Previous Page Next Page 
గోడచాటు ముద్దు పేజి 10

  

    జ్వాలాముఖిరావుకు ఫోన్ చేసి కమీషనర్ కు అనుబంధం ఈనాటిది కాదు జ్వాలాముఖిరావు ఎలాంటివాడో కమీషనర్ కు బాగా తెలుసు. కానీ డబ్బు పాలిటికల్ పవర్.
   
    అలాంటి పరిస్థితుల్లోనూ చాలాసార్లు రాజీపడ్డాడు కమీషనర్. కానీ ఏ ఒక్కరూ మయూషళా హెచ్చరించలేదు, చీత్కరించి వెళ్ళిపోలేదు.
   
    ఒక్కొక్కప్పుడు దెబ్బకన్నా మాట పదునైనది.
   
    అందుకే అతను తన సీట్లోంచి చాలా సేపటివరకూ కదలలేక పోయాడు.
   
    భార్గవి కోరిక తను తీర్చలేని పరిస్థితులేర్పడినందుకు.
   
    ఆ రోజు చాలా బాధపడింది మయూష. మయూషకు ఆ రోజు రాత్రి చాలా సేపటివరకూ నిద్రపట్టలేదు.
   
                                                                         *    *    *    *
   
    సరిగ్గా అదే సమయంలో-
   
    దిల్ షుక్ నగర్ లోని గెస్ట్ హౌస్ లో జ్వాలాముఖీరావు తన ఫ్రెండ్స్ తో మందు పార్టీలో వున్నాడు.
   
    అందరూ వెళ్ళిపోయాక జ్వాలాముఖిరావు. భుజంగపతి ఇద్దరే కూర్చుని తీరుబడిగా తాగుతున్నారు.
   
    "ఏంటి బావా! ఏంటిదంతా__నేను సరిగ్గా టైమ్ కి బ్రెయిన్ ఉపయోగించి ఆ నర్సింగ్ హోమ్ డాక్టర్ని ఆ డాక్టర్ ద్వారా ఆ భార్గవి పేరెంట్స్ ని కమీషనర్ని మేనేజ్ చెయ్యబట్టి సరిపోయింది. భార్గవి విషయం నా కసలు చెప్పలేదేమిటి?" అడిగాడు భుజంగపతి.
   
    "నీకు చెప్తేనేగానీ నేనేపని చెయ్యకూడదా?" చికాగ్గా అడిగాడు జె.ఎమ్.
   
    "అది కాదనుకో మాటవరుస కన్నాను వాళ్ళందరూ నా మాట ఎందుకు విన్నారంటావ్? నీ డబ్బుచూసే అసలు నా పాయింట్ ఏంటంటే...."
   
    "నువ్వసలేం చేశావ్__ఇవాళ పేపర్లు చూసావా? అన్ని పేపర్లూ భార్గవి ఆత్మహత్యకూ నాకూ లింక్ పెడుతూ అనుమానాన్ని వ్యక్తం చేస్తూ న్యూస్ ఐటెమ్స్ రాసాయి. కమీషనర్ మీద కూడా సందేహపడ్డాయి పత్రికలు.
   
    "రాసుకోనీ బావా! ఏవైందీ.....పెద్దమనిషన్నాక మంచికో, చెడ్డకో పేపర్ న్యూసుల్లా వుండాలి. కేసు లేకుండా పోలీసులు కొట్టేసాక న్యూస్ లేం చేస్తాయ్?"
   
    కాసేపు ఏం మాట్లాడలేదు జ్వాలాముఖిరావు.
   
    "ఆ మయూష బేక్ గ్రౌండ్ కనుక్కోమన్నాను కనుక్కున్నావా?" సీరియస్ గా అడిగాడు జె. ఎమ్. రావు.
   
    "మిడిల్ క్లాస్ ఫామిలీ బావా.. తండ్రి పేరు పీతాంబరం. సెక్రటేరియట్ లో సెక్షన్ హెడ్ అన్నయ్య పేరు శర్మ. ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. మయూష బ్రిలియంట్ గర్ల్. ఎక్కడా, ఏ విధమైన రిమార్కూ లేదు. చాలా యాక్టివ్" చెప్పాడు భుజంగపతి.
   
    "చాలా యాక్టివని తెలుస్తూనే వుందికదా" వేళాకోళంగా అన్నాడు జ్వాలాముఖిరావు.
   
    "ట్వంటీ ఫోర్ అవర్స్ లో, నిండా ట్వంటీఫోర్ ఇయర్స్ లేని ఆ పిల్ల నన్ను ఇరుకున పెట్టింది. ఆమె కారణంగా ఫారిన్ డెలిగేట్స్ మీటింగ్ కాన్సిలైంది. వాళ్ళ దృష్టిలో కేరక్టర్ లెస్ మెన్ ని అయ్యాను. ఆఖరికి పోలీస్ కమీషనర్ కూడా నన్ను పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసాడు. దీనికంతటికీ కారణం ఎవరు?" గంభీరంగా అడిగాడు జ్వాలాముఖిరావు.
   
    "ఇంకెవరు మయూష"
   
    "నా జోలికి వచ్చిన వాళ్ళను నేనేం చేస్తానో నీకు తెలుసుకదూ" నెమ్మదిగా పెగ్ ను సిప్ చేస్తూ అన్నాడు జ్వాలాముఖిరావు.
   
