తను ఆషామాషీగా, గుర్తు పెట్టుకోకుండా, లెక్క తెలియకుండా ఖర్చుచేసే రెండువేలో, మూడువేలో ఆ అమ్మాయికి జీవన్మరణ సమస్యనా?
విధి ఒక్కొక్కరి పట్ల చాలా క్రూరంగా ఉండగలదు!
డబ్బు అంతా పోగొట్టుకుని తన సౌందర్య స్థితిలోకి వస్తే ఎలా ఉంటుంది?
ఆ ఆలోచనే అతని ఒంటిని భయంతో జలదరింపజేసి అతని చేతి మీద రోమాలు నిక్కబొడుచుకునేటట్లు చేసింది.
ఉద్వేగంతో వణుకుతున్న గొంతుతో అన్నాడు. "సౌందర్యా! హనీ! నువ్వు డబ్బు గురించి వర్రీ అవకు! వెధవ మూడువేలు కాదు, అయిదువేలయినా సరే! మనీ నో ప్రాబ్లెం! ధైర్యంగా ఉండు, బేబీ! ఎవ్వెరిథింగ్ విల్ బీ ఆల్ రైట్! నాకు తెలిసిన మంచి ఫిజిషియన్ ఉన్నాడు. ఆయనకి రింగ్ చేసి చెబుతాను. ఆయనతో కలిసి రేపు మీ ఇంటికి వస్తాను. డోంట్ వర్రీ హనీ! డోంట్ వర్రీ!"
రెండు చేతులూ జోడించి అతనికి నమస్కారం చేసి, ఆ రెండు చేతుల్లోనే మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది సౌందర్య.
అహ్లువాలియా లాంటి 'మగాడు' ఆ సమయంలో అక్కడుంటే గుండెలో వున్న దుఃఖంతో ఎగసిపడుతున్న ఆ ఆడపిల్ల గుండెని చూసి పెదిమలు తడి చేసుకునేవాడే!
* * * * *
"పిన్నీ! శ్రీరాంకి నువ్వు వెంటనే పెళ్ళి చేసెయ్యాలి. లేకపోతే ఇక లాభంలేదు!" అంది శృతి, సరస్వతి పక్కన కూర్చుంటూ.
"ఏమిటే విశేషం?" అంది సరస్వతి నవ్వుతూ.
శృతి గొంతు వినబడగానే శ్రీరాం అర్జెంటు పని వున్నట్లు బయటికి వెళ్ళిపోయాడు.
"వెళ్ళిపోకు! కూర్చో!" అంది శృతి, అతన్ని ఆటలు పట్టిస్తూ.
అప్పటికే శ్రీరాం కారు గేటు దాటింది.
అర్ధం అయీ కానట్లు చూసింది సరస్వతి.
"ఏమిటి చెప్పు?"
ఐక్యరాజ్యసమితి తరఫున వచ్చిన ప్రతినిధిలా గంభీరంగా ఫోజు పెట్టి చెప్పడం మొదలెట్టింది శృతి.
శ్రద్దగా విన్న సరస్వతి మొహంలో ఆశ్చర్యం, సంతోషం వంతులు వేసుకుని చూశాయి.
"వీడింత హఠాత్తుగా పెళ్ళికి ఒప్పుకుంటాడనుకోలేదు నేను! అంత బాగుంటుందా అమ్మాయి?"
"బాగుంటుందా అని మెల్లిగా అడుగుతావేమిటి, పిన్నీ! జయప్రదా, శ్రీదేవి, బోడెరెక్ - ఈ ముగ్గుర్నీ ట్రిక్ ఫోటోగ్రఫీలో కలిపేశామనుకో! ఎంత అందంగా ఉంటుందీ? అంత అందంగా ఉంటుందన్నమాట!"
"జయప్రదా, శ్రీదేవి తెలుసు కానీ, ఈ బోడెక్క ఎవరే?" అంది సరస్వతి నవ్వుతూ.
"బోడెక్క కాదు, పిన్నీ! బోడెరెక్! లాభం లేదు! నువ్వు ఇంగ్లీషు సినిమాలు విరివిగా చూడాల్సిందే!" అంది నిస్పృహగా తల వూపుతూ.
"ఇప్పుడు కాదు! మరో పదేళ్ళు పోయాక, మనవన్నో, మనవరాలినో వెంటేసుకుని అప్పుడు చూస్తాను ఇంగ్లీషు సినిమాలు!"
ఇద్దరూ నవ్వుకున్నారు.
"అయితే పెళ్ళి పెత్తనం అంతా నీ మీదే పెట్టుకున్నావు కదా! వెళ్ళి వాళ్ళ నాన్నగారిని కూడా నువ్వే పిలుచుకురా! రేపు దశమి! మంచి రోజు! మాట్లాడదాం" అంది సరస్వతి.
