అతనికిదంతా కన్ ప్యుజింగ్ గా ఉంది.
"నాక్కాబోయే మొగుడులే" అంది సమీర. గడ్డమతను పిచ్చి చూపులు చూసాడు.
"సమ్మీ....గట్టిగా అరిచాడు శ్రీచంద్ర.
"అబ్బ....ఉర్కోరా.....ఏంటి నీ నస. నువ్వేట్లాగు నన్ను పెళ్ళి చేసుకోవు పోనీ....ఓ రెండేళ్ళు వీడితో కాపురం చేస్తా. ఈలోగా నీకు ఉద్యోగం దొరికితే ఈ గన్నాయ్ గాడ్ని వదలి నిన్నే చేస్కుంటాన్లే.....
గడ్డం వ్యక్తీ తన కాళ్ళకు బుద్ది చెప్పి ఒక్కసారిగా పరుగు మొదలుపెట్టాడు.
"ఏయ్....మేన్! ఎక్కడికా పరుగు?" అంటూ పరుగెడుతున్న గడ్డమతన్ని పిలిచింది.
"సమ్మీ! దిసీజ్ టూ మచ్" కోపంగా అన్నాడు శ్రీచంద్ర.
"అబ్బబ్బ....వీడు వెళ్లడా" అంటూ పక్కకు తల తిప్పింది.
బూట్ పాలిష్ చేసే కుర్రాడు కనిపించాడు.
"ఏరా చందూ....ఓసారేళ్ళీ ఆ బూట్ పాలిష్ చేసే కుర్రాణ్ణి కేకేసి పిలుస్తావు?" అంది.
"ఎందుకు....నువ్వేసుకున్నవి హిల్స్ కదా. పాలిష్ వాడితో నికేంటి పని?" అనుమానంగా అడిగాడు శ్రీచంద్ర.
"అబ్బబ్బ....నికిన్ని డిటెయిల్డ్ గా డెయిలీ సీరియల్ టైప్ లో నే చెప్పాలి. వాడినో మాట అడగాలి."
"ఏంటి?" కోపంతో అనుమానంగా అడిగాడు.
"నన్ను పెళ్ళి చేసుకోవడానికి వాళ్ళింట్లో వాళ్ళు ఒప్పుకుంటారో లేదోనని" తాపీగా అంది సమీర.
"స....మ్మీ" ట్విన్సిటీస్ వినిపించేలా అరిచాడు శ్రీచంద్ర.
అలా గొంతు నొప్పిపుట్టేదాకా అరుస్తూనే ఉన్నాడు.
* * *
"ఒరే.....పింజారిన్నర పింజారి వెధవా......కళ్ళు తెరవరా" ఘోరమైన ఆ తిట్టుకి ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు శ్రీచంద్ర.
ఎదురుగా సీరియస్ గా చూస్తూ తండ్రి నిలబడి ఉన్నాడు.
తల్లి కూడా యాజిటిజ్ గా నిన్నటి పొజిషన్ లో నిలబడి తన నిద్రపాడు చేసిన కొడుకుని తన భర్త ఎలా దులిపెస్తాడా? అని చూస్తున్నట్టుంది.
బామ్మ ఆసక్తిగా కొడుకుని కోడల్ని చూస్తోంది.
"ఏమైంది నాన్నా.....ఎందుకలా సీరియస్ గా చూస్తున్నావు?" అర్ధం కాక అయోమయంగా అడిగి సమీర ఎక్కడ వుందా అని చూడసాగాడు.
అతని కళ్ళముందు బూట్ పాలిష్ చేసే కుర్రాడే కనిపిస్తున్నాడు.
"నాకు పక్షవాతం వచ్చిందిరా పక్షికుంకా" అన్నాడు గరుడాచలం డామ్ సీరియస్ గా.
"అయ్యో.....అలాగా నాన్నా" అన్నాడు నొచ్చుకుంటూ.
"నాకంత అదృష్టం కూడానా?" అరుంధతి గొణిగింది.
"అవున్రా.....చూడు నా కాళ్ళు చచ్చుబడిపోయాయి.....ఛండాలపు వెధవ. నీకేం ద్రోహం చేసాన్రా. పాతికేళ్ళు పెంచాను కదరా.....రోజు ఇలా అర్ధరాత్రి నిద్రలో కలవరించి మమ్మల్ని నిద్రలేపి చంపుతున్నావు" జామచెట్టుకేసి తలబాదుకుంటూ అన్నాడు గరుడాచలం.
అప్పుడర్ధమయింది.
తనకి కలొచ్చిందని, ఆ కలలో తను 'సమ్మీ' అని అరిచానని ఆ అరుపు విని తండ్రి ఝడుసుకుని లేచాడని.
అంటే తన సమీర గడ్డం వాడ్ని పెళ్ళి చేసుకుంటానని అన్లేదా? బూట్ పాలిష్ వాడ్ని చేస్కోదా? ఎప్పుడు కలిసినా వాడికి లైనేస్తా, విడ్ని చేసుకుంటా అంటుంటే అది తన మైండ్ లో ఫిక్సయి ఇలా కలలా.....వచ్చింది! హమ్మయ్యా థాంక్స్ గాడ్....." అంటూ నిట్టూర్చాడు.
