Previous Page Next Page 
వలపు సంకెళ్ళు పేజి 9

త్వరత్వరగా నెలరోజులు గడిచిపోయి పెళ్ళి జరిగిపోతే బావుండుననిపిస్తోంది లతకు.
పదిహేనురోజులు గడిచాయి.
ఈ మధ్యలో -
'ఎక్స్ ఛేంజ్ లైఫ్!'
అదో లోకం.
టెలిఫోన్లూ, వైర్లూ, నిర్విరామంగా మోగే గంటలూ, వెలిగి ఆరిపోయే లైట్లూ, కలుసుకునే లైన్లూ, విడిపోయే లైన్లూ, అల్లుకుపోయి చిక్కుబడిన లైన్లూ - జీవితానికి ప్రతిబింబంలాగా, జీవితమంతా హడావిడిగా, అయోమయంగా ఉంటుంది ఆటెలిఫోన్ ఎక్స్ ఛేంజ్.
రకరకాల ఫోన్ కాల్స్! రకరకాల కంప్లయింట్స్! రకరకాల మనుషులు!
తీరిగ్గా భోంచేసి కూర్చుని, సరదాగా ఫోన్ చేసి ఆపరేటర్లను ఆటపట్టించే రకాలు కొందరు, సరసాలాడ్డానికి ప్రయత్నించేవాళ్ళు ఇంకొందరు.
లతకి సహనం తక్కువ! ఉన్న ఆ కొద్ది సహనానికి పబ్లిక్ పరీక్షలాంటిది ఈ ఉద్యోగం. సాధ్యమైనంతవరకూ ఎవరినీ నొప్పించకుండా ఉండాలనే ప్రయత్నిస్తుంది లత. కానీ రోజుకోసారయినా కొంచెం కటువుగా మాట్లాడి, అవతలవాళ్ళ నోరు మూయించాల్సిన అవసరం తప్పదు.
"మేడమ్! టైమెంతైందో చెప్పగలరా!" అని రోజూ అలవాటుగా అడుగుతుంది ఒక గొంతు. ఆ గొంతు తాలూకు ఓనరు ఓ గడియారాల షాపుకి కూడా ఓనరే!
అతని చుట్టూ గోడ గడియారాలూ, గొప్ప ఖరీదైన ఎలక్ట్రానిక్ వాచ్ లూ ఉంటాయి. అయినా టైమ్ పాస్ చెయ్యడానికి టైమడుగుతూ ఉంటాడు.
నిజానికి టైమ్ చెప్పాల్సిన డ్యూటీ లతది కాదు. కానీ లత గొంతు సంగీతం పాడుతూ టైమ్ చెప్పే 'మ్యూజికల్ క్లాక్ లా' ఉంటుంది. అందుకని లతకే ఏదో వంక పెట్టుకుని ఫోన్ చేస్తాడతను.
"టైమ్ కావాలంటే టైమ్ చెప్పే నెంబరుకి రింగ్ చెయ్యండి" అంటుంది లత ముందర మృదువుగానే.
అది అతనికి తెలియక కాదు. అందుకే "మీరు చెప్పొచ్చుగా!" అంటాడు.
తను వాచీ చూడకుండానే, "నా వాచ్ ప్రకారం పదింబావు. ఇది నిన్న ఆగి పోయింది." అంటుంది.
"లతా!"    
కొద్దిగా అనుమానంగా, "ఎవరూ?" అంది.
అవతలవైపు చిన్నగా నవ్వు.
"నేనే! గుర్తు పట్టలేదూ?"
ఒకసారి గట్టిగా ఊపిరి తీసుకుని, పెదిమలు బిగబట్టి, తనని తాను అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నించింది లత. తర్వాత తూచితూచి మాట్లాడుతున్నట్లు అంది. "మీకు చాలాసార్లు చెప్పాను. ఇలా మాటిమాటికీ ఫోన్ చేశారంటే కంప్లెయింట్ ఇవ్వాల్సి వస్తుంది"
మళ్ళీ నవ్వు వినబడింది.
