Previous Page Next Page 
నరుడా ఏమి నీ కోరిక పేజి 8

 

    తూలి కిందపడబోయాడు శ్రీచంద్ర.


    "నీకిదేం పోయే కాలమే ముసలి బామ్మా. హాయిగా కృష్ణా, రామా అనుకోవాల్సిన సమయంలో "హర్ ఫస్ట్ నైట్" చదువుతావా? నేను కూడా ఇంతవరకూ చదవలేదు కదే" నెత్తి నోరు బాదుకుని అన్నాడు శ్రీచంద్ర.


    "అందుకే ఇలా వున్నావు. అయినా కృష్ణా, రామ అని ఇరవయేళ్ళ క్రిందట యితే అనుకునేదాన్ని ఆ కృష్ణారావు, రామారావులు పోయి ఇరవయేళ్ళు అయింది.


    "వాళ్ళెవరే?"


    "మీ తాతయ్యను పెళ్ళి చేసుకోకముందు కృష్ణారావును పెళ్లి చేసుకుందామనుకున్నాను కానీ అతడు నా కన్నా హైట్ తక్కువని చేసుకోలేదు" తాపీగా అంది బామ్మ.


    "అలాగా పాపం....మరి రామారావెవరే....."


    "ఉన్నాడ్లే ఓ గొట్టం గాడు. పెళ్ళికి ముందు ఓ వర్షం రాత్రి అతనింటికీ వెళ్తే భయపడి హడలి చచ్చాడు. ఆ రాత్రంతా తన గదిలోనే ఉండి లోపలి నుంచి గొళ్ళెం వేసుకున్నాడు పిరికి నన్నాసి" అంది ప్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటూ.


    తన ప్యాంటూ , షర్టు చించుకుని రోడ్డు మీదకి పరుగెత్తాలన్నంతా కసి, స్ట్రికింగ్ చేయాలన్నంత కోరికా కలిగాయి శ్రీచంద్రకి.


    "నికేన్ని టాలెంట్లున్నాయే బామ్మా....పాపం నిన్ను తాతయ్య ఎలా భరించాడే?" ఉండబట్టలేక అనేసాడు.


    "అందుకేగా ఓసారి.....ఎక్కడికో వెళ్ళిపోయింది బామ్మ.


    ఇక అక్కడే వుంటే తన మెదడుకు ప్రమాదం అని, తన గుండె ఏ క్షణమైనా వీకయి తన ప్రాణం కొడిగట్టెస్తుందని లోపలకి పరుగెత్తాడు.


    "పిల్ల వెధవ...." అనుకుని నవల చదవడంలో నిమగ్నమైంది బామ్మ.

 

                                                              * * *


    శ్రీచంద్ర నవారు మంచంలో వెల్లకిలా పడుకున్నాడు.


    పెరట్లో వున్న జామచెట్టు కింద మంచం వేసుకున్నాడు. అతనికి లుంబిని పార్కులో సమీర అన్న మాటలు గుర్తొస్తున్నాయి.


    సమీర గుర్తుకు రాగానే అతని పెదవుల మీదకి అనుకోకుండా చిర్నవ్వోచ్చింది. అందంగా వుంటుంది. తన పలువరస కనిపించేలా అంతకన్నా అందంగా నవ్వుతుంది. సమీరలో అతనికి అన్నీ నచ్చుతాయి గానీ "నువ్వు తొందరగా నన్ను పెళ్ళి చేసుకోకపోతే ఎవడో ఒకడికి లైనేస్తా" అనడమే అస్సలు నచ్చదు.


    తిక్కమేళం .....అన్నంత పన్జేస్తుందని శ్రీచంద్ర భయం. అలా సమీర గురించి ఆలోచిస్తూ ఓ విచిత్రమైన కల కన్నాడు శ్రీచంద్ర.


    నిద్రలోనే చెమట్లు పట్టాయి.


    సినిమాల్లో అయితే హీరో హీరోయిన్ వూహించుకుని ఓ పాటేసుకుంటారు. తనకేంటి ఇలాంటి కలోచ్చింది? అనుకున్నాడు.


    ఆ కల అంత నీచ నికృష్టంగా అనిపించింది మూసుకున్న అతని కళ్లకు.

 

                                                         * * *


    "హలో....." సమీర కంఠం విని ఆ గడ్డం వ్యక్తీ తిరిగి సమీర అందాన్ని చూసి లొట్టలు వేస్తూ.


    "యస్ మిస్" అన్నాడు.


    "కిస్ మిస్సెం కాదూ" సమీర అంది ఒళ్ళు మండి.


    "యూ నాటి......" అన్నాడు అతను కాస్త అడ్వాన్సవుతూ.


    "మరీ నాటుగా ఫస్ట్ పరిచయంలోనే కుళ్ళు జోకులేయకు. అన్నట్టూ....గడ్డం ఎప్పట్నుంచి పెంచుతున్నావేంటి?" అంది.


