ఎవంటావ్?
మీనాక్షి అతన్ని రూడ్ గా కట్ చేయ్యబోయింది గాని, అంతలోనే తన తల్లి, ఆమె అనారోగ్యం , ఆమె అవసరాలూ అవన్నీ గుర్తు వచ్చి మౌనంగా వినడం మొదలెట్టింది.
ఆమెకి అనిపించింది.
తనకి ఉద్యోగం కావాలి.
ఆ ఇవ్వబోయే వాడెవడో మల్ హోత్రా కంటే మంచివాడయి ఉంటాడని నమ్మకం ఏమిటి?
ఏ నొన్ డెవిల్ ఈజ్ బెటర్ దాన్ ఎన్ అన్ నొన్ డెవిల్!
అందువల్ల ఈ మల్ హోత్రాతో వ్యవహారమే బెటరేమో!
అలా అనుకోగానే, ప్రయత్నపుర్వకంగానే కాస్త ప్రసన్నంగా పెట్టింది మొహం.
మల్ హోత్రా చెబుతున్నాడు.
"నేను పెట్టబోయే కొత్త హోటల్ లో నువ్వు కేవలం డాన్సర్ వే కాదు - నీకు లాభాల్లో మూడో వంతు భాగం కూడా ఇస్తాను - బీ మై పార్టనర్!" అన్నాడు.
"మీ దగ్గర అంత డబ్బెక్కడిది?" అంది మీనాక్షి.
నవ్వాడు మల్ హోత్రా.
"పారడైజ్ హోటల్ ప్రోప్రయిటర్ ఉత్త యూజ్ లెస్! వాడికి వ్యాపారం తెలిదు - నాకు తెలుసు - వాడిచేత వ్యాపారం పెట్టించాను - ఏళ్ళు గడిచాయి.
వాడికి అనుభవం మిగిలింది. నా దగ్గర డబ్బు చేరింది. ఆ విమానం ఎక్స్ ఫ్లోడ్ అయి వుండకపోయినా కూడా, ఇవాళో రేపో పారడైజ్ హోటల్ దివాళా ఎత్తి వుండేది" అంటూ ఒక ప్లాస్టిక్ ఫోల్డర్ మీనాక్షికి అందించాడు మల్ హోత్రా.
"హోటల్ స్టార్టు చెయ్యడానికి ఓ నెల పడుతుంది. ఈ లోపల నువ్వు ఈ ఇన్ ఫర్మేషన్ అంతా చదివి డైజెస్ట్ చేసుకుంటే బావుంటుంది."
"ఏం ఇన్ ఫర్మేషన్?" అంది మీనాక్షి అనుమానంగా.
"ప్రపంచంలో అతి పెద్ద పరిశ్రమలలో ఒకటి - సెక్సు ఇండస్ట్రి ! నీకు తెలుసో తెలిదో, ఈ మధ్య ప్రాస్టిట్యూట్స్ ని "సెక్సు వర్కర్స్" అనే పేరుతొ పిలుస్తున్నారు."
సెక్సు వర్కర్స్ - సెక్సు ఇండస్ట్రి - అర్ధమయ్యిందా? రాత్రింబవళ్ళు డిమాండ్ వున్న ఇండస్ట్రి అది!
ధ్రువ ప్రాంతంలో అయినా, సహారా ఎడారిలో అయినా, కెనడాలో అయినా, కోనసీమలో అయినా లాభమే తప్ప నష్టం లేకుండా నడిచే వ్యాపారం ఇది.
మనం పెట్టె హోటల్ కేవలం ఒక స్కీన్ లాంటిది. ఆ తెర వెనక అనేకమైన భాగోతాలు నడిపిస్తాం.
అంతకంటే ముందు -
మనిద్దరం ఫేమిలియర్ అయితే బాగుంటుంది - అని చటుక్కున లోపలికి వచ్చేశాడు మల్ హోత్రా.
అతని వాలకం చూసి ముచ్చెమటలు పోసేశాయి మీనాక్షికి. అమ్మ మగత నిద్రలో వుంది.
ఆమె భుజం మీద చనువుగా చెయ్యి వేశాడు మల్ హోత్రా.
