Previous Page Next Page 
మధుమాసవేళలో ... పేజి 9

 

    "బాగుందే, నువ్వు అందంగా వుంటావు. చూడబుద్దేస్తుంది. చూస్తారు. ఇంకానయం నిన్ను చూసేవాళ్ళంతా మర్యాదస్తులు. చూపులతో పోనిస్తున్నారు. నేనే మగాడి నయితేనా?" అంటూ చటుక్కున వైజయంతిని ముద్దుపెట్టు కుంది త్రిలోకసుందరి.
    
    "ఛీ..." అంటూ సిగ్గుపడి "నిన్ను....నిన్ను" అంటూ చిరుకోపంతో చెయ్యెత్తింది వైజయంతి.
    
    ముందే జాగ్రత్తపడి ఛంగున అవతలికి దూకింది త్రిలోకసుందరి. "నువ్వట్టా నేయిట్టా మన యిద్దరికీ పొసిగేదెట్టా ఈ కధ ముగిసేదెట్టా?" అంటూ సొంతపైత్యంతో పాటందుకుంది.
    
    రెండు చెవులకి చేతులడ్డం పెట్టుకుంది వైజయంతి.
    
                                                  4
    
    వైజయంతికి త్రిలోకసుందరికి బామ్మగారంటే చాలా యిష్టం ఏర్పడింది. కారణం బామ్మగారి ప్రవర్తనే. ఆవిడ అమాయకంగా మాట్లాడేదిగాక"పిచ్చిపిల్లల్లారా! ఇంతమాయకులయితే ఎలానే అమ్మా?" అంటుంటే వీళ్ళకి నవ్వొచ్చేది.
    
    "ప్రసాదం పుచ్చుకెళ్ళండే పిల్లలూ!" అని బామ్మగారు కేకేయటంతో వైజయంతి త్రిలోకసుందరి పరుగెత్తుకువచ్చారు.
    
    "సింట ఆసింట జరగండే పిల్లలూ బొత్తిగా మడిమైల తెలియదు" అంటూ కోప్పడి తనే వాళ్ళకి దూరంగా జరిగి కొబ్బరి ముక్కలు ఎత్తిచేతుల్లో పడేసింది బామ్మగారు.
    
    "బామ్మగారూ! చిన్న రిక్వెస్ట్" అంది వైజయంతి పీట వాల్చుక్కూర్చుంటూ.
    
    త్రిలోకసుందరికి ఈ మన్నింపులు తెలియవు "బామ్మా" అంటూ చనువుగా మాట్లాడుతుంది.
    
    "బామ్మకి ఇంగ్లీషు రాదు, రిక్వెస్టు గిక్వెస్టులు మానేసి అచ్చతెనుగులో మాట్లాడు" అంది త్రిలోకసుందరి.
    
    "నాన్నమ్మకి ఇంగ్లీషు రాకపోవటం మేమిటండోయ్ బాగావచ్చు. కాకపోతే సబ్బుబాక్స్ అనో, సోపుపెట్టె అనో తిరగేసి రెండు భాషలు కలిపేసి మాట్లాడుతుంది కదే నాన్నమ్మా?" అంటూ ముద్దుగ అడిగాడు అక్కడేవున్న మదన్ గోపాల్.
    
    మూతి తిప్పింది వైజయంతి. ఈ నాయనమ్మ మనవడి ప్రేమ చూస్తూంటే నవ్వొస్తుంటుందిది వైజయంతికి.
    
    పిచ్చిసన్యాసి, నామీద ఈగవాలనీయడమ్మా!" అంది బామ్మగారు.
    
    "చూస్తూనే వున్నాను. మీరీయింట్లో అడుగు పెట్టి నప్పటినుండి" అంది వైజయంతి.
    
    "నేనుకూడా" అంది త్రిలోకసుందరి వంతపాటగా.
    
    "హిద్దరూహిద్దరే. రెండాడకోతులు" అనుకున్నాడు మదన్ గోపాల్.
    
    "ఇందాకేదో అడగబోతూ ఆపేశావు" అంటూ గుర్తుచేసింది బామ్మగారు వైజయంతికి.
    
    "అదిగాదు బామ్మగారూ! వారానికి నాలుగురోజులు ఆ దేముడికంటూ ఈ దేముడికంటూ కొబ్బరికాయలు కొడతారుకదా, వారంలో మూడురోజు లేంపాపం చేసుకున్నాయి? ఈ మూడురోజులుకూడా ఎ దేముడికో ఓ దేముడికి కొబ్బరి కాయలు కొట్టేసేయండి."
    
    "ఎక్కడ నెత్తినా కొట్టటం?" గొణిగాడు మదన్ గోపాల్.
    
    "మూడురోజులు మిగిలాయని ఓ నీయమము నిష్ఠ లేకుండా ఎలా కొడతామే పిల్లా?" బామ్మగారు ఆశ్చర్యంగా అడిగారు. ఆవిడకి చాలా విషయాలు ఆశ్చర్యంగానే వుంటాయి.
    
    "అదేదో మీరే చూసుకోండి బామ్మగారూ! మాకు మాత్రం రోజూ మీచేతి ప్రసాదంకావాలి. మూడురోజులు ప్రసాదంలేక మా ఆత్మారాముడు లబ్బున గోల పెట్టేస్తున్నాడు" కొబ్బరిముక్కలు పరపర నములుతు అంది వైజయంతి.
    
    "అవును" అంటూ వంతగా తలవూపింది. త్రిలోక సుందరి.
    
    బోసినోరు తెరిచి ఫక్కున నవ్వారు బామ్మగారు.
    
    "పిచ్చిభడవల్లారా! ప్రసాదంకోసమా ఈ గోలంతా!" అని వైజయంతి వేపు తిరిగి "నాలుగెకరాల కొబ్బరితోటలోవున్నా వాడికిచ్చే నిన్ను ముడిపెట్టమని చెప్పాలి మీబామ్మతో" అంది బామ్మగారు.

 Previous Page Next Page