    గడ్డం వంక గర్వంగా చూసుకుని "ఆరు నెలల నుంచి" చెప్పాడతను.


    "గడ్డం చక్రవర్తి రిలేటివా?" అడిగింది.


    "అతనెవరు?" అడిగాడు గడ్డం వ్యక్తీ కంగారుగా.


    "మా అత్త కొడుకులే. అద్సరే....గడ్డం ఆరు నెలల నుంచి పెంచుతున్నావు కదా, దురదేయదా?" అడిగింది అతని గడ్డం వంక చూసి.


    "లేదు"


    "పేలు ఎన్నుంటాయేమిటి?" అడిగింది క్యాజువల్ గా.


    అతనికర్ధం కాలేదు.


    "ఏంటి మిస్?"


    "పేలు...." అంది స్పష్టంగా.


    "ఛ...ఛ....నా గడ్డంలో పేలు వుండవు." అన్నాడతను కంగారుగా.


    "పోనీ మిసాల్లో వుంటాయా?"


    అతనికి పెచ్చేక్కిపోయింది.


    "పోన్లే....నీ గడ్డంలో పేలు వుంటే నాకెందుకు? నీ మిసాల్లో చుండ్రు వుంటే నాకెందుగ్గాని .......నేనెలా వున్నానంటావ్?"


    "అందంగానే వున్నారు" అతనికి బుర్ర తిరిగిపోతుండగా చెప్పాడు.


    "అంటే ఇంచుమించు మాధురీ దీక్షిత్ లెవల్లో వుంటానా?"


    "ఆవిడెవరు?" మళ్ళీ ఆశ్చర్యపోయాడా గడ్డం శాల్తీ.


    "నీ జన్మలో సినిమా హాలు చూసిన పాపాన పోలేదా?" కోపంగా అంది.


    "చూసాను. పదిహేనేళ్ళ క్రితం" గర్వంగా చెప్పాడు.


    తల బాదుకోవడం సమీర వంతయింది.


    "ఏయ్ సమ్మి......అతన్నేందుకు ఎడిపిస్తావ్" అప్పటివరకూ ఆ తతంగం చూస్తున్న శ్రీచంద్ర అన్నాడు.


    కానీ ఏడిపించేది అతన్ని కాదని, తననేనని ఆ జీవుడికి అర్ధం కాలేదు.


    "ఇఫ్ యు డోంట్ మైండ్....."


    "ఏంటి....మని ప్రాబ్లమా?" గడ్డం వ్యక్తీ దర్పంగా జేబులో చెయ్యి పెట్టి పర్సు తీసి అడిగాడు బలి చక్రవర్తి లెవల్లో.


    రోడ్డు పక్కన ఆకలితో ఏడ్చే చిన్న పసిపాప పది పైసలు అడిగితే చిదరించుకునే మనిషి, అందమైన అమ్మాయి ఓ స్మయిల్ తో లుక్కేస్తే వందలయినా ఇవ్వడానికి సిద్దపడే కామన్ మేన్ మెంటాల్టి అతనిది!


    "ఉహూ....మంగళ సూత్రం ప్రాబ్లం...." అంది నెమ్మదిగా.


    "వాట్....." అదిరిపోయాడతను.


    "అవును మేన్. ఓసారి నాకు తాళి కట్టి పెట్టగలవా?"

    ఆ జీవుడికి సగం మెంటలేక్కింది.


    "ఏయ్ సమ్మీ....." కంగారుగా అన్నాడు శ్రీచంద్ర.


    "నిజమా మిస్" సగం ఉత్సాహంగా, సగం డౌట్ గా అడిగాడు గడ్డం వ్యక్తీ.


    "నీ గడ్డంమ్మిదొట్టు. తాళి ప్రాబ్లం. ఏ గన్నాయ్ గాడు దొరకపోతాడా అని ఎదురు చూస్తున్నాను" అంది అతని వంక చూస్తూ.


    గతుక్కుమన్నాడతను తనని "గన్నాయ్ గాడు" అన్నందుకు ఏడుపు వచ్చింది.


     "సమీరా ఇదేం న్యాయం. ఓ పక్కన కాబోయే మొగుడ్ని నేనుండగా...."


    "అబ్బా.....నువ్వుర్కోరా చందూ. నా కొచ్చిన బెరాన్ని చెడగొట్టకు. దొరక్క దొరక్క ఓ బేవార్స్ గాడు దొరికాడు పెళ్ళి చేసుకోవడానికి.


    మరోసారి గతుక్కుమన్నాడు గడ్డం వ్యక్తీ. ఈసారి తిట్టు మార్చి 'బేవార్స్ గాడు' అన్నందుకు.


    అంతేకాదు, అతనికి మరో డౌట్ పట్టుకుంది. పెళ్ళయ్యాక ఈ అమ్మాయి తననిలాగే తిడుతూ వుంటుందా అని!


    "ఈయనెవరు మిస్?" గడ్డమతను అడిగాడు శ్రీచంద్ర వైపు చూస్తూ .

 Previous Page Next Page