Previous Page Next Page 
ప్రేమ పురాణం పేజి 10


    
    వాళ్ళగొంతుల్లో పట్టలేని ఉత్సాహం.
    
    నిన్న మేడమ్ గారు బస్సెక్కబోయి బోర్లాపడ్డ వృత్తాంతం వైనవైనాలుగా చెప్పాడు జెయ్ చంద్ర.
    
    దాన్తో ఆమె పరువు పరాయి దేశాలకి పోయింది పాపం.
    
    కానీ-
    
    ఆ తర్వాత నిజంగానే ఓ యాక్సిడెంట్ లో ఆమె భర్త చనిపోయినప్పుడు - ఎంత సపోర్టు ఇచ్చాడు జెయ్ చంద్ర.
    
    రాత్రింబగళ్ళు తన గ్రూపునంతా వెంటేసుకుని, అహర్నిశలూ ఆమె పక్కనే వుండి అన్నిరకాల సహాయం అందించలేదూ?
    
    ఆ తర్వాత ఆమె ఉద్యోగంమానేసి కేరళకి వెళ్లిపోయేముందు ఆమె కోసం ఫేర్ వెల్ పార్టీ ఏర్పాటు చేస్తే, ఆమె ఇదంతా అంకిరీ చెప్పి కృతజ్ఞత భరించలేక పబ్లిగ్గా  ఏడ్చెయ్యలేదూ?
    
    జెయ్ చంద్రని వెయ్యి విధాలా ఆశీర్వదించలేదూ?
    
    "జడలబర్రెగారూ"ట.
    
    ఎంతపరమ మోటు పేరు పెట్టేశాడూ?
    
    ఆ పేరుతో కంపేర్ చేస్తే తనకి పెట్టిన పేరు ఎంతో నయంకదూ? వెయ్యిరెట్ల ఆరురెట్లు అందమైనది కదూ?
    
    సితార!
    
    సితార!
    
    సితార!
    
    అసలు ఆ సీతారామలక్ష్మి అనే పేరు కంటే ఇదే బావుండేదేమో కూడా.
    
    సితార!
    
    సితార!
    
    మెత్తగా, మృదువుగా, ముద్దుముద్దుగా లేదూ?
    
    సితార! తల్చుకుంటే తన పేరూ కూడా సీతారావమ్మగా పాపులర్ చేసేసి వుండేవాడు జెయ్ చంద్ర.
    
    కానీ చెయ్యలేదు! ఎంచేత? చేతకాకపోవడం వల్లమాత్రం కాదు.
    
    మరి?
    
    సరే సితార ఇక్కడిట్లా ఆలోచనల్లో వుంటే -
    
    అక్కడ -
    
    జెయ్ చంద్ర ఇంట్లో...
    
                                                                     * * *
    
    నిన్న ఫ్లైట్ లో మెడ్రాసెళ్ళి, ఓ కాన్ఫరెన్స్ కి అటెండయి, మళ్ళీ ఇవాల్టి ఫ్లైట్ లో తిరిగొచ్చేసింది డాక్టర్ సునీతా సుందరి.
    
    రాగానే బ్యాంక్ బాలన్సు ఓ సారి చెక్ చేసుకుంది.
    
    వెయ్యాల్సిన చెక్కులు బ్యాంకుకి పంపించేసింది.
    
    రావాల్సిన కలెక్షన్స్ వసూళ్ళ కోసం కాంపౌండర్ ని పంపింది.
    
    సర్వీసింగుకి వెళ్ళిన కారు తిరిగివచ్చిందో లేదో వాకబు చేసింది.
    
    ఆ సర్వీసింగు ఛార్జెస్ పదిరూపాయలు ఎందుకెక్కువయిందని గుమాస్తా మీద అరిచింది.
    
    ఓ మంత్రిగారి బర్త్ డే కి బొకే పంపమని సెక్రెటరీని పురమాయించింది.
    
