Previous Page Next Page 
దీప పేజి 8


    పట్నంలో స్నేహం పేరిట ఓ రకమైన చనువు మనుషుల మధ్యవుంటే పల్లెటూళ్ళలో అన్న, వదిన, అత్త అంటూ చుట్టరికాలు తిరగేసుకుని కలసిపోతారు. దీపకి పార్వతమ్మ దగ్గర బాగా చనువు. ఇంటిలో పిల్లలాగానే మసులుతుంది. దీప చదువుకోవాలనే కోరిక అనిల్ తీరుస్తున్నాడు. దీపకి కావాలసిన పుస్తకాలు, ప్రయివేట్ చెప్పటం అన్నీ అనిల్ చూసుకుంటున్నాడు.

 

    "నికింకా చదువెందుకే దీపా మా అనిల్ చూడు. పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగం చేస్తాడని ఆశ పడ్డాను. ఏమయింది, చదివాడు చేతులు ముడుచుక్కూర్చున్నాడు. అదేమంటే, చదువు విజ్ఞాన దీపిక, పల్లె సీమలు ప్రగతి పధానికి సోపానాలు, గ్రామాభ్యుదయాన్ని మించినదేదీలేదు అని కబుర్లు చెప్పి నా నోరు మూస్తాడు." అంది పార్వతమ్మ. నాలుగు రోజులకొకసారయినా ఆ మాట అనంది తోచదు పార్వతమ్మకి. వెంటనే దీప "అనిల్ చెప్పింది నిజమే." అంటుంది.

 

    "మీ అక్కయ్యని డాక్టర్ కి చూపించాలని చెప్పావు, చూపించారా?" అంది పార్వతమ్మ.

 

    "ఆ......"

 

    "ఏమన్నది?"

 

    దీపకి ఎలా చెప్పాలో తెలియలేదు. గోళ్ళు కొరుక్కుంటూ వుండిపోయింది.

 

    "రహస్యమా?"

 

    "అబ్బెబ్బే, అదేం లేదు."

 

    "మరి......!"

 

    "అక్క, చాలా వీక్ నెస్ గా వుంది. ఎప్పటిలాగా ఆరో నెల నిండకుండానే ఎబార్షన్ కావచ్చని డాక్టర్ చెప్పింది. కదలకుండ రెస్ట్ తీసుకోమంది. ఇంజక్షనులు, టానిక్ లు విడవకుండ వాడమంది. ఇవన్నీ ప్రతిసారీ చేసే పనులేగదా."

 

    "మరో డాక్టరుకి చూపిస్తే."

 

    "అనవసరం అత్తయ్యా! అక్క ఆరోగ్యలోపం ఏమీలేదని, బావ పరీక్ష చేయించుకుని అవసరమయిన జాగ్రత్తలు, మందులు తీసుకోవాలని- లోపం బావలో వుండవచ్చని చెప్పింది."

 

    దీప ఇంటి పరిస్థితి తెలిసిన పార్వతమ్మ ఏమీ మాట్లాడలేకపోయింది. ఇది అయే పని కాదన్నట్లు భారంగా ఓ నిట్టూర్పు విడిచింది. "ఊ...ఎవరం మటుకు ఏమి చేయగలం, సంసారంలో కొన్ని విషయాలు మగవానికి తెలిసి వుండాలి. వెళ్ళి చదువుకో మాటలతో ఆలశ్యం అయిపోయింది" అంది.

 

    అప్పటికే అనిల్ రెండుసార్లు కేకపెట్టాడు. "దీపా! వస్తున్నావా!" అని. దీప పుస్తకాలు తీసుకుని అనిల్ గదిలోకి వెళ్ళింది.

 

                                                               7

 

    ఓ అర్ధరాత్రి లలితకి నొప్పులొస్తే ఆసుపత్రిలో చేర్చారు. ఎప్పటిలా నాలుగు నొప్పులొచ్చి కడుపు పోలేదు. ఊరికే నొప్పులు పడుతున్నది, అలసిపోతున్నది. లలిత అవస్త చూసి డాక్టరు కంగారు పడింది, ఇంట్లో వాళ్ళకన్నా కూడా.

 

    వెంకట్రావు ఇచ్చిన టెలిగ్రాం అందుకుని ఊరి నుంచి దిగాడు మధుసూదనం.

 

    ఆడదానికి కడుపురావడం, కడుపు పోవటం, కనటం మామూలు విషయం అన్నట్లు మధుసూదనం ప్రవర్తిస్తుంటే దీపకి వళ్ళు మండింది. లలిత బాధపడుతుంటే నవ్వుతూ తృళ్ళుతూ పిల్లలతో కబుర్లు చెపుతూ అనవసరంగా దీపతో మాటలు పెంచుతూ చీకూ చింతలేకుండా కొత్తల్లుడిలా మెలిగాడు. తప్పని పరిస్థితి అన్నట్లు ఓసారి ఆసుపత్రికెళ్ళి లలితని చూసొచ్చాడు.

 

    "నీ చదువు బాగా సాగుతుందా దీపా?" నఖ శిఖ పర్యంతం దీపని చూస్తూ అడిగాడు మధుసూదనం.

 

    "ఎవరికి దేనిమీద పట్టుదల శ్రద్ధా వుంటాయో ఆ పనులు బాగానే సాగుతాయి, అక్కకి అలా వుంటే బాధగా లేదా బావా?" అంది దీప.

 

    "బాధా! భలేదానివే, నా కెందుకు లేదూ వుంది."