    "అంటే మయూష మీద కక్ష తీర్చుకుంటావా! పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమన్నమాట. అయితే ఏం చేస్తావ్?"
   
    ఒకింతసేపు జ్వాలాముఖిరావు ఏం మాట్లాడలేదు.
   
    "నేను చెప్పింది చెప్పినట్టుగా చెయ్యి. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడు"
   
    "ఏం చెయ్యాలి?" ఆసక్తిగా అడిగాడు భుజంగపతి.
   
    నెమ్మదిగా చెప్పడం ప్రారంభించాడు జ్వాలాముఖిరావు.
   
    అంతా విన్నాక అడిగాడు భుజంగపతి.
   
    "దీనివల్ల ఏం జరుగుతుంది? ఆ అమ్మాయి ఏ విధంగా సీన్లోకి వస్తుంది?"
   
    "మాట్లాడకుండా నేను చెప్పింది చెయ్యి నీకు మూడ్రోజులు గడువిస్తున్నాను" అని నెమ్మదిగా లేచి తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు జ్వాలాముఖిరావు ఆయన ఎప్పుడు ఎందుకు ఏం చేస్తాడో మరోసారి అర్ధంకాని భుజంగాపతి చేతిలోని గ్లాస్ తో అతనివేపు అయోమయంగా చూస్తుండిపోయాడు.
   
                                          *    *    *    *

    కిచెన్ రూమ్ లో వదిన మాలతి మాటల్తో మెలకువ వచ్చిన మయూష గోడగడియారంవేపు చూసింది.
   
    ఎనిమిదీ పదిహేను నిముషాలు.
   
    గబగబా లేచి డాబా మీదకు పరుగెత్తింది మయూష.
   
    పక్కింటి పెరట్లో ఎవరూ లేరు ఎక్కడినుంచో రేడియోలో పాటలు మాత్రం విన్పిస్తున్నాయి.
   
    పిట్టగోడవరకూ వెళ్ళి ఆసక్తిగా అటువేపు చూస్తున్న మయూషకు ఈసారి ఆ యువతికి బదులుగా ఆ యువతి భర్త బాత్రూమ్ లోకి నీళ్ళ బకెట్ ను తీసుకెళుతూ కనబడ్డాడు.
   
    అతని వీపు పచ్చగా పనసపండులా మెరుస్తోంది.
   
    రోజూ ఆమె బాత్ రూమ్ దగ్గరకు వెళితే అతనొచ్చేవాడు. ఇవాళ అతని దగ్గరకు ఆమె వస్తుందా?
   
    ఆ ఆలోచన మయూషకు చాలా ఎగ్జయిటింగ్ గా ఉంది. భర్త కోరికగా వచ్చినప్పుడు భార్య కూడా కోరికగా రావాలి గదా! సృష్టి ధర్మం, వాంఛా ధర్మం.
   
    కళ్ళప్పగించి చూస్తోంది మయూష.
   
    రెండు నిముషాలు గడిచాయి.
   
    "గాయత్రీ.....గాయత్రీ" అతను కేక వేసాడు.
   
    "ఏంటండీ? ఎందుకూ?" లోపలినుంచి సన్నటి గొంతుతో సమాధానం.
   
    "టవల్ తెచ్చుకోవటం మర్చిపోయాను" మళ్ళీ అరిచాడతను.
   
    "అబ్బబ్బా__చారు మరిగిపోతుందండీ అని ప్రేమగా విసుక్కుంటూ జవాబు ఆ వెనుకనే టవల్తో బయటికొచ్చిన గాయత్రి టవల్ ని బాత్ రూమ్ గోడమీద వేసేసి-
   
    "గోడమీద పెట్టాను తీసుకోండి" అని అంది.
   
    "ఏయ్__నిన్నే.....ఒకసారి ఇలారా" స్వరం తగ్గించి అన్నాడతను.
   
    "ఎందుకూ?" ఆమె కూడా గొంతును తగ్గించింది ఆడపిల్ల గొంతు తగ్గించి మాట్లాడుతున్నప్పుడు అందంగా వుంటుంది. అందులోనూ పెళ్ళయిన యువతులు మరీ అందంగా వుంటారు ఈ విషయం భర్తలకు మాత్రమే తెలుస్తుంది!
   
    అతను బాత్ రూమ్ తలుపును నెమ్మదిగా తెరిచాడు. బాత్ రూమ్ పైన రూఫ్ ఏమీలేకపోవడం వల్ల ఆ యువకుడు సగభాగం మాత్రమే కన్పిస్తున్నాడు.
   
    "దేవి.....కం.....డీ....అత్త....గారు" నెమ్మదిగా డోర్ దగ్గరకు వెళ్ళింది గాయత్రి.
   
    "మీ అత్తగారు పూజ చేసుకుంటున్నారని నాకు తెల్సుగానీ పిచ్చి మొద్దూ ఒక్కసారి లోనికొచ్చేసి గబుక్కున ముద్దు ఇచ్చేసి వెళ్ళిపో.....ఒక పనైపోతుంది" అన్నాడతను తమకంగా.
   
    "అబ్బా.... ఆశ అయినా ఈ బాత్రూమ్ భాగోతమేమిటి?" అంటూ నెమ్మదిగా తలుపు తెరచుకుని లోనికెళ్ళిన గాయత్రి భర్త నిజస్వరూపాన్ని చూసి సిగ్గుపడిపోయి తలవంచుకుంది.

 Previous Page Next Page