నేను వంచిన తలెత్తి నిసాపతిని చూడలేకపోయాను.'' నిశాపతీ, నీ స్నేహము నాకు పూర్ణిమనాటి వెన్నేలలాంటిది. నీ గానము నా జీవితానికే ఆధారమయింది. ఇదివరదాకా నా విషయంలో ఎప్పుడూ నిశ్చయం రాలేదు. స్త్రీ తన యిష్టం వచ్చినట్లు సంచరించవచ్చో, వివాహమే అవసరమో నేను తెలుసుకోలేదు. అవసరమైతే ఆ కోరుకోవలసిన పురుషుడేవరో నేను నిశ్చయించుకోలేదు. మనస్సు ప్రేమించే మనిషి ఒకరు, దేహం ప్రేమించే మనిషి యింకొకరు ఉంటారేమో; అదిన్నీ తెలియదు. కాని....నేను....నాకు....నీవంటే....విపరీతమైన....సో.....ద...ర....భావం మాత్రముండేదని....''
నిశాపతి క్రుంగి నిట్టూర్పు పుచ్చి సోఫా హస్తం మీద నున్న తన హస్తంపైన తలవాల్చి, ధ్వని లేని గుండె బద్దలయ్యే యేడ్పులో ద్రవించి పోయినాడు. భయంతో అతని వద్దకే వెళ్ళలేకపోయాను.
ఇంతలో '' అమ్మాయీ ! ఆరున్నరయినా క్రిందికే రాలేదని బోయీలు చెప్పటమువల్ల యెలాగున్నావో చూదామనివచ్చాను'' అని మెట్లకు వెళ్ళే గుమ్మంలోనుండి అనిన త్యాగతి మాటలు వినబడినవి. '' ఇదిగో వస్తున్నాను. నిశాపతి వస్తే యేదో మాట్లాడుతున్నాను'' అని నేను స్నానాల గదిలోనికి పరుగెత్తాను. నేను స్నానంచేసి బట్టలుకట్టి వచ్చేవరకు నిశాపతి యిదివరకు కూర్చున్నచోటనే కూర్చుని ఉన్నాడు.
'' నా స్నానాలగాదిలోకి వెళ్ళి ముఖం కడుక్కొని రావయ్యా నిసాపతీ!నేను క్రింద ఉంటాను. నీకూ నాకూ యింతవరకున్న స్నేహము యింకను నిత్యమై, నిర్మలమై ఉండాలి! నిన్ను నా సహూదరునికన్నా యెక్కువగా నాకు....సన్నిహితునిగా చూస్తున్నాను'' అంటూ మెట్లు దిగి వెళ్ళిపోయాను.
నిశాపతి అక్కడే మ్రాన్పడి నిలుచుండిపోయాడు.
14
నిశాపతి ప్రణయరాగాలాపంలోంచి త్యాగతి మాటలు నాకు పూర్తిగా మెలుకువ తెప్పించినవి. రేడియం చూపులు కలిగిన త్యాగతి చూపులకు కూడా నిశాపతికీ నాకూ జరిగిన సంగటన గ్రహించడానికి వీలులేని పద్దతిగా నేను మేడ దిగాను. త్యాగతి యేమీ తెలియనివాడిలాగే కనబడ్డాడు. అయినా నాలుగు రోజులు పోయిన తరువాత మేమిద్దరమే యింట్లో భోజనం చేసే ఓ మద్యాహ్నం వేళ, '' హేమాదేవి, నిశాపతిని నీవేమన్నావు?'' అని అడిగినాడు.
'' ఏమయ్యా, అలా అడుగుతున్నావు?''
'' నిశాపతి మొన్న నాతో అంతా చెప్పినాడు.''
'' ఏమి చెప్పాడు?''
'' ఈ మహాయుద్ధంలో విజయ దివ్యమూర్తియై నిశాపతి మనకు కనబడతాడు. లేదా ఇంకనూ అదోగతికిబోయే పరమరాక్షసుడై మన కంటికి కనబడకుండా పోతాడు.''
