Previous Page Next Page 
యమదూత పేజి 10

 

    అప్పటికే నకిలీ ఇన్ స్పెక్టర్ గుండె జారిపోయింది. ఎప్పుడెప్పుడు జారుకుందామా అని ఉంది అతనికి.
    
    "నా పేరు భగవాన్!" అన్నాడు వినీ వినబడనట్లు. అది అతని అసలు పేరు కాదు.
    
    "థాంక్యూ భగవాన్!" అంది వైశాలి. "రేపటి ఫ్లయిట్ లో ఢిల్లీ వెళ్ళినప్పుడు మీ కేసు హోమ్ మినిస్టర్ కి చెప్పి రికమెండ్ చేస్తాను. వచ్చే ఇండిపెండెన్స్ డే సెలెబ్రేషన్ అవార్డుల లిస్టులో మీ పేరు తప్పకుండా వుంటుంది. ఓ.కే?" అంది దేవతలాగా.
    
    ఏడవలేక నవ్వాడు నకిలీ ఇన్ స్పెక్టర్ భగవాన్.
    
    తర్వాత "థాంక్యూ మేడమ్!" అంటూ వైశాలికి రెండు చేతులూ జోడించి నమస్కారం పెట్టి, జలీల్ తో అంటీ ముట్టనట్లు కరస్పర్శ చేసి, అక్కడినుంచి అదృశ్యమైపోయాడు.
    
    "మీ కూపేలోకి దొంగ దూరాడన్నారు. ఎలా వున్నాడు వాడు? అసలు వాడు దొంగ అన్న అనుమానం మీకెందుకొచ్చింది!" అన్నాడు జలీల్ వైశాలితో.
    
    ఒక్కక్షణం ఆలోచించిందామె. "ఫస్ట్ క్లాస్ ఎక్కే మొహంలా లేదు వాడి మొహం. బట్టలు మట్టికొట్టుకుపోయి తోళ్ళలా వున్నాయి. వాడి చూపులూ వాలకం చూస్తే జైల్లోనుంచి పారిపోయివస్తున్న ఖైదీలా వున్నాడు. అందుకే అనుమానం తగిలి హారాన్ని ఆ ఇన్ స్పెక్టర్ కి ఇచ్చాను. రిస్క్ తీసుకోదలుచుకోలేదు. డబ్బుతోబాటు ఇలాంటి చికాకులు కూడా అనుభవించాలి. తప్పదు! ఏమంటారు?" అంది.
    
    "అయితే వాడే దినకర్ అయివుంటాడు" అన్నాడతను ఎగ్జయిటింగ్ గా! "ఏ కంపార్ట్ మెంట్ లో ట్రావెల్ చేస్తున్నారు మీరు?"    
    
    "అదిగో ఆ కంపార్ట్ మెంటే!" అని చూపించిందామె.
    
    జనాన్ని తోసుకుంటూ అటు పరిగెత్తాడు ఇన్ స్పెక్టర్ జలీల్. ఒకసారి వైశాలివేపు ఆపాదమస్తకంగా చూసి తను కూడా జలీల్ ని అనుసరించింది డాక్టర్ నిశాంత.
    
    విజయగర్వంతో నవ్వుకుంది వైశాలి.
    
    ఇదంతా జరిగిపోవడానికి కేవలం రెండు నిముషాలు మాత్రమే పట్టింది.
    
    కానీ ఆ కొద్ది సమయంలోనే రైలు దిగేసి, రెండు ఫర్లాంగుల దూరం దాటేశాడు దినకర్.
    
    దినకర్ అదే ట్రైనులో వచ్చివుంటాడని కరెక్టుగా వూహించిన ఇన్ స్పెక్టర్ జలీల్ రైలంతా వెదికినాకూడా లాభం లేకపోయింది.
    
    విసుగుని అణుచుకుంటూ అక్కడినుంచే రెండు మూడు టెలిఫోన్ కాల్స్ చేశాడు ఇన్ స్పెక్టర్ జలీల్. తర్వాత తన అసహనాన్నంతా డాక్టర్ నిశాంత మీద చూపిస్తూ అన్నాడు.
    
    "దయచేసి ఆ యాక్సిడెంట్ స్పాట్ ఎక్కడో చెబుతారా నాకు"
    
    అన్యమనస్కంగా తల ఊపింది ఆమె.
    
    ఇద్దరూ అక్కడనుంచి కదిలారు.
    
