'నీకు ఏం చెప్పి లాభం లేదు. నీకెంత తోస్తే అంతే. ఇది నాకభ్యంతరం అని చెప్పడం కాదు- నీ ఫ్యూచర్ గురించి ఆలోచించి అన్నమాట. నీవిక్కడ ఉంటే నాకేం అభ్యంతరం లేదు. ఎన్నాళ్ళు కావలిస్తే అన్నాళ్ళు వుండు. కావలిస్తే పర్మనంట్ గా ఉండచ్చు. యిద్దరం రూము ఖర్చులు షేర్ చేసుకుందాం.'
'జయంతి సంతోషంగా...' నిజంగా యిద్దరం ఉందామా కలిసి, నాకూ ఒక ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అకామిడేషన్ వెతుక్కునే బాధ తప్పుతుంది.' అంది.
'అదేం ప్రాబ్లమ్ కాదు. కానీ.... "ఏదో చెప్పబోతుంటే జయంతి వారించింది.
'ఇంకేం చెప్పకు. నాకుద్యోగం ఉంది. నా బతుకు నేను బతకగలిగే ధైర్యం నాకుంది. నీకు నచ్చని దానితో రాజీ పడను' స్పష్టంగా అంది ఉషారాణి నిట్టూర్చి వూరుకుంది.
* * *
పదిహేను రోజుల తర్వాత దమయంతి ఓ రోజు తన పెళ్ళి శుభలేఖ తీసుకొని జయంతి పనిచేస్తున్న బ్యాంకుకి వచ్చింది. పలకరింపుగా నవ్వి 'అక్కయ్యా ఎలా వున్నావు' అంది. చెల్లెలిని చూసిన జయంతి కళ్ళల్లో ఒక్కక్షణం ఆనందం నీడ కదలాడింది. ఎంతయినా రక్త సంబంధం, పాతికేళ్ళ అనుబంధం. మరుక్షణంలో వర్తమానం గుర్తొచ్చినట్లు ముభావంగా 'ఎలా వుంటాను. బాగానే వున్నాను 'నీవెక్కడ వున్నావో, ఏ ఇబ్బందులు పడ్తున్నావో అని అమ్మ పాపం ఊరికే బాధపడ్తుంది. నాన్న కోపంగా వున్నా ఆయన నీవిలా వెళ్ళినందుకు మనసులో మధనపడ్తున్నారు" అంది దమయంతి.
'ఆహా, అలాగా, పాపం...' అంది కాస్త వ్యంగ్యంగా. 'నా గురించి ఎవరికి ఏం బాధ అక్కరలేదని చెప్పు. ఇంతకీ ఏమిటిలా వచ్చావు" చేతిలో శుభలేఖ చూస్తూ కూడా తెలియనట్టే అంది.
'ఈ పన్నెండో తారీఖు నాపెళ్ళి- శుభలేఖ ఇచ్చి రమ్మంది అమ్మ- తప్పకుండా రావాలి నీవు లేకపోతే చాలా ఫీలవుతాను...'
'చూడు దమ్మూ....నీ పెళ్ళికి వచ్చేట్లయితే అసలు ఇల్లు కదిలి రావాల్సిన అవసరం ఏముంది. సారీ...నేను రాను ఏమనుకోవద్దు. బెస్ట్ విషెస్ ఇప్పుడే చెప్తున్నాను. నీమారీడ్ లైఫ్ సుఖంగా వుండాలని కోరుతున్నాను-"
"థాంక్స్ అక్కా నీవు వస్తే సంతోషిస్తాం అందరం'. దమయంతి ఇంక రెట్టించకుండా వూరుకుని వెళ్ళిపోయింది. శుభలేఖ కేసి చూస్తూ కాసేపు ఉండిపోయింది జయంతి. తన పెళ్ళికంటే చెల్లెలి పెళ్ళి ముందు అవుతుంది అన్న ఆలోచన ఒక్క నిమిషం మనసులో కదలాడింది.
