Read more!
Next Page 
ఒక గుండె సవ్వడి పేజి 1

                                 


                           ఒక గుండె సవ్వడి    
                                                        ---ముచ్చర్ల రజనీ శకుంతల
    
                                     

 

  ది ట్రూత్...
    పదహారవ శతాబ్దం.
    ఫ్రెంచి - జర్మనీల మధ్య యుద్ధం ఆరంభమైంది.
    ఫ్రెంచి సైన్యంలో పనిచేసే సైనికాధికారి నికేలన్ ఆ యుద్దంలో మరణించాడు.
    మరణం ఒక భయంకరమైన అనుభవం కాదు.
    మరణం ఒక అత్యంత విషాదకరమైన అనుభూతిని మిగిల్చే వాస్తవం.
    నికేలన్ మరణించిన విషయం అతని భార్య మార్గరేట్ కు తెలిసింది ఆమె గుండె చెక్కముక్కలైంది. కన్నీటి పర్యంతమైంది. యుద్దానికి వెళ్ళే భర్తకు ధైర్యాన్ని చెప్పి చిర్నవ్వుతో సాగనంపి.... తన ప్రియమైన భర్తకోసం ఎదురు చూస్తున్న మార్గరేట్ కు నికేలన్ మృతదేహం ఎదురుగా కనిపించింది.
    "నా ప్రియమైన నికేలన్ నువ్వు చచ్చిపోలేదు. యూఆర్ ఆల్వేస్ విత్ మి....నువ్వు నాతోనే వుంటావ్.... నిన్ను..... నిన్ను నా నుంచి ఎవరూ దూరం చేయలేరు.
    నీ హృదయంలో నేనే వున్నాను.
    నీ హృదయం నా దగ్గరే వుంటుంది. ప్రామిస్ నికేలన్. భర్త వియోగాన్ని భరించలేని మార్గరేట్ అతని శవాన్నుంచి గుండెను వేరు చేయించింది.
    యావత్ ప్రపంచం నివ్వెరపోయినా....
    సృష్టి సమస్తం దిగ్ర్భాంతమైనా...
    నుదిటి రాతరాసే విధాత విభ్రాంతుడైనా...
    ఆమె మనో నిశ్చయం.... వజ్ర సంకల్పమే...
    తన ప్రియతముడి గుండెకు బంగారపు ఫ్రేము అమర్చిన ఓ పేటికలో భద్రపరిచింది. ఆ పేటికను సెరాంట్ కోల్ లోని తన పక్కగదిలో మంచం పక్కనే వున్న టేబుల్ మీద పెట్టుకుంది.
    ఆమెకు పగలు లేదు - రాత్రి లేదు.
    ఆమెకు ఆకలి లేదు - దప్పిక వేయదు.
    ఆమె బ్రతికి వున్న జీవచ్చవం.
    అతని గుండెతో ఆమె గుండె మాట్లాడుతోంది.
    అతని గుండెలోని తన ప్రతిరూపాన్ని చూసుకొని మురిసి కన్నీటితో మెరిసిపోతోంది.
    ఆ పేటికకు రెండు పక్కలా రెండు కొవ్వొత్తులు అఖండంగా ఇరవై నాలుగు గంటలూ వెలిగేటట్లుగా ఏర్పాటు చేసింది.
    ఆ అఖండమైన వెలుగులో తన ప్రియతముడి గుండెను చూసుకుంటోంది.
    అతని కోసమే కాబోలు ఓ గులాబీ చెట్టును నాటింది. రోజూ రెండు గుమాబీ పువ్వులు ఆ హృదయంపై వుంచి, గంతలతరబడి దాన్నే చూస్తూ ఒకటి కాదు....రెండు కాదు.... నలభై.... నలభై సంవత్సరాల పాటు మార్గరేట్ ఆ విధంగా తన హృదయాన్నే ఆరాధిస్తూ.... ఆరాధిస్తూ.... ఆరాధిస్తూనే....
    
                                     * * *
    
    1704
    చివరిసారిగా తన ప్రియుని హృదయాన్ని చూసింది. చివరిసారిగా తన ప్రియ వల్లభుడి గుండెకు యిరువైపులా కొవ్వొత్తులు వెలిగించి, దీపార్చన చేసింది.
    చివరిసారిగా రెండు గులాబీలు తన ప్రియతముడి గుండె పాదాల చెంత పెట్టింది.
    అలానే.... అక్కడే.... ఆ హృదయం సాక్షిగా తల వాల్చేసింది మార్గరేట్.
    మార్గరేట్ శవంతోపాటు, ఆమె ప్రియుడైన నికోలస్ హృదయం పేటికను కూడా సమాధి చేశారు.
    అతని గుండె సవ్వడి, ఆమెకు మాత్రమే వినిపిస్తోంది. ఆమె హృదయమూర్తి అతను మాత్రమే అనుభవవేద్యం చేసుకోగలడు. (ఈ సంఘటన వాస్తవంగా జరిగినదే. దీనికి సంబంధించిన వార్తా కథనం....ఈనాడు 04-03-2001 నాటి ఆదివారం అనుబంధం సంచికలో 'మాయాలోకం' శీర్షికతో వచ్చింది - రచయిత్రి)    
    
                                      * * *
    
    ప్రారంభానికి ముందు...
    
