తను యిప్పుడీ భూమ్మీద అనుభవిస్తున్న ఈ నరకం చాలు. ఇంక చచ్చాకకూడా అక్కడింకో నరకం కోరితెచ్చుకోవడం ఎందుకు?
అయినా ప్రతిరోజూ తనకి స్వాగతం చెప్పడానికా అన్నట్లు తనోచ్చేదాకా గేటు దగ్గరే తారట్లాడుతుండేవాడు యీ ఆలీబాబా.
ఇవాళ ఏం రోగం పుట్టుకొచ్చిందీ?
అతని స్వాగతం తనకి అంతలా అలవాటయిపోయిందని కూడా అప్పుడే తెలిసింది సితారకి.
దానితో మనసంతా ఖాళీగా అయిపోయినట్లయింది.
అప్పుడు కనబడ్డారు ఆ అమ్మాయికి లీనా, షీలా, అమృత, ముగ్గురు మూర్ఖిణులు! ఆ ముగ్గురూ ఒకే రంగు చుడీదార్ లు వేసుకుని వున్నారు. అందరిదీ ఒకేరకం హెయిర్ స్టయిల్స్! ఒకే రకం చెప్పులు కూడా.
ఎక్కడో చదివింది గుర్తొచ్చింది సితారకి. ఈ టీనేజర్స్ మనస్తత్వం ఎలా వుంటుందీ అంటే -
తోటి టీనేజర్స్ కంటే డిఫరెంట్ గా కనబడాలని తాపత్రయపడతార్ట. అలా డిఫరెంట్ గా కనబడ్డానికి గాను ముమ్మూర్తులా తక్కిన టీనేజర్స్ లాగే డ్రెస్ చేసుకుంటారట. అచ్చం అలాగే ప్రవర్తిస్తారట.
ఇదో గొప్ప ఐరనీ!
కాదూ?
అందుకే అన్నారు యిదో వెర్రిమాలోకం అని.
అంతలోనే లీనా, షీలా, అమృత దగ్గరకొచ్చేశారు.
చలికాలం బాగా ముదిరినా కూడా వడదెబ్బతగిలినట్లు వాడిపోయి వున్నాయి వాళ్ళ మొహాలు.
పైకి చెప్పుకోవటంలేదుగానీ ఆ ముగ్గురి దుగ్దా ఏమిటో తనకి అర్ధమయిపోతూనే వుంది.
జెయ్ చంద్ర కనబళ్ళేదు!
ఆ చంద్రుడి కోసం చకోరాల్లా చూస్తున్నారు వీళ్ళు.
"జెయ్ యింకా రాలేదు" అంది లీనా నీర్సంగా ఆమె గొంతు వణుకుతోంది.
'అయితే ఏమిటిట?' అనుకుంది తను.
కానీ తనకి మనసులో అదే ఆలోచన.
ఎందుకు రాలేదూ?
కొంపతీసి చచ్చిపోయాడా ఏమిటి?
కానీ అతగాడు చచ్చిపోతే ఈపాటికి అందరికీ తెలీకుండా వుండదు గదా.
అతను పాపులర్ పర్సన్ కాబట్టి తప్పకుండా కాలేజీకి శెలవు ఇస్తారు.
ఇవ్వాళ కాలేజీకి సెలవ్ కదూ! అన్ని క్లాసులూ ఏకధాటిగా జరిగిపోయే సూచన్లు కనబడుతున్నాయి గూడా!
ఓ వైపు సిల్వర్ నైట్రేట్ లెక్చరర్ గారూ క్లాసు తీసుకుంటున్నారు.
ఆయనకి సిల్వర్ నైట్రేట్ అని పేరు పెట్టింది కూడా జెయ్ చంద్ర అంట.
పాపం ఆయనోసారి సిల్వర్ నైట్రేట్ దొంగతనంగా తీసుకెళ్ళిపోతుంటే అతను చూశాట్ట. మర్నాటి నుంచి ఆయన పేరు సిల్వర్ నైట్రేట్ అని పెట్టేశాడు.
బాటనీ లెక్చరర్ గారికేమో "పాసుఇడ్లీ" అని పేరు పెట్టారు.
దానికీ పూర్వ వృత్తాంతం వుందట.
