Previous Page Next Page 
కాలనాగు పేజి 8

 

   
    దేవుడా! రక్షించు యీ జనాన్ని అనుకుంది. వెంటనే అప్రయత్నంగా తన నోట వచ్చిన ఆ 'దేవుడా!' అన్నమాటకి ఉలికిపడింది.

                                         7


    'చూశావా!స్వామి ఎలా వచ్చాడో అలా మాయమయ్యాడు!'

    ఉలికిపడింది సంధ్య ఆ మాటలకి

    చప్పున అటువైపు చూసింది

  ఏదో తెలీని భావం_భయమో_భక్తో వెన్నుగుండా జరజరా ప్రాకింది. కుబుసం విడిచిన పాము ఇసుక తిన్నెల మీద జరజరపాకిపోయినట్టుగా

    అక్కడ పాము లేదు నిజం!

    మట్టి మిద్దె! ఎన్ని కన్నాలున్నాయో! అది మట్టిగోడల యిల్లు. గోడలో ఎన్ని కన్నాలో! తేళ్ళు_పాములు కాపురం పెట్టేయ్యొ చ్చు.

    తనకి ఉద్యోగం దొరికితే_యీ గోడల నన్నిటినీ గికించి_సిమెంట్ ప్లాస్టరింగ్ చెయ్యించోచ్చు. అప్పుడీ పురుగూ_పుట్రా భయం వుండదు. ధైర్యంగా వుండచ్చు.

    'సంధ్యా!'

    చప్పున ఊహలు కరిగిపోయాయి మామూలు మనిపై పోయింది మళ్ళి.

    'ఆదివారం ఉపవాసముంటానని మొక్కుకోవే! తలంటి పోసుకుని పుట్టలో పాలుపోసి కొబ్బరికాయ కొడతానని వేడుకోవే ! స్వామి దయ తలుస్తాడు_' ఉద్బోధ చేసింది విశాలాక్షీ.

    సంధ్యకి నవ్వొచ్చింది!

    ఎంత వెర్రి!

    పాములు పాలు తాగుతాయా! ఒక వేళ పాములు పాలు తాగటమే నిజమని భ్రమించినా_ఆ పుట్టలో పములుండొద్దూ!

    వాదనికి పాములుంటాయని ఒప్పుకున్నా_వీళ్ళు పోసే ఆ పాలు సరిగ్గా ఆ పాము నోట్లో పడద్దూ!

    ఎంత పిచ్చి నమ్మకం?

    నమ్మకం! ఎంత మంచి పదం ! ఎంత అర్ధమున్న మాట?

    ఆ నమ్మకంతోటి యీ ప్రపంచం నడుస్తోంది

    ఈ ప్రపంచాన్ని నాయకులు నడుపుతున్నారని అనుకుంటారు జనం దేవుడు పాలిస్తూ నడుపుతున్నాడని భక్తులు అనుకుంటారు డబ్బు నడుస్తోందని ఎనాకమిస్ట్స్, రిచ్ పీపిల్ అనుకుని, అంటారు.

    కానీ ఎంత అబద్దం_

    ప్రపంచాన్ని నడుపుతున్నది నమ్మకం_

    ఆ నమ్మకం నశిస్తే మనిషే నశిస్తాడు
   
    'సంధ్యా!ఏమిటి ఆలోచన?'

    'ఆ పాము గురించి_' చప్పున జవాబు చెప్పింది.

    'పామా?' నోరు వెళ్ళబెట్టింది విశాలాక్షీ, "తప్పు_తప్పు! లెంపలు వేసుకో_స్వామి_స్వామి వారిని అలా అనద్దు! అది దివ్య సర్పం" అదో విధమైన తన్మయత్వంతో అంది ఆమె.

    అవతల గదిలో విశ్వేశ్వరంగారు "నాగాభరణం" పఠిస్తుంనాడు తారాస్థాయిలో. స్పష్టంగా_స్వచ్చంగా_స్ఫుటంగా. అంతకంటే చక్కగా "సర్పవాక్యం" చదువుతోంది.

