"యుగ యుగాల బట్టి ఎన్నో కధలు విన్నవాన్ని...ప్రత్యక్షంగా చూసినవాణ్ణి పెద్దవాన్ననుకోండి, చాదస్తం అనుకోండి. ఒక్క సలహా యిద్దామని నాకైతే ఉందిగాని మీకైతే కోపం వస్తుందేమోనని మా చెడ్డ అనుమానంగ ఉంది." అంటూ అక్కడితో ఆగాడు నారదుడు.
"ఒక కార్యసాధన నిమిత్తం బయల్దేరిన వాళ్ళం. కోపగించుకుంటే పనులెలా అవుతాయ్? చెప్పండి స్వామీ! మీరు చెప్పింది వినటానికి మాకు కష్టంగా వున్నాసరే. వింటాం. విన్నంతలొ పోయేదేమీ లేదు కదా?" వినయంగా అంది లీడర్ లీలారాణి.
"మీరు ముందుగ జగన్మాతలైన లక్ష్మి...సరస్వతి...పార్వతీ దేవీలదగ్గరికే వెళ్ళండి ఏ కారణం చేతనైనా అక్కడ మీ కోర్కెలు నెరవేరకపోతే బ్రహ్మ విష్ణు మహేశ్వరులనుకూడా సందర్శించి చూడండి. అవతల వాళ్ళు మగవాళ్ళయ్యేది ....ఆడవాళ్ళయ్యేది...అది మీకు అనవసరం. మీ కోర్కె నెరవేరటం ఒక్కటే ధ్యేయంగా పెట్టుకోవాలి 'ఏ రాయి అయితేనేం పళ్ళూడగొట్టుకోడానికి' అన్న సామెతలాగా మీ ధ్యేయం నెరవేరడానికి ఏ దేముడైతేనేం మీకు వరాలిచ్చే దేముడు కావాలి అంతేకదా" అంటూ చల్ల చల్లగా శలవిచ్చాడు నారదమహర్షి
ఆ మాటలకి ఆడవాళ్ళందరికి కాస్త కోపం వచ్చింది గాని 'ఏ పుట్టలో ఏముందో' అన్న సామెత గుర్తుకు రాగా కోపాన్ని దిగమింగుకొన్నారు.
"మీరు పెద్దవారు....అనుభవజ్ఞులు...మా శ్రేయస్సుకోరి మీరు చెప్పారు కాబట్టి మా పని కానప్పుడు కాస్త ఆలోచిస్తాం" గంభీర్యంగా అంది లీడర్ లీలారాణి.
"నన్ను అర్ధం చేసుకొన్నారు. అంతేచాలు తల్లులార!" పైకి వినయంగా అని లోలోపల "అమ్మయ్య! చిన్న పాచిక వేశాను" అనుకున్నాడు నారదుడు.
"మా ప్రయాణంలో ముందుగా ఎదురయింది మీరు. మా కోర్కెలు తీరేలా మేము వెళ్ళేపని నెరవేరేలా దీవించండి స్వామీ!" అంది లీడర్ లీలారాణి.
అందరూ పెద్ద పెట్టున "దీవించాలి! దీవించాలి" అంటూ అరిచారు.
"తథాస్తు" నారదులవారు అన్నారు.
ఉప్పొంగే ఉత్సాహంతో "నారద మునీంద్రులవారికి నా రెడ్ శాల్యూట్" అంది అరుణేందిర.
ఆ తరువాత-
అందరూ కలసి నారద మహర్షివద్ద శలవు తీసుకొని "సాధించాలి....సాధించాలి. సమాన హక్కులు సాధించాలి. తర తరాలుగా మారని తరుణల బాధలు మారాలి. మగాడి రూపులు, షేపులు మారాలి.
"మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి" అని సినిమా పాట బాణీలొ పాటని కట్టి పాడుతూ ముందుకు సాగారు.
'అమ్మయ్య! నాకో కొత్త కథ దొరికింది. ఇంకా కావాల్సినంత కాలక్షేపం. ఓ కంట వీళ్ళని గమనిస్తూ ఉంటాము' అనుకున్న నారదుడు ఆనందంతో తుంబుర మీటుతూ నారాయణ....నారాయణ....అంటూ నామ కీర్తన చేస్తూ మరో పక్కకి పయనమయ్యాడు.
* * * *
ముందుగా
అందరూ కలసి లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళారు.
