఏమీలేదు" దమయంతి ఇలా మామూలుగా అంది.

 Previous Page Next Page