"హోటల్ సిబ్బంది, మా ప్రయత్నానికి ఏ ఇబ్బంది కలిగించినా ఏం జరుగుతుందో నేను చెప్పలేను ....." మయూష హెచ్చరికకు ఏం చేయాలో తెలీక, మ్రాన్పడిపోయి బొమ్మలా నిలబడిపోయాడు మేనేజర్.
మయూష ముందుకెళ్ళి అంబులెన్స్ లోంచి స్ట్రెచర్ ను బయటకు లాగి, ఇద్దరు స్టూడెంట్స్ తోడురాగా ఆ శవాన్ని ఎత్తి తన రెండు చేతుల్లో పట్టుకుని__
ఆవేశంగా ముందుకు నడిచింది.
"కామాంధుడు, కిరాతకుడు, జాలాముఖిరావు డౌన్....డౌన్...." స్టూడెంట్స్ నినాదాలు మిన్నంటుతున్నాయి.
అప్పటి వరకు లోతైన నిశ్శబ్దంతో కూరుకుపోయున్న ఆ ఫైవ్ స్టార్ హోటల్ ఒక్కసారిగా నినాదాలతో దద్దరిల్లిపోయింది.
* * * *
సౌండ్ ప్రూప్ ఎ సీ హాల్లో ఎవరో ప్రతినిధి అడిగిన ప్రశ్నకు జ్వాలాముఖిరావు సమాధానం చెపుతున్నాడు.
సరిగ్గా అదే సమయంలో డోర్ తెరచుకొని పరుగు పరుగున లోనికి ప్రవేశించిన భుజంగపతి, జ్వాలాముఖిరావు దగ్గరకెళ్ళి అతని చెవిలో అసలు విషయం చెప్పాడు భయంగా.
"భార్గవి సూసైడ్ చేసుకుందా? ఆమె శవంతో స్టూడెంట్స్ హోటల్ మీద దాడి చేసారా?" మాటల్లో కంగారు తప్ప జె.ఎమ్.రావు ముఖంలో ఏ మార్పూలేదు.
కొద్ది క్షణాల్లోనే తేరుకుంటూ అటెన్షన్ లో కొచ్చేసాడు.
"కమీషనర్ కు ఫోన్ చెయ్.....హోమ్ మినిస్టర్ కు ఫోన్ చెయ్.....లేదా.....సి....ఎమ్ కి ఫోన్ చెయ్....ఆ స్టూడెంట్స్ ఈ హోటల్లోకి అడుగుపెట్టడానికి వీల్లేదు....అండర్ స్టాండ్...." భార్గవి ఒక సమస్యగా తలెత్తుతుందని ఊహించని జె.ఎమ్.రావు చకచకా ఆలోచిస్తున్నాడు.
"లేదు.....పరిస్థితి చేజారిపోయింది.....స్టూడెంట్స్ హోటల్లోకి వచ్చేసా...." ఏదో చెప్పబోతున్న భుజంగపతి-
ధన్ మని డోర్ చప్పుడు కావడంతో తల తిప్పి చూసాడు.
జ్వాలాముఖిరావుకు తల తిరిగినంత పనయింది. విదేశీ ప్రతినిధులు డోర్ వేపు ఆశ్చర్యంగా చూసారు.
డోర్ దగ్గర రెండు చేతుల్లో భార్గవి శవంతో నిలబడిన మయూష__ఎన్నోసార్లు పేపర్స్ లో ఫోటోల్లో కన్పించిన జ్వాలాముఖిరావు వేపు తీక్షణంగా చూస్తూ, నెమ్మది, నెమ్మదిగా ముందుకు నడుస్తోంది.
"ఏయ్....హూ ఆర్యూ....వాటీజ్ దిస్....." ఏదో అనబోయాడు జ్వాలాముఖిరావు దగ్గరకు నడిచి-
తన పిడికెట్లో వున్న భార్గవి రాశిన ఉత్తరాన్ని ఆయనకు చూపిస్తూ...
"మిస్టర్ జ్వాలాముఖిరావు....మీ కామానికి ఈ భార్గవి బలైపోయింది. మీరు చూపిన ఆశల ఊబిలో కూరుకుపోయిన ఈ అమ్మాయి బతుకు నాశనమైపోయింది. అందుకు సాక్ష్యం ఈ ఉత్తరం పెళ్ళి చేసుకుంటానని ఈ అమ్మాయితో సంబంధం ఏర్పరచుకుని నిలువునా మోసం చేసారు."
అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న మయూష మాటలకు అడ్డం వచ్చాడు జ్వాలాముఖిరావు.
"ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఏం మాట్లాడుతున్నావో తెలుసా? ఒక కాలేజీ స్టూడెంట్ తో నాకు సంబంధం ఉండడమేమిటి.....నాన్సెన్స్.....గెటవుట్ ఫ్రమ్ హియర్....సెక్యూరిటీ...." గట్టిగా అరిచాడాయన.
"మిస్టర్ జె.ఎమ్.రావ్....నువ్వు మమ్మల్ని నువ్వంటే మేం మిమ్మల్ని నువ్వని కూడా అనగలం .....మైండిట్....నీకు భార్గవి తెలీదా" సూటిగా, ఆగ్రహంగా ప్రశ్నిస్తూన్న మయూష వేపు అసహనంగా చూసారు జ్వాలాముఖిరావు.