కొన్ని యుగాలక్రితం ఐతే లక్ష్మీదేవి ఒక్కతే అన్ని పనులు చక్కబెట్టుకొనేది. ఎప్పుడు ఎవరి దగ్గర వుండాలి..ఎంతవరకు వుండాలి...ఏ విధంగా ఉండాలి....అన్నీ ఆమె చూసుకునేది.
ఇప్పుడు అలాకాదు.
భారతదేశం జనాభా లెక్కలేనంతగా పెరిగిపోయింది. పైగా అప్పుల రూపేణా రుబాలు, బాకీలు, ఎగుమతులు-దిగుమతులు...దీని వల్ల దేశ దేశాల్లోనూ మన ధనానికికూడా కాళ్ళొచ్చినట్టు అటూ ఇటూ నడవటం బంగారం ఇతర దేశాలకి తరలిపోవడం స్విస్ బ్యాంక్ లు... ఇలాంటివెన్నో ఏర్పడటంవల్ల అన్ని పనులు తానొక్కతే చక్కబెట్టుకొలేక చేతికింద బోలెడుమంది అసిస్టెంట్లని పెట్టుకుంది.
లక్ష్మీదేవి మైండ్ కాస్త ప్రశాంతతగా ఉండటానికి ఆమె దగ్గరున్న అసిస్టెంట్లే కంప్యూటర్ తో లెక్కలు వేస్తూ ఎవరి దగ్గర ఎంత ధనం చేరాలి....ఎవరి దగ్గరనుంచి ఎంత ధనం పోవాలి....టక టకా లెక్కలు వేస్తున్నారు. మరి కొందరయితే టైప్ మిషనులు టక టకలాడిస్తున్నారు. ఫోన్ల విషయానికొస్తే అదేపనిగ ఫోను విడిచి ఫోను మోగుతూనే ఉంది.
కరిమింగిన వెలగపండులోని గుజ్జు ఎలా మాయమౌతుందో? కొబ్బరికాయలోకి నీళ్ళు ఎలా వచ్చి చేరతాయో? ఎవరికీ తెలియదు కాని అక్కడి వాళ్ళకి మాత్రం బాగానే తెలుసు. కరి మింగి వదిలి పెట్టిన వెలగపండని, నీళ్ళు చేరిన కొబ్బరికాయని అటూ ఇటూ మారుస్తున్నారు కొందరు.
ఒక కాగితంమీద పూర్తి బయోడేటా రాసి ఉంది. దాని మీద ఉన్న నీళ్ళు నిండిన కొబ్బరికాయని పెడుతూంటే గుజ్జులేని వెలగపండుని ఇలా మరో పేరున్న కాగితం మీద మారుస్తూ అదో బిజినెస్ లా యమ బిజీగా చేస్తున్నారు మరికొందరు.
అక్కడ అందరు ఎంత బిజీగా ఉన్నారంటే ఏదన్నా ప్రశ్న అడిగితే పూర్తి జవాబివ్వకుండా వీలైనంత తక్కువ ఊ....ఆ...లతో సరిపెడుతూ వంచిన తలెత్తకుండా వాళ్ళపని వాళ్ళు చేసుకుపోతున్నారు.
అక్కడ పనిచేస్తున్న అందరూకూడ రక రకాల వయసుల్లో వున్న ఆడవాళ్లే.
ఒక్కసారిగా ఆ లోకంలో అంతమంది ఆడవాళ్ళని చూసేసరికి భూలోకంనించి వచ్చిన మన ఆడవాళ్ళందరికి చాలా సంతోషం వేసింది.
ఆ సంతోషంతో తబ్బిబ్బవుతూ "నమస్కారమండి!" అందరూ కలిసి ఒక్కసారిగా అన్నారు.
"నమస్కారం" అన్నది ఎవరో తలతిప్పి చూసే టైమ్ కూడా లేని లక్ష్మీదేవి అసిస్టెంట్లు "ఊ" కొట్టి ఊరుకున్నారు.
మరోసారి గట్టిగా 'నమస్కార' మన్నారు అందరు. మళ్ళీకూడ ప్రతిస్పందన 'ఊ' అనే వచ్చింది.
ఇలా లాభం లేదనుకొన్న లీడర్ లీలారాణి "మేము అర్జంట్ గా మాట్లాడాలి భూలోకం నించి వచ్చాం శ్రీమతి శ్రీ మహాలక్ష్మి దేవిగారు ఎక్కడ ఉన్నారు? ఆమెని మేము అర్జంట్ గా కలుసుకోవాలి" అని ఒకామె భుజం పట్టుకొని కుదిపి మరీ అడిగింది.