జరిగిన దానికి కారణం దైవం చిన్నచూపు చూడటమే అని అందరూ అనుకుంటే దీప మాత్రం మానవుడు చేసే తప్పొప్పులకి దైవం ఎలా బాధ్యుడవుతాడు. అనుకుంది.
జరిగింది పెద్దాప్రేషను గాబట్టి లలితకి విశ్రాంతి వుంటుందని పుట్టింట్లోకి వదిలి మధుసూదనం ఊరెళ్ళి పోయాడు.
"అక్కా! బావ నిన్ను బాగా చూసుకుంటాడా?" అని ఓరోజు అడిగింది దీప.
"ఆ...ఆయనేం నన్ను కొడతారా? తిడతారా?" అంది లలిత.
"అక్కా! నేనొకటి అడుగుతాను నువ్వేం అనుకోకు. బావకేమయినా అలవాట్లు వున్నాయా?"
"సిగరెట్లు తాగుతారు. అంతే ఇంకేంలేవు. అవునే దీపా, ఈ ఆరాలన్ని దేనికి?"
"బావ నిన్ను బాగా చూసుకుంటున్నాడంటే తృప్తి."
"అదా నీ దిగులు. మీ బావ ధర్మరాజు. నాకే కష్టం కలిగించరు. నాకే కాదు, మనింట్లో అందరిమీద ఎంత ప్రేమో! మీ బావకి నాకన్నా పిల్లలంటే ప్రేమ. నాఖర్మ ఈ జన్మకి నాకాయోగం లేదు. దాన్ని గురించే తీవ్రంగా ఆలోచిస్తున్నాను."
"ఆలోచించి చేసేదేముంది?"
"ఆలోచిస్తే మార్గం కనపడకపోదు."
"పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు. బావకి మరో పెళ్ళి చేద్దామని అనుకుంటున్నావేమో! అది ఆ రాబోయే పిల్లకు, నీకు నరకం. అసలు బావ మరోపెళ్ళికి ఒప్పుకుంటాడంటావా?"
"మీ బావ నన్ను తప్ప పరాయి ఆడదాని వంటిమీద చేయివేసి ఎరుగరు. నేను బలవంతం చేస్తే పెళ్ళాడిల్సిందేగాని ఆడదాని ముఖం చూడరు."
లలిత మాటలువింటుంటే దీపకి నవ్వాలో ఏడవాలో తెలియలేదు. ఓ నాటి సంఘటన గుర్తుకొచ్చి "అక్కా! నువ్వుత్త పిచ్చిదానివి" అనుకుంది.
8
మన్ మోహన్ కి శెలవులయిపోయాయి. మర్నాడు ఊరి కెళుతున్నాడు.
మన్ మోహన్ ఊరికెళతాడని తెలిసిన దీప అనిల్ వద్దకు ప్రవేటు కెళ్ళేముందు అన్నపూర్ణమ్మ ఇంటికి వచ్చింది.
"మనూ ఊరికెళుతున్నాడు తెలుసా?" అంది అన్నపూర్ణమ్మ.
"ఆ...మొన్నొచ్చినప్పుడు చెప్పాడు." అంది దీప.
"లలిత వంట్లో కులాసాగా వుందా?"
"ఊ..."
"మీ నాన్న పొలమమ్మే ప్రయత్నం మీదున్నాడుట నిజమేనా? ఉన్న ఆ రెండెకరాలు అమ్మితే తిండి గింజలేం వస్తాయి ఆ పొలమైనా వుండబట్టి జరిగిపోతున్నది. మీ అమ్మా నేను పదిరోజులు వారగా కాపురానికి ఒకేసారి ఈ వూరు వచ్చాము. లక్ష్మీదేవిని వెంట బెట్టుకొచ్చిందని ఆనాడు మీ అమ్మని అందరూ అన్నవాళ్ళె. ఇప్పుడు పొలమమ్మే అవసరం ఏమొచ్చిందో దీపా! నీకు పెళ్ళి ఖాయం అయిందా ఏమిటి?"