"నన్నెవరూ ఇంతవరకు సాహసించి ఏక వచన ప్రయోగం చేయలేదు. నీకు నా స్టేటస్, పలుకుబడి తెలీక ఆ ప్రయోగం చేశావు దానికి ఫలితం అనుభవించి తీరతావు. నీతోటే జీవితాంతం మీరు అనేలా చేసుకోగల సత్తా ఉన్నవాడు ఈ జెమ్" ఆగ్రహావేశాలతో ఊగిపోతూ అన్నాడు జె.ఎమ్.
"చూడమ్మా....మీ స్టూడెంట్స్ కి ఏం కావాలి.....రా.....నేన్చెప్తాను మనం మాట్లాడుకుందాం ....రా..." భుజంగపతి, చనువుగా మయూష చెయ్యి పట్టుకుని పక్కకు తీసికెళ్ళబోయాడు.
తలెత్తి అతని ముఖంలోకి ఒకె ఒక్క క్షణం చూసి కుడిచెయ్యి ఎత్తి ఫట్ మని అతని చెంప మీద ఒక్కటి కొట్టింది మయూష.
"బీ హేవ్ యువర్ సెల్ఫ్...." అని జె.ఎమ్.రావు వేపు చూస్తూ.....
"నువ్వు భార్గవికి చేసిన అన్యాయాన్ని ఇక్కడే ఈ క్షణమే వప్పుకోవాలి. అందుకు నష్టపరిహారం చెల్లించడంతోపాటు భార్గవి కుటుంబంలోని వ్యక్తుల్ని యావజ్జీవితం పోషిస్తానని మాటివ్వాలి.....ఇదీ మా స్టూడెంట్స్ డిమాండ్."
రుద్రమదేవిలా రెచ్చిపోతూన్న మయూష వేపు నివ్వెరపోయి చూస్తున్నారు విదేశీ ప్రతినిధులు.
జ్వాలాముఖిరావు ముఖం కందగడ్డలా అయిపోయింది.
వెయ్యికోట్ల అధిపతి జ్వాలాముఖిరావుకు ఎప్పుడూ ఏ సందర్భం లోనూ ఆ పరిస్థితి ఎదురవలేదు. ఎలాంటి పెద్ద సమస్య కూడా తన దగ్గరకు రాలేదు.
ఆఫ్ట్రాల్....లిటిల్ ప్రాబ్లెమ్! అలాంటి ప్రాబ్లమ్ వస్తుందని అతనూహించలేదు.
"దిసీజ్ ఏన్ ఇంపార్టెంట్ మీటింగ్.....గెస్ట్ హవుస్ కు రండి.....మీ ప్రాబ్లమ్ ను సాల్వ్ చేస్తాను" అన్నాడాయన కావాలనే తగ్గిపోతూ.
"దిసీజ్ నాట్ అవర్ ప్రాబ్లమ్ మిస్టర్ జ్వాలాముఖిరావ్......దిసీజ్ హండ్రెడ్ పర్సెంట్ యువర్ ప్రాబ్లమ్.....మేం మీ గెస్ట్ హవుస్ కు రావడానికి మేం మీ ఎంప్లాయిస్ కాము....." స్టూడెంట్ లీడర్ బదులిచ్చాడు.
అలా మాటకు మాట బదులిచ్చే వాళ్ళను మరొక సమయంలో అయితే రైపిల్ తీసి కాల్చిపడేసేవాడే.
"డోన్ట్ టాక్ రబ్బీష్.....సాయంత్రం నువ్వు నా గెస్ట్ హవుస్ కు రా.....జరిగిందేమిటో అక్కడ చెప్తాను" సాధ్యమైనంత నెమ్మదిగా మయూషతో అన్నాడు జ్వాలాముఖిరావు.
తలెత్తి సూటిగా అతని కళ్ళవేపు చూసింది మయూష.
"ఏం.....నన్ను మరో భార్గావిలా చేద్దామనా?" మయూష అలా ప్రస్నిస్తుందని ఊహించని జ్వాలాముఖిరావు నరాల్లో రక్తం ఉవ్వెత్తున సరసరమని ప్రవహించింది.
విసురుగా అతని కుడిచేయి పైకి లేచింది - క్షణకాలంలో తనని తాను నిగ్రహించుకుని.....
"కమాన్.....ఐ విల్ డిసైడ్ నౌ ఇట్ సెల్ఫ్...." అంటూ ఆ ఏ సీ రూమ్ కు ఆనుకొని ఉన్న చాంబర్ లోకి నడిచాడు.
మయూష ముందుకు అడుగువేసింది.
ఆమెను అనుసరించబోయిన స్టూడెంట్స్ ను అక్కడే ఆగమన్నట్లుగా సంజ్ఞ చేసిందామె.
చాంబర్ లోకి వెళ్ళిన జ్వాలాముఖిరావు గబగబా అక్కడున్న తన బ్రీఫ్ కేస్ ను తెరచి....చేతికందిన కరెన్సీ కట్టల్ని టేబుల్ మీదకు విసిరాడు నిర్లక్ష్యంగా.
"ఇందుకే గదా నువ్వొచ్చింది.....బ్లాక్ మెయిల్ ఐ నో దట్....ఎంత కావాలో తీసుకోండి..... టేక్ దిస్ ఎమౌంట్.... గెట్ ఎవే ఫ్రమ్ హియర్" అసహనంగా అన్నాడు జ్వాలాముఖిరావు.
ఆ డబ్బు వేపు చిరాగ్గా చూసింది మయూష.
"మీరిచ్చే డబ్బుకు లొంగిపోవడానికి మేం మీ ఫ్యాక్టరీ లీడర్లము కాము."
మయూష స్వరం తీవ్రంగా వుంది.