Previous Page Next Page 
ఆరోరుద్రుడు పేజి 9

 

     "బీ... స్పోర్టివ్... లక్ష్మి" అంటూ ఆయన చేతుల్ని పట్టుకుని, తన భుజమ్మీద వేసుకుని ముందుకు నడిచింది సుమిత్ర.
    
                                       *    *    *    *    *
    
    ఉదయం తొమ్మిదింపావయింది.
    
    అజమాబాద్ ఏరియాలోని సమాజం డైలీ ఆఫీసులోని, న్యూస్ సెక్షన్లో చీఫ్ రిపోర్టర్ చక్రవాకం....ఎవరితోనో ....ఫోన్ లో మాట్లాడుతున్నాడు.
    
    "ఆ న్యూస్ ను ఇప్పుడే మీలాగే నేనూ చూసాను. ఎడిటర్ గారిని...కలిసాక గానీ...ఏవీ చెప్పలేను. మీరు మాత్రం క్లారిఫికేషన్ ని పంపించండి తర్వాత చూద్దాం..." విసురుగా ఫోన్ పెట్టేసి....కుర్హ్చీలో కూలబడి, సిగరెట్ వెలిగించుకున్నాడు.
    
    అంతలో మళ్ళీ ఫోన్ మోగింది.
    
    అదే సమయంలో హైహీల్స్ ను టక, టక లాడించుకుంటూ లోనికొచ్చింది మధూలి.
    
    "అమ్మా... మధూలీ.... ఇవాళ....బేనర్ ఐటెమ్ తమరేనా....ఇచ్చింది..." కోపంగా అడిగాడాయన. మధూలి వెంటనే మాట్లాడలేదు.
    
    "ట్రైన్ దిగి ఇంట్లోకి అడుగుపెట్టగానే ఒక ఫోన్, కాఫీ తాగుతుంటే ఒక ఫోన్, స్నానం చేస్తుంటే ఒక ఫోన్...ఎమ్మెల్యేలమ్మా....ఎమ్మెల్యేలూ...మినిస్టర్ పి.ఏ.లూ... ఇంతకీ ఆ ఐటెమ్, ఎవడిమ్మన్నాడమ్మా...నిన్నూ....ఎడిటర్ గారూ చూసారా."
    
    "అందరూ చూసారు సర్..."
    
    "ఏం చూసారో... ఏం పాడో....నువ్వొచ్చేముందే....సి.ఎం....ప్రెస్ పి.ఏ. ఫోన్ చేసి, గొల్లు- గొల్లుమన్నాడు.... ఆ డిటైల్స్... ఎలా వచ్చాయని అడుగుతున్నాడా పి.ఎ."
    
    "రియల్ ఫాక్ట్సు అండ్ ఫిగర్స్ సర్... నెససరీ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయండి."
    
    "డాక్యుమెంట్స్ సరే....గవర్నమెంటు వ్యవహారాల్లోకి మరీ అంత 'డీప్'గా వెళ్ళిపోగూడదమ్మా.... నీకు తెలీదు తొందర....చూడు సి.ఎమ్. సాయంత్రం ప్రెస్ మీట్ పెడుతోందట....దీని గురించి క్లారిఫికేషన్ ఇవ్వడానికే అనుకుంటాను ఎలా చెప్పుకుంటావో...ఏమిటో అది నువ్వే కవర్ చెయ్."
    
    "ఒ.కే. సార్....థాంక్యూ సర్....'ప్రెస్ మీట్' ఎన్ని గంటలకు సార్..."
    
    చెప్పాడు చీఫ్ రిపోర్టర్.
    
    "అక్కడికి వెళ్ళే ముందు ఒకసారి మన ఎడిటర్ గారిని, ఎండీ గారిని కలిసి వెళ్ళు." అంటూ అదే పనిగా మోగుతున్న టెలీఫోన్ రిసీవర్ని అందుకున్నాడు చీఫ్ రిపోర్టర్ చక్రవాకం.
    
