"ఆకర్షణ లాంటి ప్రేమ అయితే ఆకర్షణ తగ్గగానే ఆ ప్రేమ తగ్గిపోతుంది. ఊ...ఇప్పుడు ఆ విషయాలు దేనికి గాని, నువు చెప్పేదేమయినా వుంటే చెప్పు నే వెళ్ళిపోవాలి."
"చెప్పవలసినవి ఏమీ లేవు. చెప్పక తప్పదూ అంటే ఒకమాట. నిన్ను చూసిం తరువాత ప్రేమ ఎక్కువయింది."
దీప మాట్లాడలేదు. మన్ మోహన్ ఊరికి వెళ్ళి పోతున్నాడు. చిన్ననాటి చెలికాడు. నాలుగు కబుర్లు చెప్పుకుందామని వచ్చింది. మాటలు ప్రేమలోకి దిగాయి.
"మాట్లాడు దీపా!"
"ఏం మాట్లాడను?"
"నాపై నీకు ప్రేమ వుందా?"
"ప్రేమ చాలా రకాలుగా ఉంటుంది. ఆ రకాలన్నీ ఏకరువు పెట్టటానికి టైమ్ లేదు. ప్రైవేట్ కి వెళ్ళాలి. ఈ తఫా వస్తావుగా అప్పుడు మాట్లాడుకుందాం! సరేనా? వస్తా మనూ!" వెళ్ళటానికి పుస్తకాలు తీసుకుని దీప లేచింది.
దీప చెయ్యి పట్టుకున్నాడు మన్ మోహన్.
"ఇదేం పని మనూ! చెయ్యి వదులు."
"ఉహూ! వదలను నాపై ప్రేమ వుందో లేదో చెప్పు. నేనంటే ఇష్టమేనా?"
"చెయ్యి వదులు నిజం చెప్పిపోతాను."
మన్ మోహన్ దీప చెయ్యి వదిలేశాడు.
"మనూ! నీపై నాకు...నాకు...అసహ్యం మాత్రం లేదు." అని దీప రెండంగల్లో దాటిపోయింది.
మన్ మోహన్ ఓ అడుగు ముందుకేసి అక్కడే నిలబడి పోయాడు.
9
దీప పుస్తకం తెరిచింది గాని మనసు పరిపరి విధాల పోతున్నది. అక్షరాలు అలుక్కు పోయినట్లు అనిపిస్తున్నాయి. పెదవులు పాఠాన్ని ఉచ్ఛరిస్తున్నాయి అంతే పాఠం తలకెక్కడం లేదు.
"బావ సంగతి ఆనాడే తనకి తెలిసింది. ఇంట్లో ఎవరూ తను చదువుకోటానికి ఒప్పుకోలేదు. బావ సాయం చేస్తానని ఈ కాలం చదువుకోవటం గొప్పని... ప్రతివారికి చదువవసరమని... వాదించి ఇంట్లో అందరిని ఒప్పించాడు. బావ ఉదార బుద్ధికి ఎంతో సంతోషించింది తాను. ముందు ముఖమాట పడి వద్దన్నా పరాయి వాళ్ళ ముందు చేయి చాచటం లేదు, బావా అని సరి పెట్టుకుంది.
తరచు బావ తనతో సరదాగా మాట్లాడేవాడు. ఒకటి రెండుసార్లు భుజం మీద చేయి వేశాడు. సరసంగా జోక్స్ వేశాడు. ఇవన్నీ అతను బావ, తను మరదలు అందుకే చనువు అనుకుని పట్టించుకోలేదు. ఆరోజు ... అమ్మ అక్కని ఆసుపత్రికి తీసుకెళ్ళింది. నాన్న పేకాటనుంచి రాలేదు. బావ, తను తమ్ముడు, చెల్లెళ్ళు మిగిలారు ఇంట్లో. పెందలకడ భోజనాలయాయి. పిల్లలు నిద్రపోయారు. వాకిలి తలుపు బిగించి బావ సరాసరి తన గదిలోకి వచ్చి భుజంమీద చేయివేసి దగ్గరకు లాక్కుని కన్నుమూసి తెరిచేటంతలో కౌగిలిలోకి లాక్కోటం ముద్దు పెట్టుకోవటం జరిగిపోయింది.
తను ఈ హటాత్ పరిణామానికి నిర్ఘాంతపోయింది. తెప్పరిల్లేప్పటికి బావచేతులు తన శరీరంపై వేయరాని చోట వేసి తడుముతున్నాయి. ఒక్క విదిలింపు విదిలించింది. గింజుకుంది. తిట్టింది, ఆఖరికి రక్కి పెట్టింది. అప్పుడు బావ తనని వదిలాడు లాభం లేదని.