                                                             * * *
    
    ఇదంతా జరగడానికి కొంతకాలం ముందు జరిగింది మరొక సంఘటన.
    
    ఆ రోజు సాయంత్రం ఆరు గంటలు కావస్తోంది.
    
    తన బంగళాలో అద్దంముందు నిలబడి డ్రెస్ అవుతున్నాడు అతను. యాభై రెండు, యాభై మూడేళ్ళు వుంటాయి అతనికి.
    
    కానీ అంత వయసువచ్చినా అతనికి వళ్ళు రాలేదు. వంట్లో బలం తగ్గలేదు. చర్మంలో బిగువుగానీ, మొహంలో కళగానీ తగ్గలేదు. అతని జుట్టు చాలావరకు నెరిసిపోయినా వుంగరాలు తిరిగి సిల్కులా ఆరోగ్యంగా మెరుస్తూ వుండడంవల్ల అదీ ఆకర్షణగానే వుంది.
    
    దాదాపు ఆరడుగులు ఎత్తువుంటాడతను. రోజూ క్రమం తప్పకుండా మూడు గంటలు ఏరోబిక్స్ దగ్గరనుంచి అన్నిరకాల ఎక్సర్ సైజులూ చేయడంవల్ల స్టీలు స్ప్రింగ్ లా మారిన అథ్లెటిక్స్ బాడీ అతనిది.
    
    తన టైలరు అత్యంత భక్తిశ్రద్దలతో కుట్టిన మృదువయిన గ్రే కలర్ కేమెల్ ఊల్ సూట్ వేసుకుని, టై సరిచేసుకుని సంతృప్తిగా తలపరికించాడు. ఇంపోర్టెడ్ ఫెర్ ఫ్యూమ్ కొద్దిగా స్ప్రే చేసుకుని, పులిలా అడుగులు వేస్తూ హాల్లోకి వచ్చేసరికి అతని ఆంగ్లో ఇండియన్ సెక్రటరీ జాక్వెలిన్ లేచి నిలబడి అతనివైపు ఆరాధనగా చూసింది.    
    
    "గో హోమ్ గర్ల్" అన్నాడతను.        
    
    మాట్లడకుండా అతనివైపు చూసింది జాక్వెలిన్ "నేను కూడా మీతో వస్తాను ప్లీజ్" అన్న అభ్యర్ధన కనబడుతోంది ఆమె కళ్ళలో.
    
    "నాట్ టుడే గర్ల్! సమ్ అదర్ డే... సమ్ అదర్ టైం!" అన్నాడు అతను నవ్వుతూ.
    
    నిరాశగా తలవంచుకుంది జాక్వెలిన్.
    
    అతను కిందికి వచ్చేసరికి పోర్టికోలో నిలబడి వుంది హోండా కారు.
    
    డ్రయివర్ తో అన్నాడతను. "నువ్వు వుండిపో! నేనే డ్రయివ్ చేస్తాను ఇవాళ!"
    
    వినయంగా తల పంకించి, పక్కకి తప్పుకున్నాడు డ్రయివర్.
    
    డ్రయివింగ్ సీట్ లో కూర్చుని సిగరెట్ వెలిగించి, కారు స్టార్ట్ చేశాడు అతను.
    
    కొద్ది నిమిషాల తర్వాత ఒక క్లబ్బు ముందు ఆగింది కారు. దాన్ని పార్కింగ్ లాట్ లో ఉంచి స్టయిల్ గా లోపలికి నడిచాడు. అతను ఎవరినీ పలుకరించలేదు. అతనితో అవసరం వున్నవాళ్ళో, అవసరం ఉంటుందనుకున్నవాళ్ళో, అతనంటే భయం వున్నవాళ్ళో, అవసరం ఉంటుందనుకున్నవాళ్ళో, అతనంటే భయం వున్నవాళ్ళో, ఫాసినేషన్ ఉన్నవాళ్ళో మాత్రం అతన్ని పలకరిస్తున్నారు.
    
    చిరునవ్వుతో తలపంకించి అభివాదాలని అందుకుంటూ ముందుకు వెళుతున్నాడు అతను.
    
    లాంజ్ లో కూర్చుని స్కాచ్ సిప్ చేస్తున్న ఒక కొత్త మెంబరు తన ఫ్రెండుని అడిగాడు ఆసక్తిగా.
    
    "ఎవరతను?"
    