    మధూలి న్యూస్ సెక్షన్ లోంచి ఎడిటోరియల్ సెక్షన్ లోకొచ్చింది.
    
    ఎడిటోరియల్ సెక్షన్ లో-
    
    గ్లాస్ ఛాంబర్లో అప్పటికే వచ్చేసి హనుమాన్ చాలీసా చదువుకుంటున్నాడు ఎడిటర్ అప్పలాచార్యులు.
    
    ఆయనకు ఆఫీసుకురాగానే హనుమాన్ చాలీసా చదువు కోవడం అలవాటు.

    మధూలిని చూడగానే పుస్తకాన్ని పక్కనపెట్టి, లోనికి రమ్మని చెయ్యి ఊపాడు.
    
    మధూలి వెంటనే లోపలకు వెళ్ళింది.
    
    "చూడమ్మా....చూడు నీ 'ఐటెమ్' పొలిటికల్....సెక్షన్ లో కాదు మనాఫీసు మీద 'బాంబు'లా పేలింది చూడు...ఆ ఎక్సయిజ్ మినిస్టర్ రాజ్య....తెల్లవారకుండానే ఫోను....అందరికంటే...అతని గురించే డిటైల్స్...ఎక్కువగా.... ఉన్నాయట గదా...అతనికి...సిటీలో....మేడలూ, మిద్దెలతో పాటు, అయిదారు కళ్ళు కాంపౌండులున్నాయని రాసావట గదా."
    
    "రాసావట గదా కాదు సార్.... రాసాను గదా సర్! మీరు మాన్యుస్క్రిప్టును....అయిదారు సార్లు చదివేరు గదా సార్! డాక్యుమెంట్లన్నీ చూసారు గదా సర్..."
    
    "రాజ్య గురించి నీకు తెలీదమ్మా మూడుసార్లు చీఫ్ మినిస్టర్లు మారినా, ఈయన పోస్టు మాత్రం మారలేదమ్మా-సిటీలో రౌడీలు....గుండాలు....అంతా....ఆయన చేతిలోని మనుషులే రేపు...మనాఫీసు మీద దాడి చేస్తే...."భయంగా అన్నాడాయన.
    
    "ఇంతదానికే భయపడితే ఎలా సార్....మన్ది ఫోర్త్ ఎసెట్."
    
    "జర్నలిజం సూత్రాలు చెప్పకు తల్లీ.... ఏదో ఈ రెండేళ్ళూ.... ముక్కు మూసుకొని... రామాయణాలు, మహాభారతాలూ, సీరియల్స్ గా వేసుకుని, కాలక్షేపం చేసేద్దావంటే...కుదిరేటట్టు లేదు. ఈ 'ఐటెమ్' ఏం కొంపముంచుతుందో....రేపు చైర్మెన్ బొంబాయి నుంచి వస్తున్నాడు. ఆయనకసలే పొలిటికల్ కనెక్షన్స్ ఎక్కువ....పవర్ లో ఉన్న పార్టీనీ ఏవన్నివ్వడు- ప్రతి పక్షాన్నీ ఏవన్నివ్వడు...అడకత్తెరలో పోకచెక్కలా నన్ను బెట్టేసావ్ తల్లీ."
    
    ఆయన భయాన్ని చూస్తుంటే మధూలికి జాలేసింది.
    
    "ఐటెమ్ నేనిచ్చాను....ఏదైనా....అయితే- నేను చూసుకుంటాను. ఆ రెస్పాన్స్ బులిటీ నాది." ధైర్యంగా అంది మధూలి.
    
    తలెత్తి ఆమె చూపు 'సీరియస్'గా చూసాడు అప్పలాచార్యులు.
    
    "ఎండీతో నువ్వేం చెప్పుకుంటావో, చెప్పుకో...చైర్మెన్ తో నువ్వేం చెప్పుకుంటావో చెప్పుకో నాకేం సంబంధం లేదమ్మాయ్."
    
