ఫైలట్ హెలికాప్టర్ ని నడపడంలోనే పూర్తిగా నిమగ్నమయి వున్నాడు. చాలా ప్రమాదకరమైన ప్రదేశం అది. అటూ ఇటూ కోటగోడల్లా కొండలు ఏ మాత్రం ఏమరుపుగా ఏమన్నా వున్నా కొండలు తాకి, పేలి చిన్నాభిన్నమై పోతుంది హెలికాప్టర్.
"అదేమిటి?" అన్నాడు రతన్.
"ఏమిటి?" అన్నాడు ఫైలట్.
"అక్కడెవరో వున్నట్లు నాకు అనిపిస్తోంది. కానీ గట్టిగా చెప్పలేకపోతున్నాను. నా భ్రమ అయివుండవచ్చు కూడా! ఫైలట్ గారూ......ఇంకొంచెం కిందికి దిగుదాం. అప్పుడు స్పష్టంగా కనబడుతుంది మనకు౧ ఏమంటారు?"
"ఇంకా కిందికి దిగడం పిచ్చితనమంటాను. ఇప్పటికే ప్రమాదకరమైనంత కిందికి వచ్చేశాం. ఇంకా కిందికి పొతే లోయ ఇంకా ఇరుకైపోతుంది........డేంజరు" అన్నాడు ఫైలట్.
"కానీ ఫైలట్ గారూ!నాకేదో అనుమానంగా వుంది. వెళ్ళి నిర్ధారించుకోకపోతే మనసు నిలవదు"
ఎటూ చెప్పలేక కిందికి చూశాడు ఫైలట్.
శిక్షణ పొందిన అతని కళ్ళకు తక్షణం కనబడింది అస్పష్టంగా వున్న హరీన్, కరుణ ల రూపాలు కాదు.
ఎండ పొడపడి మెరుస్తున్న లోహం!
ఏమిటది?
రతన్ దగ్గర బైనాక్యులర్స్ లాక్కుని చూశాడు ఫైలట్.
అది ఉత్త మెటల్ కాదు! మెటల్ పార్ట్స్! హెలికాప్టర్ వి! అవిగో రెక్కలు! ఇప్పుడు స్పష్టంగా తెలుస్తున్నాయి.
"వాళ్ళు కనపడ్డారా ఫైలట్ గారూ!" అన్నాడు రతన్.
"నాకు కనబడుతోంది మనుషులు కారు! కూలిపోయి ధ్వంసమైపోయిన ఒక హెలికాప్టర్ తాలూకు శకలాలు! ఏం జరిగిందో నేను ఉహించగలను రతన్! ఇదివరకేప్పుడో ఎవరో ఫైలట్ తన హెలికాప్టర్ తో బాటు ఈ లోయలోకి వచ్చి వుంటాడు. లోయలో నుంచి బయటకు వచ్చేటప్పుడు హెలికాప్టర్ ని ముందుకీ, పైకీ ఒకేసారి పోనిచ్చేటట్లు ఆపరేట్ చేసి వుంటాడు ఫైలట్. ఒక్కోసారి ఏమవుతుందంటే , హెలికాప్టర్ ని ఏకకాలంలో ముందుకీ, పైకీ తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నప్పుడు హెలికాప్టర్ ని పైకి తీసుకెళ్ళే సిస్టం పనిచెయ్యడం మానెయ్యవచ్చు. అప్పుడు హెలికాప్టర్ పైకి లేవకుండా కేవలం ముందుకి మాత్రమే వెళ్ళిపోతుంది. ఏ కొండకో తాకుతుంది. పేలి భస్మమైపోతుంది. అలా జరగడానికి ఆస్కారం వుంది. ఇదివరకు అలాంటి సంఘటనలు కొన్ని జరిగాయి కూడా! ఇది కూడా అలాంటి ట్రాజెడీనే అయివుండవచ్చు."
"అయితే ఏం చేద్దామంటారు?" అన్నాడు రతన్ ఆరాటంగా.
"రతన్......నువ్వు స్టంట్ మాన్ వి. నేను స్టంట్ పైలట్ ని. మనకు వున్న పరిమితులూ, పరిధులు మనకి తెలుసు. అసంభవమైన పనులు చెయ్యకూడదు మనం. ఇది అసంభవం. అని నాకు అనిపిస్తోంది. దానికి సజీవ - కాదు కాదు నిర్జీవ ఉదాహరణ ఆ కూలిపోయిన హెలికాప్టరే . నో రతన్. బతికి వున్నాడో లేదో తెలియకుండా ఎందుకంత సాహసం చెయ్యడం" అని హెలికాప్టర్ ని పైకి పోనిచ్చి , తర్వాత వెనక్కి మళ్ళించాడు పైలట్.