    సంధ్య నెమ్మదిగా కదిలింది ఏమీ జవాబు చెప్పకుండా. అక్కడి నుంచి వచ్చి తల్లీ, తండ్రీ వున్న గదిదాటి బయటికి వచ్చింది. అక్కడ దీపం లేదు, దూరాన వున్న మునిసిపాలిటి లైటు వెలుతురు మసక మసగ్గా పడుతున్నది.

    సంధ మనస్సులో ఆలోచనలు ఉవ్వెత్తుగా పాము పడగల్లా లేస్తూ బుసలు కొడుతున్నాయి ఒక పెద్ద అల విసురుగా లేచి ఒడ్డున వున్న కొండరాయిని తాకి చప్పున విరిగిపోయినట్టు ఆమె ఆలోచనలు ఆగిపోయాయి ఆ దృశ్యాన్ని చూడగానే.

    కొద్ది దూరంలో ఓ పాము నుంచుని వుంది తోకమీద.పడగమీద మణి మెరుస్తున్నది నక్షత్రంలాగా. ఆ పాముకి ఎదురుగా మరో పాము అంతే ఎత్తులో నుంచున్నది.

    రెండు పాములూ_నుంచున్న తీరు ఎలా వుందంటే స్వయంవర మండపంలో ఓ రాజకుమారిచేత్తో దండ పట్టుకుని నుంచుంటే ఆమెకి ఎదురుగా ఓ రాజకుమారుడు నుంచున్నట్టుగా వుంది.

    పాములు తోకపై లేస్తాయి. సర్రున జార్తాయి, పరిగెడతాయి. జరజర శబ్దం చేసుకుంటూ _ బుస్సుమని ఊత్తాయి.

    కానీ ఎలా తోకపై ఎలా నుంచుంటాయి?

    ఆశ్చర్యంగా వుంది సంధ్యకి   

    అద్భుతంగానూ వుంది ఆమెకి.

    అయితే అంతకంటే అయోమయంగానూ వుంది.

    పాములు పరస్పరం దగ్గరికి జరిగాయి. ఇపుడు వాటి శరీరం ఒక దాన్ని ఒకటి ఒరుసుకుంటూ వుంది. వాటి పడగలు దగ్గరికి వస్తున్నాయి.

    చాచిన నాల్కలు పరస్పరం స్పృశించుకుంటున్నాయి ప్రేయసీ ప్రియులు ముద్దులు పెట్టుకుంటున్నట్టుగా వుంది ఆ దృశ్యం.

    పైని పడగలు దగ్గరగా వస్తున్నాయి.

    క్రింది  శరీరాలు రెండూ పెనవేసుక పోతున్నాయి. రెండు పొరల తాడుని పేనినట్టుగా పెనవేసుకున్నాయి. చూట్టానికి అవి రెండు పాములు కానీ ఇపుడవి ఏకశారీరం అన్నట్టుగా కలిసిపోయాయి. పడగలు మాత్రం బుస్సుబుస్సు మంటూ అవి రెండు పాములు అని స్పష్టం చేస్తున్నట్టుగా వున్నాయి.

    సంధ్య గుండెలో భయం పాము పిల్లలా ప్రవేశించింది. అది మరో అయిదు నిమిషానికి సర్పమై పది నిమిషాలకి సర్పరాజమై సర్ప నృత్యం చేయసాగింది.

    ఆ రెండు పాములు మహాతి వంగా కదులుతున్నాయి. ఆవేశంతో పూత్కరిస్తున్నాయి అదే ఒక గదిలో అయివుంటే ఆ పాములు వదిలిన గాలికి ఆ గది అంతా విషపూరితమైపోయేది.

    అవి ఎప్పుడు తన మీద వచ్చి పడతాయో అన్నట్టుగ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నుంచుంది సంధ్య.

    "హలో!"

    ఆ పిలుపు ప్రాణగానం అయింది ఆమెకి.

    చప్పున అటు చూసిందామె

    నాగరాజు

    అటు ఒకటైన రెండు పాములు జంతువులు విషపూరితలు కదిల్తే కటువేసేవి, ప్రాణం తీసేవి.

 Previous Page Next Page