"నేనిలా నెత్తి నోరు కొట్టుకుని నా గొంతు నొప్పెట్టేలా అరుస్తుంటే నువ్వేంట్రా రవీంద్ర భారతిలో వరుసగా సన్మానాలు చూసి చూసి పిచ్చెక్కిపోయినట్టు మొహం పెడతావు? మతిలేని వెధవ....." గరుడాచలం నోరు విప్పాడు.
ఈలోగా పిట్టగోడ మీది నుంచి చుట్టుపక్కల జనం ఈ తంతుని గమనిస్తున్నారు మహాదానందంగా.
"నాయనా శ్రీచంద్రా! రేపట్నుంచి నువ్వు ఇంట్లోనయినా పడుకో. లేదా కలలు కని అరవడాలయినా మానేయ్....నీ అరుపులకు ఝడిసి, మీ నాన్న తిట్లకు పిచ్చెక్కిపోతున్నాం. ధూ.....నీయమ్మ ,,,ఛండాలపు గోలని హుస్సేన్ సాగర్ లో తగలెట్టా" ఎదురింటాయన అరుస్తూ అని వెంటనే తనలో తనే "ఇదేంటి నాకు బూతులోచ్చేస్తున్నాయ్ ....హమ్మో....." అనుకుంటూ తన వీపు చరుచుకున్నాడు.
అరుంధతి ఆవులిస్తూ "అయిపోయిందా తిట్ల దండకం నేవేళ్ళీ పడుకోవాలి" అంది.
భార్య వంక చురచుర చూసి "నువ్వు నా పెళ్ళానివి కాదే నా పాలిట దెయ్యానివి ఇలాంటి దరిద్రపుగొట్టును ఎందుకు కన్నావే?" అన్నాడు గరుడాచలం.
"అబ్బో.....ఇంతోటి అందగాడైనా, బుద్దిమంతుడైన మొగుడికి అదోక్కడే తక్కువ" అంటూ బామ్మ వైపు చూసి ఆమె దగ్గరికి వెళ్ళి.....
"నువ్వు నా అత్తవు. పోయిన జన్మలో నా శత్రువ్వి అందుకే ఇలాంటి కొడుకుని కని నాకు కట్టబెట్టావ్" అంది సీరియస్ గా.
"హమ్మో....గాలి నా మీదకి మళ్ళింది. ఇక్కడ ఇక ఉంటె నా పని మటాషె" అనుకుని అక్కడ్నుంచి మెల్లగా జారుకుంది బామ్మ.
శ్రీచంద్రకు అక్కడి సిట్యుయేషన్ అర్ధమైంది. వెంటనే నిండుగా దుప్పటి కప్పుకున్నాడు.
అయినా అరగంటపాటు తండ్రి తిట్లు వినబడుతూనే వున్నాయి.
* * *
నారదుడు పడిపడి నవ్వుతున్నాడు.
వీణాదేవి నారదుడి వైపు చూసి "నవ్వుతున్నవేంటి నాయనా" అని అడిగింది.
ఆ సమయంలో బ్రహ్మదేవుడు విహారానికి వెళ్ళొస్తానని వెళ్ళాడు.
నారదుడు సరస్వతి దేవి పక్కనే వున్న ఆసనంలో కూర్చున్నాడు.
మేఘాలు వీళ్ళని స్పృశిస్తూ వెళ్తున్నాయి. వాతావరణం అతి రమ్యంగా వుంది.
"ఏం లేదు మాతా.....భూలోకంలో ఓ నరుడి పాట్లు చూసి....."
"అంతగా నవ్వుతున్నావంటే ఏదో వుండే వుంటుంది. తండ్రి గారు మానవుల తలరాతలు కడు చిత్రంగా రాసి యున్నారు. ఆ మానవుడి పాట్లు, అగచాట్లు చూస్తుంటే హాసము, ఆదరములపై విలాసంగా వచ్చి చేరుతున్నది....."
"చమత్కరివి నాయనా. అయినా ఆ మానవులే అదృష్టవంతులు నేనూ ఉన్నాను దేనికి నాయనా. వీణ శృతి చేసుకుని వాయిస్తూ కూచోవడానికి. స్వామివారిని చూద్దామా అంటే తనకున్న తలలన్ని సృష్టి చేయడానికే వినియోగిస్తారు. నా ఒక్క తలరాతే కాదు. స్వామివారి కున్న అన్నీ తలల రాతా అలాగే ఉంది. ముచ్చటా లేదు, మురిపము లేదు" అంది మూతిని మూడు వంకర్లు తిప్పుతూ సరస్వతిదేవి.
"అసలా విధాత గొప్పతనం ఎవరికి తెలియకున్నది మాతా" అన్నాడు నారదుడు.