 

    "ఉన్నట్లు నాకు కనపడలేదులే" వ్యంగ్యంగా అంది దీప.

 

    "కనిపడితేనే ఉన్నట్లా? శరీరమయితే చక్కగా ఎదిగింది గాని మనసింకా ఎదగలేదు దీపా! రేపు పెళ్ళికాదా! కడుపురాదా కనవా, బాధపడకుండానే కంటావా? అబ్బా... అమ్మా... అనకుండా అబ్బాయి ఎలా పుడతాడు చెప్పు!" మధుసూదనం మాటలకి సిగ్గుతో ఏహ్యభావంతో ముడుచుకుపోయింది దీప.

 

    "నా మాటలకి సిగ్గు పడుతున్నావా?" మృదువుగా అడిగాడు మధుసూదనం.

 

    "సిగ్గు పడుతున్నాను. అవతల పెళ్ళానికి అలా వుంటే నిశ్చింతగా పనికి మాలిన ప్రసంగం చేస్తున్న నిన్ను చూసి నిజంగా సిగ్గుపడుతున్నాను." దీప మధుసూదనం కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అంది.

 

    అప్పుడే వచ్చిన వెంకట్రావు దీప అన్న మాటలు విన్నాడు. "పెద్దంతరం, చిన్నంతరం లేకుండా ఏమిటా మాటలు!" అని దీపని కసిరాడు.

 

    "కొందరికి ఏళ్ళు పైబడుతున్నకొద్దీ మనసు వికసించాల్సిందిపోయి ముడుచుకుని చిన్నవాళ్ళవుతారు. కొందరు చిన్న వయస్సులోనే ఎదిగిపోతారు. ఆ తారతమ్యాలు తెలియని వారికి తెలియజెప్పటంలో తప్పులేదు." అని దీప వెళ్ళిపోయింది.

 

    "ఇదీ దీని వరుస మధుసూదనం, ఏం చెయ్యాలో నా కర్ధం కావటం లేదు. భయమూ, భక్తీ బొత్తిగాలేవు. మగరాయుడి చేష్టలు. ఆ మధ్య రెండు సంబంధాలు తీసుకువస్తే "కట్నం లేకుండా పెళ్ళాడుతాడా! నన్ను చదివిస్తాడా." అని పెళ్ళివారిని ఇంటిదాకా రానియ్యలేదు. ఏం చేయాలో ఏమిటో, అంతా అయోమయంగా వుందనుకో." వెంకట్రావు బాధ వెళ్ళబోసుకున్నాడు.

 

    "నయానో, భయానో మెడలో మూడు ముళ్ళుపడటం జరిగితే అదే సర్దుకుంటుంది. ఆ వచ్చిన వాడే అన్నీ చూసుకుంటాడు. హంతకుడికి ఉరితాడు ఆడదానికి పసుపుతాడు, పోట్లగిత్తకి బందుతాడు. (కాలికి మెడకి కలిసి పొడిచే ఎద్దులకు తాడు కడతారు) పడిననాడు, తల మళ్ళీ ఎత్తటానికి వీలు కాదులే మామయ్యా. ఈ సంగతి పెద్దవారు మీకు తెలియందా?"

 

    "అవునవును." తల తాటించాడు వెంకట్రావు.

 

    తల్లి ఆసుపత్రిలో లలిత దగ్గర వుండటంవల్ల దీప మీద ఇంటి పనంతా పడింది. అల్లుడింట్లో వుండగా మర్యాదగా వుండదని వెంకట్రావు చతుర్ముఖ పారాయణానికి బైటికెళ్ళక తనూ అల్లుడు కలిసి ఇంట్లోనే ఆట మొదలు పెట్టారు.

 

    పేరుకి పల్లెటూరయినా అనుభవమున్న లేడీ డాక్టరు ఆపరేషన్ కి కావలసిన పరిసరాలతో ప్రభుత్వం వారి ఆసుపత్రి వుంది. ఓ మగ కుర్ర డాక్టరు ముగ్గురు నర్సులు వున్నారు. లలిత ఆసుపత్రిలోనే వుంది. రెండు రోజులబట్టి నెప్పులు పడుతూ.

 

    ఎప్పటిలా ఓ రోజు బాధపడి లలితకి కడుపు పోవటం జరగలేదు. కడుపులో ఆరు నెలలు నిండిన పిండం అడ్డం తిరగటం, ముందే ఉమ్మనీరు పోయి, పిండ ప్రాణం పోవటం జరిగింది. పొట్ట రాయిలా బిగిసి నెప్పులు గుండెకి ఎగతన్నటం ప్రారంభించాయి. అది చెడు లక్షణం. తల్లి ప్రాణం పోయినా పోవచ్చు. వెంటనే ఆపరేషన్ చేయటం తప్ప గత్యంతరం లేదు. డాక్టరు ధైర్యంచేసి తన అనుభవమంతా ఉపయోగించి ఉన్న పరికరాలతోనే దిగ్విజయంగా ఆపరేషన్ చేసి పిండాన్ని తీసింది. లలిత ప్రాణం దక్కింది. అయితే ఆపరేషన్ ఫలితం మరొకటి సాగిపోయిన గర్భకోశం జీర్ణించిన సుఖవ్యాధులు వల్ల గర్భకోశం తీసేయటం జరిగింది. జీవితంలో ఎప్పటికి మాతృయోగం పొందలేని లలిత ప్రాణభయం లేకుండా క్షేమంగా ఇల్లు చేరింది.

 Previous Page Next Page