శృతి ఇష్టంగా, మెచ్చుకోలుగా చూసింది సరస్వతి వైపు.
"నువ్వు చాలా మోడరన్ గర్ ల్ వి పిన్నీ!" అంది నవ్వుతూ.
"నేనా గరల్ నా?"
"సారీ! మోడరన్ లేడీవి! నీది చాలా విశాల గుండె పిన్నీ!"
"విశాల గుండెనా? చదవేస్తే ఉన్న మతి పోతూందేమిటి? దుష్ట సమాసం!"
"పోన్లెద్దూ! నాకు తెలుగు రాదు సరిగా."
"నెత్తి మీద ఒక్కటేస్తాను! ఎంత డాక్టరీ చదివినా తెలుగు రాదు అని గొప్పగా చెప్పుకునే వాళ్ళంటే చిరాకు నాకు."
"తిట్టకు పిన్నీ! నేను వెళుతున్నాను" అని నవ్వుతూ లేచి రెండడుగులు వేసి, "పెళ్ళిలో నాకు వెండి కంచమూ, కంచి పట్టుచీరె తప్ప వేరేవి పెడితే ఊరుకోను. ముందే చెబుతున్నాను!" అంది శృతి.
* * * * *
"ఏరా, కేశవా! కూతురికి పెళ్ళి చేసే ఉద్దేశమేమైనా ఉందా? చెప్పు! నా ఎరికలో బేషైన సంబంధం ఉంది. వాళ్ళు నేనెంత చెబితే అంత!" అంటూ గుమ్మడికాయలా దొర్లుతూ లోపలికి వచ్చాడు రమణయ్య.
మధ్య గదిలో కూర్చుని బియ్యంలో రాళ్లేరుతున్న ప్రతిమ, భోజనంలో పంటి కిందికి రాయి వచ్చినట్లు మొహం అదోలా పెట్టింది. ఈయన కూడా ఒక సంబంధం తీసుకొచ్చాడా ఇప్పుడు? ఇంకా శృతి రాలేదే?
కొంపదీసి ఈ సంబంధం ఇంట్లో అందరికీ ఇష్టమై ఒప్పేసుకుంటే తనేం చెయ్యాలి? శ్రీరాంనే చేసుకుంటానని ఎదురు తిరగాలా? ఎంత ఇబ్బందిగా ఉంటుంది! అంత దూరం రాకుండా శృతి నాన్నగారిని ఒప్పించి, శ్రీరాం సంబంధం కుదిర్చేయగలిగితే పెద్ద డ్రామా తప్పిపోతుంది.
పడక్కుర్చీలో పడుకుని పేపరు చదువుతున్న కేశవరావు చివుక్కున తలెత్తి చూశాడు. 'కూతురి పెళ్ళి' అన్నమాట వినగానే ఆయనకి షాక్ కొట్టినట్లు అయింది. సాయంత్రం ఆరున్నర అవుతూంది. మామూలుగా అయితే అది కేశవరావు బార్లో కూర్చుని బీర్ సేవిస్తూ ఉండాల్సిన సమయం. కానీ ఇవాళ నుంచీ ఆయన ఇంక తాగకూడదని నిశ్చయించుకున్నాడు.. ఇల్లు జరిగే మార్గమే లేనప్పుడు ఈ తాగుడు అలవాటు వదిలెయ్యక తప్పదని గ్రహించాడు ఆయన.
పాతికేళ్ళ నుంచీ వేళ తప్పకుండా గొంతులోకి మృదువుగా జారే ద్రవం ఇవాళ పడకపోయేసరికి ఆయనకి గొంతెండుకు పోయినట్లు ఉంది. అయినా నిగ్రహంగా అలా కూర్చునే ఉన్నాడు. ప్రతిమ అన్నం వండెయ్యగానే తినేసి నిద్రపోతే, ఇంక 'బాటిల్' గురించిన ఆలోచనలు రావని ఆయన ఆశ.
"కూచో!" అన్నాడు విసుగ్గా. ఈ సమయంలో రమణయ్య రావడం బొత్తిగా ఇష్టంగా లేదు కేశవరావుకి.
రమణయ్య కూర్చున్నాడు.
సారా పీపాలా ఉంటాడతను. కోరాగుడ్డతో కుట్టిన గంగాళం లాంటి చొక్కా, లుంగీ అతని యూనిఫారం. ఉద్యోగం సద్యోగం ఏమీ చెయ్యడు. వాళ్ళ పనులూ, వీళ్ళ పనులూ చేసిపెడుతూ వాళ్ళు తృణమో, పణమో ఇస్తే అది తీసుకుంటాడు. 'రేపొక రెండు వేలు రావాల్సి ఉంది. ఇవ్వాళ్టికో రెండ్రూపాయలు సర్దుదూ!' అన్నది అతని వాడుక డైలాగు.