"ఆ హారం సంగ్రహించడానికి ఒకరోజున ముహూర్తం పెట్టాను నేను. మసాజ్ చేస్తూ, ప్రేమాకపూర్ స్పృహ కోల్పోయేలా చేశాను.
ప్రేమాకపూర్, నేనూ దాదాపు ఒకే ఒడ్డూ పొడుగుతో ఉండడం నా అదృష్టం.
ఆమెకి స్పృహ తప్పాక ఆమె నైట్ గవున్ ని నేను వేసుకున్నాను. రకరకాల దినుసులతో చేసిన ప్యాక్ ని మొహానికి దట్టంగా పట్టించుకున్నాను. జుట్టు విరబోసుకున్నాను. బుగ్గలో చూయింగ్ గమ్ పెట్టుకున్నాను.
ఇప్పుడెవరయినా హఠాత్తుగా నన్ను చూసినా, ప్రేమాకపూర్ అనుకుని పొరబడటానికి ఆస్కారం వుంది.
ఎందుకంటే, ఆమె ఇంట్లో నేను ఉన్నాను గనుక -
ఆమె డ్రస్సు వేసుకున్నాను గనుక -
మొహానికి పూసుకున్న ప్యాక్ వల్ల నా మొహం గుర్తుపట్టడానికి వీల్లేని స్థితిలో వుంది గనుక -
అప్పుడు తాళాలు తీసుకుని స్ట్రాంగ్ రూం తలుపు తెరిచాను. వెంటనే నిద్రలేచిన దెయ్యప్పిల్లలా మోగడం మొదలెట్టింది అలారం.
క్షణాల్లో సెక్యూరిటీ వాళ్ళు పరిగెత్తుకొచ్చారు. తలుపులు దబదబ బాదారు. నేను ఏమాత్రం తొణకకుండా తలుపు తీశాను. వాళ్ళు నన్ను చూసి ప్రేమాకపూరే అనుకుని సెల్యూట్ చేసి "ఏమైంది మేడమ్?" అన్నారు.
దబాయించి మాట్లాడటం నాకు అలవాటే. నేనే ప్రేమాకపూర్ అయినట్లు చూయింగ్ గమ్ నముల్తూ, అర్ధమయీ, అవని యాసతో కరుస్తున్నట్లు చెప్పాను.
"నన్నడుగుతారేం? మీకు బుద్ధుందా లేదా? అలారం చెడిపోయినట్లుంది. వెళ్ళి ఆపెయ్ దాన్ని!" అన్నాను.
"యస్ మేడమ్!" అని భయభక్తులతో అని, స్ట్రాంగ్ రూం వైపు పరిగెత్తారు వాళ్ళు అంతలోనే -
"అలారం బాగయ్యేదాకా వజ్రాలహారాన్ని నా దగ్గరే వుంచుకోవడం మంచిది" అని చెప్పి స్ట్రాంగ్ రూంలోకెళ్ళి దాన్ని తీసుకున్నాను నేను.
కళ్ళెదురుగా జరిగిపోతున్న మోసాన్ని కనిపెట్టలేకపోయారు వాళ్ళు. అలారం ఆపేసి, వినయంగా సెల్యూట్ చేశారు నాకు. వాళ్ళు బయటికెళ్ళిపోయాక, నేనూ చల్లగా బయటపడ్డాను. అతి విలువైన వజ్రాలహారం నా సొంతం అయినందుకు వుప్పొంగిపోతూ రైలెక్కేశాను.
కానీ ఏం లాభం! చివరి నిమిషంలో పోలీసులు పట్టేసుకోగలిగారు" అంది దిగులుగా.
వింటున్న దినకర్ తల పంకించాడు. ఈలోగా -
మరో స్టేషన్ ని సమీపిస్తున్నట్లు కూతపెట్టింది రైలు. వేగం తగ్గింది.
కిటికీలోంచి బయటికి చూశాడు దినకర్. అప్పటిదాకా కంపార్టుమెంటు డోర్ దగ్గర నిలబడ్డ సబ్ ఇన్ స్పెక్టరూ, పోలీసు కానిస్టేబుల్సూ ఫ్లాట్ ఫారం మీదికి దూకి గబగబ గేటువైపు నడవడం మొదలెట్టారు. చూస్తున్న దినకర్ భ్రుకుటి ముడిపడింది.
"వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్ళకుండానే వెళ్ళిపోతున్నారేం?" అన్నాడు దినకర్.
"అదే నేనూ చూస్తున్నాను" అంది వైశాలి. హఠాత్తుగా అన్నాడు దినకర్.
"మిస్ వైశాలీ! వీళ్ళు అసలు నిజం పోలీసులే అని మీకు తెలుసునా?"
తెల్లబోయి చూసింది వైశాలి.
"కాదని ఎలా అనుకుంటాను అసలు?"
"యూ హావ్ బీన్ హాడ్!" అన్నాడు దినకర్ అసహనంగా. "వాళ్ళెవరో పగటి దొంగలు! ఐయామ్ వెరీ ష్యూర్! మీరు దొంగిలించిన వజ్రాల హారాన్ని మీ దగ్గర్నుంచే దొంగిలించుకు పోయారు వాళ్ళు!"
"ఓ మై గాడ్!" అంది వైశాలి నిర్ఘాంతపోతూ.
"డోన్ట్ వర్రీ! వాళ్ళని పట్టుకుని నలుగు ఉతికి, వజ్రాల హారాన్ని లాక్కొచ్చేస్తాను!" అన్నాడు దినకర్ లేచి నిలబడుతూ.
"ప్లీజ్! ప్లీజ్ డూ!" అంది వైశాలి ప్రాధేయపూర్వకంగా. డోర్ దగ్గరికి వచ్చి, కంపార్టుమెంటులో నుంచి కిందికి దిగబోయాడు దినకర్.
అప్పుడు కనబడింది అతనికి మరో విశేషం! గేట్లోనుంచి పరిగెత్తి లోపలికి వస్తున్నాడు ఇన్ స్పెక్టర్ జలీల్!
నిజం ఇన్ స్పెక్టర్ జలీల్! తనని వెదుక్కుంటూ! తనని అరెస్టు చేయడం కోసం!
ఇదే సమయంలో!
ఇన్ స్పెక్టర్ జలీల్ కనబడగానే స్థంభించిపోయాడు దినకర్.
అలా ఒక్కక్షణంపాటే!
ఆ తర్వాత వెంటనే అతని సెన్సెస్ అతని స్వాధీనంలోకి వచ్చింది. చటుక్కున వైశాలివైపు తిరిగాడు.
సందిగ్ధంగా అతనివైపూ, పోలీసులవైపూ మార్చి మార్చి చూస్తోంది వైశాలి.
త్వరత్వరగా అన్నాడు దినకర్.
"మిస్ వైశాలీ! మీ హారం మీకు తిరిగి దక్కాలంటే మీరు నేను చెప్పినట్లు చెయ్యాలి."
"ఏం చెయ్యాలి?" అంది వైశాలి.
గుసగుసగా ఆమెతో ఏదో చెప్పాడు దినకర్. "ఐ హెల్ప్ యూ! యూ హెల్ప్ మీ! అర్ధమయిందా?"
అది వినగానే పాలిపోయిన వైశాలి మొహంలోకి రంగు తిరిగి వచ్చింది.
పుంజుకున్న ధైర్యంతో తనే ప్రిన్సెస్ ఆఫ్ రత్నగిరి అయినంత హుందాగా కిందికి దిగింది వైశాలి. వెన్నువిరిచి చకచక నడుస్తూ, ఆ దొంగ పోలీసులని సమీపించింది.
ఆమె తనవంకే వస్తూ వుండడం గమనించాడు నకిలీ పోలీ స్ ఇన్ స్పెక్టర్. అదే సమయంలో మరో నిజం ఇన్ స్పెక్టర్ ఎదుటినుంచి వస్తూ వుండటం కూడా అతని కంటపడింది.
వైశాలి కూడా తనలాంటి దొంగేనని అతనికి బాగా తెలుసు. కానీ ఆమె జంకూ గొంకూ లేకుండా అలా వచ్చేస్తుండడం చూసి అతనికి ఆశ్చర్యంతోపాటు కలవరం కూడా కలిగింది.
ఆమె ఏదో ఎత్తు వేస్తోంది! అంతవరకూ తెలిసిపోతూనే వుంది.
