Previous Page Next Page 
వలపు సంకెళ్ళు పేజి 10

ఆ నెంబరు కోసం ట్రై చేసింది లత. ఆ లైన్ అవుటాఫ్ ఆర్డర్.
ఆయనకు రింగ్ చేసి, "లైన్ ఔటాఫ్ ఆర్డర్ సర్! బాగవగానే కనెక్షన్ ఇస్తాను" అని చెప్పింది లత.
"ఇట్సాల్ రైట్! థాంక్యూ సో మచ్!" అని కాస్త ఆగి "మనుషుల్ని పోలిన మనుషులుంటారంటారు. అలాగే గొంతుల్ని పోలిన గొంతులుకూడా వుంటాయి. మీ వాయిస్ వింటూంటే నా...ఐమీన్...నాకు బాగా సన్నిహితులయిన ఒకళ్ళ వాయిస్ గుర్తొస్తోంది" అన్నాడు.
ఏమనాలో తోచక ఇబ్బందిగా నవ్వింది లత. ఆయన అలా మాట్లాడుతాడని ఊహించలేదు. చాలా మర్యాదగా చాలా మామూలుగా చెప్పాడా విషయాన్ని. తప్పు పట్టాల్సింది ఏమీ కనబడలేదు.
ఇంకో నంబరు డయల్ చేసి, ఫలాని నెంబరు 'అవుటాఫ్ ఆర్డర్' అన్న విషయం వాళ్ళ నోటీస్ లోకి తెచ్చింది.
మరుక్షణం మళ్ళీ ఫోన్ రింగయింది.
"లతా!" మళ్ళీ ఆ ప్రేమికుడు.
డిస్ కనెక్ట్ చేసింది.
ఇలాంటి వెధవల మూలంగా ఆ పెద్దమనిషితో విసురుగా మాట్లాడవలసి వచ్చింది తను.
పాపం! బాధపడ్డాడేమో!
ప్రతి అరగంటకీ ఆయన అడిగిన నెంబర్ డయల్ చేసి చూసింది. చాలా సేపటి తర్వాత దొరికింది కనెక్షన్.
ఫోన్ మోగుతోంది.
వెంటనే ఆ పెద్దమనిషి నెంబరు డయల్ చేసింది.
"హలో! శివరావ్ స్పీకింగ్!".
"సర్! నేను ఎక్స్చేంజి నుంచి మాట్లాడుతున్నాను. మీరడిగిన నెంబరు ఓకే అయింది. మాట్లాడండి."
ఆయన పెద్దగా నవ్విన శబ్దం వినబడింది.
"ఇప్పుడు టైమెంతయిందో తెలుసా మేడమ్? సాయంత్రం ఏడున్నర! నేనడిగిన నంబరు ఒక ఆఫీసుది. ఇంక ఇవాళ ఫోన్ చేసి లాభం లేదు. రేపే మాట్లాడాలి. థాంక్స్!"
"యూ ఆర్ వెల్ కమ్!"
"అది సరే! పొద్దుటి నుంచీ మీరే అక్కడ ఉన్నారు! డ్యూటీ ఇంకా అయిపోలేదా?"
చిన్నగా నవ్వింది లత. "కాదు సర్! డబుల్ డ్యూటీ చేస్తున్నాను. పొద్దున్న ఆరునుంచి మధ్యాహ్నం రెండు దాకా, మళ్ళీ రెండునుంచి రాత్రి తొమ్మిది దాకా! ఇవాళ ఇలా రెండు డ్యూటీలూ కంటిన్యుయస్ గా చేస్తే రేపు పూర్తిగా ఆఫ్!"
"అంటే రేపంతా హాయిగా రెస్ట్ తీసుకోవచ్చన్న మాట."
"అవును" అంది పైకి నవ్వుతూ. కానీ మనసులో మాత్రం "ఉహూ! రెస్ట్ తీసుకుంటే ఎలా? వారానికి సరిపడా బట్టలు ఉతుక్కోవాలి!" అనుకుంది.
"ఓకే! చాలా శ్రద్దగా నా నెంబరు గురించి పట్టించుకున్నందుకు థాంక్స్! గుడ్ నైట్ టు యూ!"
"గుడ్ నైట్ సర్!"
కట్ చేసి, కొద్దిగా వెనక్కి జారగిలబడి చిరునవ్వు నవ్వుకుంది లత. టెలిఫోన్ ఆపరేటర్ గా తన అనుభవం అది. కొంతమంది మర్యాదగా మాట్లాడితే మర్యాదగానే జవాబిస్తుంది తను. కొంతమంది అసభ్యంగా మాట్లాడితే విసురుగా మాట్లాడాల్సివస్తుంది. ఇంకొంతమంది రౌడీల్లా మాట్లాడుతారు. మరికొంతమంది రాక్షసుల్లా అరుస్తారు.    
అన్నీ భరించక తప్పదు!
ఇది తన జీవితం!
    
