Previous Page Next Page 
మౌన రాగాలు పేజి 9


    
    కళ్ళంబడి నీళ్ళు కారిపోతుండగా, "నన్ను వదిలెయ్యండి" అంది శారద రెండుచేతులూ జోడించి, నమస్కారం పెడుతూ ఆ మాటలు పైకి వినబడలేదు. అతను ఆమె మీదికి ఒరిగిపోయాడు. ఆమె అటు జరిగింది - ఇటు జరిగింది. పొర్లింది. క్రిందకు జారిపోయింది. విలవిల్లాడింది.
    
    అరగంట తర్వాత ప్రతిఘటించే శక్తి కోల్పోయి నిస్సహాయంగా ఆక్రందిస్తూ తల వాల్చెయ్యగా లేడిని చూసిన పులిలాగా, కప్పను చూసిన పాములాగా, మనిషిని చూసిన మనిషిలాగా - అతను కలలు కన్నట్లు, పావురాయిని బోర్డుకి పిన్నులతో గుచ్చేసినట్లు, ఆమెచేతులు రెండూ తన చేతిలో పట్టుకుని, ఆమె రెండు కాళ్ళమీదా తన రెండు కాళ్ళూ వేసి, 'ఎక్స్ పెరిమెంట్' దిగ్విజయంగా పూర్తిచేశాడు.
    
    అవును! చాలా పుస్తకాల్లో రాసింది కరెక్టే.
    
    చూపుల్లో అదే ద్వేషం! అదే రోషం! అదే కోపం! అదే శాపం!
    
    అతని చేతులకి ఆమె మంగళసూత్రం చిక్కుకుని తెగింది.
    
    "ఇంతేనన్నమాట రేప్ అంటే?" అన్నాడు సుధీర్. అతని గొంతులో బోర్ ధ్వనించింది.
    
    శారద వెక్కిళ్ళు గొంతు దాటి బయటికి రావటం లేదు. కన్నీళ్ళతో దిండు మాత్రం తడిసిపోతోంది.
    
    "ఊ! నేను రేప్ చేశాను-రేపు నువ్వేం చేస్తావ్! అరిచి అందరికీ చెప్తావా?  నీ మొగుడు నా మెడలిరిచేస్తాడా? నిజం చెప్పేసినందుకు నీకు మెడలిస్తాడా! 'గతమంతా మరిచిపో! బంగారంలాంటి భవిష్యత్తు మన ముందు  ఉంది అని పక్కా సినిమా డైలాగు వల్లిస్తాడా? అదేం జరగదు. అతనికి ఈ సంగతి తెలిసిందంటే క్షణ క్షణం నీ జీవితం నరకం చెయ్యకపోతే నన్నడుగు. బాండ్ పేపర్ మీద రాసిస్తాను కావాలంటే! నువ్వు అందరికి చెప్తే - అందరూ నిన్ను గురించి చెప్పుకుంటారు. 'ఇదిగో...ఈమెనే డాక్టరుగారు చెడగొట్టింది' అంటారు రోడ్డుమీది జనం. అంటే నువ్వు చెడిపోయిన దానికిందే లెక్క అన్నమాట! కొంతమంది నన్ను విలన్ని చూసినట్లు చూడొచ్చు. కొంతమంది నన్ను హీరోని చూసినట్లు కూడా చూడవచ్చు. కానీ ఎవ్వరూ....ఎవ్వరూ....నన్ను చెడిపోయిన వాడిగా చూడరు. అవునా?"
    
    శారద ఏడుస్తూనే ఉంది. అతను సిగరెట్ వెలిగించి గుండెనిండా పొగపీల్చాడు. తర్వాత నిదానంగా శారద పెదిమలకి అతికించిన ప్లాస్టర్ తీసేశాడు.
    
    "దరిద్రుడా!" అంది శారద అక్కసుగా.
    
    సుధీర్ నవ్వాడు. "నేనా దరిద్రున్ని! నీ మొగుడు దరిద్రుడు. నువ్వు ఆ దరిద్రుడి పెళ్ళానివి. శశి అతనికి చాలా ఉదారంగా చాలా ఎక్కువ జీతమే ఇస్తూంది. అయినా, ఆ జీతం మా కుక్కకి పెట్టే తిండికి సరిపోదు. కలెక్టరుగారి కూతురికి మొహం మీద మొటిమ లేస్తే, దానిమీద సుతారంగా ప్లాస్టర్ అతికించడానికి శశి తీసుకునే ఫీజంత ఉండదు - మీ ఆయన జీతం. ఎక్కువ గొడవైందంటే శశితో చెప్పి మీ ఆయన ఉద్యోగం పీకేయిస్తాను జాగ్రత్త!"
    