కానీ, ఏమిటా ఎత్తు?
ఆ నకిలీ ఇన్ స్పెక్టర్ తడబాటు చూస్తూ వుంటే చెలగాటంగా ఉంది వైశాలికి. చిరునవ్వుతో చనువుగా అతనితో అంది.
"థాంక్యూ ఇన్ స్పెక్టర్! ఇక మీరు ఆ వజ్రాలహారం నాకు ఇచ్చెయ్యొచ్చు!"
తేలు కుట్టినట్లు చూశాడు ఇన్ స్పెక్టర్. ఏం చెయ్యాలో అతనికి వెంటనే తోచలేదు.
అంతలోనే, ఇన్ స్పెక్టర్ జలీల్ కూడా అదే స్పాట్ కి వచ్చాడు. ఫ్లాట్ ఫారం మీదికి అప్పుడే వచ్చి ఆగిన ట్రెయిన్ లోనే దినకర్ వుండి తీరాలని తెలుసు అతనికి.
అతని వెనకే వస్తోంది డాక్టర్ నిశాంత. ఎప్పుడూ అలవాటు లేని లారీ ప్రయాణంవల్ల వడిలిపోయి వుంది ఆమె మొహం. దినకర్ ని హంట్ చేస్తున్న ఇన్ స్పెక్టర్ జలీల్, సరైన వాహనం ఏదీ దొరక్క సరిగ్గా అదే రూట్ లో వస్తున్న ఒక లారీని ఆపి ఎక్కేశాడు నిశాంతతోబాటు.
ఆలోచనలతో మనసు తూట్లుపడిపోతుంటే, లారీ కుదుపులతో ఒళ్ళు హూనమయిపోయింది నిశాంతకి.
ఈలోగా-
ఇన్ స్పెక్టర్ జలీల్ వైపు చూస్తూ పలకరింపుగా నవ్వి నిబ్బరంగా అంది వైశాలి.
"నా పేరు ప్రేమాకపూర్! మీరు బహుశా వినే వుండవచ్చు. ఫస్ట్ క్లాస్ కంపార్టుమెంటులో కూపేలో కూర్చుని వుంటే, ఒక దొంగవెధవ అందులో దూరాడు. హి వాజ్ అబౌట్ టూ స్నాచ్ అవే మై డైమండ్ నెక్లెస్ ఫ్రమ్ మీ! సరిగ్గా అదే టైంకి దేవదూతఃలా వచ్చాడు ఆ ఇన్ స్పెక్టర్."
"వచ్చాడు" అని కావాలనే ఏకవచనం ప్రయోగించింది వైశాలి. తనకంటే తక్కువ స్థాయిలో వున్నవాళ్ళతో అలా మాట్లాడటం తనకి అలవాటే అన్నట్లు.
"అప్పుడు నేను చాలా తెలివిగా ప్రవర్తించి, ఈ ఇన్ స్పెక్టర్ ని పిలిచి హారం ఇచ్చాను. అతను పాపం చాలా జాగ్రత్తగా దాన్ని ఆ దొంగవెధవ బారినుంచి కాపాడాడు." అని మళ్ళీ నకిలీ ఇన్ స్పెక్టర్ వైపు తిరిగింది వైశాలి.
"వన్స్ ఎగెయిన్! థాంక్స్ ఇన్ స్పెక్టర్! నౌ యూ కెన్ గివ్ బాక్ దట్ నెక్లెస్ టూ మీ!"
కోపాన్ని మనసులోనే దాచుకుని పైకి మాత్రం ప్రసన్నవదనంతో నవ్వుతూ జేబులోంచి నెక్లెస్ తీసి ఇచ్చేశాడు నకిలీ ఇన్ స్పెక్టర్.
ఇన్ స్పెక్టర్ జలీల్ నకిలీ ఇన్ స్పెక్టర్ వైపూ, వైశాలివైపూ మార్చి మార్చి చూస్తున్నాడు.
"ఇతను నీకు తెలుసా? ఇతని పేరేమిటి?" అంది వైశాలి కావాలనే జలీల్ తో.
అతను ప్రశ్నార్ధకంగా నకిలీ ఇన్ స్పెక్టర్ వైపు చూశాడు.