త్యాగతి మాటలు నా కర్ధమవుతున్నా అర్ధం కానట్లే నటించాను. ''నిశాపతికీ యుద్దానికీ సంబంధ మేమొచ్చిందీ?'' అన్నాను.
'' మొన్ననే మొదలుపెట్టిన ఇంగ్లండు, ఫ్రాంసు, జర్మన్ నూతన సంగ్రామానికీ నిసాపతికీ యేమీ సంబంధం లేదని నీకూ తెలుసును నాకూ తెలుసును. నిశాపతి నిన్ను వాంచ్చించిన విషయమూ, నీవు కాదన్న విషయమూ నేను గ్రహించాను. నీ జీవితం ఒక ఆనందపధంలో విహరించాలంటే అతడు నీకు సరియైనవాడు. మొదటి దినాల్లో పరివ్రాజకుడై, సంగీత సత్యాన్వేషణలో, చీకట్లో దారి తడుముకున్నాడు. ఈనాడు నిశాపతి ఉత్తమ పధం చేరినాడు. అతన్ని వీ వెందుకు వివాహం చేసుకోగూడదో నా కర్ధం కావడంలేదు.''
'' నీ దగ్గర మే మేమీ రహస్యాలు దాచుకొనేందుకు వీల్లేదన్నమాట, అతడు చెప్పినాడా నీవే గ్రహించావా?''
'' అతడు చెప్పలేదు హేమా! ఈ రహస్యమతని కతి పవిత్రమైనది.''
'' నీవే గ్రహించావూ? అప్పడే అనుకున్నాను! ఒక వస్తువు మంచిదే. ఆ వస్తువు నీ కిష్టమో లేదో ఏదైనా ఒక విచిత్ర సంఘటన జరిగినపుడు గాని తెలియదు.''
త్యాగతి మౌనంగా ఉన్నాడు.
ఆ రోజు ఉదయము ఢిల్ల్లీ నుంచి రావదముతోనే, తాను రాత్రెలాగో గడిపి ఉదయమే నేను నిద్రలేవకుండానే నన్ను వచ్చి లేపాడు. అంతకు ముందే ఎప్పుడో మా నాన్నగారిని కలుసుకొన్నాడట. మా అమ్మగారు కుశల ప్రశ్నలు వేసిందట.''
'' మీ అమ్మగారి దయాంతఃకరణలు మమ్మల్ని ముంచి తేలుస్తునే! ఉంటవి.''
'' అతని రాక నాకు చాలా సంతోషమైంది. నిద్ర మంచం మీద నుంచి వచ్చి తలుపులు తీశాను. తన ప్రేమ తెలుపుతూ నన్ను సుడిగుండంలా కౌగిలించుకోవాలని ప్రయత్నించాడు.''
త్యాగతి మౌనం.
'' మొట్టమొదటలో నా యౌవన రక్తం పొంగింది కాని, మరుసటి క్షణంలో నిశాపతి అంటే నాకేమీ ప్రణయం లేదని, అతడు నాకు పురుషుడు కాదని స్పష్టంగా, నిస్సందేహంగా తోచింది. అతన్ని ఆపుచేసి ఆ సంగతి....''
'' అతనితో చెప్పావు. ఎంత కఠిన హృదయమమ్మా నీది? అయినా ధైర్యం కలదానవు. నీవు సంపూర్ణంగా నేటి కాలపు మనిషివి!''
'' ఆ మర్నాడాత డెక్కడకో వెళ్ళిపోయినాడు.''
'' ఔను. మైసూరులో నందిపర్వతానికి వెళ్ళినాడు. నీవు తిరుగులేని నిశ్చయానికి వచ్చినట్లేనా ? అతడు పెండ్లి చేసుకొంటానన్నాడు. నీవు కాదన్నావు. జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయ మిది, నీవు తొందర పడలేదుకదా?''