Previous Page Next Page 
నీలికనుల నీడల్లో పేజి 8

                                                                               8
   
    "చూడండి..." ఇన్ స్పెక్టర్ అన్నాడు.
   
    బన్సీలాల్ చూస్తూనే అవాక్కయి నిలిచిపోయాడు.
   
    రాజు, రమణ చెరో బెడ్ మీద వున్నారు. వాళ్ళకి స్పృహ లేదు. శరీరం మీద అక్కడక్కడ దెబ్బలు తగిలిన గుర్తులు ఉన్నాయి.
   
    "వీళ్ళళా బెడ్ మీద వుండటం దొంగవేషాలు కాదు కదా!" అని బన్సీలాల్ కి అనుమానం వచ్చింది. సరీగ అప్పుడే ఇన్ స్పెక్టర్ కల్పించుకోని అన్నాడు.
   
    "లాల్ జీ! రమణ చేతికి గాయం అయింది అన్నారు కదూ!"
   
    "అన్నాను."
   
    "ఏ చేతికో గుర్తున్నదా!"
   
    "ఆ__బాగా గుర్తున్నది. ఎడంచేతికి."
   
    ఇన్ స్పెక్టర్ మాట్లాడలేదు. రమణ మీదకి కాస్త వంగి రమణ ఎడంచేతిని ఎత్తి చూపాడు.
   
    విచిత్రం! రమణ చేతిమీద గాయంలేదు.
   
    "కుడిచెయ్యి చూడండి." కంగారుగా అన్నాడు ఓవేళ తను పొరబడి వుండవచ్చుకదా! అని అనుకున్నాడు బన్సీలాల్.
   
    ఇన్ స్పెక్టర్ రమణ కుడిచెయ్యి ఎత్తి చూపాడు.
   
    రమణ కుడిచేతిమీద కూడా గాయంలేదు.
   
    "చాలా విచిత్రంగా వుంది!" అంతకుమించి ఇంకేమనాలో తెలియలేదు బన్సీలాల్ కి.
   
    "నాకూ అలాగే వుంది. మీరు చెప్పిందానికి...."
   
    "అంటే నన్ను అనుమానిస్తున్నారా?"
   
    "ఛా...ఛా...మీరు అనవసరంగా మాటలని అపార్ధం చేసుకుంటున్నారు. ఏదో జరిగింది...అది తర్వాత ఆలోచిద్దాము. ముందు డాక్టర్ ని కల్సుకుని వెళదాము" అంటూ ఇన్ స్పెక్టర్ రూమ్ లోంచి బయటికి దారి తీశాడు.
   
    ఇరువురు కల్సి డాక్టర్ శంభుమిత్ర రూమ్ లోకి వెళ్ళారు.
   
    కొద్దిసేపు సంభాషణ తర్వాత...
   
    "కానిస్టేబుల్స్ శరీరం మీద ఒక్క రక్తంబొట్టుపైకి చిన్ధకుండా ఎవరో బాగా కొట్టారు. శరీరం మీద అక్కదక్కడ కమిలిపోయింది. చూశారుగా! అని మామూలు దెబ్బలు కావు. పైకి గాయం కనపడదు. బాధ విషయానికి వస్తే నరకయాతన చవి చూడాలి....ఇలాంటి దెబ్బలు కొట్టటానికి అవతలి వారికి చాలా తెలివి వుండాలి. అంటే దెబ్బలు కొట్టినవారు చాలా ఘటనా ఘటన సమర్ధులు అని...." డాక్టర్ శంభుమిత్ర అన్నాడు.
   
    "వాళ్ళకి ఇంకా తెలివి వచ్చినట్లు కనబడలేదు...." ఇన్ స్పెక్టర్ అడిగాడు.
   
    "వాళ్ళిద్దరికీ వదిన మత్తుమందు మన దేశంది కాదు. రాత్రినుంచీ ఇంతవరకు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా తెలివి రాలేదు. బహుశా ఈరాత్రికో రేపు ఉదయానికో...
   
    "అంతవరకు...?"
   
    "వెయిట్ అండ్ సీ" అంతకు మించి చెప్పేది ఏమీ లేదన్నట్లు ముఖం పెట్టి అన్నాడు డాక్టర్ శంభుమిత్ర.
   
    డాక్టర్ వద్ద శలవు తీసుకుని ఇరువురు నర్సింగ్ హోమ్ నుంచి బయటకి వచ్చారు.
   
    "మీ ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాము" ఇన్ స్పెక్టర్ అన్నాడు మోటారు సైకిల్ ఎక్కుతూ.
   
    "అదే మంచిది" ముక్తసరిగ అని బన్సీలాల్ తన జీపు ఎక్కాడు.
   
    పది నిమిషాల తర్వాత రెండు వాహనాలు బన్సీలాల్ ఇంటిముందు ఆగాయి.
   
    ఇరువురు బన్సీలాల్ ప్రయివేటు రూములోకి వెళ్ళి కూర్చున్నారు. నౌఖరు ఇరువురికి చల్లని పానీయాలు అందించి రూము తలుపువేసి బయటికి వెళ్ళిపోయాడు.
   
    "నాకంతా అయోమయంగా వుంది." బన్సీలాల్ అన్నాడు.
   
    "లాల్ జీ! జరిగింది ఏ కొంచెం కూడా అర్ధం, కావటం లేదు. ఒంటిగంట పది నిమిషాలకి రాజు, రమణలు మీ ఇంటికి వచ్చారని కదా మీరు చెపుతున్నది."
   
    "ఎస్."
   
    "సరిగ అప్పుడు రాజు, రమణలు నా దగ్గర వున్నారు..."
   
    "అది...అది...ఎలా సాధ్యం?"
   
    "ఈ రోజుల్లో సాధ్యం కానిదంటూ ఏమీ లేదు లాల్ జీ!"
   
    "అంటే!"
   
    "అదే చెప్పబోతున్నాను వినండి. మీ దగ్గరికి వచ్చింది రాజు, రమణ కారు. మారువేషగాళ్ళు."
   
    "పోనీ అలాగే అనుకుందాం. రాత్రి రమణ, రాజులని స్వయంగా నేను చూశాను మాట్లాడాను. రాత్రి రమణ చేతికి గాయంవుంది. ఇప్పుడు చూస్తే లేదు. కొన్ని గంటలలో గాయాన్ని ఎవరూ మాయంచేయలేరు. మళ్ళీ మాట్లాడితే ఆ దేముడికి కూడా సాధ్యంకాదు అనుకోవాలి. రాత్రి రమణ చేతికి గాయం లేకుండా ఈ పూట వున్నట్లయితే అతన్ని అనుమానించ వచ్చు. రాత్రి గాయంవుండి ఈపూట గాయం లేదు కాబట్టి ఆ రమణ, ఈ రమణ వకరుకాదు"
   
    "చాలా చక్కగా ఆలోచించారు లాల్ జీ!" ఇన్ స్పెక్టర్ అన్నాడు మెచ్చుకోలుగా చూస్తూ.
   
    "ఆలోచన చక్కగానేవుంది అర్ధం కానిది ఆ రమణ ఈ రమణ."
   
    "వకరు కానప్పుడు యింత పోలికలు ఎలా వచ్చాయి అని ఆలోచిస్తున్నారు...అర్ధం కానిది యిదే అవునా?"
   
    "అదికాదు ఎత్తు, లావు, రమణ లాంటివాడిని తీసుకు వచ్చి మేకప్ చేశారు అనుకుందాం. మరి రాజు విషయం?"

 Previous Page Next Page