"అమ్మయ్యా!" అని పైకే అనేసి ఎప్పటినుంచో ఎతుకుతున్న పుస్తకం వినపడింది" అన్నాడు మదన్ గోపాల్ ఛాతీమీదకి చెయ్యి పోనిచ్చి.
శబ్దం పైకొస్తే వైజయంతి చంపేస్తుందని మూతికి పమిటచెంగడ్డం పెట్టుకుని కిసుక్కున నవ్వింది త్రిలోకసుందరి.
"అమ్మయ్య" అని మదన్గోపాల్ అనటంలో అర్ధం గ్రహించింది వైజయంతి. "నాకు నాలుగెకరాల కొబ్బరితోట లేదుకాబట్టి నీ మొగుడ్నయే ప్రమాదంతప్పింది. అమ్మయ్య!" అని హాయిగా వూపిరిపీల్చి గుండెమీద చెయ్యేసుకున్నట్లుగా వుంది మదన్ గోపాల్ తీరుచూస్తుంటే.
"కొబ్బరితోట లేకపోతేనేమి బామ్మగారూ! నా మెడలో తాళికట్టినవాడి మెడలోంచి నెత్తిన మొట్టి రోజుకో కొబ్బరికయ కొనిపిస్తాను. నా సంగతి పూర్తిగా మీకేం తెలుసు?" అంది వైజయంతి.
తల తడుముకున్నాడు మదన్ గోపాల్.
"మంగమ్మ శపధం సినిమా చూశారా బామ్మా?" అంది త్రిలోకసుందరి.
"దాంట్లో దేముళ్ళుంటారా ఏమిటే పిల్లా?" ఆతృతగా అడిగింది బామ్మగారు. దేముళ్ళ సినిమాలయితే ఏడాదికొకటి చూస్తుందావిడ. తెరమీద ఏ గాడ్దెకొడుకు దేముడి వేషం కట్టేనా ఆవిడ లేచి చెంపలేసుకుని దండం పెట్టాల్సిందే. ఒక్కో సారి బామ్మగారి వెనకనున్న వాళ్ళు "కూర్చో అమ్మా కూర్చో ఇది సినిమా" అంటూ కేకలు పెట్టటం, అదేమి ఆవిడ పట్టించుకోకపోవటం మామూలే. ఒక్కోసారి ఏ ఆంజనేయుడో తెరమీద ప్రత్యక్షం కాంగానే ఈవిడ కళ్ళు మూసుకుని తెరిచేటప్పటికి ఆంజనేయుడు పారిపోయి ఎ హిడింబో అక్కడ ప్రత్యక్షమవుతుంది. "ఇలా కనిపించి అలా మాయమయావా తండ్రి?" అనుకుని నిట్టూర్పు విడుస్తుంది అది వేరే కధ.
"దేముళ్ళుండరు బామ్మా!" అంది త్రిలోకసుందరి.
"మరి, దేవతలుంటారా?"
"వాళ్ళూ వుండరు. మంగమ్మని ఓ అమ్మాయుంటుంది ఆ మంగమ్మ అచ్చం మన వైజయంతి లాంటిదే."
"ఎవరిసంగతో ఎందుకు మంగమ్మకున్న పౌరుషం మీకుందా?" రెట్టిస్తున్నట్లడిగాడు మదన్ గోపాల్.
"ఉంది అంతకు రెట్టింపు పౌరుషం వుంది. చూస్తారా?" రోషంతో ముక్కుపుటా లెగరేసి అడిగింది వైజయంతి.
"వద్దులెండి... చిన్న అనుమానం తీరుస్తారా?"
"అడగండి."
"మంగమ్మ నీవల్ల మగపిల్లవాడినికని వాడిచేతనే నిన్ను తన్నిస్తానని శపధం చేసింది కదా! అలా ఈకాలం మంగమ్మలకు శపధం పట్టినా మగపిల్లవాడు పుడతాడని గ్యారంటీ లేదే, ఎక్కడ చూసినా ఆడసంతానమే కదా! కాబట్టి ఓ పని చెయ్యవచ్చు ఈ అపరమంగమ్మ లున్నారు చూశారూ! నీద్వారా ఓ ఆడనలుసుని కను అంటూ శబధంచేస్తే మంచిది. ఏమంటారు?" తన మాటలకి ఎర్రబడ్డ వైజయంతి ముఖంచూసి ఆనందిస్తూ అమాయకంగా ఫోజుపెట్టి అన్నాడు మదన్ గోపాల్.