Previous Page Next Page 
చిల్లర దేవుళ్ళు పేజి 7

    శ్రద్దగా విన్నాడు పాణి. వయిలిన్ వదిలి రెడ్డిగారి ముందు కుర్చీలో కూర్చుంటూ అన్నాడు:
    "దొరవారూ! మీరు నాకు ఎంతో మేలు చేస్తున్నారు. మీ అన్నం తింటున్నాను. అలాంటప్పుడు మీ శ్రేయస్సు వాంఛించడం నా ధర్మం. ఒక మాట చెపుతాను. లోకంలో మేలుకోరి నిష్టురం అయినా శ్రేయస్సుకొరకు మాట చెప్పేవారు అరుదు. 'అప్రిమస్యతు పద్యస్య వక్తాస్రోతాచ దుర్లభ:' అన్నాడు వాల్మీకి 'హితం మనోహరంభ దుర్లభం వచ:' అన్నాడు భారవి. హితకరం అయినా మాట ఎప్పుడూ తీయగా ఉండదు. తీయగా లేనిమాట చెప్పేవారూ, వినేవారూ లభించడం దుర్లభం. 'చింతకాయల కోసంగానూ మీరు మనస్సును క్షోభ పెట్టుకోవడం మంచిది కాదు. పీరిగాన్ని లాక్కొచ్చి చావకొట్టడం వల్ల ప్రయోజనమూ లేదు. వాడూ బుద్దిపూర్వకంగా చేయాలని దొంగతనం చేసి ఉండడు. మీరంటే ఉన్న భయంతో పారిపోయి ఉంటాడు. 'చింతకాయలు' అతి చిన్న విషయం. దీనికోసం తాము చిక్కుల్లో ఇరుక్కోవడం మంచిది కాదని నా మనవి."
    హు బోడిముండకు దండం పెడ్తే నావోలెనే ఉండమని దీవించిందట. ప్రభువులు, ప్రభుత్వం వారి గౌరవం నీకెట్ల ఎవరికైతది' అంటూ కోపంగా లేచిపోయారు రెడ్డిగారు. సారంగపాణి మనసు చివుక్కుమంది. తాను దొర మేలుకోరి చెపుతే 'బోడిముండ' అంటాడా అనుకునాడు. బాధపడ్డాడు. తనను తిట్టుకున్నాడు, దొరను తిట్టాడు మనసులో.
    'పేదవాని మాట పెదవికి చేటు.'   
                                                                         x    x     x 
    పెద్దగా చదువుతూ రోజ్నామ్చా (డైరీ) రాస్తున్నాడు కరణం.
    'గామం సివార్ పై కావల్కార్ గస్తి (గస్తీ) తిరుగగా తామామ్ (అంతా) ఖైరియత్ (క్షేమం)
    జనన మరణములు కాలేదు.
    బందెకు జాన్ వర్లు (పశువులు) రాలేదు.
    గ్రామానికి మూసాఫిర్లు (ప్రయాణికులు) రాలేదు.
    సువార్లు (కంసాలీలు) సోనా గలాయించలేదు (కరిగించలేదు)
    చోరీ (దొంగతనం) సర్ఖా (దోపిడీ) జరుగలేదు.
    బద్మాషులంతా హాజరున్నారు.
    ఖరీద్, పోరోక్త్ (క్రయవిక్రయాలు) జరుగలేదు.'
    అది పూర్తి అయ్యేదాకా నుంచొని నమస్కరించాడు పాణి, కరణంకి.
    'వచ్చినావు శానసేపైందా? కూచో' అన్నాడు. పాణి కూర్చున్నాడు.
    వయొలిన్ కేసు పట్టుకొని వచ్చిన ఎంకటి, అది అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు.
    "బాగా పాడ్తవ్ ట?" అడిగాడు కరణం ఉబుసుపోకకు అన్నట్లుగా.
    "ఏదో మీ దయ"
    'ఆహా, దొరవారు మెచ్చుకున్నరంటే.....'
