'' ఎవరూ'' అని కేకవేశాను.
'' ఎవరా? ఒక యోగి! దివ్యత్వం కోరే ఒక తపస్వి.''
'' ఆ తపస్వి యిక్కడకు ఇప్పుడెందుకు వచ్చాడు?''
'' వరం కోరడానికి...''
'' ఏమిటా తపస్సు ! ఏమిటా వరం ? ఇక్కడా తపస్సూలేదు. సిద్దీ లేదు. తపస్వి వెళ్ళిపోవచ్చును. ''
'' ఇక్కడ లేవూ? ఏ దివ్యమూర్తి సాక్షాత్కారం కోసం ఇన్నాళ్ళు దివ్యగాంధర్వం ఉద్భవింపజేసానో, ఏ దివ్యమూర్తి నామ మంత్రం జపిస్తూ భ్రూయుగ్మం మధ్య చూపు నిలిపానో, అద్బుత సంకల్ప సమాధిలోనికి పోయానో, ఆ దివ్యమూర్తి ప్రసన్న అవుతుందని ఈ ఉదయమే నాకు ఆకాశవాణి వినబడినది. కాబట్టి,
'' తెరవవే తలుపుల్లు. దేవీ
తెరువమేమే దివ్యహృదయము
తెరిచి యీ భక్తుణ్ణి త్వరలో
వ్స్రము లిచ్చీ వాంఛ లిచ్చీ
కరుణతో కాపాడు టేపుడో ?''
ఏమా సంగీత మాధుర్యము! సైగల్ గొంతుకన్నా గంభీరత, అబ్దుల్ కరీం గొంతుక కన్న మాధుర్యం, పంక జమల్లిక్ గొంతుకకన్న గాఢసురభిళత, వసంత దేశాయి కంఠముకన్న సమ్మోహనత ........నిశాపతి యెప్పుడు వచ్చాడు? అతని గొంతు విని యెన్నాళ్ళైంది! నా పందిరిమంచం మీదనుంచి, విమానంలోనుంచి దేవకన్యలా ఉరికాను. నా వదులు జడ వీడి కెరటాలై, వడులై, సుడులై ప్రవహించింది. తలుపు చటుక్కున తీశాను. ఎదుట నిశాపతి, హృదయాభిరామంగా అలంకరించుకొని ఉన్నాడు.
'' కరుణతో కాపాడు టెపుడో '' అంటూనే రాగం ఏ లోకాలకో పోనిచ్చి, సాలేగూడును దులిపినట్టుగా తలుపును తోసుకొని మాటాడకుండా అతితీక్షనపు చూపులతో, అతి తృష్టాపూరిత వదనంతో సున్నితమైన పట్టు దుస్తులలోంచి తొంగిచూచే నా అందాల యౌవనాన్ని పరిశీలిస్తూ ఒక్క నిముష మాట్లా ఉండి,
'' ఎవ్వరికి యెప్పుడూ దొరకని నీ సూక్ష్మాచ్చాదిత ప్రాతఃకాల దర్సనం నాకు లభించింది'' అని తమితో అస్పష్టంగా పల్కుతూ, సుడిగాలిలా నన్ను చుట్టివచ్చినాడు. రక్తం నా ముకంలోనికి పోటెత్తుకొచ్చింది. నా చూపుల్లో యెర్రమంచులు కప్పినవి నా వొళ్ళు వివశత్వం పొందింది. నా యౌవనం ఒక్కసారి ఉప్పెనలా యెగిసింది. వళ్ళు వేడెక్కిపోయింది. అప్రయత్నంగా ఒక అడుగు ముందుకు వేయబోయినాను. ఇంతలో నాకు ఫెళ్ళున మెలకువ వచ్చినట్లయింది. వెనక్కు అడుగు వేసి ఆయాసంతో తూలుతూ నా పందిరి మంచపు పక్క మీదకి వచ్చి పడ్డాను. నేను భరించలేని యేదో బాధ నన్నలమి, నన్ను మూలమంతా కదిల్చి వేసే యేడుపు నన్నావరించినది. ఎప్పుడూ నే నేడ్చి యెరుగను. అప్పుడు నిశాపతి భయంతో నా వద్దకు త్వరగా వచ్చినాడు. తెల్లబోయి అట్లే నిలుచుండిపోయినాడు.
'' హేమం, నేను మృగంలా ప్రవర్తించాను. నన్ను క్షమించు. నా ప్రేమ అలాంటిది, అంత అద్బుతమైంది. అంత ఉత్కృష్టమైనది. సంగీత కచ్చేరి అయిందో లేదో ఢిల్లీనుంచి పరుగెత్తుకొచ్చాను.''
'' ఓయి వెర్రివాడా, యీ దినం నాకేదో భయంకరమైన ఆనందం కలిగింది. నీవు నన్ను అలమికొని వచ్చినపుడు నాకేదో విపరీతానందమూ, వింత భయమూ ఆవరించినవి. అదే ప్రేమంటావా?''
'' నువ్వు మాట్లాడినప్పుడల్లా నీ పెదవుల్లోని ఆ మాటల్నేతనివి తీరా ఆస్వాదించి దివ్యసంగీతంగా వెదజల్లుదామనే కాంక్ష కలుగుతుంది.''
