"వాటీజ్ దిస్ హెల్ ఇంతకీ మీకేం కావాలి నువ్వు భార్గవికి క్లోజ్ ఫ్రెండ్ వా?" క్లోజ్ అనే పదాన్ని వత్తి పలుకుతూ అన్నాడు జ్వాలాముఖిరావు.
"సైడ్ టాక్స్ వద్దు జ్వాలాముఖిరావ్- భార్గవినే భార్యగా చేసుకుంటానని వంచించారా లేదా? ఆమె నాకు రాసిన లెటర్ ని పోలీసులకు ఇస్తాను. పోలీసులు ఈ కేసుని తిరగతోడితే ఎందరో భార్గవిల జీవితాలు బయటకొస్తాయి. భార్గవికి నావల్ల అన్యాయం జరిగిందని వప్పుకుంటూ పేపర్ మీద రాసివ్వండి. భార్గవి ఆత్మ శాంతిస్తుంది లేనిపక్షంలో....." బెదిరింపుగా అంది మయూష.
ఆమె ఒక్కొక్క మాటలకు వులిక్కిపడుతున్నాడు జ్వాలాముఖిరావు.
"నేను పేపర్ మీద రాసి సంతకం చేసి మరీ ఇవ్వాలా....వాట్ ఏ ఫన్నీ జోక్...." పెద్దగా నవ్వాడు జ్వాలాముఖిరావు. నవ్వి, నవ్వి అలిసిపోయి-
"ఆర్యూ మేడ్ బేబీ....డోంట్ ప్లే విత్ మీ....యూ నో దట్ యు ఆర్ డీలింగ్ విత్ ఏ పవర్ ఫుల్ ఇండస్ట్రయలిస్ట్స్ ఇన్ ది స్టేట్" పొగరుగా అన్నాడాయన.
"ఐ నో మిస్టర్ రావ్! ఐ ఫర్ ఫెక్ట్ లీ నో దట్- అయామ్ డీలింగ్ విత్ ఎ జాకాల్"
"ష.....ట.....ప్...."
మయూష మాటకు విసురుగా ముందుకొచ్చారు జ్వాలాముఖిరావు.
ఆమె కంఠాన్ని నులిమేసి చంపెయ్యాలన్నంత కోపంగా ఉందతనికి.
సరిగ్గా అదే సమయంలో__
డోర్ తెరుచుకుని పోలీసు కమీషనరు, ఆ వెనుక భుజంగపతి వచ్చారు.
"కమీషనర్ సాబ్.....వాటీజ్ దిస్....నేనెవరో వీళ్ళకు చెప్పండి. ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయండి" విసుగ్గా ఆయన వేపు చూస్తూ అన్నాడు జ్వాలాముఖిరావు.
పోలీస్ కమీషనర్ ఆమె వేపు ఎగాదిగా చూశాడు.
"మీరేనా మయూష?" ఆశ్చర్యంగా ఆమె వేపు చూస్తూ అడిగాడు.
"ఎస్ సార్. అసలు...." ఏదో చెప్పబోయిందామె.
"కేసంతా నాకు తెలుసు.... నర్సింగ్ హోమ్ డాక్టర్ని కలిసే వస్తున్నాను. మీకు న్యాయం చేసే బాధ్యత నాది..... జె.ఎం.రావుగార్ని యిక్కడ నిలదీయడం భావ్యం కాదు. దేనికయినా సమయం, సందర్భముండాలి. నాతో రండి" గంభీరంగా, హుందాగా అన్నాడు పోలీస్ కమీషనర్.
భారంగా నిట్టూర్చి ఒకింత తటపటాయించిందామె.
"అయామ్ సారీ పోలీస్ కమీషనర్. పోలీస్ స్టేషన్ లో మీరు చేసిన కంప్లయింట్ నా దగ్గిర కొచ్చింది. శవాన్ని తీసుకొచ్చి మీరిలా డిమాండ్ చేయడం బాగాలేదు. పైగా అది చట్ట విరుద్దం. ఈయన చట్ట వ్యతిరేకం గానో, అన్యాయంగానో ప్రవర్తించారంటూ వచ్చిన మీరు తిరిగి అదే పనిచేస్తే ఎలా చెప్పండి? ఐ విల్ డూ జస్టిస్, బిలీవ్ మీ ప్లీజ్ కమ్ విత్ మీ" ఎంతో అనునయంగా అన్నాడాయన.
మయూష తలెత్తి జ్వాలాముఖిరావు ముఖంలోకి చూసిందోక్షణం.
అతని మొహంలో గూడుకట్టుకున్న ఉద్రిక్తత స్పష్టంగా కనిపించింది.
పదిమందిలో జ్వాలాముఖిరావు పరువు తీయాలనుకున్న తన ద్యేయం నెరవేరటంతో, పోలీస్ కమీషనర్ ను అనుసరించింది మయూష.
పోలీస్ కమీషనర్ ఇచ్చిన హామీతో స్టూడెంట్స్ హోటల్ దగ్గిర నుంచి వెనుదిరిగారు.
అప్పటికే జె.యమ్ కు పరువు ప్రతిష్టల పరంగా జరగవలసిన నష్టం జరిగిపోయింది.
పోస్టుమార్టమ్ అయ్యాక శవాన్ని భార్గవి తల్లిదండ్రులకు అప్పగించారు.
ఆ రోజు సాయంత్రమే భార్గవి శవానికి అంత్యక్రియలు జరిగాయి.
ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా అంత్యక్రియల వరకూ పోలీసులు ప్రతీచోటా కావలా కాసారు.
ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత-
పోలీస్ కమీషనర్ చాంబర్ లో_
తన ఆఫీసులో పని చేసిన ఉద్యోగి భార్గవి అకస్మాత్తుగా ఆత్మహత్యా చేసుకున్నందుకు సంతాపం ప్రకటిస్తూ భార్గవి కుటుంబానికి అందజేయమని లక్షరూపాయల్ని పోలీస్ కమీషనర్ కి అందజేసి వెళ్ళిపోయాడు జ్వాలాముఖిరావు.
పోలీస్ కమీషనర్ ఆ ఎమౌంట్ ను భార్గవి తల్లిదండ్రులకు అందజేసి వారిని ఆ రోజు రాత్రే వారి స్వగ్రామానికి పంపించి వేసాడు.
మర్నాడు__
పోలీస్ కమీషనర్ కబురు చేస్తే ఆయన ఆఫీసుకు వెళ్ళింది మయూష.
ఆమె వెనక ఇద్దరు మాత్రమే స్టూడెంట్స్ ఉన్నారు.
"మిస్ మయూషా! కేస్ సాల్వయిపోయింది. ఆ విషయం చెప్పదానికే మిమ్మల్ని పిలిచాను" అన్నాడు పోలీస్ కమీషనర్ హుందాగా.
"ఎలా?"
ఆశ్చర్యంగా అడిగింది ఆమె.
"అన్ని రకాలుగా ఆలోచించి నేనీ కేసును స్వయంగా డీల్ చేశాను. జ్వాలాముఖిరావు తను భార్గవిని పెళ్ళి చేసుకుంటానని అన్నాడని మీరంటున్నారు. అందుకు సాక్ష్యం లేదు. భార్గవి మీకు రాసిన ఉత్తరం పటిష్టమయిన సాక్ష్యంగా పనికిరాదు.
నా పరిశీలనలో తేలింది ఏమంటే, భార్గవి మీకు ఉత్తరంలో రాసినవన్నీ నిజాలే. కానీ జ్వాలాముఖిరావుతో సంబంధం తప్ప.....ఆమె డబ్బుకి ఆశపడింది. ఎక్కడో కాలు జారింది.
ఆమె ఆత్మహత్యకూ, జ్వాలాముఖిరావుకూ అసలు ఏ విధమైన సంబంధంలేదు.
ఇందుకు భార్గవి పనిచేసిన జ్వాలాముఖిరావు ఆఫీసులోని స్టాఫే సాక్ష్యం. అసలు భార్గవి కేరక్టర్ మీద నాక్కొన్ని అనుమానాలున్నాయి" పోలీస్ కమీషనర్ వరసగా చెప్పుకుపోతున్నాడు.
సీటులోంచి దిగ్గున లేచి నిలబడిందామె.
"ఎస్ మిస్టర్ పోలీస్ కమీషనర్ మీలాంటి వాళ్ళు జ్వాలాముఖిరావులాంటి వాళ్ళకు కాపలాగా పని చేస్తున్నంత కాలం అమాయకమైన భార్గవి లాంటివాళ్ళు కేరక్టర్ల మీకెప్పుడూ అనుమానంగానే ఉంటుంది. భార్గవి కేసు బయటకు రాకుండా చేయడానికి మీరెంత తీసుకున్నారో చెప్తే విని సంతోషిస్తాను" ఒక కాలేజీ స్టూడెంట్ తననంత ధైర్యంగా ప్రస్నించగలదని ఊహించని పోలీస్ కమీషనర్ ఒక్కక్షణం దిగ్బ్రాంతికి లోనై అంతలోనే తేరుకొని "వాట్ డూ యు మీన్" గట్టిగా అరిచాడు.
రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టింది మయూష.
"థాంక్యూ మిస్టర్ పోలీస్ కమీషనర్ స్టూడెంట్స్ మిమ్మల్ని నమ్మినందుకు కేసుని చాలా ఇంటెలిజెంట్ గా డీల్ చేసారు. ఎన్నో ఆశలతో చచ్చిపోయిన భార్గవి ఎందుకు సూసైడ్ చేసుకుందో నాకు తెలుసు. ఇవాళ భార్గవికి జరిగిన అన్యాయం రేపు మీ అమ్మాయికి, ఇంకొక జ్వాలాముఖిరావు వల్ల జరగొచ్చు. అప్పుడు మీ కన్నీళ్ళను తుడవడానికి ఏ ఒక్కరూ ముందుకురారు మీలాంటి అధికార్లు డబ్బుకి కక్కుర్తిపడి జెమ్ లాంటి వాళ్ళకు రక్షణగా నిలబడితే నిలబడవచ్చు. కానీ పత్రికలు మీ స్థాయికి దిగజారలేదు. భార్గవి కేసుని పత్రికల కెంతగా హైలెట్ వేసాయో మీరు చూసే వుంటారు, చట్టపరమైన రక్షణ మీకు కల్పించవచ్చు. కానీ ఆయన పరువు, ప్రతిష్టలు బజారు పాలు కాకుండా కాపాడలేకపోయాయి, కాపాడలేవుకూడా ఆ విషయం గుర్తుంచుకోండి" విసురుగా లేచి డోర్ తెరచుకుని గబగబా కారిడార్లోకి వచ్చేసింది మయూష.