విచారంగా తలదించుకుని వుండిపోయాడు రతన్.
* * *
"హెలికాప్టర్ వెళ్ళిపోయింది" అంది కరుణ నిస్పృహగా. "ఏం చేద్దాం ఇంక!"
"లెటజ్ సీ!" అన్నాడు హరీన్ ధైర్యం కోల్పోకుండా.
అప్పుడు వినబడింది ఆ చిత్రమైన శబ్దం - అతి దూరంనుంచి అస్పష్టంగా.
అది హెలికాప్టర్ శబ్దం కాదు.
మరేమిటి?
చెవులు రిక్కించి విన్నాడు హరీన్.
9
రాన్రానూ ఆ శబ్దం దగ్గరవుతోంది. కరుణ ఆపాదమస్తకం వణికిపోతూ హరీన్ ని కౌగిలించుకుంది. హరీన్ చెవులు రిక్కించి ఆ శబ్దన్ని జాగ్రత్తగా విన్నాడు.
అది ఆటవికులు వాయించే రండోలు శబ్దం అని గ్రహించాడు హరీన్. మరుక్షణం ఆ లోయల్లో సంచరించే నరమంసభక్షకులు హరీన్ స్మృతిపదంలో మెలిగారు.
ఓ నెలరోజుల క్రితం విడుదలై విజయభేరి మోగించిన తన సినిమాలోని ఓ సీన్ గుర్తొచ్చింది హరీన్ కి. అందులో ఓ ఆటవికుల పిల్లకి పూసల దండలు, రంగురంగుల ఈకలు కానుకులుగా ఇచ్చి ఆ పిల్లని లోబర్చుకుని శారీరకవాంచని తీర్చుకున్న కమెడియన్ ని ఆ విషయం తెల్సిన 'కానిబాల్స్' ఎత్తుకుపోతారు. వాళ్ళ నివాస్థలం మధ్యలో ఆ కమెడియన్ ని తలకిందులుగా వేలాడవేసి, అక్కడ మీటింగు పెట్టి, ఓ వేలం పాట మొదలెడతారు. ఆ కమెడియన్ చిటికనవేలు ఓ ముంత కల్లుకి పాడుకుని కోసుకుపోతాడొకడు. తన కళ్ళ ముందే తన శరీరంలోని భాగాలు వేలం వెయ్యబడడం చూసి కంగారుపడిపోతాడా కమెడియన్. ఒక్క తల తప్ప మిగతా భాగాలన్నిటికీ రెట్లు బాగా పలుకుతాయి. వాడి తలలో మట్టి తప్ప మరేం లేదన్న కారణంగా ఆ తలని ఎవ్వరూ పాడుకోరు.
తను భయంతో వణికిపోతున్నా ఎటో చూస్తూ చిరునవ్వు నవ్వుతున్న హరీన్ ని చూసి ఆశ్చర్యపోయింది కరుణ ........ఆ మనిషి మీద కొంత కోపం కూడా వచ్చింది. ఆ వస్తున్న మనషుల అరుపులే భయంకరంగా వున్నాయి. వాళ్ళ చేతికి తాము చిక్కితే ......ఆ ఆలోచనే భరించలేకపోయింది. హరీన్ ని మరింత గట్టిగా కౌగలించుకుంది. ఉహల్లోంచి వాస్తవంలోకి వచ్చి హరీన్ ఆటవికుల శబ్దాలు మరింత దగ్గరకావడం గమనించాడు. వెంటనే కరుణ చెయ్యి పట్టుకుని అక్కడినుంచి పరుగు ప్రారంభించాడు.......అదిగో, అదే హరీన్ చేసిన పెద్ద పొరబాటు.
అడవులలో ఓ మనిషి కదలిక లేకుండా నిశ్చలంగా వుంటే ఎవ్వరూ తెలుసుకాలేరు. కదలడం ప్రారంభిస్తే కింద రాలిపడి వున్న ఎండుటాకుల శబ్దం ఆ వ్యక్తిని పట్టించేస్తుంది. హరీన్ అనాలోచితంగా చేసిన ఆ పొరపాటు వల్ల ఆకుల శబ్దం ఆటవికుల చెవిన పడింది. వారి అరుపులూ, కేకలు ఆగాయి. డోలు శబ్దం ఆగింది. ఓ ఆటవికుడు విల్లు తీశాడు - శబ్దం వస్తున్న వేపు బాణం వేశాడు.