    అల అనతున్న ఆయన ముఖాన్ని చూస్తుంటే నవ్వొచ్చింది మధూలికి వస్తున్న నవ్వుని, అణచుకుంటూనే లేచి ఆయన దగ్గర శెలవు తీసుకుని, ఆ రూమ్ లోంచి బయటపడింది.
    
    అంతా బాగానే వుంది కానీ-
    
    ఎక్సైయిజ్ మినిస్టర్ రాజ్య పేరు వినగానే, మధూలి కూడా మొట్టమొదటిసారో ఆలోచనలో పడింది.
    
    "కేరేహోట్....వాట్ విల్ హేపెన్....నథింగ్...నథింగ్..." కళ్ళద్దాల్ని సవరించుకుంటూ ముందు కడుగేసింది మధూలి.
    
                                         *    *    *    *    *
    
    సెక్రటేరియట్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి పేషీ..
    
    ముఖ్యమంత్రి త్రిభువనేశ్వరీదేవి-
    
    విశాలమైన ఏ.సీ గదిలో విశాలమైన టేబుల్ ముందు, ఆడపులిలా కూర్చొని ఉంది త్రిభువనేశ్వరీదేవి-
    
    అప్పుడే తలుపు తెరచుకొని లోనికొచ్చాడు పి.ఎ. అరవింద్.
    
    "మేడమ్....కృష్ణాజిల్లా ఎమ్మెల్యేలు మిమ్మల్ని కలవడానికి వచ్చారు."
    
    తలెత్తి పి.ఎ. వేపు చూసింది త్రిభువనేశ్వరీదేవి.
    
    "వాళ్ళని.... రేపు.... ఇంటి దగ్గర కలుసుకొమ్మని చెప్పండి... ఎక్సయిజ్ మినిస్టర్ రాజ్యగారికి ఫోన్ చేసారా?"
    
    "చేసాను- మేడమ్- ఆయనింకా 'పేషీ'కి రాలేదు....చీఫ్ సెక్రట్రీ వరదరాజన్ ఎక్సయిజ్ కమిషనర్ అరవిందరావు ఇంటెలిజెన్స్ ఐజి శ్రీధర్ బయట వెయిట్ చేస్తున్నారు మేడమ్."
    
    "వాళ్ళని లోనికి పంపించండి. అలాగే హేమాద్రిశర్మగారిని....రమ్మనండి."
    
    "ఎస్. మేడమ్..." అడుగులో అడుగు వేసుకుంటూ వినయంగా బయటకు వెళ్ళిపోయాడు పి.ఎ. అరవింద్.
    
    వరదరాజన్ అరవిందరావు శ్రీధర్ లోనికి అడుగుపెట్టారు.
    
    ఆమెను విష్ చేస్తూ, సీట్లలో కూర్చున్నారు.
        
    "నిజంగా చనిపోయినవాడు....శ్రీకరేనా...చచ్చిపోయాడా? చంపేసారా?"
    
    నెల్లూరు వెళ్లేముందు పర్సనల్ గా, తన 'ఇన్ స్ట్రక్షన్స్' తీసుకున్న యంగ్ ఆఫీసర్ శ్రీకర్ ముఖం, త్రిభువనేశ్వరీ దేవి కళ్ళముందు కదలాడింది.
    
    గుండె దిటవు, చేవ, శక్తిగల, అలాంటి యంగ్ ఆఫీసర్స్....ద్వారానే తను ఎన్నో అసాధ్యమైన పనులను, సుసాధ్యం చెయ్యాలనుకుంది.
    
    "ఎక్సయిజ్ డిపార్టుమెంటు ద్వారా వచ్చిన ఇన్ ఫర్ మేషన్- చనిపోయింది శ్రీకరే మేడమ్..." ఎక్సయిజ్ కమీషనర్ నెమ్మదిగా చెప్పాడు.

 Previous Page Next Page