అతనింకా ఫార్వార్డ్ అయిపోయేలోగా - దడలుమని తలుపు నెట్టుకుని లోపలికి వచ్చింది డాక్టర్ లత.
ఆమె వెనకనే ఆమె భర్త అలోక్.
వాళ్ళని చూడగానే మీనాక్షి ప్రాణాలు లేచి వచ్చినట్లు అయింది.
చేతిలోనుంచి జారిపోయి క్రిందపడిపోయిన కేడ్ బరీస్ చాక్లెట్ వేపు చూసినట్లు బాధగా మీనాక్షివైపు చూసి, పెదిమలు తడిచేసుకుని వెళ్ళిపోయాడు మల్ హోత్రా.
తన చేతిలో వున్న ప్లాస్టిక్ కవర్ డాక్టర్ లత చూడకుండా పక్కన పెట్టేసింది మీనాక్షి.
"హాలో బిగ్ బెన్!" అంది మీనాక్షి డాక్టర్ లత వైపు చూస్తూ.
అది విన్న అలోక్ అనందంగా నవ్వాడు.
"ఏమిటి? బిగ్ బెన్?" మంచి పేరే పెట్టావ్!
లండన్ లో క్లాక్ టవర్ లో వుండే గడియారం పేరు కదూ బిగ్ బెన్ అంటే?
"ఈవిడ ఇంత పొడుగ్గా వుంటుంది గదా! బిగ్ బెన్ అంటే బాగా సూటయింది!" అన్నాడు.
అలోక్ చాలా సరదా మనిషి, లైఫ్ ని ఈజీగా తీసేసుకుని సినిమాలు, సరదాలతో తెగ ఎంజాయ్ చేసేస్తుంటాడు.
సినిమాలు చూడనప్పుడు వాళ్ళావిడ లతతో కలిసి మంచి బాయ్ స్కోట్ లా వాళ్ళని వీళ్ళని ఆదుకుంటూ ఉంటాడు.
"అబ్బే! ఆ బిగ్ బెన్ కాదు - ఈ బిగ్ బెన్ వేరు - బిగ్ అంటే పెద్ద - బెన్ అంటే బెహన్ - అంటే అక్క అన్నమాట!
బిగ్ బెన్ - లత అక్కా!" అంది నవ్వుతూ.
కులాసాగా నవ్వాడు అలోక్. ":భలే వుంది" అన్నాడు.
"మా అక్కకి ఇంకో పేరు కూడా పెట్టా!" అంది మీనాక్షి.
"ఏమిటది?" అన్నాడు అలోక్ ఆత్రంగా.
"సోనా షర్బత్!"
"అంటే?"
"తెలిదా! సోనా అంటే బంగారం"
"పర్బత్ అంటే పర్వతమేనా?" అంటూ నవ్వాడు అలోక్.
"కొండ అనుకోండి - సోనా పర్బాత్ అంటే బంగారు కొండ - మా అక్క అన్నమాట!"
"ఇదిగో! ఇంక కొత్త పేర్లెం పెట్టకు" అంది లత కట్టేవిరిచినట్లు.
ఆ తర్వాత మీనాక్షి తల్లి వసుదని చెక్ చేసింది డాక్టర్ లత. సంచిలో నుంచి కొన్ని పళ్ళు, బిస్కెట్లు తీసి అక్కడ పెట్టాడు అలోక్. తనతో తెచ్చిన చిన్న కెరియర్ ని ఎడం చేత్తో తీసి టేబుల్ మీద పెట్టింది లత. "కొబ్బరిపచ్చడి, ముక్కాల పులుసు ఉన్నాయి......కడుపునిండా తిను!" అంటూ. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి, ఇబ్బందుల్లో ఉన్న బందువులని ఆదుకోవడానికి కాబోలు చెట్టపట్టాలు వేసుకుని అర్జెంటుగా తార్నాకా వైపు వెళ్ళిపోయారు.
పరోపకారం లతకి ప్రాణం!
అలోక్ కి హాబీ!
వాళ్ళు వెళ్ళగానే ప్లాస్టిక్ కవర్ వైపు చూసింది మీనాక్షి. కాస్త తటాపతాయించి , తర్వాత దాన్ని ఓపెన్ చేసింది.