    నవ్వి ఊరుకున్న రెండో మెంబరు తెలుసనీ చెప్పలేదు, తెలియదనీ చెప్పలేదు.
    
    రెట్టించాడు మొదటి అతను.
    
    రెండో అతను ఇబ్బందిగా మొహం పెట్టి "మనకెందుకు పోనిద్దూ!" అన్నాడు.
    
    "చెప్పుదూ!"
    
    "హి ఈజ్ ఎ మెకానిక్!"
    
    "మెకానిక్కా? వాట్ డూయూ మీన్? ఆఫ్టరాల్ ఒక మెకానిక్ ఈ క్లబ్బులోకి ఇంత నిస్సంకోచంగా ఎలా వస్తాడు?"
    
    నవ్వాడు రెండో మెంబరు.
    
    "మెకానిక్ అంటే మామూలు మెకానిక్ కాదు. నీకు అమెరికాలోని ఇటాలియన్ మాఫియా గ్యాంగుల గురించి తెలుసా?"
    
    "చదివాను"
    
    "ఆ గ్యాంగుల్లో మెకానిక్ అని ఒకడుంటాడు. ఎలాంటి ట్రబుల్ వచ్చినా 'ఫిక్స్' చేసేసి వస్తాడన్నమాట!"
    
    "అంటే....యూ మీన్?"
    
    "యా యూ గెన్స్ డ్ ఇట్ రైట్! హీ ఈజ్ ఏ హిట్ మాన్, హైర్ డ్ కిల్లర్, రాకెటీర్ అండ్ గ్యాంగ్ స్టర్!"
    
    అనుమానంగా అడిగాడు మొదటి అతను. "అలాంటి కిరాయి హంతకుడు నీకెలా తెలుసు?"
    
    చెప్పాలా వద్దా అని కొద్దిగా ఆలోచించి చెప్పాడు రెండో మెంబర్.
    
    "మన దేవీప్రసాద్ కి ఒక విషయంలో అతని సాయం కావలసి వచ్చింది ఆ సందర్భంలో పరిచయం!"
    
    "ఐసీ!"
    
    "అతనంటే పడి చచ్చిపోతారు అమ్మాయిలు. అతనికి గర్ల్ ఫ్రెండ్స్ ఒక్కళ్ళూ ఇద్దరూ కాదు అంటే ఎనీ గివెన్ మూమెంట్, డజనుమందికి తక్కువ గర్ల్ ఫ్రండ్స్ వుండరతనికి. అందులో ఎవ్వరికీ పాతికేళ్ళకిమించి వయసుండదు. హీ ఈజ్ ఏ ప్లేబోయ్! ప్రొఫెషనల్ లేడీ కిల్లరనుకో!" అని నవ్వాడు రెండో మెంబరు. "అమ్మాయిల పిచ్చికంటే పెద్ద వ్యసనం మరొకటి వుంది అతనికి"
    
    "ఏమిటది?"
    
    "అది నేను చెప్పడంకంటే నువ్వు స్వయంగా చూస్తేనే బాగుంటుంది. లెటజ్ గో అప్!"
    
    ఇద్దరూ లేచారు. మేడమీదికి వెళ్ళారు.
    
    అక్కడ పెద్ద హాలు ఒకటి వుంది.
    
    దాని ఫ్లోరింగ్ అంతా నలుపు, తెలుపు పాలరాతితో చదరంగం గళ్ళలా డిజైన్ చేసి వుంది.
    
    ఆ గళ్ళలో అప్పటికే నిలబడి వున్నారు కొంతమంది మనుషులు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గడిలో.
    
    వాళ్ళలో సగంమంది తెల్లబట్టలు వేసుకుని వున్నారు. వాళ్ళలో కొంతమంది భటుల్లాగా వేషాలు వేసుకుని వున్నారు. కొంతమంది మంత్రుల్లాగా, ఇద్దరు రాజుల్లాగా వేషాలు వేసుకుని వున్నారు. మరి కొంతమంది గుర్రాల్లాగా, ఇంకొంతమంది ఏనుగుల్లాగా వేషాలు వేసుకుని వున్నారు.
    
    ప్లేయర్స్ అంతా ఓ ప్రక్కగా నిలబడి వున్నారు. వాళ్ళలో వున్నాడు మెకానిక్. అలర్టుగా అందరినీ గమనించి చూస్తున్నాడు అతను.

 Previous Page Next Page