Previous Page Next Page 
నీలికనుల నీడల్లో పేజి 10

    అర్ధమైంది కదా లాల్ జీ! ఇది వాళ్ళపని కావచ్చు. మీరు స్నేహంగా వుండటం మీ బలం పెరగటం చూసి సహించలేక మీకు తలనొప్పి కలిగించటానికి చేసిన పనియిది"
   
    "మీరు చెపుతుంటే చక్కగా అర్ధ మవుతున్నది. ఠాకూర్ల రోగం కుదర్చటానికి ఆనందయ్య గాడి సంసారాన్ని సర్వనాశం చేస్తే?"
   
    "పాముని చంపకుండా పాము కన్తని పూడిస్తే పనవుతుందా?"
   
    "అయితే ప్రస్తుతం నన్నేమి చేయమంటారు?"
   
    "ఆనందయ్య జోలికిపోతే వాళ్ళు నవ్వుకుంటారు. అందుకే మనం ఏమీ ఎరగనట్లు మిన్నకుందాం.... వెయ్యి కళ్ళతో మాత్రం అన్నింటిమీద నిఘావేసి వుందాము...ఏదో ఒకరోజు వాళ్ళ పాపం పండకపోదు అప్పుడు మనం ఒక ఆట ఆడించకపోము."
   
    "ప్రస్తుతం ఇలా చేయటమే మంచిదనిపిస్తున్నది. మీరు చెప్పినట్లే చేస్తాను" బన్సీలాల్ అన్నాడు.
   
    "రాజు, రమణలకి తెలివి వచ్చిన తర్వాత ఏం, జరిగిందో అడిగి తెలుసుకుంటాను" అన్నాడు ఇన్ స్పెక్టర్.
   
    ఆ తర్వాత అరగంటసేపు....
   
                                                   9
   
    "నిన్నుచాటుగాపిలిచి అడిగాడా?" రాజు తగ్గుస్వరంతో అడిగాడు.
   
    "వాడెవడు! యముడు. ఓ పట్టాన మనని నమ్మడు" రమణ నవ్వుతూ అన్నాడు.
   
    "మన ఇన్ స్పెక్టర్ ది తెడ్డుబుద్ది తెడ్డుపాదాలు. జిడ్డు ఆలోచన బంక మాటలు. ఎవరినెత్తిన టోపీ పెడదామా అని గోతికింద నక్కలా చూస్తుంటాడు. పెద్ద టోపీయే వేసింది శక్తిమాయి"
   
    "నిజమే" అంటూ నవ్వాడు రమణ.
   
    రాజు రమణ తగ్గు స్వరంతో జరిగింది మాట్లాడుకుంటున్నారు. జరిగింది ఏమిటో వాళ్ళిద్దరికీ బాగా తెలుసు. నోరు జారితే ఏం జరుగుతుందోకూడా వాళ్ళకి బాగా తెలుసు. నిజం బయట పడ్డ మరుక్షణం మెడమీద తలకాయ వుండదు. మొండెం నాలుగు రోడ్లకూడలిలోను తలకాయ డొంకలో వుండటం ఖాయం.
   
    జరిగింది ఇది సార్! మమ్మల్ని ఏం చేయమంటారు? అని ఇన్ స్పెక్టర్ ని అడుగుదామా అంటే ఈ ఇన్ స్పెక్టర్ ని అడుగుదామా అంటే ఈ ఇన్ స్పెక్టర్ కంటే జేబులు కొట్టేవాడు నయం. ఓ పక్క భయభక్తులు మరోపక్క ఎంతో కొంత మంచిబుద్ధి వున్నవాళ్ళు వీళ్ళిద్దరు. మంచివాళ్ళు మంచి స్నేహితులు.
   
    కనుకనే శక్తిమాయి పని జరగటానికి వీళ్ళని ఎన్నుకుంది.
   
    అసలు జరిగింది ఏమిటో శక్తిమాయికి పూర్తిగా తెలుసు.
   
    ఆవగింజలో అయిదో భాగంలో అణు మాత్రమే తెలుసు రాజురమణలకి.
   
    జరిగింది ఏమిటంటే...?
   
    శక్తిమాయి పంపితే వచ్చానంటూ ఒకతను వచ్చాడు. రాజురమణ అతను కలిసి రహస్య సమావేశం అయ్యారు.
   
    వచ్చిన అతను విషయం బయట పెట్టాడు.
   
    రాజురమణలు ముందు ఎదురు తిరిగారు. బుకాయించారు. మేము అలాంటి వాళ్ళం కాము అన్నారు.
   
    అప్పుడు సాక్ష్యాధారాలతో సహా అతను కొన్ని విషయాలు బయట పెడుతూ, "మీ ఇన్ స్పెక్టర్ ఎలాంటివాడో మీకు తెలుసు. అన్యాయంగా నేరం మోపబడిన ఓ ఆడపిల్ల ఖైదీగా వుంటే మిమ్మల్ని బయట కాపలా పెట్టి మీ ఇన్ స్పెక్టర్ ఆ పిల్లని జైలుగదిలో రేప్ చేస్తుంటే మీరేం చేశారు?"
   
    "ఆయన మాపై అధికారి. మేము ఏమీ చేయలేక ఓ పక్క బాధగా వున్నా నోరు మూసుకున్నాము" నంగి నంగిగా సమాధానం ఇచ్చాడు రమణ.
   
    "మంచిది....అదే మీ ఇంట్లో వాళ్ళకే జరిగితే?"
   
    రమణ మాట్లాడలేకపోయాడు.
   
    "న్యాయం గురించి ధర్మం గురించి మాట్లాడాలి అంటే ఆ వ్యక్తి ఉన్న పదవిలో వుంటే చాలదు వ్యక్తి ధర్మంతో మెలగాలి న్యాయంగా వ్యవహరించాలి మీ ఇన్ స్పెక్టర్ ఎలాంటి వాడన్నదీ అయిదేళ్ళ బొట్టి కాయని కదిలించినా చెపుతాడు.... మీరు మీమీ సంసారాలు గడవటంకోసం రక్షకభటుల ఉద్యోగం చేపట్టారు. న్యాయం అధికార దుర్వినియోగ రక్కసి పాదాలముందు అల్లల్లాడుతుంటే కళ్ళప్పగించి చెవులు మూసుకొని చేతులు కట్టుకొని మీ అధికారి ఏం చెపితే డానికి జీహుజూర్ ఎస్సార్ అంటూ రోజులు గడుపుతున్నారు.
   
    న్యాయానికి కొత్త అర్ధం ధర్మానికి కొత్త భాష్యం నేర్పుతూ అన్యాయాన్ని ఎదుర్కొంటున్న మా తల్లి చెప్పిన పని మీరు చేయటంలో అధికార దుర్వినియోగం ఎంతమాత్రం లేదు.
   
    మా శక్తిమాయి శక్తి యుక్తులతో అన్యాయమయి పోతున్న ఎందరినో రక్షించటం జరిగింది. దుష్టులను శిక్షించటం అన్యాయంగా శిక్షించబడిన వారిని రక్షించటమే ఆ తల్లిపని. "అమ్మా! అన్యాయం జరిగింది రక్షించు" అంటే చాలు ఏ దేవతా పలకదు, ఏ దేముడూ దిగిరాడు....కాని... మామాయీ మాత్రం వెంటనే రంగంలోకి దిగి కలకత్తా కాళిలాగా అపర దుర్గలాగా ప్రచండ చండిలాగా రంగం లోకి దూకి అన్యాయాన్ని అరికడుతుంది."

 Previous Page Next Page