వెంకట్రావు పొలం బేరం పెట్టాడని అన్నపూర్ణమ్మ చెవులదాకా వచ్చింది గాని కారణం ఇదీ అని తెలియదు. దీప కనబడంగానే దీపనే అడిగేసింది. పొలం బేరం పెట్టిన సంగతి దీపకి తెలియదు. ఉంటున్న లంకంత యిల్లు, రెండెకరాల పొలం. ప్రస్తుతం సంసారానికి అవే పెద్ద ఆధారం. పొలంమీద వచ్చే ధాన్యం ఏడాది తిండికి సరిపోయి, పై ఖర్చులకి డబ్బు రూపేణా కూడా అందుకుంటున్నది. పొలం అమ్మితే తిండి గింజల కరువు మాటటుంచి గడ్డి తిందామన్నా గుప్పెడు గరిక పోచలు దొరకవు. దీప నిర్ఘాంతపోయి ఆలోచిస్తూ వుండిపోయింది.
"పెళ్ళి మాటెత్తగానే మౌనం వహించావేమే దీపా!"
"పెళ్ళా! అదొక్కటే తక్కువ. నాన్న పొలం బేరం పెట్టిన సంగతే తెలియదు. కారణం ఏమని చెప్పను, నాన్న ఏమి ఇబ్బందుల్లో ఉన్నాడో! మ్చ...మ్చ..అడిగి కనుక్కుని చెపుతాలే అత్తయ్యా! మనూ ఉన్నాడా?"
"నీకంతా ఎగతాళే. తెలుసేమో అని అడిగాను. ఊ... మనూ పైన వున్నాడు వెళ్ళు." ఊ కొట్టి దీప మనూ దగ్గర కొచ్చింది.
"వచ్చావా దీపా! నువ్వు వస్తావో రావో నీ కోసం నేనే వద్దామనుకుంటున్నాను. రేపు ఉదయమే ఊరెళ్ళి పోతాను" మన్ మోహన్ దీపకి ఎదురొచ్చి అన్నాడు.
"మళ్ళీ రావడం..."
"రేపు నెల పరీక్షలు, ఆపై నెలనుంచీ శెలవులు. శెలవులంతా ఇక్కడే గడిపేస్తాను."
కాసేపు మన్ మోహన్ దీపా కబుర్లు చెప్పుకున్నారు.
"నాకు తొందరగా పెళ్ళి చేయాలనే పిచ్చి పట్టుకుంది అమ్మకి."
"అరె నాకు తెలియదే" అంది దీప.
"నీకే తెలియదంటున్నావు. మొన్నటిదాకా నాకూ తెలియదు. ఉన్నట్టుండి పెళ్ళి మాటెత్తింది పిల్ల కుందనం బొమ్మలా వుండాలిట. వాళ్ళది మంచి సాంప్రదాయం అయి వుండాలిట. ఐశ్వర్యం ఉండాలిట. అబ్బో చాలా చాలా కోరికలు బైట పెట్టింది. నే నిప్పుడిప్పుడే పెళ్ళి చేసుకోనని చెప్పేశాలే."
"నీకెలాంటా పిల్లయితే ఇష్టం మనూ!"
"అచ్చం నీలాంటి పిల్లయితే ఇష్టం" టక్కున అనేశాడు మన్ మోహన్.
"ఏయ్."
"ఏం, నా లాంటి అబ్బాయి నీకిష్టం లేదా!"
దీప మాట మార్చేసింది "పెళ్ళి చేసుకోనని చెప్పావుగాని! పెళ్ళి పిచ్చి చాలానే వుంది. పెళ్ళి మాటలకేంగాని బాగా చదువుకో మనూ"
"దీపా!"
"ఊఁ"
"నేనొకటి అడుగుతాను నిజం చెపుతావా?"
"ఏమిటి?"
"నేనంటే నీకు ప్రేమ వుందా?"
దీప ముఖ కవళికలు ఏమాత్రం మార్చకుండా వెంటనే జవాబిచ్చింది. దీప ముందే గ్రహించింది మన్ మోహన్ ఇలాంటి ప్రశ్న అడుగుతాడని.
దీప నెమ్మదిగా నవ్వి, "భలేవాడివి మనూ! చిన్నప్పటి నుంచి నా సంగతి తెలిసే ఇదేం ప్రశ్న. మనిద్దరం ఎప్పుడూ కొట్లాడుకోలేదు. ప్రేమ..., స్నేహంతోనే ఆడుకున్నాము" అంది.
"అబ్బ ఆ ప్రేమకాదు. ఈ వయసులో ఓ యువతీ యువకుడి మధ్య వుండే ఆకర్షణలాంటి ప్రేమ. ఇరువురు చేరువ కావాలనిపించే ప్రేమ."