నిశాపతి నా పాదాలకడ మోకరిల్లినాడు. అతని తల నా కాళ్ళకు తలగడం గ్రహించి నా కాళ్ళు రెండూ పైకి లాక్కొన్నా. '' నిశాపతీ , ఆ సోఫాలో కూర్చో. అభిమానాలు, మాయలు లేకుండా మన యిద్దరి సంగతీ యిప్పుడే విచారించుకొని ఒక నిర్ణయాని కొద్దాము.'' అని నేనన్నాను.
'' ఆకాశనదీ స్వర్ణ పద్మాలు పోగుచేసి నిన్ను కైవసం చేసుకోవడానికి యే దివ్యుడూ తగడు. నేను హీనుణ్ణి, ఆశాజీవిని.''
'' తగివుండటం ఉండకపోవటం నిర్ణయము అనేక విషయాల మీద ఆదారపడి వుంటుంది '' అని అంటూ కాశ్మీరపు పాష్మీనాశాల్వ నాచుట్టూ కప్పుకొన్నాను.
'' చిన్నతనమునుంచీ నా గొంతుక అత్యద్బుతంగా ఉంటుందని అందరూ, అన్నారు. ఆ చిన్ననాడే తల్లిదండ్రులకి చెప్పకుండా, టిక్కెట్టు లేకుండా అలహాబాదు పారిపోయాను. నా గొంతుకలోని తీపితనాలు గమనించి అలహాబాదులోని ఒక సేట్ జీ ప్రసిద్దుడైన బాబూరావు త్రిపాఠీ దగ్గర సంగీతం నేర్చోకోమని నన్ను లక్నో పంపించాడు. ఏకదీక్షగా పదేళ్ళాయన వద్ద నేర్చుకొన్నాను. మూడేళ్ళు కస్టపడి సారంగి నేర్చుకొన్నాను. ఉత్తరాదిలో ప్రసిద్ది కెక్కిన అన్ని బాణీలూ కైవసంచేసుకున్నాను. మాయింటి పేరైన చతుర్వేదులను '' చతుర్వేది '' యని పెట్టుకొన్నాను. ఉత్తరాది '' చతుర్వేది '' వారు నేనూ ఒక్కటేనని ఉత్తరాదివారి ఊహ. ఇతడు మహోత్తమ గాయకులలో ముఖ్యుడు అని జేజేలు పొందాను. మద్రాసు వచ్చి నిన్ను చూసాను, నీకు దాసుణ్నయాను. అప్పటినుంచి మదరాసే నా ముఖ్యమకాముగా చేసుకొన్నాను. ''
'' అవును. ఇవన్నీ నాకు తీర్ధమిత్రుడే చెప్పాడు.''
'' ఇవన్నీ తీర్ధమిత్రుడు నీకు చెప్పి ఉంటాడు. ఎవరైనా చెప్పివుండవచ్చు. కాని నే నిదివర కెవరికి తెరిచి చూపని కవాటాన్ని తెరిచి నా జీవితంలో అతి నిగూఢమైన చరిత్ర భాగాన్ని యీ దినము నీకు గోచరింపచేస్తున్నాను. అదే నా పరమ నివేదన నీకు. నా సంగీత కళాపరిశ్రమలో ఒక్కొక్క పథమే గడిచి పైకి పోతూండే రోజులవి. అందరూ నన్ను ప్రేమించేవారు, గౌరవించేవారు. నా ప్రతిభకు, నా శక్తికి ఆశ్చర్యపడిపోతుండేవారు. నాకు యౌవనం వచ్చింది. కళాజీవిని కామవాతావరణం యెప్పుడూ చుట్టుకొని, ఇంత సందుదోరికితే లోనికి ప్రవేసించి, అతని జీవితంలో తానే రాజ్యంచేసే స్తితిని తీసుకొస్తుంది. నా కంఠమహిమ, నా గానవై చిత్రి సందర్శించి యెందరో బాలికలు పాదక్రాంతలయినారు. నా బ్రహ్మచర్యాశ్రమం పాడు చేసుకొన్నాను. నా గానప్రజ్ఞతోపాటు నా కామతృష్ణ మహారణ్యం అయినది. ఇప్పటికినాలుగేళ్ళక్రితం నిన్ను చూచినంతవరకూ నా తుచ్చ జీవితము నన్ను పోదివికొనే ఉన్నది. అద్బుతములైన నీ కన్నులు నా వైపు తిరిగి, పరమ తేజాలైన నీ చూపులు నాపై ప్రసరించి ఆ పిశాచాన్ని దగ్ధం చేసివేసినై ఆనాటినుంచీ నీ రూపమే తల్చుకొంటూ, నీ నామమే జపం చేసుకొంటూ, నీకోసం నిజమైన బ్రహ్మచారినయ్యను. నువ్వు మన పెళ్లికై అనుమతియ్యి. నా గానశక్త, నా జీవితం నీ రెండు పాదాలదగ్గర సర్వార్పణము చేస్తున్నాను. ''