Previous Page Next Page 
మౌన రాగాలు పేజి 10


    
    ఆ మాత్రం ఇంగ్లీషు చదవగలదు శారద. చటుక్కున ఆ బాటిల్ అందుకుని జాకెట్లో దోపేసుకుంది. తర్వాత హడావిడిగా వెనక్కి వచ్చేస్తుంటే, కుర్చీ తగిలింది కాలికి.    
    
    "చీకట్లో ఎందుకు నడుస్తావ్? శుభ్రంగా లైటు వేసుకోక."
    
    తొట్రుపడుతూ వెనక్కి తిరిగి చూసింది.
    
    సుధీర్!
    
    "నిద్రపట్టట్లేదా? నర్స్! గివ్ హర్ సమ్ సెడేటివ్!"
    
    మెలకువా, నిద్రా కాని స్థితిలో ఉన్న నర్సు లేచి శారదని మేడమీదికి నడిపించుకుపోయి ఇంజెక్షన్ ఇచ్చింది. ఆమెకి నిద్రపట్టేదాకా పక్కనే కూర్చుంది. అప్పటికే తెల్లవారుతోంది. తెల్లారేక బలవంతంగా కళ్ళు తెరుద్డామన్నా కుదరనంత నిద్ర వచ్చేసింది శారదకి.
    
                                                               * * *
    
    "నమస్తే సార్!" అన్నాడు శంకర్రావు సుధీర్ తో అతని భుజానికి ఫ్లాస్కు వేలాడుతోంది.
    
    సుధీర్ అతన్ని అదోలా చూసి అంతలోనే మొహంమీదికి చిరునవ్వు తెచ్చుకుని తల పంకించాడు.
    
    "శారదకి కాఫీ తెచ్చాను" అన్నాడు శంకర్రావు.
    
    "అలాగా" అన్నాడు సుధీర్ - ఏదో ఆలోచిస్తూ.
    
    శంకర్రావు మేడమెట్లు ఎక్కాడు.
    
    మగతగా నిద్రపోతుంది శారద. ఒక్క క్షణం ఆమెని ఆరాధనగా చూసి నడుంమీద తట్టాడు.
    
    "నిజంగానే ఇది నీకు పుట్టిల్లు లాగుంది."
    
    అతని గొంతు వినగానే ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది శారద. రాత్రంతా నిద్ర లేకపోవడం వల్ల కళ్ళలో ఇసక పడ్డట్లు గరగరలాడుతోంది. కొద్ది క్షణాలసేపు అయోమయంగా, మతి చలించినదానిలాగా చూసింది.

 

    ఆ తర్వాత మెల్లిగా గుర్తొచ్చింది రాత్రి జరిగిందంతా.
    
    "టైమెంతయిందో తెలుసా?" అన్నాడు.
    
    అతని ప్రశ్నకు సమాధానం చెప్పకుండా అతన్నే తదేకంగా చూస్తూంది శారద.
    
    "మధ్యాహ్నం మూడవుతూంది! ఇంట్లోనే అయితే ఈపాటికి ఉరుకులు పరుగులు తీస్తుండేదానివి."
    
    ఒక్కసారిగా శారద కళ్ళనిండా నీళ్ళు నిండాయి.
    
    "ఇవాళ నా మూడ్ ఎంత బావుందో తెలుసా? ఇది హాస్పిటల్ కాకపోతే నిన్నూ..." అని ఆపేశాడు. మాటల్లో చెప్పని భావాన్ని-గొంతులో, కళ్ళలో పలికిస్తూ. అంతలోనే శారద మొహంమీద ఉన్న ప్లాస్టర్ చూశాడు.
    
    "అరె! అదేమిటి?" అన్నాడు కంగారుగా.
    
    శారద నిద్రలేవకముందే సుధీర్ ఆ ప్లాస్టరు అతికించాడు. గాయాన్ని తడుముకుని చూసుకుంది శారద. దుఃఖంతో పెదిమలు వణుకుతున్నాయి. కన్నీళ్ళు బుగ్గలమీదనుంచి జారిపోతున్నాయి.
    
    శంకర్రావు ఆదుర్దాగా చూశాడు.
    
    "శారదా! ఏడుస్తున్నావా? ఏమయింది?"
    
    శారద కన్నీటి పొరలోంచి మసకమసగ్గా కనబడుతున్న అతన్ని చూస్తూంది. తను చనిపోవాలి.... తక్షణం!
    
    ఉహూ!
    
    తక్షణం కాదు. ఒక్కరోజు...ఒక్కరోజంతా ఈయన మాటలు తనివితీరా వినాలి. ఆ తర్వాత...
    
    "నేను ఒక్కసారి ఇంటికి వస్తానండీ!" అంది, బతిమాలుతున్నట్లు.
    
    అతని మొహంలో సంతోషం కనబడింది. ఆ వెంటనే సందేహం గూడా కనబడింది.
    
    "ఎందుకు? డాక్టర్ గారు ఒప్పుకోరేమో?"
    
    నిరసనగా అంది శారద. "ఆయన ఒప్పుకొనేదేమిటి? మనిష్టం!"
    
    "బాబోయ్! అసలే డాక్టర్ గారికి కోపమెక్కువ!"
    
    "ఒక్కరోజండి! ఒక్కరోజు! రేపు శ్రావణ శుక్రవారం! నోము నోచుకోవాలి. మళ్ళీ ఎల్లుండి వచ్చి చేరిపోతాను. ఎలాగూ శశివదనగారు లేరుగా!"
    
    కన్నీళ్ళు ఆపుకోవడానికి కనురెప్పలు ఆర్పింది శారద. కళ్ళముందు విషం సీసా మెదుల్తోంది.
    
    "ఏం ఫర్వాలేదంటావా?"
    
    "ఏం ఫర్వాలేదు" అంది శారద ధైర్యంగా.
    
    "ఎందుకంత పట్టుదల?"
    
    "నాకిక్కడ దిగులుగా, భయంగా ఉందండీ! ఒక్క రోజు మనింట్లో వుండాలనిపిస్తూంది."
    
    "నీ ఇష్టం! డాక్టరుగార్ని అడుగుతాను. ఇంతకీ ఈ గాయమేమిటీ?"

 Previous Page Next Page