"వక పని చేయగలిగినవారు రెండో పని చేయలేరా....?"
"మరీ అంత పోలికలతో..."
"కావచ్చు....కనపడని చేయి ఏదో చాలా గట్టిదే."
"అదే...అదే నా భయం....ఈ రావణ హస్తం ఎవరిది....? దాని చిరునామాఎక్కడ....?" కాస్త ఆవేశంగా అన్నాడు బన్సీలాల్.
"కంటికి కానవస్తే చూస్తూ వూరుకుంటానా లాల్ జీ! ఆరు రోజుల దాకా అన్న పానీయాలు లేకుండా చీకటి గదిలో కూలవేసే వాడిని ఆ తర్వాత ఏ కీలుకా కీలు విడదీసి ఆపై ఎగుడు దిగుడుగా అతికించేవాడిని." వికృతంగా నవ్వుతున్నాడు ఇన్ స్పెక్టర్.
"మీరు అంతటి మేధావులే. ఇప్పుడు నాకు కావాల్సింది ఇదంతా ఎవరు చేశారు అన్నది."
"వెయిట్ అండ్ సీ?"
"ఇది మీనమేషాలు లెక్కపెట్టే విషయం కాదు. నా పేరు చెపితే చాలు ఊరు వాడ గజగజ లాడుతుంది. అలాంటిది వాళ్ళెవరో అర్దరాత్రి వచ్చి నా కళ్ళలో దుమ్ముకొట్టి నే దాచిన కుర్ర నాయాల్ని నా చేతికింద వాడి చేత వాళ్ళంటి దాకా క్షేమంగా పంపించటం__ఇంత పెద్ద అవమానం నేను పుట్టి బుద్ది ఎదిగిన తరువాత యిదే మొదటిది" వాపోతూ అన్నాడు బన్సీలాల్.
"మీకు నాకు తప్ప మరో ప్రాణికి తెలియదు. ఇంక అవమానానికి తావెక్కడిది?" ఇన్ స్పెక్టర్ తేలిక భావంతో నాలుక చప్పరిస్తూ అన్నాడు."
"ఈ కథని నడిపిన చాటు మనుషుల సంగతి మర్చిపోతున్నారు."
"వాళ్ళెవరో మీకు తెలియదు కదా యింక అవమానము, అపార్ధము వగైరాలు వదిలేయండి వెయ్యి కళ్ళతో అటు నేను ఇటు మీరు విద్రోహులని కనిపెడుతూ వుందాము. వాళ్ళు కనపడ్డ మరుక్షణం హాం ఫట్ అనిపట్టేద్దాము."
"అందాకా చేతులు ముడుచుకు కూర్చుందామా?"
"తప్పదు లాల్ జీ....! కాలం ఖర్మం కలిసిరానప్పుడు కలుగులో ఎలుకలా బతక మన్నారు పెద్దలు."
"మా లాల్ వంశస్తుల రోషాలు పౌరుషాలు తెలిసి కూడా పిచ్చుక సలహాలు ఇస్తున్నారా ఇన్ స్పెక్టర్."
"ఇది పిచ్చి సలహాయో పిచ్చుక సలహాయో ప్రస్తుతం చేసేది ఏమీ లేదు కదా?"
"ఎందుకు లేదు వుంది. మీరు మంది మార్భలంతో వెళ్ళి ఆనందయ్య గాడి కుటుంబం మీద మీ అధికారంతో ఏదో వక కేసు బనాయించి అందరినికలిపి కొట్లోతోయండి" బన్సీలాల్ ఆవేశంగా పలికాడు.
"అది అన్ని వేళలా మంచి పద్దతి కాదు."
"మీకు చేతగాక పోతే చెప్పండి మా వాళ్ళని చాటుగా పంపి, వాళ్ళని సర్వ నాశనం చేస్తాను."
ఇన్ స్పెక్టర్ చిరునవ్వు నవ్వాడు.
"అది చూసి చిరచిర లాడాడు బన్సీలాల్."
అధికార దుర్వినియోగంతో వకడు వెధవ పనులు చేస్తుంటే ధన గర్వంతో వళ్ళు మదించి కళ్ళు మూసుకుపోయి మరొకడు వెధవన్నర పనులు చేస్తున్నాడు. వెధవ పనులు చేసే విషయంలో వకరికొకరు తలవగ్గక తప్పదు.
"లాల్ జీ! మీరు చాలా ఆవేశంలో వున్నారు."
"ఉన్నాను."
"ఆవేశంలో ఉన్నప్పుడు ఆలోచనలు సవ్యంగా సాగవు."
"నా బుర్ర పని చేస్తూనేవుంది."
"నిజమే కాపోతే కాస్త ఓవర్ గా చేస్తున్నది. అలా కోపంగా చూడకండి. నేచెప్పేది సావదానంగా విని ఆపై మీ నిర్ణయం చెప్పండి.....మీ ఇష్టమొచ్చినట్లు చేయండి. నేను అడ్డురాను. నాకు చేతయినంతలో హెల్ప్ కూడా చేస్తాను."
"చెప్పండి" ముఖం గంటుపెట్టుకునే అడిగాడు బన్సీలాల్.
ఇన్ స్పెక్టర్ ముఖం వికసించింది.
"లాల్ జీ! మీరు చెప్పిన ప్రకారం ఆనందయ్య అతి సామాన్యుడు....అలాంటివాడు పెద్ద పెద్ద పనులు చేయలేడు. మా కానిస్టేబుల్స్ లాంటివాళ్ళని తయారుచేసి వాళ్ళని మీ ఇంటికి పంపి ఇంత పెద్దనాటకం ఆడగలిగారంటే వాళ్ళు మంది మార్భలం కలవాళ్ళు, ధనం బాగా వున్నవాళ్ళు. డ్యూటీలో నా సమక్షంలో వున్న రాజు రమణలని కొట్టి మత్తుమందు యిచ్చి మా స్టేషన్ వెనకనే పడేశారంటే వాళ్ళెంత ఘటనాఘటన సమర్దులో ఆలోచించండి. విషయం బయటికి పొక్కకుండా చేయగలిగాను కాబట్టి సరిపోయింది. దీనిని బట్టి మీకేమనిపిస్తుంది?"
"నాకంతా పెద్ద ఇంద్రజాలంగా వుంది. మిగతా మీరే పూర్తి చేయండి."
"అంగ అర్ధ బలం వున్నా వాళ్ళు మాత్రమే ఇంతటి పనులు చేయగలరు. ఇది ఆనందయ్యపని కాదు....మిమ్మల్ని ఏడిపించటానికో అవమానం పాలు చేయటానికో ఇది కావాలని ఎవరో చేసిన పని. ముమ్మాటికీ యిది మీ శత్రువుల పని..."
"ఆలోచిస్తే నాకూ అలాగే తోస్తున్నది."
"తోస్తున్నది కదా, ఇంకా శత్రువులు ఎవరో ఆలోచించండి."
"నా కంటూ శత్రువులు ఎవరూ లేరు. ఎందుకంటే ఈ వూరే కాదు ఈ చుట్టుపక్కల గ్రామాలలో జనం అల్పులు...నా ముందు తల ఎత్తలేని అర్భకులు__ఠాగూర్ లు ఒక్కరే మిమ్మల్ని డీ కొనగలవాళ్ళు....వాళ్ళకీ మాకు ఎప్పుడూ పడదు."