Previous Page Next Page 
మనసున మనసై పేజి 10


    "మీ అక్క నన్ను చేసుకోవడం నాకు వరం అయిందనుకుంటున్నాను" తమాషాగా అన్నాడు.
    "ఎందుకు?" ఆశ్చర్యంగా చూసింది దమయంతి.
    "ఆమె చేసుకుంటానంటే నీవు దక్కేదానివి కాదుగదా. మా ఇద్దరి పెళ్ళి జరిగుంటే మేం ఇద్దరం సుఖంగా వుండేవాళ్ళం కాదు అనిపిస్తోంది. ఆమెకి సర్దుకుపోయే తత్వం కాదు. పెళ్ళికి కావాల్సిన ముఖ్యమైనది అదేకదా! ఏదో తంతే బూర్లగంపలో పడ్డాననిపిస్తోంది. నీ స్వభావం నాది కలుస్తుంది. మనం హాపీగా వుంటాం అనిపిస్తోంది" ఆమె చెయ్యి చేతిలోకి తీసుకుని అన్నాడు.
    "అప్పుడే, పెళ్ళయి ఇంకా ఒకరోజు కూడా కాకుండా నాగురించి తెలిసిపోయిందా' కొంటెగా అంది.
    "అన్నం అంతా పట్టుకుచూడాలా- ఈ పదిహేను రోజులలో మనం కలిసి తిరిగిన కొన్ని గంటలు చాలవంటావా మనిషిని అంచనా వేయడానికి- నా నమ్మకం వమ్ముకాకుండా చూసే పూచీనీది" భుజం చుట్టూ ఆప్యాయంగా చేయివేశాడు.
    "కావాలని చేసుకుని, కాపురం చెడగొట్టుకునే తెలివితక్కువతనం నాకు లేదు లెండి" నవ్వి అంది అభయం ఇస్తున్నట్లు.
    "మేరేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్" అన్నది ఎంత నిజం. మీ అక్కని చూడటానికి వచ్చి నిన్ను చేసుకున్నాను చూడు-దమ్మూ వివాహంలో కావాల్సింది పరస్పర ప్రేమ, అనురాగాలు ఇచ్చి పుచ్చుకుని సర్దుకుపోయే మనస్తత్వాలు...అందం, ఆకర్షణ ఇవన్నీ నాలుగు రోజుల ముచ్చటే-
    "మనకు అందాలు లేవుకనక అలా సరిపెట్టుకుంటున్నామేమో ... అందని ద్రాక్ష....నవ్వుతూ కొంటెగా అంది.
    "ఇది అందిన ద్రాక్ష నాకు. ఈ పులుపులోనే తీపిని వెతుక్కుంటాను. ఈ మాత్రం సెన్సాఫ్ హ్యూమరుంటే చాలు జీవితం నిస్సారం అవదు. ఐ ప్రామిస్....ఏనాడు నా వైపునుంచి నిన్ను హర్ట్ చేసే ప్రవర్తన వుండకుండా జాగ్రత్తపడతాను" అన్నాడు ప్రేమగా కళ్ళలోకి చూసి-
    'ఐ టూ.....' అతని గుండెలమీద వాలి అంది దమయంతి.
    