                                                                    * * *
    
    బంజారా హిల్సులో బస్సు దిగి బంగళాల వైపు పరీక్షగా చూస్తూ వెళుతున్నాడు శ్రీమంత్.    
'పైన్ విల్లా'. యస్! ఇదే ఆ యిల్లు!
ఒక మనిషి భుజం మీద ఇంకో మనిషి నిలబడినా గానీ ఆ కాంపౌండ్ వాల్ లోంచి లోపలికి తొంగిచూడడం కుదరదు. గోడలకు గాజుపెంకులు గుచ్చి  వున్నాయి.
పెద్దపెద్ద శూలాలు గుచ్చినట్లున్న ఇనుపగేటు. 'కుక్కలున్నాయి జాగ్రత్త' అని బోర్డు.
హిప్ పాకెట్లో కాయితాలు భద్రంగా ఉన్నాయని తడిమి చూసి నిర్దారణ చేసుకుని గేటు తీసుకుని ఇంట్లో ప్రవేశించాడు.
వెంటనే కాలభైరవుడిలా నల్లగా కోడెదూడ సైజులోవున్న కుక్క శరవేగంతో పరిగెడుతూ వచ్చింది.
వెంటనే "కమాన్! డెవిల్! వచ్చెయ్ లోపలికి!" అని ఛెళ్ళుమని కొరడా విదిల్చినట్లు సన్నటి పదునైన గొంతు వినబడింది.    
కుక్క సంశయంగా ఆగిపోయింది. కానీ గుర్రు మానలేదు.
గేటు దగ్గర నుంచి పోర్టికో దాకా రెండువందల గజాల మేరలో వృత్తాకారపు తారురోడ్డు. ఆ వృత్తం మధ్యలో అందమైన లాన్. ఆ లాన్ మధ్యలో ఫౌంటెన్.
పోర్టికో దగ్గర నిలబడి వుంది ఒక అమ్మాయి. అంత దూరానికే ఆమె అపురూప సౌందర్యవతి అని తెలిసిపోతోంది.
నిదానంగా లోపలికి అడుగులు వేశాడు శ్రీమంత్.
మళ్ళీ "భౌ భౌ!" అంది కుక్క.
"డెవిల్!" అంది ఆ అమ్మాయి తీవ్రంగా.
కుక్క తోక ముడిచేసి వెళ్ళిపోయింది. "ఏం కావాలి?" అంది ఆ అమ్మాయి.
"నా పేరు శ్రీమంత్."
"అయితే?" అన్నట్లు చూసింది. ఆ అమ్మాయి మొహంలో అందంతో సమానంగా దర్పం కూడా వుంది.
"మీకు డ్రైవరు కావాలని తెలిసింది."
"మా ఇంటిలో కారు వాడేది నేనొక్కదాన్నే. నాకు డ్రైవింగ్ వచ్చు. డ్రైవరక్కరలేదు."
కొంచెం తికమక పడ్డట్లు చూశాడు శ్రీమంత్.
"నన్ను కల్యాణసుందరంగారు పంపించారు. మీకు డ్రైవరు కావాలని చెప్పారే ఆయన?"
"కల్యాణసుందరంగారా?"
"అవును. క్రికెట్ కంట్రోల్ బోర్డు మెంబరు."

 Previous Page Next Page