Previous Page Next Page 
డైమండ్ రాజా - ఆఠీన్ రాణీ పేజి 10

 

    మాధవయ్య కూతురు పేరు రాజమ్మ. ఆమె పేరుని "రాజనందిని' అని మార్చాలని చూశారు గాని, అందుకు ఆమె సుతరామూ ఒప్పుకోలేదు.


    రాజమ్మకి ఏ విధమైన భేషజాలు లేవు అందరితో బాటు ఆమె మారలేదు - తండ్రి రాజయినా, కూడా తను మాత్రం రైతు బిడ్డగానే ఉండిపోదలుచుకుంది.


    ఆమె రైతు బిడ్డ రాజమ్మగా ఉన్నప్పుడు ఆమెకి శౌరి అనే యువకుడితో పరిచయం కలిగింది.


    శౌరి ప్రజలమనిషి. చాలా మంచివాడు.


    అప్పట్లో ఒక విశేషం ఉండేది.


    సాంఘిక విలువలూ ఆదర్శాలు కాలంతో బాటు మారుతూ ఉంటాయి. శ్రీరాముడి కాలంలో ఏకపత్నివ్రతం ఉండేది. శ్రీ కృష్ణుడి కాలంలో పదహారువేల భార్యలున్నా చెల్లింది. ద్రౌపది ఐదుగురి భర్తలని చేసుకున్నా ఎవరూ తప్పుపట్టలేదు. ఇప్పుడు కొత్త విలువలూ, ఆదర్శాలూ వచ్చాయి.


    అలాగే -


    దేశభక్తి అనే ఆదర్శం గురించి చెప్పాలంటే -


    అప్పట్లో దేశభక్తి అనేది ఎవరికి ఉన్నట్లు తోచదు -


    దైవభక్తి , పతిభక్తి, స్వామిభక్తి, ప్రభుభక్తి, తప్ప దేశభక్తి అనేది ఉండేది కాదు.


    నా దేశం అని ఎవరూ అనుకునే వాళ్ళు కాదు.


    రాజే దేశం!


    దేశమే రాజు!


    రాజభక్తి ఉంటే చాలు -


    దేశభక్తి అక్కర్లేదు!


    ఆ మాటకి వస్తే అప్పట్లో భరతఖండం ఒక దేశంగా ఉండేది కాదు కూడా!


    ఈ జంబూద్వీపం, చప్పన్న దేశాలుగా ఉండేది.

    
    చప్పన్న రాజులూ ఉండేవాళ్ళు.


    వాళ్ళ క్రింద సామంతరాజులు ఉండేవాళ్ళు.


    ఇంకా క్రిందగా జమిందార్లు ఉండేవాళ్ళు!


    పాలేగాళ్ళు  ఉండేవాళ్ళు.


    ముక్కలు చెక్కలుగా ఉండేది ఈ దేశం. మొదటినుంచి కూడా అంతే.


    ఈ దేశమంతా ఒకటి అని, దేశభక్తి అని స్పృహ ఎవరికి వుండేదికాదు.


    బ్రీటీష్ వారు వచ్చాక మొత్తం భారతదేశం ఒకటిగా చేశారు.


    బ్రిటీష్ వారు వెళ్ళిపోయాక, మళ్ళీ మనలో అనైక్యత మొదలయింది. దేశాన్ని ముక్కచెక్కలు చేసుకోవడానికి మనమే ప్రయత్నాలు మొదలెట్టాం.


    అలాంటి ఆ రోజుల్లో -


    మొట్టమొదటిసారిగా దేశభక్తి అనే భావం శౌరి అనే ఆ యువకుడి మనసులో మెదిలింది.


    తన రాజుకోసం కాకుండా దేశం కోసం ఉద్యమించదలుచుకున్నాడు అతను.

    
    దేశమాత శ్రుంఖలాలు వదిలించుకున్నాడు.


    బ్రీటీష్ వారి అల్లూరి సీతారామరాజులా తిరుగుబాటుకి సిద్దమయ్యాడు.


    ఆ స్పూర్తే ఆ తర్వాత 1857 లో సిపాయిల తిరుగుబాటుకి కారణమయిందేమో బహుశా!