పరిగెడుతున్న కరుణ కాల్లో ముల్లు దిగడంతో హటాత్తుగా ఆగి, హరీన్ ని వెనక్కి లాగింది. కరుణకేమైందోనని వెనక్కి చూసిన హరీన్ జుట్టుని తాకుతూ వెళ్ళిందో బాణం - పరిస్థితి ప్రమాదకరంగా మారిందని గమనించాడు హరీన్. కరుణ కాల్లోంచి రక్తం స్రవిస్తోంది. ఇంకా తాత్సారం చేస్తే మరింత ప్రమాదమని కరుణని చేతుల్లో ఎత్తుకుని, కాలి కింది ఆకుల సవ్వడి పెద్దగా వినబడకుండా జాగ్రత్తపడుతూ మెల్లగా అడుగులు వేస్తున్నాడు.
అక్కడ, ఆటవికుల బృందం నాలుగు భాగాలుగా విడిపోయింది. నాలుగు జట్లూ నాలుగువైపులా నుంచి తాము శబ్దం విన్న ప్రదేశాన్ని చుట్టుముడుతున్నాయి. హరీన్ అతిజాగ్రత్తగా నడుస్తూ ముందుకి చూశాడు. నలుగురు ఆటవికులు ఎదురోస్తున్నారు. ఒక్కసారిగా వెనక్కి తిరిగి పరిగెత్తబోయాడు. అటువైపు నుంచి మరికొందరు ఎదురోస్తున్నారు. హారీన్ ఆగి చుట్టూ చూశాడు. ఆటవికులు వారిని చుట్టుముట్టారు. ఆ దృశ్యాన్ని చూస్తున్న కరుణ గుండె ఆగినంత పనైంది. పెనం మీంచి పొయ్యిలో పడినంత పనైందని బెదిరిపోతోంది. ఆ నీళ్ళలో కొట్టుకుపోయినా బాగుండేదనిపిస్తోంది కరుణకి.
హరీన్ ని, కరుణని ఆటవికులు చుట్టుముట్టారు. వాళ్ళని చూసి పెద్దగా నవ్వుతున్న ఆ జనం హటాత్తుగా నవ్వులు ఆపేశారు. హరీన్ మొహంలోకి తేరిపారా చూడటం ప్రారంభించారు. హరీన్ కి ఏమీ అర్ధంకావడంలేదు. వేషధారణవల్ల ఆ బృందం పెద్దలా అనిపిస్తున్న ఓ వ్యక్తీ ఓ క్షణం హరీన్ మొహంలోకి మొహం పెట్టి చూసి పెద్దగా అరిచాడు.
"ఉకిస్త్రకిజబో జింబురూకా"
ఆ అరుపుకి చెట్లమీద మాగన్నుగా నిద్రపోతున్న పిట్టలు అదిరిపడి ఒక్కసారిగా ఎగిరిపోయాయి. ఆ విచిత్ర శబ్దానికి అర్ధం ఏమిటో హరీన్ కి బోధపడలేదు.
అతవికులందరూ తమ చేతుల్లోని ఆయుధాలని కిందపడేసి హరీన్ కి సాష్టాంగనమస్కారం చేశారు. హరీన్, కరుణ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఈ అడవులలో కూడా హరీన్ కి ఫాన్స్ వున్నారా అనుకుని ఆశ్చర్యపోయింది కరుణ.
ఆ ఆటవికులలో కొందరు హరీన్ ని మరికొందరు కరుణ ని తమ భుజాల మీద ఎత్తుకున్నారు. వాళ్ళ మొహాల్లో గొప్ప అనందం కొట్టొచ్చినట్లు కనబడ్తోంది. తమని తీసుకెళ్ళి ఏం చేస్తారోనని భయపడుతోంది కరుణ.
తన సినిమాలో కమెడియన్ పట్టినగతి తల్చుకుని మరోసారి నవ్వుకున్నాడు హరీన్.
ఆటవికుల నివాసస్థలాలు, కోయగూడేలూ సినిమాల్లో చాలా చూశాడు హరీన్. కానీ తను ఇప్పుడు చూస్తున్న గూడెం వాటిలో అందంగా, రంగురంగుల హరివిల్లులా లేదు ఎలా వుంటుంది.....ఏ భాస్కరరాజు ఆర్ట్ డైరెక్షన్ లోనో ఏర్పాటైన గూడెం అయితే అందంగా వుంటుంది గానీ, అడవుల్లో దొరికిన చేన్నలు , కర్రలతో వాళ్ళకి వాళ్ళు ఏర్పరచుకున్న నివాసస్థలానికి ఆ రంగులు హంగులు ఎక్కడ నుంచి వస్తాయి?