"ఎందుకు కుదరదు మా చక్కగా కుదురుతుంది. సృష్టికి ప్రతి సృష్టి విశ్వామిత్రుడు చేయలేదా! కందిపప్పుకి ప్రతిగా పెసర పప్పు మిరపకాయకి బదులుగా మిరియం, మినుములకి బదులుగా పెసలు...." నడిమింటి నాంచారమ్మ చేతులు తిప్పుతూ అంది.
"ఆ కాలం కధల్లో నిప్పులోంచో నీళ్ళలోంచో ఒకడు ప్రత్యక్షమై పాయసం యిస్తే పిల్లలు పుట్టలేదా! పంచదార నీళ్ళకి పరవాన్నంకి పిల్లలు పుట్టేటప్పుడు మేమందరం కలిసి పోరాడి మా కోరికలు తీరేలా విజయం సాధించలేమా! సాధించి తీరుతాం. గెలుపు మాదే. ఈ విజయం దిగ్విజయం" మహా రచయిత్రి మహాదేవి గర్జిస్తూ అంది.
అందరూ ఒక్కసారిగా జైజై ధ్వనులు చేశారు.
"తీరబోయే మా కోరికలకి, జరగబోయే విజయానికి యిదే నా రెడ్ స్యాల్యూట్!" అంది అరుణవర్ణం దుస్తులు ధరించిన అరుణేందిర పిడికిలి బిగించిన చేతిని గాలిలోకి లేపి.
"అంతిమ విజయం మాదే స్వామీ!" అంది లీడర్ లీలారాణి.
ఇంకా వాళ్ళతో ఏం మాట్లాడినా లాభం లేదని గ్రహించిన నారద మహర్షి ఓసారి కళ్ళు గట్టిగా మూసుకొని తంబురని 'టింగ్ టింగ్' మనిపించి లోలోపల 'నారాయణ.....నారాయణ' అనుకుని నెమ్మదిగా కళ్ళు తెరచి "మీ కోరిక లేమిటో ఇప్పుడర్ధమయ్యాయి తల్లులారా! ఈ సృష్టిలో చావు పుట్టుకలు తప్ప ప్రతిది ఎంతో కొంత సాధ్యమే. కాకపోతే సాధించాలన్న పట్టుదల, ఒక ధ్యేయం, కోరే కోర్కెల్లో న్యాయము, ధర్మము ఉండాలి. మీ మాటలను బట్టి మీ కోర్కెలు అంత అసాధ్యమైనవి కాకపోవచ్చు. దీనికి అదృష్టం కూడ తోడైతే విజయం మీకే తధ్యం" అన్నాడు.
నారద మహర్షి మాటలకి అందరూ సంతోషించారు.
"మీరు, ఆంజనేయస్వామి తప్ప మిగతా దేవుళ్ళందరు ఆడవాళ్ళని పెళ్ళాడి అంతో ఇంతో వాళ్ళని కష్టాల పాలు చేసినవాళ్ళే. విష్ణుమూర్తి మునీస్వరుడి చేత వక్షస్థలం మీద తన్నించుకొని లక్ష్మీదేవిని అవమానపరిచాడు. అందుకనే కదా పాపం ఆవిడ మహా బాధపడిపోయి ఆయన్ని వదిలి వెళ్ళిపోయింది." డాక్టర్ గారి భార్య అయిన అమృతవల్లి అంది.
"అంతెందుకు? పరమశివుడు ఏం చేశాడు? ఆయనకా ఇల్లూ వాకిలి లేవు. ఉన్న ఒక భార్య చాలక మరో భార్యని నెత్తిమీద పెట్టుకొన్నాడు ఇది ఆడదానికి అన్యాయం చేసినట్టు కాదా?" అలివేణి అంది అలివేణి భర్త మరో పెళ్ళి చేసుకోలేదు గాని ఒకదాన్ని వుంచుకున్నాడు. అదీ ఆమె కోపం.
అలివేణి కోడలు త్రివేణి అత్తగారు మాట్లాడుతూంటే 'కోడల్ని నేను మాత్రం తక్కువ తిన్నానా?' అన్నట్టు తనూ పెదవి కదిపి "బ్రహ్మదేవుడు మటుకు ఏం చేశాడు? సరస్వతికి అన్యాయం చెయ్యలేదా?" అంది సస్పెన్స్ కోసమా అన్నట్టు అక్కడితో ఆపి.
"బ్రహ్మ, సరస్వతీదేవికి అన్యాయం చేశాడా? ఎప్పుడు? ఎక్కడ? ఏమిటి?" కవయిత్రి కాంచనమాల ఆతృత పట్టలేక గబ గబా అడిగేసింది.
మహా రచయిత్రి మహాదేవికి అవకాశం చిక్కింది. "అందరి నుదుట రాతలు రాసేది బ్రహ్మదేవుడే కదా. ఒక్కగానొక్క కూతురు. ఆయన చేసిందేమిటి? కూతురి మొహాన విడో కమ్మని రాత రాశాడు. చేతిలో అంత పెద్ద పదవి పెట్టుకొని అలాటి రాతలు రాయటమా?సరస్వతీదేవికి కూతురు ఒక్కతే కదా? ఆ ఒక్క కూతురికి భర్త పోతే ఆమె మనస్సు ఎంత క్షోభించేను?" అంటూ కథ చెప్పేసింది.
