Previous Page Next Page 
నరుడా ఏమి నీ కోరిక పేజి 10

 

    "అవునవును" అంది సరస్వతీదేవి.


    "ఏదో ఒకరోజు విధాత గొప్పతనం విశ్వానికి తెలుస్తుంది" సరస్వతిదేవి మౌనంగా వుండిపోయింది.


    నారదుడు భూలోకం వైపు చూచాడు.


    అతని దృష్టి భూలోకంలోని ఆ ఇంటిమీద పడింది. మంచం మ్మిద పడుకుని దుప్పటి కప్పుకుని తండ్రి తిట్టే తిట్ల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోన్న శ్రీచంద్ర అతను.


    "మానవా! లోక కల్యాణానికి నువ్వే పాత్రదారివి  సుమా....." అనుకున్నాడు. చిరునవ్వుతో నారదుడు.


    తధాస్తు దేవతలు అనాలోచితంగా , ఆప్రయత్నంగా "తధాస్తు' అన్నారు.


    తధాస్తు దేవతలు ముగ్గురూ ముచ్చట్లాడుకుంటున్నారు.


    వాళ్ళ సాధక బాధకాలు చెప్పుకుంటున్నారు.


    "వేకువ ఝామునే బయల్దేరి తదాస్తూ......తధాస్తు అంటూ దీవించి దీవించి గొంతు నొప్పి పెడుతోంది. దీనికి తరుణోపాయం ఏమున్నది?" బక్కపలచగా వుండి రెండు కన్నులు రెండు దిక్కులు చూస్తున్నట్లు వున్న ఓ తధాస్తు దేవుడు నీరసంగా అన్నాడు.


    "అవునవును సహొధరా! నా గడ్డం బారులు పెరిగింది. మీసములు ముల్లోకములు దాటనున్నవి అయిననూ నాకు విముక్తి లేదు" తన గడ్డాన్ని బరబరా గోక్కుంటూ అన్నాడు మరో తధాస్తు దేవుడు.


    మూడో దేవుడు మాత్రం తన పక్కనే వున్న మధుపానములు వరుసగా సేవిస్తూ.....వగరుస్తూ "నాకు ఓవైపు క్షుద్భాద, మరోవైపు భుక్తాయాసము కలుగుచున్నవి. ఈస్థితిలో తధాస్తు అనుటకు కూడా ఓపిక లేకున్నది" అన్నాడు.  


    మిగిలిన తధాస్తు దేవతలు లావుగా , పర్వతం మాదిరిగా వున్న తధాస్తు దేవత వైపు చూసి "నీ కాయము పర్వతము మించుతున్నది, పొరపాటున మీద పడినచో మా దేహములు చితికి చిత్రమగును సుమీ" అన్నాడు గడ్డం దేవుడు.


    "అవునవును నన్ను చూడుము నా దేహమును చూడుము. వాయుదేవుడు కోపంగా ఒక్క ఉచ్చ్వాసము విడిచిన చాలు కైలాసము నుంచి వైకుంఠమున పడిపోవుదును. దేహం తేలికగా వుండవలెను సోదరా" అన్నాడు బక్కపలచని తధాస్తు దేవుడు సలహా ఇస్తున్నట్లు.


    భారీ కాయముతో నున్న తధాస్తు దేవుడు గుర్రుగా చూసాడు మిగతా తధాస్తు దేవతలా వైపు.


    "అదిగో.....ఆ గుర్రుయే వద్దు. మనకి తిప్పులు తప్ప మార్గమేమున్నది" ఓ నిట్టూర్పు విడిచాడు గడ్డం తధాస్తు దేవుడు.


    "అంతా విష్ణుమాయ" అన్నాడు భారీకాయ తధాస్తు దేవుడు.


    "యమలీల కాదా....."ఎకసెక్కంగా అన్నాడు బక్క పల్చని తధాస్తు దేవుడు .


    "అవును సుమీ. యముని ప్రస్తాపన వస్తే గుర్తొచ్చింది. ఆ మధ్యన యముడు మన ఇంద్రుడితో ఏదో విషయమున వైరపడినాడట. ఎందులకందువు?"


    "యమునికి కాసింత అహము జాస్తి కదా. అయినా వారు పెద్ద వేల్పులు మనకెల" అన్నాడు గడ్డం దేవుడు.


    భారీకాయ తధాస్తు దేవుడు భుక్తాయాసంతో 'తధాస్తు' అన్నాడు.


    బిత్తరపోయి బక్కపల్చని దేవుడు శూన్యం వంక చూసి "యమా...." అనుకున్నాడు మనసులో.

 

                                                                     * * *


    నరకం.


    వాతావరణం భయంకరంగా వుందక్కడ.