అందులో కొన్ని పేజీల ప్రింటెడ్ మేటర్ ఉంది. కొంత టైపు చేసిన మేటర్ ఉంది. కొంత బాల్ పాయింటుతో రాసిన నోట్సు .
ముందుగా నోట్సు చదవడం మొదలెట్టింది మీనాక్షి.
"మనం పెట్టబోయే హోటల్ చాలా కొత్త పద్దతిలో ఉంటుంది. అందుకోసం మనం ప్రతిక్షణం ప్రపంచంలో ఎలాంటి కొత్త పద్దతులు వస్తున్నాయో తెలుసుకోవాలి. సెక్సు అనేది ఎప్పటికి డిమాండ్ తగ్గని ఇండస్ట్రి. తెలివి, చొరవా ఉంటే లాభాలు కుప్పలు కుప్పలుగా సంపాదించవచ్చు.
ఈ దశాబ్దంలో లోకం చాలా మారిపోయింది. ప్రజల భావాలు మారాయి. టెస్టు మారిపోయింది. నీతి నియమాలపట్ల పట్టింపు సదలిపోయింది. ఈ మార్పు శృంగారపరమైన విషయాలలో కూడా కనబడుతోంది.
డిమాండుకి తగినట్లుగానే సప్లయి కూడా వుండాలి కాబట్టి, మారుతున్నా విలువలని, అభిరుచులని గురించి తెలుసుకోవడం అత్యవసరం!
ప్రస్తుతం డిమాండ్, సప్లయిలు ఏవిధంగా ఉంటున్నాయి?
గతంలో వ్యభిచారం అంటే వారకాంతల దగ్గరికి మొగవాడు వెళ్ళేవాడు. ప్రేయసీ ప్రియుల మధ్యా, లేదా భార్య భర్తల మధ్యా శృంగారం వుండేది.
ఇప్పుడలా కాదు.
అనేకమైన కారణాలవలన మోరల్సు మారిపోయాయి.
ఒళ్ళు కంపరం పుడుతున్నా చదువుతూనే వుంది మీనాక్షి. ఆ నోట్సులో పెన్ ప్రెండ్స్ అడ్వర్టైజి మెంట్స్ గురించి రాసి ఉంది. జంటలు - పార్టనర్స్ ని మార్చుకోవడం. ఎట్ సెట్ రా..........ఎట్ సెట్ రా.
అయినా చదువుతూనే వుంది మీనాక్షి.
తన మనసులో ఒకే ధ్యేయం!
ఈ సెక్సు ఇండస్ట్రి గురించి తను పూర్తిగా తెలుసుకోవాలి. ఇంట్రెస్టు కొద్ది కాదు - అసహ్యం కొద్ది!
ఆ తర్వాత దీన్ని సమూలంగా నాశనం చెయ్యాలి.
తను నిప్పులాగా ఉంటూనే వీటన్నిటి గురించి కూలంకుషంగా తెలుసుకుంటుంది.
ఆ తర్వాత సైలెంటుగా, చెయ్యవలసింది ఏమిటో చేసేస్తుంది.
ష్యూర్!
* * *
అక్కడ -
డైమండ్ రాజా ఇంట్లో -
డైమండ్ రాజాతో చెబుతున్నాడు జస్వంతరావు.
"ఏం చెబుతున్నాను? రైతు మాధవయ్య కాస్తా ధనం దొరకగానే సైన్యాన్ని తయారు చేసి ఉళ్లు అక్రమించేసుకుని రాజు మార్తాండ సింహుడిగా మారాడు. దొంగలు గుర్రాల మీద వచ్చి ఊళ్ళు దోచుకుంటూ ఉంటే వాళ్ళని పిండారీలన్నారు. ఇంకోరకం "దొంగలు" గుర్రాల మీద వచ్చి ఉళ్లు ఆక్రమించుకుంటుంటే వాళ్ళని సైనికులన్నారు. పిండారీల నాయకుడిలాంటి మాధవయ్యని రాజు అన్నారు.
మాధవయ్య భార్య పేరు సిద్దమ్మ. అతను మార్తాండ సింహుడుగా మారాక, ఆమె రేపు సిద్దేశ్వరి మహాదేవిగా మారింది.
మాధవయ్య కొడుకు పిచ్చయ్య ప్రచండ భైరవుడిగా మారాడు.