బాటనీ లెక్చరర్ గారు వేకువ ఝామున లేచీ లేవగానే హోటల్ కెళ్ళిపోయి ఇడ్లీ తింటేగానీ యింకే పనీ చెయ్యలేట్ట.
ఓ రోజున ఆయన మరీ పెందలాడే లేచి హోటల్ కి వెళితే అక్కడ యింకా ఇడ్లీ తయారవలేదుట.
"పోనీ నిన్నటి ఇడ్లీ మిగల్లేదా" అన్నాట్టాయన ఆశగా.
"అది పాసిపోయింది" అన్నాట్ట సర్వరు.
"ఫర్వాలే! అదే తీస్కురా" అన్నాట్ట ఈయన ఆశగా.
అది జెయ్ చూసేశాడు. ఇంకేముందీ! మర్నాటినుంచి ఆయన పేరు పాసు ఇడ్లీ!
ఇలాంటి చూడగూడనివి ఎన్నో ముఖ్యంగా జెయ్ చూడకూడనివి అతని కంటబడుతూనే వుంటాయి.
ఓరోజున మిసెస్ మీనన్ మేడం, ఆమె మళయాళీ కోఠీలో వెళ్తోంది. ఆమెది భలేపెద్ద జుట్టు, ఆమె జడ భలే పొడుగ్గా వుంటుంది కూడా.
అంత పొడుగు జుట్టుని ఆమె రెండు జడలుగా వేస్కుంటుంది. ఒక్కొక్క జెడా పాదాలదాకా వస్తుంది.
అందుకని ఆమెకి 'జడలబర్రె' అని పేరు పెట్టేశాడు జెయ్.
పేర్లుపెట్టడం కంటే యితనికి వేరే పనేంలేదుగా మరీ.
పాపం!
ఆమె పేరు మిసెస్ మీనాక్షీ మీనన్ మేడం అని అందరూ దాదాపు మర్చేపోయారు.
ఓరోజున ప్రిన్సిపాల్ కూడా పొరబాటున "ఇవాళ జడలబర్రెగారు రాలేదా?" అని అడిగేసి నాలిక్కర్చుకున్నాట్ట.
ఆ జడల బర్రెగారు ఓ రోజున కోఠీలో ఆనందంగా షాపింగ్ ముగించుకుని, ఓ డబుల్ డెక్కర్ ఎక్కబోయింది. అదేటైంకి ఆ డబుల్ డెక్కర్ కదిలిపోయిందిటకూడా.
ఒక కాలు బస్సులో ఒక్కాలు నేలమీద వున్న మిసెస్ మీనాక్షి మీనన్ మేడం, ఉరఫ్ 'జడలబర్రెగారూ' ధన్ మని వెల్లకితలా పడిపోయింది.
పెద్దదెబ్బేం తగల్లేదుగానీ, కాస్త అవమానం అనిపించింది ఆమెకి.
ఆ దరిదాపుల్లో తనకి తెలిసినవాళ్ళెవరూ లేరుగదా అని భయంగా అటూ ఇటూ చూసింది జడలబర్రె మేడంగారు.
ఆమె భయపడ్డంతా అయ్యింది. అక్కడికి సరిగ్గా అడుగు దూరంలోనే జెండాకర్రలా నిలబడి వున్నాడు జెయ్ చంద్ర.
జరిగిందంతా, చూసి మారు మాట్లాడకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు.
మర్నాడు క్లాసులో -
మేడమ్ జడలబర్రెగారు జంకుతూనే క్లాసుకి వచ్చింది.
ఆమె వచ్చి అటెండెన్స్ తీసుకోగానే, ఆఖరి బెంచీలో కూర్చున్న జెయ్ చంద్ర అమాయకంగా లేచి నిలబడ్డాడు.
"ఏమిటి?" అన్నట్లు భయంగా చూసింది మేడమ్ గారు.
"మేడమ్! మీకు పెద్దగా దెబ్బలేం తగల్లేదు గదా" అన్నాడు జెయ్ చంద్ర, సానుభూతిని వర్షంలా కురిపించేస్తూ.
జడలబర్రెగారు అతన్ని దహించేటట్లు చూసింది.
ఆమె తడుముకుంటూ ఏదో సమాధానం చెప్పేలోగానే స్టూడెంట్సందరూ ఏమయింది, ఏమయింది" అని ప్రశ్నల వర్షం కురిపించేశారు.