    కొత్తగా రాజయిన మార్తాండ సింహుడిగా ఈ వరస నచ్చలేదు. అందుకని శౌరికి రాజ్య బహిష్కరణ శిక్ష విధించాడు. "రాజనందిని" రాజమ్మ కూడా శౌరితో కలిసి వెళ్ళిపోయింది.


    "ఆ రాజమ్మకి , శౌరికి పుట్టిన వాళ్ళ సంతతి వాడివే నువ్వే! అన్నాడు జస్వంతరావు.


    "ఆహా" అలాగా! అన్నాడు డైమండ్ రాజా ఎగతాళిగా, అపనమ్మకంగా.

 

    అది పట్టించుకోకుండా , ఇంకా చెబుతున్నాడు జస్వంతరావు.


    "మార్తాండసింహుడి ఆస్తిపాస్తులు కొడుకుల హయంలోనే హరించుకుపోయాయి.


    అయితే అయన వంశీయుడైన విక్రమదేవరావు మాత్రం స్వయంశక్తితో వ్యాపారాల్లో అపారమైన ధనం సంపాదించాడు. వివరాలు చూడు! అంటూ ఒక కాగితాల కట్ట అందించాడు.


    విక్రమదేవుడు ఆస్తి వివరాలు అందులో నీటుగా టైపు చేసి ఉన్నాయి.


    "మొదటి రెండొందల పేజీల్లో అయన ఆస్తి వివరాలు ఉన్నాయి. చివరి అయిదు పేజీల్లో అయన దగ్గర ఉన్న వజ్రవైడుర్యాల తాలుకు వివరాలు ఉన్నాయి. మొత్తం ఆస్తి విలువ పదివేల కోట్ల రూపాయలు! విక్రమదేవరావుగారు సకుటుంబ సపరివార సమేతంగా మరణించారు. ఇప్పుడింక మిగిలిన వారసుడివి నువ్వే! వచ్చి ఆస్తి స్వాధీనం చేసుకో!" అన్నాడు జస్వంతరావు బిజినెస్ లైక్ గా.


    "ఏమిటి! పదివేల కోట్ల రూపాయలా? డానికి నేను వారసుడినా? భలే బావుంది జోక్?" అని నవ్వడం మొదలెట్టాడు డైమండ్ రాజా.


    నవ్వి నవ్వి అతని కళ్ళలో నీళ్ళు నిలిచాయి.


    అంతలోనే -


    హటాత్తుగా అతని నవ్వు ఆగిపోయింది.


    మోహంలో సీరియస్ నెస్ చోటు చేసుకుంది. చెవి ఒగ్గి, ఏదో ఆలకించాడు. ఆ తర్వాత చటుక్కున లేచి, బయటికి పరిగెత్తాడు అప్పటికే "బాబాయ్' అనే అతని కుక్క కూడా బయటికి పరిగెత్తింది. పెద్దగా అరవడం మొదలెట్టింది.


    జరుగుతున్నదేమిటో జస్వంతరావుకి అర్ధం కాలేదు - మానవుల శ్రవణేంద్రియాలు వినలేనిది కుక్కలకి వినబడుతుంటాయి. వాటి గ్రహణ శక్తి అపారం! అలాంటి శక్తి ఈ రాజాకి కూడా ఉన్నట్లుంది. ఇంతకీ జరిగిందేమిటి? అలా అనుకుంటూ తను కూడా బయటికి వెళ్ళాడు జస్వంతరావు.


    ఆదుర్దాగా అటూ ఇటూ చూస్తూ పరిగెడుతున్నాడు డైమెండ్ రాజా. అక్కడికి కొద్ది దూరంలో ఒక ప్రహరి గోడ ఉంది. దానికవతల ఏదో కన్ స్ట్రక్షన్ జరుగుతోంది. గోడ మీదికి లంఘించాడు డైమండ్ రాజా.


    అవతల ఒక గుంట వుంది.


    అందులో పడి వున్నాడు అయిదేళ్ళ భార్గవ్! మాటలు సరిగా రాక తన అపభ్రంశాలతో జస్వంతరావుని ఆదరగోట్టేసిన భార్గవ్!