    సేఠ్ చందన్ లాల్ పంపించిన ఖరీదైన పట్టు చీరెల్ని ఓసారి పరామర్శించి, వాటిలో నాలుగిట్ని మాత్రమే వుంచేసుకుంది.
    
    బాగా బేరమాడిగానీ డబ్బులివ్వద్దని గుమాస్తాకి, ఆదేశం ఇచ్చింది.
    
    ఇదంతా పూర్తయ్యాక అప్పుడు కొలోన్ కలిపిన నీళ్ళలో స్నానం చేసి, పేషెంట్లని చూడ్డానికి రెడీ అవుతుండగా -
    
    అప్పుడు కనబడ్డాడు ఆమెకి జెయ్ చంద్ర.
    
    వెంటనే ఆమె మొహం విప్పారింది.
    
    "వాట్ సన్నీ! హౌడీ?" అంది యాంకీ స్టయిల్ ల్లో.
    
    "నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి మామ్" అన్నాడు జెయ్ చంద్ర.
    
    ఓ క్షణం కళ్ళు మూసుకుని, తన బిజీ షెడ్యూలు గుర్తు తెచ్చుకుంది.
    
    "ఓకే! లెటజ్ టాక్ టుమారో! ఎట్ నైన్ షార్ప్" అంది.
    
    "నథింగ్ డూయింగ్! ఐ వాంట్ టూ టాక్ నౌ ఇట్ సెల్ఫ్!"
    
    "సన్నీ టైం ఈజ్ మనీ! ఐదు నిమిషాలు మాట్లాడేబదులు ఐదుమంది పేషంట్లను చూస్తే ఐదొందలు. ఎవరు తిన్నట్లు?"
    
    "మామ్" అన్నాడు జెయ్ స్థిరంగా.
    
    "వాట్ సన్నీ?"
    
    "అయ్ వాంట్ టు టాక్ టూయూ! హియర్ అండ్ నౌ!"
    
    నిస్పృహగానే భుజాలెగరేసి, కొడుకువైపు చూసింది డాక్టర్ సునీతా సుందరి "ఆల్ రైట్! షూట్' అంది.
    
    "మామ్! నేను నా ఆస్తి వదిలెయ్యదల్చుకున్నాను" అన్నాడు జెయ్ చంద్ర.
    
    షాకయిపోయి మళ్ళీ అంతలోనే తేరుకుంది డాక్టర్ సునీతాసుందరి. ఆమె మొహంలో అవహేళనతో కూడిన నవ్వు కనబడింది.
    
    "దిసీజ్ న్యూస్! నీకసలు ఆస్తేలేదు కదా? ఎలావదిలేస్తావ్?" అంది వ్యగ్యంగా.
    
    "నాకు రాబోయే ఆస్తిని"
    
    "సన్నీ! నేను సితె కదా నీకు వచ్చేది?"    
    
    "మామ్......"
    
    "యా! ఈ ఆస్తిలో ప్రతి పైసా నాస్వార్జితం. మై ఓన్ హార్డ్ ఎర్న్ డ్ మనీ! అది ఆటోమాటిక్ గా నీకు రాదూ. నీకు తెలుసోలేదో..... నేను ఎవరికిస్తే వాళ్ళకే చెందుతుంది అదంతా" అంది సునీతాసుందరి.
    
    "మామ్! నీ ఆస్తి నాకొద్దు"
    
    "ఓహ్! మే ఐ నో వై?"
    
    "నా కారణాలు నాకున్నాయి"
    
    "ఎ గర్ల్?" అంది డాక్టర్ సునీతాసుందరి.
    
    ష్రూడ్ గా కొడుకుని ఇంతగా మార్చేసిన ఆ అదృశ్యశక్తి తప్పకుండా ఎవరో ఆడపిల్లే అయివుంటుందని ఆమె ఆడమనసు యిట్టే కనిపెట్టేసింది.
    
    "యస్ మామ్"
    
    దెబ్బ తిన్నట్లు చూసింది ఆమె "ఐ గెస్స్ డ్ సోమచ్" అంది పదునుగా.

 Previous Page Next Page