"ప్రతి డానికి ఒక కారణం ఉందమ్మా!" అని అందామంటే ఈ ఆడవాళ్ళంతా కలిసి కయ్యిన మీదపడేట్టున్నారు. అసలు ఈ మధ్య తనకి ఏ పనీ లేక తోచకుండా పోయింది. వీళ్ళని కాస్త మంచి చేసుకుంటే కొత్త కధకి నాంది పలకడమో, అవసరమైతే తగాదాలు సృష్టించి ఆనందించడమో చెయ్యొచ్చు అని తలచిన నారదుడు చాలా శాంతం వహించి మోమున చిరునవ్వు పులుముకొని "మీ కోర్కెలు సమంజసమే. మీకు విజయం కలగాలని దీవిస్తున్నాను. మరి మీ కోర్కెలు తీర్చుకోటానికి ఇలా ఎక్కడికి వెళుతున్నారు? మీకు అభ్యంతరం లేకపోతే అదైనా చెప్పండి. నాకు తోచిన సలహా నేనిస్తాను." అన్నాడు.
ఆయన మాటలకి అతివలందరు ఆనందించారు.
"స్వామీ! ఇలాంటి కోర్కెలు నెరవేర్చమని వరాలు అడగటానికి దేవుళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులైన మగదేవుళ్ళు మా కోర్కెలను మన్నించకపోవచ్చు. కాబట్టి మా సాటిజాతి...సాటి మనిషి అయిన లక్ష్మీ సరస్వతీ పార్వతీలలో ఎవరో ఒకరి దగ్గరికెళ్ళి మా కోరికలు తీరేలా వరాలు కోరతాం. మేమిప్పుడు బయల్దేరింది వాళ్ళ దగ్గరకే స్వామీ!" అంటూ లీడర్ లీలారాణి ఆలు విషయం చెప్పేసింది.
"ఆడవాళ్ళు కోరితే తొందరగా వరాలిచ్చేది....కోరికలు తీర్చేది మగాళ్ళే తల్లులారా! ఆడవాళ్ళు ఆడవాళ్ళ కెప్పుడూ సహకరించరు..." అని అందామని నాలుక చివర దాకా నారద మునీంద్రుల వారికి మాట వచ్చింది గాని అక్కడున్న స్త్రీలంతా పురుష ద్వేషిణులే కావటం... మగపేరు ఎత్తితే మండిపడటం...అనుభవంలో తెలిసిన విషయం కాబట్టి ఆ మాటల్ని మింగేసి "మంచిది తల్లులారా! మీరు చెప్పింది నాకు న్యాయంగానే తోస్తోంది. కాబట్టి లక్ష్మీ, సరస్వతి, పార్వతి....వారి దర్శనానికే వెళ్ళండి. ఒకవేళ..."
నారదుడు నాన్చుతూ ఆగేసరికి లీడర్ లీలారాణి "మీకేదైనా అనుమానం వుంటే అడిగి తీర్చుకోండి స్వామీ! మేమేమీ అనుకోము." పరమ శాంతంగా అంది.
"నా నోరు వూర్కోదు తల్లీ! ఏదో ఒక సలహా ఇవ్వడం... నాలుగు చివాట్లు తింటం...యుగ యుగాలుగా జరుగుతున్న కధే. చివరికి సుఖాంతమైనా ముందు చివాట్లు తినేది నేనే!" నారద మునీంద్రుల వారు అంటూంటే లీడర్ లీలారాణి అడ్డు తగిలి "మీ సలహా మాక్కావాలి స్వామీ! చివాట్లు పెట్టమని మా అందరి తరపున నేను మాట ఇస్తున్నాను చెప్పండి స్వామీ!" అంది.
"లక్ష్మీ...సరస్వతి.... పార్వతి...ముగ్గురు తల్లుల దగ్గరికి మీరు వెళ్ళి మీ కోర్కెలు విన్నవించుకోండి. సమయం సరిగ్గా లేకనో, ఖర్మ కాలో మీ మాటలు వాళ్ళు వినరనుకోండి! అప్పుడు మీరు ఏం చేస్తారు?" భయపడుతూ భయపడుతూ నెమ్మదిగా అడిగాడు నారదుడు.
నారదుడు ఆ మాట అనేసరికి ఆడవాళ్ళకి కోపం రాలేదు. అందరికి ఒక్కసారిగా అనుమానం వచ్చింది. కిరు కిరులు చెయ్యటమే ఆయన పని కాబట్టి నారద మహర్షి వేసిన పాచిక బాగానే పారింది "మీరిక్కడే వుండండి స్వామీ....!" అని చెప్పి అందరూ అవతలకి వెళ్ళి గుస గుస లాడుకున్నారు. వాళ్ళల్లో వాళ్ళకి కాసేపు వాదోపవాదనలు జరిగాయి. చివరికి అందరూ కలిసి సలహాలవల్ల తప్పులేదని ఒక నిర్ణయానికి వచ్చారు. మళ్ళీ అందరూ కలిసి నారదుడి దగ్గర కొచ్చారు.
"ఆడ త్రిమూర్తులైన ఆ తల్లుల దగ్గరికి వెళ్ళటంవల్ల మా కోర్కెలు నెరవేరుతాయని మేము గట్టిగా విశ్వసిస్తున్నాము. పెద్దలు కీడెంచి మేలెంచమన్నారు. ఒకవేళ ఖర్మకాలి మా పని వాళ్ళ దగ్గర కాకపోతే ఏం చెయ్యమంటారు? సలహా యివ్వండి స్వామీ!" అందరి తరపున లీడర్ లీలారాణి అడిగింది.