    శశి! ఆమె రూపం శారద కళ్ళముందు కనబడింది. తమకు అన్నంపెట్టే దేవత - చల్లని తల్లి. అలాంటి సహృదయురాలికి ఎలాంటి భర్త దొరికాడు!
    
    "దేముడంటూ ఉంటే....నువ్వు పురుగులు పట్టి నాశనమై పోతావ్!" అంది వుగ్రంగా.
    
    సుధీర్ నిర్లక్ష్యంగా నవ్వాడు.
    
    "అపర సీతలా శపించకు. నువ్వు సీతవీ కావు - నేను రావణాసురుడ్నీ కాను. ఉప్పూ, కారం తినే మామూలు మనుషులం. ఇప్పుడేం ముంచుకుపోలేదు. వుయ్ హాడ్ సెక్స్! వుయ్ జస్ట్ హాడ్ సెక్స్. రేపొద్దున్న జరిగింది మర్చిపోయి, పమిటకొంగు భుజం చుట్టూ కప్పుకుని భర్తతో కాపురం మొదలెడతావు. యూ జస్ట్ సీ" అంటూ తనమీద తనకున్న అపారమైన నమ్మకంతో శారద చేతులు వదిలేశాడు. తక్షణం శక్తికొద్దీ అతని చెంపమీద కొట్టింది శారద.
    
    మళ్ళీ.
    
    మళ్ళీ.
    
    మళ్ళీ కొట్టింది.
    
    సుధీర్ ఆమె చేతుల్ని తప్పించుకునే ప్రయత్నం చెయ్యలేదు. మాట్లాడకుండా, కదలకుండా కూర్చున్నాడు. ఆపదలో చిక్కుకున్న జింక ప్రవర్తనను పరిశీలిస్తున్న జంతు శాస్త్రజ్ఞుడిలాగా శీలం పోగొట్టుకున్న ఆ స్త్రీ రియాక్షన్ ఎలా ఉంటుందో అని చిత్రంగా చూస్తున్నాడు.
    
    కొట్టికొట్టి శారద చేతి ఎముకలు నెప్పి పుట్టాయి. సుధీర్ చెంపలు ఎర్రబడ్డాయి. అతని పెదిమల మధ్యనున్న సిగరెట్ జారి పరుపుమీద పడి దుప్పటి కొద్దిగా కాలింది.
    
    "ఆల్ రైట్, ఇంక చాలు. వూరికే గొడవ చేసుకోకు. అరిస్తే....గుర్తుంచుకో, ఎక్కువ నష్టపోయేది నువ్వే -" అంటూ లేచి, బయటికి వెళ్ళిపోయాడు.
    
    నుదుటిని మంచంకోడుకేసి బలంగా నాలుగైదు సార్లు కొట్టుకుంది. నుదురు చిట్లి రక్తం కారింది. తర్వాత మోకాళ్ళ మధ్య మొహం దాచుకుని ఏడుస్తూ వుండిపోయింది.
    
    అలా అరగంట సేపు తలచుకుని తలచుకుని ఏడ్చింది. తర్వాత కళ్ళు తుడుచుకుని లేచింది. ఇంక ఒక్కక్షణం కూడా తను ఇక్కడ ఉండకూడదు - తను చచ్చిపోవాలి. జరిగింది ఇంకెవ్వరికీ తెలియకూడదు. తనతోనే అంతమైపోవాలి.
    
    మేడమెట్లు దిగింది. కారిడార్ చివరగా ఉన్న మంచంమీద నర్సు నిద్రపోతోంది. పక్కనే మందుల గది. చటుక్కున ఒక ఆలోచన తట్టింది. శబ్దం చెయ్యకుండా లోపలికి నడిచింది. షెల్ఫ్ లనిండా సీసాలూ, పాకెట్లూ కళ్ళు త్వరత్వరగా చురుగ్గా వెదికాయి. ఒక సీసా కనబడింది. ఎర్రటి లేబిల్ ఉంది దానికి. 'పాయిజన్ - ఫర్ ఎక్స్ టర్నల్ యూస్ వోన్లీ - కీప్ అవే ఫ్రమ్ చిల్డ్రన్' అని కొట్టొచ్చినట్లు రాసి వుంది.

 Previous Page Next Page