"తేజా...తే....తేజా" గబగబా మెట్లెక్కి పై మేడమీదకెళ్ళి వెతికి, కంగారుగా కిందకు దిగిందామె. హాలు, వరండా, డైనింగ్ హాల్ డ్రాయింగ్ రూమ్, ఆఫీసురూమ్, స్టోర్ రూమ్, బాత్ రూములన్నీ వెతికింది.
ఎక్కడా? ఎక్కడా? తేజ కనిపించలేదు!
అంతవరకూ ఆమెలోవున్న సంతోషం ఒక్కసారి తెగిన గాలి పటంలా ఎగిరిపోయింది.
"వెతకండి- బిల్దింగంతా వెతకండి-గార్డెనంతా వెతకండి- ఆయా, నువ్వు స్విమ్మింగ్ ఫూల్ వేపు వెళ్ళు" కంగారు కంగారుగా చెప్పి మళ్ళీ మేడమెట్లేక్కింది సుదేష్ణాదేవి.
అంతవరకూ సుదేష్ణాదేవిలోని కలవరాన్ని గమనిస్తున్న ఆ ఇంటి పెంపుడు కుక్కా బ్రౌనీ-
డ్రాయింగ్ రూమ్ లొ నాలుగువేపులా తిరుగుతూ వాసన చూస్తోంది.
౦ ౦ ౦
సర్కిల్ ఇన్స్ పెక్టర్ స్టేషన్ లొ కొచ్చి, ఎదురుగా కనిపించిన దృశ్యాన్ని చూసి హైనాని చూసినవాడలా అయిపోయాడు.
సెల్లో ముగ్గురు వ్యక్తులు, ఓ పక్కన దొంతర్లు, దొంతర్లుగా ఫైల్స్, ఆ ఫైల్స్ లోంచి కాగితాల్ని చింపుతూ ఒకడందిస్తూంటే, మిగతా ఇద్దరు ఆ కాగితాల్ని అంటిస్తూ చలి కాచుకుంటున్నారు.
"అవ్వ....వ్వ....వ్వ....నాయాళ్ళలారా! ఏట్రాయిది__ సెల్ లొ చలి కాచుకోవడం ఏంటి? ఎఫ్.ఐ.య్యార్ పేపర్సుని ఉపయోగించడమేమిటి?" అంతెత్తున విరుచుకుపడి, ఆ కాగితాన్ని అందిస్తున్న పోతురాజు నడ్డిమీద లాఠీతో ఒక్కటేశాడు సి.ఐ.
"స్టోర్ రూమ్ లొ అనవసరంగా ఉనాయని తెచ్చి చలి కాచుకుంటున్నాం-తప్పా" ఎదురుప్రశ్న వేశాడు వీర్రాజు.
"ఈ ఎఫ్.ఐ.య్యార్ పేపర్స్ ని కాదు - స్టేషన్ లోని టేబుల్స్ నీ, కుర్చీల్నీ, ఆఖరికి నన్నూ ఆ మంటల్లో పడేసి చలికాగండి - బాగా కాగండి. ఎండాకాలంలో ఉక్కతో మేం చస్తుంటే, అంత చలేట్రా! బాబోయ్- మీరు మనుషులు కారు!"
"అవును ఇన్స్ పెట్రూ! మాకు సీజన్సుతో సంబంధం లేదు. మాకు ఎండాకాలంలో చలేస్తుంది- చలికాలంలో ఉక్కపోస్తుంది.వర్షాకాలములో..." ఏదో చెప్పబోయాడు సేతురాజు.
"నీ పాడె- నీ శ్రాద్ధం! మూడు గంటలసేపు నేను స్టేషన్ లో లేకపోతే, ధ్వంసం చేసేస్తున్నారు కదరా...ఒక్క గంటసేపు ఆగండి- మిమ్మల్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసేస్తాను. తిక్కకుదురుద్ది!" చికాగ్గా కుర్చీలో కూర్చుంటూ అన్నాడు సి.ఐ.
ఆ మాట వినగానే ముగ్గురి ముఖాలు విప్పారాయి.
