చిత్రంగా ఉంది ఆ భావన!
ఎవ్వరూ లేరా?
"నేనంటూ ఒకడ్ని ఉన్నానని మీరు బొత్తిగా మర్చిపోయారు" అని వినబడిందొక గొంతు నిలదీస్తునట్లు.
ఉలిక్కిపడి చూసి, వెంటనే చిరునవ్వు నవ్వింది లత.
శ్రీమంత్ ఆరోపణగా చూస్తూ, దగ్గరికొచ్చాడు.
"మీ ఆఫీసు దగ్గరకి రెండు మూడు సార్లు వచ్చాను ఈరెండువారాల్లో! మీరు కనబడలేదు. మూడోసారి ఇక ఉండబట్టలేక లోపలికెళ్ళి ఎన్ క్వయిరీ చేశాను. మీరు ఉద్యోగం మానేశారని తెలిసింది. తరువాత మీరు కనబడతారేమోనని చిక్కడపల్లి బస్ స్టాండుదగ్గర నిలబడ్డాను. మీరు కనబడలేదు. ఇవాళ హఠాత్తుగా ఇక్కడ! ఏమిటిది? ఎందుకు మానేశారు ఉద్యోగం?"
"నేను మానెయ్యలేదు. అదే పోయింది" అని ఒక్క క్షణమాగి "మా అమ్మ కూడా పోయింది." అంది నిర్లిప్తంగా.
షాకయినట్లు చూశాడు శ్రీమంత్.
"ఏమిటీ? మీ అమ్మగారు పోయారా? ఐయామ్ సో సారీ! ఏమిటి కంప్లయింట్?"
"హార్ట్ ఎటాక్!"
"అరెరె! విధి కొంతమందిపట్ల చాలా క్రూరంగా ఉండగలదు! ప్చ్! ధైర్యంగా ఉండండి లతా! అంతకన్నా ఏం చెప్పగలను నేను? పోయిన మనుషులు తిరిగిరారు. ఐనా మే మంతా ఉన్నాం మీకు. భయం లేదు."
"మేమంతానా?" అంది నిరాసక్తిగా నవ్వుతూ. "ఎవరెవరు?"
"నేనూ, మీమామయ్యగారూ..."
"అమ్మలేదన్న దిగులుకన్నా, మామయ్యలాంటి వాళ్ళున్నారన్న బెంగే ఎక్కువగా ఉంది."
"అదేమిటి?"
"చెబుతాను."
"కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా?"
"కాఫీ వద్దులెండి. నడుస్తూ వెళ్ళిపోదాం. ఎక్స్చేంజికి."
"ఎక్స్చేంజికా?"
"అన్నట్లు చెప్పలేదు కదూ? టెలిఫోన్ ఎక్స్ ఛేంజిలో ఉద్యోగం వచ్చింది. ఆపరేటర్"
"అంటే లక్డీకాపూల్ దగ్గరేనా?"
"అవును."
"వెరీగుడ్! కంగ్రాట్స్! మంచి జాబ్!"
"థాంక్యూ!"
కొంతదూరం మౌనంగా నడిచారు.
"ఇలా వచ్చారేమిటి ఇవాళ?" అంది లత.
"నాకు వేరే పనేముంది? రోడ్లు సర్వే చేయడం తప్ప! నడుస్తున్నంతసేపూ బస్టాపుల్లో మీకోసం చూడడం అలవాటైంది. అసలు మీరింక కనబడతారనుకోలేదు. లక్కీగా కనబడ్డారివాళ!"
ముషీరాబాద్ నుంచి లిబర్టీ చేరేలోపల దార్లో అన్నీ వివరంగా చెప్పింది లత. మామయ్యా, ఆయన ప్రవర్తనా, అతి చనువూ.....
నొసలు ముడివేసి చాలా శ్రద్దగా విన్నాడు శ్రీమంత్.
"శ్రీమంత్? ఆరోజు పెళ్ళిగురించి జోక్ చేశారు మీరు గుర్తుందా?"
"సారీ! మీకు కోపం వచ్చిందా?"
"ఛీ! కోపం కాదు!" అని ఆగి కాస్త మెల్లిగా, "శ్రీమంత్! ఆ జోక్ ని నిజం చేద్దామా?" అంది.
