ఎవ్వర్నీ లక్ష్యం చెయ్యని అహంకారం- ఎవరికీ తలవంచని ముక్కు సూటిదనం...అందర్నీ ఆటపట్టించే అల్లరితనం... ఎవరికీ అర్ధంకాని సీరియస్ నెస్....సమస్యల్ని అవలీలగా పరిష్కరించగలిగే నేర్పరితనం....పొగరు, వగరు, అల్లరి, ప్రతిభ కలగలసిన పగడాల బొమ్మ...
మధూలి...
సుమిత్ర నుదుటి మీద ఉండాల్సిన బొట్టుబిళ్ళ కంఠమ్మీద అంటుకుని కనబడడంతో-
"చూస్సాను...చూస్సాను....చూస్సానులేవే పిల్లా" అని కంఠమ్మీద బొట్టుబిళ్ళను చేత్తో తీసి సుమిత్రకు చూపిస్తూ-
"చెప్పవే....పెళ్ళయిన పిల్లా... ఇంకెక్కడ....ఇంకేం అంటుకున్నాయో చెప్తావా....నన్ను చూస్కోమంటావా...."
"ఛీ....పోకిరీ....నీ పని ఇప్పుడు కాదు....పెళ్ళయ్యాక చెప్తాను. కాస్త ఆగు..." అంది సుమిత్ర.
"నేను....నీలాంటిదాన్ని కాదులే...ఎక్కడా ఏవీ అంటుకోకుండా...జాగ్రత్తపడతానులే..." అల్లరిగా నవ్వుతూ అంది మధూలి.
అదే సమయంలో-
ఫ్లయింగ్ సాసర్ లా ఎగిరొచ్చి డ్రాయింగ్ రూమ్ లో పడింది సమాజం డెయిలీ పేపర్.
గబుక్కున దాన్ని అందుకుంది మధూలి.
గబగబా ఫాస్ట్ పేజీ....బేనర్ వేపు చూసింది.
"అమ్మ మాట హుళక్కి? సిఎంగారూ...ఏమంటారు?" బేనర్ ని గట్టిగా బయటికే చదివి-
"కేప్షన్ భలే పెట్టాడే.... మన న్యూసెడిటర్..." వార్తను గబగబా చదువుతూ అంది మధూలి.
"ఆ ఎమ్మెల్యే ఆస్తుల మీదేనా...ఐటెమ్...." ఆసక్తిగా అడిగింది సుమిత్ర.
"మరి..."
"ఎడిటర్ గారు....ఒప్పుకున్నారే..."
"ఆయనెవడే ఒప్పుకోడానికి....నాలుగు రోజులు...వెయ్యకుండా ఎందుకుంచాడనుకున్నావే.... భయం....రేపు సి.ఎం...నా ఎమ్మెల్యేలు....నా మంత్రులూ....అధికారంలో కొచ్చాక....ఆస్తులు సంపాదించలేదని అంటుందా....చూడు....ఈ ఫాక్ట్సు చూడు....ఈ ఫిగర్స్ చూడు....ఎం.డీ. వరకూ వెళ్ళబట్టే, ఈ ఐటెమ్ వెలుగులో కొచ్చింది..." ఆ వార్తని గబగబా చదివేసి పేపర్ ని సుమిత్ర కిస్తూ అంది మధూలి.
"దీనిమీద పెద్ద గొడవవుతుంది....డైరెక్టుగా....సి.ఎం మీద బాంబును పేల్చావ్....ఆవిడ తేలిగ్గా తీసుకున్నా....మంత్రులూ, ఎమ్మెల్యేలు ఊరుకుంటారనుకున్నావా...." సుమిత్ర గొంతులో భయం ధ్వనించింది.
"ఏం....ఏవవుతుందే...మనం జర్నలిజంలో విజయశాంతి టైపు...రమ్మను....ఎవడొస్తాడో ....రౌడీలచేత నన్ను కొట్టిస్తారా.... అదే నీ భయం. పిచ్చి.... తుమ్మమొద్దూ.....సిటీలోని ఏ రౌడీ షీటర్నయినా... ఒక్కసారి...ఒక్కసారి.... నా దగ్గరకు రమ్మను... తోలు వలిచేస్తాను.... డోంట్ అండర్ ఎస్టిమేట్ మి..." బాబ్డు హెయిర్ ని వెనక్కి తోసుకుంటూ అంది మధూలి.
అదే సమయంలో లోన్నించి కాఫీ కప్పుతో వచ్చాడు లక్ష్మినారాయణ.
"ఏవండీ....లక్ష్మిగారూ...మీ ఆవిడ కాఫీ నేను తాగేసానని...పాపం....ఇంకో కప్పు తెచ్చారా....తెండి...తెండి" అంటూ ఆయన చేతిలోని కప్పుని లాక్కుని తనే సిప్ చేస్తూ ఓరకంట ఇద్దరి ఫేస్ ఫీలింగ్స్ నూ గమనిస్తూ-
"మీరు భార్యగా దొరకడం....మా సుమిత్ర పూర్వజన్మ అదృష్టవండీ...ఏ నరకాసురుడికో గోల్డెన్ ఫ్లవర్స్ తో పూజ చేసుంటుంది.... పనులన్నీ....ఎర్లీ ఇన్ ద మార్నింగే కాదు... అర్దరాత్రి కూడా చేసుకోవచ్చు ....కావలిస్తే మా మిత్రని అడగండి" సుమిత్ర వేపు కన్నుగొడుతూ అంది మదూలి.