    అతని ముక్కు కోసేసి ఉంది! కళ్ళు పీకేసి ఉన్నాయి. నాలుక తెగ్గోసి ఉంది! చెవులు కాల్చేసి వున్నాయి! ఒక చెయ్యి విరిగి ఉంది. అమానుషంగా చంపారు ఆ పసివాణ్ణి ఎవరో!


    ఆ పిల్లవాడి చొక్కా జేబులో నుండి ఒక కాగితం కనబడుతోంది.


    కంపిస్తున్న చేతులతో దాన్ని తీసుకుని చదివాడు రాజా.


    "డైమండ్ రాజా! పదివేల కోట్ల రూపాయల ఆస్తికి వారసుడివని మురిసిపోకు!


    పాలెస్ లోకి వస్తే ప్రాణాలు దక్కవ్!"


    డైమండ్ రాజా పెదిమలు బిగుసుకున్నాయి.


    చటుక్కున జస్వంతరావు వైపు తిరిగి అన్నాడు.


    "పదివేల కోట్ల రూపాయల ఆస్తి కోసం కాదు. ఈ పసివాణ్ణి చంపినవాడి పని పట్టడానికి వస్తా!" అన్నాడు ఉద్రేకంగా.


    అతనివైపు తేరిపార చూస్తూ, "మంచిది!" అన్నాడు జస్వంతరావు.


    
                                                 * * *


    మొన్న మొన్నటిదాకా అసలు ఇల్లు కదలని మీనాక్షి నవలలు చదివి, టీవిలో వచ్చే సినిమాలు చూసి మాత్రమే శృంగారం అంటే ఏమిటో కొద్దిగా తెలుసుకోగలిగింది.


    అలాంటి మీనాక్షికి -


    ఇప్పుడు - మల్ హోత్రా యిచ్చిన ఈ మేటర్ చదువుతూ ఉంటే శృంగారం ఎన్ని రకాలుగా వెర్రితలలు వేస్తోందో అర్ధం అవుతోంది!


    మనుషులు ఇంత హీనంగా ప్రవర్తిస్తారని , ప్రవర్తించగాలరని కూడా మీనాక్షి కలలో కూడా ఎప్పుడూ ఉహించి ఉండలేదు!


    చేతిలో వున్న ఆ కాగితాలాన్ని కట్టకట్టి, కుంపట్లో పడేయ్యాలన్నంత రోత కలిగింది మీనాక్షికి.


    వికారంతో వళ్ళంతా గగుర్పొడిచింది.


    కానీ అంతలోనే -


    మళ్ళీ ఇంకో ఆలోచన మనసులో మెదిలింది.


    చెడుని అసహ్యంచుకుంటోంది తను -


    ఆ చెడుమీద తిరగాబడాలనే కృతనిశ్చయంతో ఉంది కూడా!


    హోటల్లో ఆ ఎక్స్ పీరియన్స్ తో తన మనస్తత్వంలోనే పూర్తిగా మార్పు వచ్చేసినట్లుంది.


    తనలో ఇంత తెగింపూ, ఇంత దైర్యం వున్నాయని కూడా తనేప్పుడు ఉహించలేదు.


    అల్ రైట్-


    తను చెడుని చీదరించుకుంటోంది . సరే!


    "అడుసు తొక్కనేల, కాలు కడగనేల" అన్నది బీసీ నాటి సామెత! బురద తొక్కడం ఎందుకు , కాలు కడగడం ఎందుకు అనుకోవడం కంటే అసలు బురద లేకుండా శుభ్రం చేసెయ్యడం ఇంకా ఉత్తమం కదూ?


    దీనికే ఇంకో ఉదాహరణ కూడా చెప్పుకోవాలంటే -


    ఇంట్లో పెరడు వుంది. అక్కడ కాస్త చిరుచికటిగా వుండే జాగాలో ఒక బండ ఉంది. ఆ బండ కింద తేళ్ళు, మండ్రగబ్బలు చేరాయి అనుకుందాం!

 Previous Page Next Page