ఉషారాణితో రూము షేరు చేసుకోడం, ఇద్దరు కలిసి పడుకోవడం, కలిసి తిరగడం ఇద్దరి అభిప్రాయాలు, అభిరుచులు కలబోసి రకరకాల టాపిక్స్ మీద చర్చలూ, వాదులాటలూ, షాపింగులు, సినిమాలు, షికార్లు ఒక నెలరోజులు జయంతికి చాలా తొందరగా గడిచిపోయాయి. ఇల్లు వదిలి వచ్చినందుకు బాధపడటం, పశ్చాత్తాపపడే అవకాశమే రాలేదు, అదే వంటరిగా ఏ గది అద్దెకు తీసుకుని వుంటేనో, ఏ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో వుంటేనో అందరిని వదిలి వంటరిగా వున్నందుకు కాస్త దిగులుగా అనిపించిందేమో. ఉషారాణి సహచర్యంతో, ఎక్కడి కెళ్ళావు, యింతాలస్యం అయిందేం లాంటి ప్రశ్నలు, కట్టడులు లేకుండా స్వేచ్చగా కావాల్సింది తింటూ, తిరుగుతూ చాలా హాయిగా సంకెళ్ళు తెంచుకుని బయటికి వచ్చిన భావం కల్గింది.
కాని ఆ ఆనందం ఎక్కువ రోజులు అనుభవించకుండానే ఉషారాణి ఇంట్లో వాళ్ళు ఊర్లో ఉన్న దూరపు బంధువు ఇంట్లో పెళ్ళిచూపులు ఏర్పాటు చేశారు. మంచి సంబంధం, పెళ్ళికొడుకు అమెరికాలో ఇంజనీరు, వున్నవాళ్ళు. తల్లి తండ్రి అంతా చదువుకున్నవాళ్ళు. అబ్బాయి అందంగా లేకపోయినా మాట అది స్మార్ట్ గా అండి, కులాసాగా ఫ్రెండ్లీగా మాట్లాడాడు. అతను అమెరికన్ సిటిజన్ కనక పెళ్ళాడి భార్యని వెంటనే తీసికెళ్ళవచ్చు. పెళ్ళిచూపులని జయంతిని బలవంతంగా లాక్కెళ్ళింది వాళ్ళ చుట్టాలింటికి. తల్లి తండ్రి పెళ్ళి కొడుకు వచ్చారు. ఉషారాణి తల్లితండ్రి పల్లెటూరిలో పొలాలు చూసుకుంటూ వుంటారు. వాళ్ళూవచ్చారు. పెళ్ళికొడుకు ఉషారాణి ని నచ్చిందని అక్కడే చెప్పేశాడు. కాసేపు వేరే ఉషతో మాట్లాడి వచ్చి సెలవు అట్టే లేదు పదిరోజులలో పెళ్ళి అయిపోవాలి అన్నారు. పెద్దలంతా మిగతా విషయాలు మాట్లాడుతుంటే, ఉషారాణి జయంతిని పరిచయం చేసి, ముగ్గురూ కలిసి ముందు వరండాలో సరదాగా మాట్లాడుకున్నారు. ఉషారాణిని పెళ్ళికొడుకు వెంటనే ఓ.కె చేసెయ్యడం, పెళ్ళి ఇంకో పదిరోజుల్లో... అంతా వింటూంటే జయంతికి లోలోపల ఉషారాణి అదృష్టానికి అసూయ కల్గింది. పైకి నవ్వుతూ మాట్లాడుతున్నా ఆమెకి పట్టిన అదృష్టాన్ని జీర్ణించుకోలేకపోతోంది. ఎంత అదృష్టవంతురాలు. అమెరికా మొగుడు, ఇంజనీరు, డబ్బున్న వాళ్ళు, సరదాగా వున్నవాడు... తన వాళ్ళూ ఉన్నారు, ఎందుకు ఒక్కటంటే ఒక్కటి ఇలాంటి సంబంధం తీసుకొచ్చారు ఎంతసేపూ చెత్త సంబంధాలు తెచ్చి చేసుకో, చేసుకోమని చెప్పడంతప్ప ఇలాంటిది తెస్తే తనెందుకు చేసుకునేది కాదూ... ఆమె అంతరాంతరాలలో కథల్లో, నవలల్లోలాగా ఆ వచ్చిన పెళ్ళి కొడుకు ఉషారాణిని కాక తనని నచ్చడం, జయంతి అయితే చేసుకుంటానని తన వాళ్ళతో చెపితే అతని వాళ్ళు వచ్చి తన అమ్మా నాన్నని అడగడం తను తన అదృష్టానికి పొంగిపోవడం....అలా జరిగుంటే ఎంత బాగుండేది..."ఏమిటా ఆలోచన' ఉషారాణి భుజం తట్టి పిలిచేసరికి వర్తమానంలోకి వచ్చింది. అతనేదో జోక్ చేసినట్టున్నాడు. ఇద్దరూ నవ్వుతూ ఏదో అంటున్నారు. వాళ్ళిద్దరి ఆనందం మధ్య తను అతకనట్టనిపించి కూర్చోలేకపోయింది. నే వెళ్తూనే ఉషా....' అంటూ లేచింది.