                                   * * *
    
    ఆ రోజు జయంతి ఆఫీసుకి వెళ్ళేసరికి కాస్త హడావిడి కనిపించింది. ఇంకా ఎవరూ పనిలొ ప్రవేశించలేదు. జయంతి నిరాసక్తంగా తన టేబిలు ముందు కూర్చుని లెడ్జరు బయటకి తీసింది. 'ఇవాళ బ్రాంచికి కొత్తమేనేజరు వస్తున్నాడు తెలుసా' అంది పక్క సీటు రేవతి.
    'వస్తున్నాడా....'కాస్త ఆశ్చర్యంగా అంది జయంతి. ఆ బ్రాంచికి తను ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచి లేడీ మేనేజర్. స్టాఫ్ లో ఎనభై శాతం మంది ఆడవాళ్ళే. అందుచేత మేనేజరుగా పురుషుడు రావడం ఆఫీసులో కాస్త డిస్కషన్ కి అవకాశం అయింది.
    'అదేమిటి? ఇదివరకు ఇక్కడచేసి వెళ్ళిన సుజాత మేడం ప్రమోషన్ మీద వస్తుందనుకున్నాంగా'
    ఆవిడని విజయవాడ వెళ్ళమన్నారుట. దివాకర్గారిని ఇక్కడ వేశారు.
    'దివాకర్ అంటే ఎవరు. పేరు విన్నట్టులేదు ఇదివరకు?' ఇన్నాళ్ళు నార్త్ లొ పనిచేశాడు. ఆంధ్రాకి ఇదే రావడమట!'
    ఐసీ....రానీ, దానికింత ఎగ్జయిట్ మెంట్ ఏమిటి?" అనాసక్తంగా అంది.
    'ఎగ్జయిట్ మెంట్ ఏం లేదు. మొదటిసారి మగ మేనేజర్ వస్తున్నాడుగా, అదీ సందడి'
    ఎగ్జయిట్ మెంట్ ఏమిటి అన్న జయంతి మేనేజరు లోపలికి రాంగానే అందరికంటే ఎక్కువగా ఎగ్జయిట్ మెంట్ లోనయింది. సినీహీరోలా టిప్ టాప్ గా టై అది కట్టుకుని స్మార్ట్ గా వున్నాడు. హిందీ ఏక్టర్ శేఖర్ కపూర్ పోలికలు కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నాయి. లోపలికొస్తూనే అందరిని కలియచూస్తూ 'హాయ్ ఫ్రెండ్స్' నవ్వుతూ పలకరించాడు. అందరూ లేచి నిలబడి 'గుడ్ మార్నింగ్ సార్' అంటూ విష్ చేశారు. ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి మగవారికి షేక్ హాండ్ ఇస్తూ, ఆడవారికి నమస్కారం చేస్తూ పేరు, వివరాలు అడిగి తెలుసుకొని అందరినీ పరిచయం చేసుకున్నాడు. జయంతి దగ్గరకు వచ్చేసరికి అతను ఆమెను నవ్వుతూ సూటిగా చూసేసరికి తడబడిపోయి కాస్త గాభరాగా జయంతి. 'మిస్ జయంతి' తను పెళ్ళి కాని స్త్రీ అని ఆమెకి తెలియకుండానే చెప్పింది. అతని మోహంలో ఒక సెకను కదలాడిన భావం జయంతి దృష్టిని దాటిపోలేదు. గ్లాడ్ టు నో యూ-మిస్ జయంతీ- మిస్ జయంతి అని కాస్త నొక్కి పలికాడు దివాకర్. ఆ మాత్రం దానికే జయంతి మొహం సిగ్గుతో కాస్త ఎర్రబడింది. అందరి పరిచయాలయ్యాక తన కుర్చీలో కూర్చుని 'ఫ్రెండ్స్, నన్నీ బ్రాంచికి పంపే ముందు జనరల్ మేనేజర్ ఈ బ్రాంచి పెర్ ఫార్మెన్స్ గత రెండేళ్ళుగా అంత బాగులేదని అనుకున్న టార్గెట్ సాధించడం అటుంచి, లోన్ల రికవరీలో, కొత్త డిపాజిట్లు సేకరించడంలో చాలా వెనకబడిందని రిపోర్టు ఇచ్చారు. ఖాతాదార్లు వడ్డీరేటు రిజర్వ్ బ్యాంక్ తగ్గించడం వల్ల ప్రైవేట్ సంస్థలలో డిపాజిట్ల వైపు మొగ్గుచూపుతున్నారన్నది ఒక వాదం. కొన్ని సిక్ స్మాల్ స్కేలు యూనిట్లు మూతపడటం వల్ల ఇచ్చిన అప్పులు రాబట్టలేకపోవడం ఒక కారణం. ఈ రుణాల వసూళ్ళకి స్టాఫ్ ప్రత్యేక శ్రద్ద తీసుకోవాల్సి ఉంటుంది. రూల్సు ప్రకారం గ్యారంటీ ఉన్నవాళ్ళ ఆస్తులు జప్తు చేయడం లాంటిది పకడ్బందీగా చేబట్టి రాబట్టడానికి ప్రయత్నించాలి మనం డిపాజిటర్లని కొత్త పథకాలు ఏమన్నా ప్రవేశపెట్టి ఆకర్షించడానికి దారులు తెరవాలి. ఇవన్నీ నేను చెయ్యడానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలి. కొత్తగా వచ్చాను వివరాలు అన్నీ తెలుసుకునే వరకు మీ అందరూ నాకు సాయపడాలని అభ్యర్ధిస్తున్నాను. 'ష్యూర్ సర్' అంటూ అంతే అభయం ఇస్తూ అన్నారు. 'ఓకే, నౌ లెటజ్ గెట్ ఇన్ టూ వర్క్' అన్నాడు. ఎవరి సీట్ల దగ్గరికి వారు వెళ్ళారు. బిజినెస్ ట్రాన్ శాక్షన్ మొదలైంది.

 Previous Page Next Page