"మనలో మనమాట...మాకెంత శిక్ష పడుతుదండీ?" వినయంగా అడిగాడు వీర్రాజు.
"పెద్ద గజదొంగలు బయల్దేరారని- పిటీ కేస్...వన్ వీక్ ఆర్ టెన్ డేస్!" సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు సి.ఐ.
మళ్ళీ ఆ ముగ్గురూ డీలా పడిపోయారు.
"ఆ రైల్వే ఎస్.ఐ. అయిదు నెలలన్నాడే?" డౌటుని వ్యక్తం చేశాడు సేతురాజు.
"వాడు కొత్త ఎస్.ఐ. వాడికి రూల్స్ తెలీవ్!"
"ఇది చాలా అన్యాయం! వన్ వీక్ కి, టెన్ డేస్ కి మేం జైలుకెళ్ళం-అంతే! ఇక్కడే- ఈ సెల్లోనే వుంటాం. ఇంక్విలాబ్ జిందాబాద్!" అరుస్తూ అన్నాడు వీర్రాజు.
"ఇది సెల్లనుకున్నారా- మడతమంచాల లాడ్జీ అనుకున్నారా! వెళ్ళాక తప్పదు. ఇక్కడ రెండే సెల్స్ ఉన్నాయి- ఇక్కడ సెటిలవడం కుదరదు." బతిమిలాడుతున్నట్టుగా అన్నాడు చాదస్తపు సి.ఐ.
"కనీసం ఆరు నెలలైనా శిక్ష పడకపోతే మనం కోర్టుకెళ్ళం-అంతే! ఈ సెల్ లోనే మేం నిరాహార దీక్ష చేస్తాం!" సేతురాజు అన్నాడు.
"శాశ్వత జైలే మాకు శ్రీరామ రక్ష!" వీర్రాజు అన్నాడు.
"మాకు ఎక్కువ శిక్ష వెయ్యకపోతే, ప్రపంచంలోని ఏ శక్తీ మమ్మల్ని ఈ సెల్ లోంచి బయటకు తీసికెళ్ళలేదు. అంతే!" ముగ్గురూ వరసగా సెల్ లోకి వెళ్ళిపోయి, డోర్ వేసేసుకున్నారు.
సర్కిల్ ఇన్ స్పెక్టర్ - 'ఈ పిచ్చాళ్ళతో వచ్చిందే చావు' అన్నట్టుగా తల పట్టుక్కూర్చున్నాడు.
౦ ౦ ౦
సరిగ్గా ముప్పై నిమిషాలు గడిచాయి.
ఎప్పుడూ కళకళ్ళాడుతూ తిరిగే ఆ బిల్డింగ్ లోని మనుషుల ముఖాలు వెలవెల బోతున్నాయి.
సుదేష్ణాదేవి అప్పటికే పిచ్చిదానిలా అయిపోయింది.
అయిదు ఎకరాల పరిధిలో ఉన్న ఆ భవనం మూల మూలల్లో వెతికి, వెతికి అలిసిపోయిన పని మనుషులు, జీవరహితమైన బొమ్మల్లా నిలబడిపోయారు.
బయట సెక్యూరిటీ గార్డ్స్ హడావుడింకా తగ్గలేదు.
మెట్ల దిగువన, హాల్లో- కార్పెట్ మీద శోక దేవతలా కూర్చుండిపోయింది సుదేష్ణాదేవి.
గాలి స్పర్శ తగిలితే, వర్షించడానికి సిద్దంగా వున్న మేఘంలా వుందామె.
పచ్చటి దేహం మీద చెమట- పసిడి మనసు నిండా దుఃఖం.
"ఏమయ్యాడు నా బాబు- ఏమయ్యాడు? నా చిన్నారి- ఒక్కొక్క కలనూ పేర్చుకుంటూ, నవమాసాల్నీ నవరాత్రుల్లా అపురూపంగా భరించి కన్న కొడుకు తృటిలో ఎలా మాయమైపోయాడు?
ఏమయ్యాడు?
చాలా విచిత్రంగా ఉంది. ఆమెకే కాదు- ఆ బిల్డింగ్ లోని ప్రతి ఒక్కరికీ ఆశ్చర్యంగా వుంది.