"తప్పేంలేదు దీపా! కొత్త కాబట్టి భయపడుతున్నావ్? నేనేం పరాయివాడినేమిటి! బాగుంటుంది, ఒక్కసారి... ఎవరూ లేరుగా...! ఎందుకు భయం... నేనెవరితో చెప్పను... నువ్వంటే నాకెంతో ప్రేమ. ఎంత గాఢమైన ప్రేమో చెప్పలేను. నిన్నెంత ప్రేమిస్తున్నానో తెలుసా? అందుకే నీ చదువుకి నే డబ్బు సాయం చేస్తానంది. ఇక్కడ వుండి చదువుకోటం కష్టం. అక్క దగ్గరుండి చదువుకుంటానని చెప్పు నీ చదువు సాగుతుంది. నాతో సినిమాలకి, షికార్లకి రోజూ తిరగవచ్చు. మెచ్చిన ఫ్యాషను, నచ్చిన చీరలు. అంతా నీ ఇష్టం" అంటూ బావ వసపోసిన పిట్టలాగా వాగుతూనే వున్నాడు. మధ్య మధ్య కవ్విస్తూ బూతుమాటలు.
"బావా! అక్క మొగుడు వయిపోయావు కాబట్టి బ్రతికిపోయావు. నా పేరు దీపా! నన్ను ముట్టుకుంటే నీవు బూడిదవుతావు. సరదా మనిషివనుకున్నాను గాని లోపల కోరిక పెట్టుకుని దానికి ప్రేమనే రంగులు పూసి చదివిస్తానని మభ్యపెట్టి దగ్గరకు తీసుకున్నావు కదూ! మంచివాళ్ళు ఓ మాట అన్నా పడతాను తల ఒగ్గుతాను. నీలాంటి దీపం పురుగంటే నాకు పరమ అసహ్యం. నీ వద్ద పైసా పుచ్చుకోకుండానే చదువుకుంటాను. ఇప్పటినుంచీ నీవన్నా నీ మాటలన్నా నీ డబ్బన్నా నాకు అసుద్ధంతో సమానం" అని తాను ఇవతలికి వచ్చేసింది.
ఇది ఇంట్లో ఎవరికీ తెలియలేదు. ఎక్కడలేని ప్రేమ నటిస్తూ బావ పైపై నాటకాలు ఆడుతూనే వున్నాడు. బావ తెచ్చే కానుకలు అవసరానికి ఇచ్చే డబ్బు ఇంట్లో అందరికీ బావ దేముడయ్యాడు. బావ నిజస్వరూపం తెలిసిన తనకి తప్ప.
ఇప్పుడు మళ్ళీ బావ మరోసారి తనమీద దాడి జరపబోతున్నాడు. ఇంట్లో అందరూ బావ పక్షం. ఛీ...ఛీ... వీళ్ళంతా మనుషులా? అమాయకులా? మూర్ఖులా?
అక్కకి ఈ జన్మలో మాతృమూర్తి అయే యోగం లేదు. కారణం ఎవరు? బావకు జీర్ణించిన సుఖ వ్యాధులవల్ల అక్కకి తరచు కడుపులు పోవడం, వ్యాధి సంక్రమించి గర్భకోశం పాడుకావటం డాక్టర్ చెప్పింది. అర్ధంకాని అమ్మ. అర్ధం చేసుకోలేని అక్క డాక్టర్ పెడచెవిని పెట్టి లలాట లిఖితం అని కబుర్లు.
వంశోద్ధారకుడు లేని ఇల్లు వల్ల కాటితో సమానమట. పిల్లలు లేని వారు పిశాచాలతో సమానమట. ఈ పనికిమాలిన మాటలు ఎవరు ప్రచారంలోకి తీసుకువచ్చారో! వాళ్ళు... వాళ్ళు... పరమ కిరాతకులు.
తనకి ఇరవై ఏళ్ళు దాటాయి. పెళ్ళి కాలేదు. నిజమే లోకంలో ముప్ఫై నలభైలు దాటిన ఆడపిల్లలు ఎంతోమంది వున్నారు. అదేమంత ఘోరం కాదే! బావా అక్క ఇల్లు నిలబడాలట. వంశం నిర్వంశం కాకూడదట. కాబట్టి... తాను బావకి భార్య కావాలిట. తనకి మళ్ళీ పెళ్ళి చేసుకోటం ఇష్టం లేదన్నట్లు ఫోజుపెట్టి బావ అంగీకారం. తప్పేంలేదు బావ మొగుడు కావటం అని తల్లితండ్రి అన్నింటికన్నా విచిత్రం అక్క. "నీకిష్టమే కదా దీపా! మనిద్దరం ఒకే ఇంట్లో వుంటాము. బావని పెళ్ళాడమని నేనడుగుతున్నాను. కాదనకు. నీ కడుపునో కాయకాస్తే వాడు మనిద్దరికీ బిడ్డ" అంటుంటే, తనకి నవ్వాలో ఏడ్వాలో అర్ధంకాలేదు. తను ఊ అనటం వాళ్ళకి కావాలి. "ఏం మనుషులు, ఏం మనస్తత్వాలు?"