    'అది వారి దయ'
    'ఆయనకు కోపం వచ్చినా, మెహర్బానీ (అనుగ్రహం) వచ్చినా అంతే' వెటకారంగా అన్నాడు.
    'పాఠం ప్రారంభిస్తే......' మాట మార్చడానికి అన్నాడు పాణి.
    'తాయారు స్తానం చేస్తున్నది. మినిట్ల (నిమిషంలో) అయిపోతది. తాయారు శాన హుషారైంది. ఇట్ల చెప్పుతే అట్ల వప్పచెప్పుతది. కాలు కాస్త కుంటికాని రంభే అనుకో! ఆ కాలొక్కటుంటే మూడులోకాలు ఏలేదనుకో!'
    పాఠం చెప్పించుకునే దాని అందాన్ని గురించి వివరించాల్సినపనేమిటో అర్ధం కాలేదు పాణికి.
    'అవిటికీ, అందానికీ ఏం సంబంధమండీ? అవిటివాళ్ళు అనేకమంది అందంగా వుంటారు. బెజవాడలో ఒక గుడ్డమ్మాయిని చూచాను. ఎంత అందంగా ఉందంటారు! ఇప్పటికీ నా కళ్ళలో ఆడుతూంది. ఆ అమ్మాయికి కళ్ళు లేవని గ్రహించలేం. గాజుకళ్ళు  పెట్టుకుంది. చూడలేదనేగాని చూపున్న దానిలాగానే కనిపిస్తుంది......'
    "ఏందేందీ, కండ్లుంటయికాని కండ్లగపడవా? చిత్రం! అయితే మా తయారుకు కాలొచ్చే ఉపాయం ఉన్నదంటావా?'
    "చూస్తేగాని......"
    ఇంట్లోంచి పిలుపువస్తే కరణం ఇంట్లోకి వెళ్ళాడు. తిరిగివచ్చి పాణిని లోనికి తీసికెళ్ళాడు. గదిలో చిరుచాప పరచివుంది. అక్కడక్కడ పుల్లలు, గడ్డిపరకలు పడివున్నాయి, పిట్టలు గూళ్ళు కట్టుకోవడానికి తెచ్చినవి అయ్యుంటాయి. చాపమీద చక్కగా ముస్తాబై కూర్చొని ఉంది తాయారు. కరణం చెప్పినట్లు రంభేమీ కాదుకాని, ముక్కూ, ముఖమూ బాగానే ఉన్నాయి. తండ్రి ఆదేశాన్ని అందుకొని చేతులు జోడించి నమస్కరించింది. పాణిని నఖశిఖపర్యంతం ఒకసారి కొలుస్తున్నట్లుగా తలెత్తి దించేసింది.
    'ఎట్లున్నది?' అడిగాడు కరణం.
    ఆ ప్రశ్న ఏహ్యంగా కనిపించింది పాణికి. తండ్రి అయినవాడు అడగరాని మాటలా ఉంది. కరణం తాయారు తండ్రేనా అనే సంశయం రాగా ఒకసారి అతని ముఖం చూచి, 'కాలు కాస్త కుంటికాని-' రంభలా ఉంది అనే పాఠం అప్పగించాడు.
    కరణం నవ్వాడు 'భలేటోనివే, కుంటని నీకెట్లెరిక?' అని అడిగాడు.
    నిజంగానే తాయారు కాలు కనిపించడం లేదు. చీర కప్పుకొని కూర్చుంది. వాస్తవంగా అవిటిగాదేమో! తానలా అని పొరపాటు చేశామనేమో అనుకొని కరణం మాట గుర్తుకు తెచ్చుకొనిమీరే అన్నారు కదండీ?' అన్నాడు.
    'ఆ అట్లను, చెప్పితేగాని తెల్వదు కుంటని' అని, 'తాయారూ! లేచి నిలబడు' అని ఆదేశించాడు కరణం.
    రెండుచేతులూ నేలకు ఆనించే లేచింది. నుంచుంటే ఒకవైపు కాస్త వంగినట్లుంటుంది. కొద్దిగా కురచకూడా.
