Previous Page Next Page 
తిలక్ కథలు పేజి 7

    ఎదురుగా ఒక యిరవై యేళ్ళ యువకుడూ యిరవై నాలుగేళ్ళ యువతీ వస్తున్నారు, మసక నిదరలో నడుస్తూన్నట్టు. ఆ యువతి వీళ్ళని నిదానించి చూసి "బామా" అని పిలిచి ఒక్క పరుగున వచ్చి హఠాత్తుగా ఆగి పకపకా నవ్వడం ప్రారంభించింది. ఆమె వెనకాలే యువకుడు కంగారుగా వచ్చాడు. ఇద్దరూ బర్మా దేశీయులు.

    అతను యువకుణ్ణి ఉద్దేశించి "ఎందుకు నవ్వుతుంది" అని అడిగాడు ఇంగ్లీషులో.

    "మిమ్మల్ని 'బామా' అనుకుంది. కాని మీరు బామా కారు" అన్నాడా యువకుడు.
    "మీరెవరు -మీ పేరు" అన్నాడతను.

    "నా పేరు యూబా. ఈమె పేరు ఆమా. శరణార్ధులం" అన్నాడా యువకుడు, లావుపాటి కింద పెదవి నొక్కిపట్టి. తిరిగి ఇలా అన్నాడు: "మీరు ఎందుకిలాగ వచ్చారు. ఈ క్యాంపులో ఉంటారా?"

    "కాదు - మిలటరీలో పనిచేస్తున్నాను" అన్నాడతను.

    బర్మా యువతి ఏదో అంది. యూబా అనువదించి ఇలా అడిగాడు.

    "ఈమె మీకేమౌతుంది?"

    "ఏమీ కాదు" అన్నాడతను.

    ఆమా నిద్రలేని బరువు కళ్ళతో నవ్వి ఏదో అంది. యూబా "మాకూ ఏమీ తోచడంలేదు. కాస్సేపు కూర్చుని మాట్లాడుకుందామా" అన్నాడు.

    నలుగురూ కొంచెందూరం నడిచి ఒకచోట కూర్చున్నారు. ఆమా ఏదో మాట్లాడుతూ పకాలున నవ్వుతోంది. ఈసారి యింతవరకూ మౌనంగా ఉన్న ఆమె అడిగింది "ఆ మా మీకన్న పెద్దదిలావుంది. ఈమె మీకేమౌతుంది?"

    యూబా కళ్ళు కుంచించాడు. అతని చిన్న నొసలు ముడతలుపడి ఏవేవో స్మృతుల్ని దాస్తున్నట్టుగా ఉంది. "బామా యీమె అన్నగారు 'దేశద్రోహి' జపాన్ వాళ్ళ గూడచారి అనే పేరుతో అతన్ని ప్రభుత్వం చంపివేసింది. కాని యీమెకింకా పాపం తెలియదు. ఎక్కడో బతికి ఉన్నాడనుకుంటోంది. తర్వాత జపాన్ విమానాలు దాడిచేశాయి. ఆ దాడిల్లో యీమె గృహమూ, ముసలితల్లీ నాశనమైపోయారు. మా అందరితోనూ యీమె పారిపోయి వచ్చింది. ఇప్పుడు..." యూబా ఒకసారి దగ్గి ఇలా అన్నాడు. "ఇప్పుడు మేం భార్యా భర్తలలాగా వున్నాం"

    "మీరు బర్మాలో ఏం చేసేవారు?" అన్నాడతను.

    యూబా మళ్ళీ ఆలోచించాడు. మళ్లీ నొసలు కుంచించాడు. జవాబు చెప్పడమే పెద్ద పరిశ్రమలాగ ఉంది అతనికి "కలప వర్తకం చేసేవాళ్ళం -నేనూ మా అన్నలూ"

    ఆమె ఏదో అడగబోయింది. కాని అతను కళ్ళతో వారించాడు.

    ఆమా అక్కడనుంచి లేచి అల్లరిగా గాలిలో ఎగిరే మిణుగురుల్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. అతను చేతిలోకి యిసుక తీసుకుని కొంచెం కొంచెం కిందపోస్తూ యిలా అన్నాడు.

     "ఏదైనా ఉద్యోగం చెయ్యరాదూ"

    యూబా అన్నాడు "అవును, నేను మిలటరీలో చేరదామనుకుంటున్నాను"

    అతను ఆమెకేసి చూచాడు. ఆమె కూర్చునే కునుకుపాట్లు పడుతోంది. అతనామెను తట్టిలేపాడు. ఆమె ఉలిక్కిపడి "అరె! నిద్రవచ్చింది- చిత్రంగా" అంది.

    యూబా అన్నాడు మళ్ళీ నిశ్చయంతో " అవును మిలటరీలోనే చేరుతాను."

    "మరి ఆమా ఏమవుతుంది?" అంది ఆమె.

    "ఏమౌతుందీ!" యూబా కాస్త దూరంలో ఉన్న ఆమాని ప్రేమగా చూశాడు.  "ఏడుస్తుంది నిజమే. కాని డేరాలలో ఏ సౌకర్యమూ తిండీ లేక ఎన్నాళ్ళు ఉండడం? ఊరికే ఉన్నకొలది మా వ్యాపారమూ, మా అన్నలూ, మా వూరూ జ్ఞాపకం వస్తారు. నేను సైన్యంలో చేరితే ఆమా ఇంకొక మంచివాణ్ని స్నేహం చేసుకుంటుంది. యుద్దం వచ్చినప్పుడు స్నేహాలెంత త్వరగా చేసుకుంటామో అంత త్వరగా తెంపుకోవాలి. అంతే నంటారా?" అన్నాడు యూబా ఇంగ్లీషులో తన ఆలోచనల నొక్కొక్కటే మెల్లగా ఎప్పుడూ, అతని గొంతులో కందిరీగ దూరినట్లు స్వరం విషాదంగా పలికింది.

    మిణుగురులతో ఆడుతూ ఆమా దూరంగా వెళ్ళిపోయింది. అక్కడనుండి యూబాను పిలిచింది. యూబా లేచి "ఆమె పిలుస్తోంది. నేను వెళతాను" అని గబగబా వెళ్ళిపోయాడు. అతడు లేచాడు. ఆమె లేచింది.
 

 Previous Page Next Page