    
    సృష్టి యజ్ఞాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్న బ్రహ్మదేవుడు ఒక్కక్షణం నిద్రాక్రాంతుడై, ఆదమరిచి ఎనిమిది కన్నులు మూసుకున్నాడు. ఆ లిప్తకాలంలోనే అతని మనోనేత్రం తెరుచుకొని, విభ్రాంతమైంది.
    అక్కడ అతని మనోనేత్రం ముందు అతల, వితల, రసాతలాది లోకాలు దాటాయి. సప్త సముద్రాలు కదిలిపోయాయి. భూలోకంలో ఓ చోట... ఓ ప్రాణి తన సృష్టినే నిగ్గదీస్తోంది. తన హృదయవేదనను నివేదించుకుంటోంది.
    "హే ప్రభూ!... నా తుదిశ్వాస... ఛిద్రమయ్యేలోపు... నా మలిశ్వాస ఆగిపోయేలోపు... నువ్వు సృష్టించిన ఈ ప్రాణిలోని చిన్న గుండెకు ఆయుష్షు ప్రసాదించు.
    ఈ దేహం అగ్నిలో కలిసిపోయినా...
    ఈ దేహం చితాభస్మమై మరుభూమిలో మిగిలిపోయినా...
    ఈ దేహం తాలూకు ఆర్తి, తపన బ్రతికే వుండాలి... బ్రతికే వుండాలి.... బ్రతికే వుండాలి.
    
                                * * *
    
    అబ్బురపడ్డ విధాత, ఆలోచనలో పడ్డ విధాత. చిర్నవ్వు భూషితుడై స్థిర సంకల్పుడై..... తన సృష్టి గమనాన్ని నిలిపి, సరికొత్త సృష్టి గమనాన్ని కదిపి... శత శతాయిన్ భవ.... చిరంజీవ.... చిరంజీవ..." అన్నాడు.
    అది అబ్బురమై, విభ్రమమో... సంభ్రమాశ్చర్య సమ్మేళనమో?....
    అది సృష్టి నివ్వెరపాటే..... సరికొత్త సృష్టి తాలూకు కలవరపాటే.....జలదరింపుకు లోనైన ప్రకృతి ఏమరుపాటో...
    అక్కడ విధాత సాక్షి... నింగి సాక్షి.... నేలసాక్షి.... ప్రకృతి సాక్షి... బ్రహ్మనే మెప్పించిన ఆ హృదయం సాక్షి.... ఒక గుం....డె....స.....వ్వ....డి....సా.....క్షి.    
    
    
    ప్రారంభం...
    
    ఒక చల్లని సాయంకాలం.
    చిరుసవ్వడి చేసే వర్షవిలాసం.
    నల్లటి మేఘాల పరామర్శల పర్వం.
    ముసురేసిన ఆకాశపు హర్షం... వర్షమై నగరాన్ని చిరు జల్లులతో తడిపెస్తున్న వేళ...
    టాంక్ బండ్ ముగ్ధమనోహరంగా వుంది. చిత్రకారుడి అద్భుత వైచిత్రికి దర్పణంలా వుంది.
    చీకటి ముసుగులో, వీధి లైట్ల వెలుతురో, టాంక్ బండ్ మీదుగా వెళ్ళే అమ్మాయిలంతా వర్షంలో తడిసి ముద్దయి జలకన్యలే అయ్యారు.
    చుడీదార్ అమ్మాయిలు చున్నీలను తలమీదుగా కప్పుకొని వడివడి అడుగులు వేస్తోంటే...
    చీరకట్టు లలనామణులు చీరకొంగులు తలమీదుగా కప్పుకొని, వర్షాన్ని ముద్దుగా తిట్టుకుంటూ ముద్దాయి తడుచుకుంటూ వెళ్తున్నారు.
    రెయిన్ కోట్లలో మగాళ్ళు, గొడుగులతో పిల్లలు.... కారుల్లో కొందరు, స్కూటర్ల మీద యింకొందరు....
    వడివడి అడుగులతో, ఉరుకుల పరుగులతో.. ఆత్రపడి కొందరు, ఆదుర్దాగా మరికొందరు... వెళ్తోన్న దృశ్యం.... గమ్మత్తుగా వుంది.
    భావుకత కలిగిన చిత్రకారుడు తన కుంచెను కదిలించి, తన భావాలను వేగిర పరిచి, ఆ దృశ్యాన్ని అందంగా చిత్రిస్తూ వుంటే.... అది చిత్రంగా చిత్తర్వు అవుతుంది. అయితే...
    ఆ క్షణం ఆ చిత్రకరుది మనసులో చిన్న వెలితి...
    ఈ ఆదరాబాదరా దృశ్యాల మధ్య మరో దృశ్యం వుంటే బావుండనిపిస్తుంది.
    సరిగ్గా అప్పుడే ఆ దృశ్యం చిత్రకారుడి వూహల్లో నుంచి జారి, వాస్తవమైంది, ఊహూ... వాస్తవమే..... చిత్రకారుడ్ని కదిలించి, కుంచెను వేగిర పరిచింది.
    ఆ దృశ్యమే.....
    
                                      * * *

Next Page