Previous Page Next Page 
గాడ్స్ గిఫ్ట్ పేజి 10

    "గదిలో విశ్రాంతి తీసుకుంటున్నారు క్షణం క్రితమే లోపలికెళ్ళారు." అని ముక్తసరిగా చెప్పింది ఆమె.
   
    "మేము ఆమెని అర్జంట్ గా కలుసుకోవాలి. మాది ప్రాణంమీద కొచ్చిన సమస్య" తెలివిగా బొంకింది లీడర్ లీలారాణి.
   
    అక్కడ కూర్చున్నామె తప్పనిసరై తలతిప్పి చూసింది బోలెడు మంది ఆడవాళ్ళు కనిపించారు. ఇప్పుడు ఈ ఆడవాళ్ళందరిని లెక్కబెడుతూ కూర్చుంటే ఇక్కడ తన లెక్కలు తేలవని తెలుసుకుని "వెళ్ళి అక్కడున్న రెడ్ బటన్ నొక్కింది. తలుపులు తెరుచుకుంటే మీరు లోపలి వెళ్ళొచ్చు, లేదంటే పడిగాపులు కాస్తూ ఇక్కడే కూర్చోండి. నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకండి." అని చెప్పేసి తింగి తన పనిలో పడిపోయింది.
   
    ఆమె ఒక్క నిమిషం మాట్లాడినందుకే ఒక ఘోరం జరిగిపోయింది. గుజ్జులేని వెలగపండుని ఉంచాల్సిన బయోడేటామీద నిండా నీళ్ళున్న కొబ్బరి కాయని పెట్టింది కొబ్బరి కాయని ఉంచాల్సిన బయోడేటా మీద గుజ్జులేని వేలగ్పందుని పెట్టింది. ఈ ఒక్క చిన్న తప్పిదం వల్ల అక్కడ భూలోకంలో చిన్న రేకుల షెడ్డున్న ఒక చిన్న గుమాస్తా గాడిని వకేసారిగ నాలుగువేపులా అప్పుల వాళ్ళు చుట్టుముట్టి నెత్తిమీద మొట్టి ఉన్న ఆస్తినంతా ఊడ పీక్కోడం కాక ఆరేకుల్ని కూడా ఎత్తుకుపోయారు.
   
    కాస్తోకూస్తో డబ్బుండి రెండు చేతులతో మరికాస్త సంపాదించుకొంటున్న ఒకామె బయోడేటా మీద నిండు నీళ్ళున్న కొబ్బరి కాయని పెట్టడం వల్ల అకస్మాత్తుగా ఓ చుట్టం చస్తూ ఆస్థి ఇవ్వటం....లాటరీలో లక్షరూఅపాయలు రావటం....గోల్డు బిస్కెట్లున్న పెట్టె దొరకటం__పలు దార్లగుండ వకేసారి డబ్బు లొచ్చిచేరాయి.
   
    లేని వాడికి ఊడ్చుకుపోయింది. ఉన్న వాళ్ళకి ఉరుక్కుంటు వచ్చింది లక్ష్మీదేవి.
   
    లీడర్ లీలారాణి తానే ముందుగ వెళ్ళి అక్కడ రంగు రంగుల బటన్స్ ఉంటే వాటిని వేటినీ ముట్టుకోకుండ ఎర్రబటన్ ని నొక్కింది.
   
    శ్రీ మహాలక్ష్మీ విశ్రాంతి తీసుకుంటున్న గది తలుపులు ఆటో మేటిగ్గా తెరుచుకున్నాయ్. లీడర్ లీలారాణితో సహా అందరు గదిలో చొరబడ్డారు.
   
    ఒక్కొక్కళ్ళు ఒక్కో పేరుతో శ్రీమహాలక్ష్మిని పొగుడుతు నమస్కారం పెట్టాడు.
   
    శ్రీదేవి నమస్కారమమ్మా! "అని ఒకామె అంటే "సిరిగల మహాలక్ష్మి నమస్కారమమ్మా!" అంది మరో ఇల్లాలు.
   
    "శ్రీమతి లక్ష్మీదేవికి ఇదే నా నమస్సుమాంజలులు." అంది వేరొక ఆమె.
   
    ఈ విధంగ తలోరకంగ శ్రీమహాలక్ష్మిని పొగుడుతు నమస్కారం చేస్తూంటే ఆమె బద్దకంగ లేచి కూర్చుంది. అప్పటికే లక్ష్మీదేవి వోకునుకు తీసినట్టుంది. కళ్ళు పూర్తిగ తెరవలేదు. "భారతదేశంలొ దిక్కుమాలిన రాజకీయాలు ఎక్కువైపోయావ్ పట్టుమని పదిరోజులు తిరక్క ముందే ఎన్నికల గోలాకటి దీంతో నాపని అటూ ఇటూ పరిగెత్తడంలా ఉంది. క్షణం విశ్రాంతి లేదు" అంటూ పూర్తిగ కళ్ళు తెరిచిన లక్ష్మీదేవి ఎదురుగా ఉన్న అంతమంది ఆడవాళ్ళని చూసి నిర్ఘాంత పోయింది.
   
    "ఏమిటి ఒక్కసారిగ ఇంతమంది బయల్దేరి వచ్చారు?" ఆశ్చర్యంగ అడిగింది లక్ష్మీదేవి.
   
    మాగోడు వినిపించుకుందామని." ముక్తకంఠంతో శెలవిచ్చారు" అంతా.
   