    లావుపాటి నల్లటి మనుషులు, పెదవుల మధ్య కోరలు, నెత్తిన రెండు కొమ్ములు, చేతిలో పదునైన ఖడ్గములు, తెలుగు సినిమా సెట్టింగ్ లా వుంది యమలోకం.


    అటూ ఇటూ హడావుడిగా తిరుగుతున్నారు యమభటులు. ఓ పక్కన ముసలి చిత్రగుప్తుడు కన్నులు చిట్లించి ఘంటంతో పాపుల చిట్టాలు రాస్తూ మరో పక్క ఆయుర్దాయం తీరిన పాపుల వివరాలు మననం చేసుకుంటున్నాడు.


    కొందరు పాపులను తల కిందులుగా వేలాడేసి కొరడాలతో ఝూళించి హింసిస్తున్నారు. మరి కొందరిని వేడి వేడి నూనెలో వేసి మరిగిస్తున్నారు.


    మరికొందరు పాపులను రంపంతో కోస్తున్నారు. అయినా వాళ్ళు  ఏడవడం లేదు.


    ఈలోగా పెద్దగాలి. యమభటులు వినయంగా తలలు వంచారు. చిత్రగుప్తుడు ఉలిక్కిపడి తన ఘంటమును పక్కకు పెట్టి లేచి నిలబడ్డాడు.


    "స్వాగతం.....సుస్వాగతం......సమవర్తికి సాదర స్వాగతం" ఆకాశవాణి పలికింది.


    పూల వర్షం కురిసింది.


    సుడిగాలిలో నుంచే ప్రత్యక్షమయ్యాడు యమధర్మరాజు.


    పొడవైన, నిండైన విగ్రహం భారీకాయుడు, అజానుభావుడు......కంఠభరణాలు , చేతిలో గద, పెద్ద కన్నులు, ఆ కళ్ళల్లో ఎరుపు జీరలు, కుడిచేతిన యమపాశము.


    అతని అడుగుల శబ్దానికి నరకలోకం కంపించింది. ఎర్రటి తివాచి మీది నుండి యమధర్మరాజు నడచి వస్తోంటే పై నుంచి పూల వర్షం కురుస్తోంది. ఎదురుగా ఎత్తయిన వేదిక మీద సింహాసనం, నవరత్న ఖచిత సింహాసనం. ధగధగా మెరిసిపోతోంది.


    "యముడా .....మయధర్మరాజుండ, సకల చరాచర సృష్టిని నా కన్నులతో శాసించి వారి తుది శ్వాసలను నా పాశము చేత హరించే యమ లోకాదిపతిండను....." అంటూ సింహాసనం మీద కూర్చున్నాడు.


    యమభటులు వినయంగా తలలు వంచి నమస్కారాలు చేసారు.


    మీసాల మీద చేయెసి నవ్వుకున్నాడు యముడు గర్వంగా ఓసారి చుట్టూ కలియజుసాడు.


    "చిత్రగుప్తా" పిలిచాడు.


    "ప్రభూ...." అంటూ గబగబా యమధర్మరాజు ముందుకు వచ్చి చేతులు కట్టుకుని నిలబడ్డాడు చిత్రగుప్తుడు.


    "ఈనాటి సభా విశేషములేమి?" దర్పంగా అడిగాడు.


    "మానవులు మితిమీరిపోయారు ప్రభూ. మనసున్న మిక్కిలి లెక్కలేకున్నది, భయము లేకున్నది....."


    "చిత్రగుప్తా" గట్టిగా అరిచాడు యమధర్మరాజు.


    "చిత్తం....ఝడుసుకు చచ్చాను స్వామి" అన్నాడు చిత్రగుప్తుడు.


    "ఏమి....ఏమది....పాపులను మనసున్న భయము లేదా? భీతి తగ్గినదా? నూనెలో మరిగించడం లేదా? తలకిందులుగా వేలాడేసి శిక్షించడం లేదా?"


    "అన్నియూ చేయుచునే యున్నాం స్వామి. అయిననూ లేశామంత భయం లేదు. పైపెచ్చు నిర్వికారంగా ఓ చిర్నవ్వును మొహం మీద పులుముకుని మనవి వెక్కిరించుచున్నారని నా అనుమానం."


    "చిత్రగుప్తా!"


    "మళ్ళీ ఝడుసుకు చచ్చాడు ప్రభూ. మీరలా గద్దించడం , నేను ఝడుసుకుని చావడం న్యాయం కాదు ప్రభూ....."


    మళ్ళీ అరవబోయి తమాయించుకున్నాడు యమధర్మరాజు.


    "ఈ నరక లోకమున మనమంటే భయంలేని పాపులెవరు? తక్షణం ప్రవేశపెట్టుము" అజ్ఞాపించాడు యమధర్మరాజు.

 Previous Page Next Page