సిగరెట్ తీసి వెలిగించాడు శ్రీమంత్.
"మీ వాళ్ళతో కూడా ఆలోచించి ఒక నిర్ణయానికి రండి లతా!"
"నాకు నా వాళ్ళెవరూ లేరని చెప్పాను గదా! ఇంకెవరితో ఆలోచించను? ఆలోచన చెప్పాల్సిందీ, ఆ ఆలోచనని అమల్లో పెట్టాల్సిందీ అన్నీ మీరే!"
నవ్వాడు శ్రీమంత్.
"నేను కొంచెం మోటు మనిషిని. చిన్నప్పటినించీ అదుపులేకుండా పెరిగాను. దౌర్జన్యం అనిపించేంత చొరవగా ప్రవర్తిస్తూంటాను నేను. ఆత్మవిశ్వాసం వుండాల్సినదానికంటే కొన్ని డిగ్రీలు ఎక్కువైపోయి పొగరుగా కనబడుతూంటూంది నాలో. ఇండివిడ్యుయాలిటీ ఎక్కువ! మరి నన్ను భరించగలరా లతా?"
లత నవ్వుతున్న కళ్ళతో అతని మొహంలోకి చూసింది.
"దాదాపు అలాంటి వ్యక్తిత్వమే నాది. నాలో కూడా అవే క్వాలిఫికేషన్స్, లేదా అవే లోపాలున్నాయి. మీరు నన్ను భరించగలిగితే, నేను కూడా చాలా సంతోషంగా భరించగలను మిమ్మలిని."
"సో! వీ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్! దేవుడు మనల్ని ఒకళ్ళ కోసం ఒకళ్ళని పుట్టించి ఉంటాడు."
ఆటో ఒకటి రేష్ గా పక్కనించి వెళ్ళడంతో ఒదిగి దాదాపు అతడిని తాకుతూ నిలబడింది లత.
"ఐతే మన పెళ్ళి సెటిలయిపోయింది లతా! ఇవాళ మీరు డ్యూటీకి వెళ్ళి తీరాలా?"
"ఏం?"
"ఈ ఒక్కరోజుకీ మానెయ్యండి. ఇద్దరం ఇటునుంచి ఇటే రిజిస్ట్రార్ ఆఫీస్ కి వెళ్ళి, ఏమేం ఫార్మాలిటీస్ కంప్లీట్ చెయ్యాలో కనుక్కుందాం!"
"రిజిష్టర్ మారేజా?" అంది లత ఆలోచనగా.
"మరి? మామూలుగా పెళ్ళిచేసుకోవాలంటే ఎంత ఖర్చు! భోజనాలు, భేషజాలు, కోపాలు, తాపాలు విమర్శలూ - ఇవేగా పెళ్ళంటే! ఐనా మీ తరపున నిలబడి చేసేవాళ్ళెవరున్నారు లతా? మీ మామయ్యా అలాంటి రకం! ఇక మా వాళ్ళంటారా? చాదస్తాలెక్కువ! జాబ్ చేస్తున్న అమ్మాయి కోడలుగా వస్తోందంటే భూమీ, ఆకాశం ఏకమయ్యేంత గోలచేస్తారు. అందుకని సివిల్ మేరేజ్ బెస్ట్!"
నిబ్బరంగా, క్షణాలమీద పరిస్థితిని తూకమేసి నిర్ణయాలు తీసేసుకుంటూ, తేలిగ్గా మాట్లాదేస్తున్న అతడిని చూస్తే లతకి కూడా ఉత్సాహం వచ్చింది. కొండంత ధైర్యం కలిగింది.
రోడ్డుపక్కనే ఉన్న షాపులోనించి ఫోన్ చేసి తనకి ఒంట్లో బాగాలేదనీ, డ్యూటీకి రాలేననీ చెప్పింది.
ఇద్దరూ రిక్షా ఎక్కి 'రిజిస్ట్రార్ ఆఫ్ మేరేజెస్' ఆఫీస్ కి వెళ్ళారు. అప్లికేషన్ సబ్ మిట్ చేశారు. ఆ రోజు నుంచి నెలరోజుల తర్వాత వాళ్ళు మేరేజ్ రిజిష్టర్ చేయించుకోవచ్చని చెప్పారు ఆఫీస్ వాళ్ళు.
* * *