    "ఆర్ధిక ఇబ్బందులా! అవి ఆడవాళ్ళొక్కళ్ళకే కాదే ఆడ మగ ఇద్దరికీ వస్తాయ్" అంది లక్ష్మీదేవి. అప్పటికే ఆమె చలా అలసిపోయినట్టుంది ఎక్కడా హుషారుగ మాట్లాడటంలేదు. మొహం చిట్లించి మరీ అడిగింది.
   
    "ఆర్ధిక ఇబ్బందులు కాదు. అతివల ఇబ్బందులు మీరు మాగోడు వినిపించుకోవాలి., "తప్పదు" మొండిగ అన్నారు కొందరు.
   
    "ఎవరు నా దగ్గర కొచ్చినా-ఎవరు నన్ను ప్రార్ధించినా...ధన సహాయానికే వారి వారి ఖర్మలను బట్టి నేను అటు ఇటు మారుతూండాను అంతే గాని నాకై నేడు మీకు వో బంగారు గనిని సృష్టించి ఇవ్వలేదు." మొహమాటం లేకుండ ఖచ్చితంగ చెప్పేసింది శ్రేమహాలక్ష్మి.
   
    "మాక్కావల్సింది ధనం కాదు. సిరిసంపదలు కాదు ఒక పెద్ద సమస్య సమస్యఏమిటో విని మాకోరికలు తీరిస్తేచాలు.
   
    ఆర్ధిక సహాయానికి అడుక్కోవటానికి రాలేదు కాబట్టి శ్రీమహాలక్ష్మి సంతోషించింది. ప్రార్ధిస్తే కరిగిపోయే తత్వంకాదు ఆమెది. గట్టి వాళ్ళ దగ్గరే పదికాలాలపాటు వుండటానికి ఇష్టపడే తత్వం ఆమెది. పిసినారులంటే మహా యిష్టం. అప్పటికి బుద్ది చంచలం కావటం వల్ల కాస్త చిరాకు కలగంగానే వున్నచోటునుంచి లేచి మరోచోటుకి పోతూ వుంటుంది. ఇనపగజ్జెల తల్లి ఇంటిలో ప్రవేశిస్తేచాలు బి.పి. పెరిగిపోయి దొడ్డిదోవన అదే పోత పోతుంది.
   
    ఆడవాళ్ళంటే చీరలు, నగలు, పూజలు, వ్రతాలు, ఐదోతనము భర్త, పిల్లలు-ఇంతకుమించి మరీ గట్టి కోరికలు వున్నా దాఖలాలు ఎక్కడా లేవు. ఇంకా వీళ్ళకు ఏమైనా సమస్యలున్నా వాళ్ళకు వాళ్ళే  వాళ్ళ కాళ్ళమీద నిలబడి ఈ మధ్యకాలంలో సాధించుకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన సమస్యలేమిటి? కావాల్సిన కోరికలు ఏమిటి?
   
    శ్రీమహాలక్ష్మికి అర్ధంకాలేదు 'తెలుసుకుంటే కాస్త కాలక్షేపం గాను, రిలీఫ్ గాను వుంటుంది' అనుకుంది. "ఐదే ఐదు నిముషాలు టైమిస్తున్నాను. మీ సమస్యలు, కోరికలు చెప్పండి" అంది.
   
    లీడర్ లీలారాణి ముందుకు వచ్చి గబగబ తమ సమస్యలు...కోర్కెలు అన్నీ చెప్పేసింది.
   
    "సృష్టికి ప్రతిసృష్టా! పైగా అపూర్వమయిన కొత్తరకం సృష్టి, అసలు సృష్టికి మూలకర్త బ్రహ్మదేవుడు. ఆయన దగ్గరకు పొండి. నా దగ్గరకొచ్చి లాభం ఏముంది? ఇంతకన్నా నేను చెప్పేదేమీ లేదు. మీ కోసం టైమ్ కేటాయించేది లేదు" అని చెప్పి ఆమె ఒక్కసారి గట్టిగా ఆవలించి మళ్ళీ నిద్రలోకి జారిపోయింది.
   
    మొహమాటమనేది బొత్తిగా లేనివాళ్ళల్లో శ్రీమహాలక్ష్మి మొదటి కోవకు చెందుతుంది. డబ్బు తప్ప ఆవిడకు రెండో విషయం పట్టదు. 'కదిలి వచ్చింది ఆడవాళ్ళు కదా' అని ఆ మాత్రం ఆ మాటలయినా అంది.
   
    ఆడవాళ్ళంతా తెల్లబోయి ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. అంతేకాదు అక్కడ వుండీ లాభం లేదు అని కూడా తెలుసుకున్నారు.
   
    అందుకే అన్నారు కాబోలు పెద్దలు. "పెద్దింటి వాడిదగ్గర చేయి జాచేకన్నా ముష్టివాడి దగ్గర చెయ్యి జాస్తే వాడు అడుక్కొచ్చిన అన్నంలో ఓ ముద్దయినా పడేస్తా" డని.
   
    డబ్బు విషయం, లావాదేవీలు తప్ప మరేమీ తెలియని లక్ష్మీదేవి అవసరమైతే అడిగినవాళ్ళకి అవసరమైనంతవరకు అదికూడా ఆమెకు ఇష్టమైతేనే ధనసహాయం చేస్తుంది. కోర్కెలు తీర్చటం యెక్కడా లేదు.

 Previous Page Next Page