    'జర్ర నడు!' ఆదేశించాడు తాయార్ను కరణం.
    కాస్తగెంతుతూ, ఒక చేత్తో అవిటికాలు పట్టుకొని నడిచింది.
    'ఎట్లున్నది?'
    ఏం చెప్పాలి తాను? ఏమిటా ప్రశ్న? 'కాలు కాస్త అవిటి....' అని కరణం పాఠం కరణానికే అప్పగించాడు.
    'బాగైతదంటవా?'
    'ఇప్పుడిప్పుడే ఒకరి అవయవాలు ఒకరికి అమరుస్తున్నారట డాక్టర్లు. కాని మనదేశంలో కాదు- అమెరికాలో!'
    'గట్టోనివే! నీకు దునియంత (ప్రపంచమంతా) ఎరికేనట్లున్నదే.'
    ఏదో మీ దయ. కొన్ని సంవత్సరాలైతే మన దేశంలో కూడా కావచ్చు. అప్పుడు అవిటితనం పోవచ్చు.'
    కరణం ఒక నిట్టూర్పు విడిచి 'సరే, దాని నసీబెట్టున్నదో (అదృష్టమెట్లున్నదో) అని నడిచాడు.
    తననూ, తాయార్నూ గదిలో వదిలి వెళ్ళిపోయాడు కరణం. అతని ప్రవర్తన ఎందుకో వింతగా తోచింది పాణికి.
    'సంగీతమంటే ఇష్టమా?' అడిగాడు పాణి.
    తలెత్తి ముఖంలోకి చూచింది.
    'సంగీతమంటే ఇష్టమా?'
    'అంటే?' గొంతు దురుసుగా ఉంది.
    'పాట నేర్చుకుంటావా?'
    'నువ్వు నేర్పిందల్ల నేర్చుకొమ్మన్నడు నాయన.'
    'సరి' అని సరళి వరుసలు ప్రారంభించాడు.
    వెళ్ళిపోయేప్పుడు కరణం కనిపిస్తే నమస్కరించి శెలవు కోరాడు.
    'ఎట్లున్నది?' మళ్ళీ అదే ప్రశ్న.
    "బాగానే ఉంది, మొదటిరోజే కదా! 'అనగనగ రాగ మతిశయిల్లుచునుండు' అన్నాడు వేమన. క్రమంగా వస్తుంది."
    "సరే నడువ్, నారయ్యగారింటికి తీస్కపోత" అన్నాడు కరణం.
    ఇద్దరూ నారయ్య ఇంటికి వెళ్ళారు. నమస్కారం చేసి ఇద్దర్నీ బల్లమీద కూర్చుబెట్టాడు నారయ్య. లోనికివెళ్ళి బైటికివచ్చి 'పాఠం శురుచేస్తరా" అన్నాడు పాణితో నారయ్య. చెప్పులు వదిలి పాణి లోనికి వెళ్ళాడు. వసారాలో చాప పరిచి వుంది. పాణిని దానిమీద కూర్చోమని "సీతా!" అని పిల్చాడు నారయ్య.
    సీత వచ్చి నమస్కారం చేసి కూర్చుంది. ప్రక్కనే ఆమె తమ్ముడు వచ్చి కూర్చున్నాడు. నారయ్య కరణం దగ్గరికి వెళ్ళిపోయాడు.
    బక్కపల్చగా, పొడుగ్గా ఉంది సీత. కోలముఖం, పల్చని చెంపలూ, పెదవులూ, చిన్న చుబుకం, కొద్దిగా చిన్నగా వున్నట్లుకనిపించే ముక్కూ, పెద్దకళ్ళు, చామనఛాయ - మామూలు తెలుగు కన్నెలా ఉంది సీత. నడకలో మాత్రం వయ్యారం ఉంది. వయసే అల్లాంటిది.
    'సంగీతమంటే ఇష్టమా?' అడిగాడు పాణి.
    అవునన్నట్లుగా తల ఊపింది.
    'అయితేసరి' అని సరళి వరుసలు ప్రారంభించాడు.
                                                                           x x x

 Previous Page Next Page