ఆ మాటకు లక్ష్మినారాయణ చిరునవ్వులు చిందిస్తూ లోనికెళ్ళి పోయాడు.
"మీ ఆయన కూడా జీనియస్సేనేవ్.... తెల్సుకొని గమ్మున లోనకెళ్ళి పోయారు" అంది మధూలి.
"వచ్చినప్పుడల్లా....అలా ఆట పట్టించకే పాపం....అసలే ఆయనకు మొగమాటం..." ఇబ్బందిగా అంది సుమిత్ర.
"మొగమాటం....నీ దగ్గరా...నా దగ్గరా...నీ దగ్గర మొగమాటమైతే చెప్పు.... చిన్న ట్రీట్ మెంట్ చేస్తాను....దెబ్బకు బిడ్డడు....పైలాపచ్చీసు రౌడీ అయిపోతాడు..."
"తల్లీ....ఊరుకుంటావా....అసలెందుకొచ్చావో చెప్పు....చీఫ్ రిపోర్టర్ కి తెలీకుండా ఆ న్యూస్ ఇచ్చావ్ నువ్వు... చూడు... ఆయన... ఎలా... లాంగ్ జంప్ లూ.... హై జంప్ లూ చేస్తాడో..." అంది సుమిత్ర.
"అదే నాకూ భయంగా వుంది.... ఆయన నిన్నటి వరకూ లీవ్ లో ఉండడం నాదా తప్పు?"
"కాదు గానీ..."
"మన రాగంగారు....మన్నేవీ చెయ్యలేరు గానీ.... చిన్న న్యూస్ ఐటెమ్ కోసం....అమీర్ పేట వచ్చాను. ఎర్లీ మార్నింగ్.... పెళ్ళయిన వాళ్ళు....ఏం చేసుకుంటారో....స్వయంగా తెల్సుకుందామని తమ కోజీహోంకి వచ్చాను...అది సరే....నీది డే షిఫ్టా... మిడిల్ షిఫ్టా."
"డే షిప్టే..."
"ఓ.కే... నే వెళ్తాను... ఎర్లీ బర్డ్ కాచెస్ ది వామ్ అన్నారు ఎల్డర్స్..." హేండ్ బేగ్ ను....సవరించుకుంటూ లేచి నిలబడింది మధూలి.
"టిఫెన్ చేసి వెళ్ళకూడదటే..." ఏదో ఒకటి అనాలని అంది సుమిత్ర.
"లక్ష్మిగారు... నీకోసం చేసే టిఫెన్ ని ప్రేమగా నువ్వే తినవే పిల్లా....నాకెందుకూ.... నాక్కూడా ఇలాంటి....మొగుడొస్తే నేనూ తింటాను. ఇంతకు లక్ష్మిగారెక్కడే..."
"బాబ్బాబూ... ఆయన్ని ఆట పట్టించకే..."
"పోనీలే నువ్వు బతిమాలుతున్నావ్ కాబట్టి...వదిలేస్తున్నాను" అంటూ వరండాలో కొచ్చిన మధూలికి-
డాబా మీద బట్టలు ఆరేసి వస్తున్న లక్ష్మినారాయణ తారసపడనే పడ్డాడు. గాభరాగా పక్కకు తప్పుకొబోయాడు...కానీ ఊరుకోలేదు మధూలి. ఎదురుగా వెళ్ళి నిలబడింది.
"అయ్యా! లక్ష్మంకుల్....మిమ్మల్నేవీ అనను....నేనో 'జోకు' చెప్తాను.....మళ్ళీ మనం కలిసినప్పుడు- దానర్ధం చెప్పాలి- చెప్తారా" కొంటెగా సుమిత్రవేపు చూస్తూ అడిగింది మధూలి.
"మధూ..." ఇబ్బందిగా మొహం పెట్టింది సుమిత్ర.
"అ...డ...గం...డి..." కళ్ళను మిటకరిస్తూ అన్నాడు లక్ష్మినారాయణ.
"అనగనగా ఒక ఆంగ్లో ఇండియన్ తల్లిని, ఓ ఆంగ్లో ఇండియన్ కూతురు.... W hat do you give a man who has Everything అని అడిగింది.
అప్పుడా ఆంగ్లో ఇండియన్ మాత Encouragement dear, en couragement ani జవాబిచ్చిందండి...ఇంతకీ దీనర్ధం ఏమిటి? నెక్స్టు చెప్పాలి....భేతాళా....ఒ.కే....సీయూ.... మిత్రా ....లక్ష్మిగారూ..."
గబగబా బయటికొచ్చేసి మెట్లు దిగి, పోర్టికోలోకొచ్చి లూనాని స్టార్టు చేసింది మధూలి.
బాల్కనీలోంచి తనవైపే చూస్తున్న సుమిత్ర, లక్ష్మినారాయణల వైపు-
"అంకుల్... మర్చిపోవద్దు..." అరుస్తూ లూనా ఎక్కింది మధూలి. లూనా తూనీగలా ముందుకు పరుగెత్తింది.
మధూలి వెళ్ళిపోగానే రిలాక్సయ్యాడు లక్ష్మినారాయణ.
"మనం ఇక్కడ నుంచి అవుట్ స్కర్ట్స్ కి.... ఎక్కడైనా.... ఇల్లు మార్చేస్తే ఎలా ఉంటుంది మిత్రా..."
"అలా అంటున్న లక్ష్మి ముఖంవేపు చూసింది సుమిత్ర. ఆమెకు నవ్వాగలేదు.