"కంప్లెయింటా? ఎవరికి ఇస్తావ్? ఏమని ఇస్తావ్? లతా! నువ్వే కంప్లెయింట్స్ సెక్షనులో వున్నావ్. నేనే నీకు కంప్లెయింట్ ఇవ్వాలి! నీమీదే! ఏమనో తెలుసా? లత అనే అమ్మాయివల్ల ఫలాని నంబరు ఫోన్ యజమానికి నిద్ర డిస్కనెక్ట్ అయిపోయింది. ఆ లత అనే అమ్మాయితో కనెక్షన్ ఏర్పడి, ఆ అమ్మాయి లైన్ లోకి వస్తే గానీ అతను ఆర్డర్ లోకి రాడు. అందువల్ల..."
"షటప్!" అంటూ డిస్ కనెక్ట్ చేసింది విసురుగా.
తక్షణం రింగయింది మళ్ళీ.
ఒక్కక్షణం తటపటాయించింది.
అతనే అయి వుంటాడు. రోజుకి పదిసార్లు ఫోన్ చేస్తాడు. తనని రోడ్డుమీదా, బస్ స్టాపులో చూస్తూ ఉంటాడుట! తనతో సినిమాకి రావాలిట! తనంటే ప్రేమట!
ప్రేమ!
ఫోన్ రింగవుతూనే వుంది.
బోర్డు మీద మీటలని తాకాలనిపించలేదు. ఆ మీట నొక్కితే అతని మాటలు వినబడుతాయి. ఐనా తప్పదు. అతను కాకుండా మరెవరో అయి వుంటే? నిస్సహాయంగా బటన్ ప్రెస్ చేసింది.
"ఫోన్ ఎత్తావా? ఎత్తకుండా ఎంతసేపు ఉండగలవ్?" వెకిలి మాటలు, వెకిలి నవ్వు. జుగుప్స కలిగించే రెండర్దాలు? "లతా! ఐ లవ్ యూ! ఐ లవ్ యూ! ఐలవ్...."
లవ్! అబ్బ! ఎంత ఉదాత్తమైన ప్రేమ!
ఎంత తేలికైపోయింది ఆ పదం!
డిస్ కనెక్ట్ చేసింది.
తక్షణం చంటిపిల్లాడు కెవ్వుమని ఏడుపు లంకించుకున్నట్లు "ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్...ట్రింగ్ ట్రింగ్" అంటూ మోగింది ఫోన్.
ఒక్కసారి దానివైపు చురుగ్గా చూసి, ఒక నిశ్చయానికొచ్చినట్లు బటన్ నొక్కింది.
"నీకు బుద్దిలేదూ? నువ్వు మనిషివా? పశువ్వా? మేనర్ లెస్ బ్రూట్!" అంది కోపంగా.
అవతలి గొంతులో ఆశ్చర్యం ధ్వనించింది.
"మేడమ్! అది టెలిఫోన్ ఎక్స్చేంజేనా?" అన్నాడు లైన్ అవతల వున్న పెద్దమనిషి.
అతని గొంతు వింటే చాలా మర్యాదస్తుడనిపిస్తోంది.
చటుక్కున నాలిక కరుచుకుంది లత.
ఎంత పొరబాటు!
"ఐయామ్ వెరీ సారీ సర్! ఎవడో అల్లరి వెధవ ఇందాకట్నుంచీ ఫోన్ చేసి విసిగిస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ రింగవగానే అతనే అనుకున్నాను. ఐ యామ్ సో సారీ!" అంది క్షమాపణ కోరుతూ.
"ఐయామ్ ఆల్ సో వెరీ సారీ! అలాంటి అల్లరి వెధవలు సులభంగా ఏడిపించడానికి వీలైన వుద్యోగంలో మీరున్నందుకు."
"థాంక్యూ! చెప్పండి! వాట్ కెన్ ఐ డు ఫర్ యూ?"
"ఒక నెంబరు కోసం చాలా సేపటినుంచి ప్రయత్నిస్తున్నాను. అసిస్టెన్స్ కి రింగ్ చేస్తే అదీ ఎంగేజ్ లోనే ఉంటోంది. అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను. కెన్ యూ ప్లీజ్ ట్రై?"
"ఐ విల్ ట్రై అండ్ రింగ్ యూ అప్ సర్! మీ నంబరు చెప్పండి." అంది లత.
నెంబరు చెప్పి "థాంక్యూ?" అంటూ ఆయన డిస్ కనెక్ట్ చేశాడు.

 Previous Page Next Page