'' గాలై ప్రసరిస్తే
వాగై ప్రవహిస్తే
మలయపవనమై
మందాకినివై
రారా నా రాజా !
యీ రాజ్యంలో
నే నొంటినిరా!
కాంతై జ్వలియిస్తే
శాంతై పులకిస్తే
శరత్సుషమయై
క్షపాహాసమై
రారా నా రాజా !
యీ రాజ్యంలో
నే నొంటినిరా !''
అని పాడినాడు.
'' ఎవరిదయ్యా యీ పాట ?''
'' నేనే రచించుకొన్న గీతిక యిది. ''
'' ఏమయ్యా! నీవున్నూ తీర్ధమిత్రునిలా కవిలాగున్నావే !''
'' నేనే కవి నెట్లా ? నా గొంతుక అవ్యక్తం, అస్పష్టం. ఏవో సంద్యా భావాలున్నవి. తీర్ధమిత్రుడంటావా, స్పష్టతతాల్చిన జ్వాలా శిఖవలె ప్రజ్వరిల్లుతూ ఉంటాడు.
అవి వెలుగులు కావేమో ! ఏదో తాటాకు, పాతగడ్డి మండించిన పొగచూరిన మంటల్లా ఉంటవి'' అని పకపక నవ్వాను. అతడు రాసిన పాట విను నీకే తెలుస్తుంది!''
'' బ్రతుకలేనే ఓ ప్రియా
కత లెరిగి నీ పెదవి
విత మెరిగి శ్రుతి మరచి
గతి తప్పి అడవిలో
వితము తెలియని నేను
బ్రతుకలేనే ఓ ప్రియా
కత లెరిగి నా పెదవి....''
'' ఈపాట అతడు ఎందుకు రాసినట్లు ?''
'' ఈపాటలో నా అందాని కాతడు జోహారు లర్పిస్తున్నాడట !''
'' నిన్ను ముద్దు పెట్టుకున్నట్లు రాస్తాడే ?''
నిశాపతి ఢిల్లీకి వెళ్ళిన రోజున తోటలో అతనూ నేనూ తిరుగుతుంటే, తటాలున నా చేయి ముద్ద్దు పెట్టుకొని '' నిన్ను ప్రేమిస్తున్నాను'' అన్నాడు. ఆ మరునాడు ఈ పాట రాసుకొచ్చి నాకు చూపించాడు.
'' నీ యౌవనం సాఫల్యం అనుభవించలేదా? ఆ ముద్దు నీ అందానికి హారతి కాలేదా ?''
'' హారతో , నివేదనమో నాకు తెలియదుకాని, అతని స్నేహానికి ఆ ముద్దుకూ శ్రుతి కలిసింది కాదు. నాకు అసహ్యం వేసిందన్నమాట నిజం. ఆ రోజున నీవు బల్లవద్ద నుంచొని ఉండగానే, నేను డేటాలు నీటితో చేయి కడుక్కొనే వచ్చాను.''
త్యాగతి మాట్లాడకుండా తల క్రిందకు వాల్చుకొని చేతితో నీల మీద యేవో గీతలు గీస్తున్నాడు.
అందరూ నాకర్ధమయ్యారు కాని త్యాగతి నా కర్ధంకాడు! అతని మౌనంలో యే మేమి భావాలు నిశ్చలపక్షాలు చాపి తెలిపోతున్నవో !
'' నేను హైస్కూలులో విద్యార్దినిగా ఉన్నప్పుడు, ఇద్దరు, ముగ్గురు బాలకులు నన్ను ముద్దు పెట్టుకోబోయారు. నా చుట్ట మొకాయన, నా క్లాసు మేట్సు యిద్దరు. నాకు అసహ్యము వేసింది; ఏదో సంతోషము వేసింది. ఆ సంతోషముయొక్క తత్వముకాని, ఆ అసహ్యత యొక్క తత్వముకాని నాకీ నాటికీ తెలియడంలేదు. నా కనుబొమలు ముడివడడంలోని కోపం చూచి ఆ ముగ్గురిలో ఇద్దరు అక్కడనే ఆగిపోయినారు. నా కనుపాపలలోని సంతోషము చూచి కాబోలు ఆ ముగ్గురిలో ఒకడైన నా క్లాస్ మేటు రెండో సారి నన్ను కౌగిలించుకునే ప్రయత్నం చేయబోయాడు. అప్పుడు నాచేత లెంపకాయ తిన్నాడు. అంతటితో ప్రణయ కార్యకలాపము చల్లారి పోయింది. ''
ఆ మాటలని ఆలోచనలో పడ్డాను. ఇద్దరం కొంతవరకూ మౌనంగా వున్నాం.
'' ఒక్కొక్క నీ ఆలోచనలకు, ఒక్కొక్క దమ్మిడీ చొప్పున ఎచ్చేట్లయితే యీపాటికి కొన్ని రూపాయలై ఉంటాయి'' అన్నాడు త్యాగతి.
ఉలిక్కిపడి తలెత్తి'' ముఉడు దమ్మిడీలకంటే యెక్కువ యీయవలసి ఉండదయ్యా ? కానీ ఇలా యీయి చెప్పుతా '' అని నే నన్నాను.
'' ధానం పెట్టి ఆలోచనలను కొనుక్కోగలమా హేమం '' అని విషాద వదనంతో ఏరువైపు చూచినాడు త్యాగతి.
13
పది దినాలయిన వెనుక ఒక ఉదయమే నా కళ్ళలోని నిద్ర సగమావలకి పోయి మళ్ళీ వెనక్కు వస్తున్నది. ఆ ప్రత్యుషంలో,
'' మేలుకొనుమీ
దివ్యసుందరీ!
మోహనాంగీ మేలుకో!
మేలుకో వాంఛప్రదాయిని
మేలుకోనవే సురభిళాంగీ
పూర్ణకాంతుల తేజరిల్లే
భువన మోహిని మేలుకో !
కలలు ఆపుము కళ్ళు తెరువుము
కలలుకన్నా విలువమీరిన
పూజ యిదిగో
వేగ లే వరవర్ణినీ
వేగ లే సువర్ణినీ!''
అన్న పాట ఘంటానాదమై వినబడింది. ఉలిక్కిపడి తొడుక్కున్న పట్టుకుచ్చులలాగు సవరించుకొని, లేచి, కళ్ళు నులుముకొన్నాను. చిత్రవర్ణ మైన పల్చని నా పట్టు చొక్కగాని, నా పట్టులాగు కాని, తప్తజాంబూనద కాంతులను వెదజల్లే నా శరీరచ్చాయలను దాచలేకపోతున్నవి.